Htin Kyaw
-
సరదా కామెంట్.. ఎంత పని చేసింది!
నేపితా: దేశాధ్యక్షుడిపై సోషల్ మీడియాలో సరదాగా చేసిన ఓ కామెంట్ జైలుకు పంపేలా చేస్తుందని మయన్మార్ యువకుడు కూడా ఊహించి ఉండడు. తన భర్తను అరెస్ట్ చేశారని బాధితుడి భార్య శుక్రవారం మీడియాకు వెల్లడించింది. ఆ వివరాలిలా ఉన్నాయి. మయన్మార్ అధ్యక్షుడు టిన్ క్వాను ఉద్దేశించి ఆంగ్ విన్ హ్లెయింగ్ అనే వ్యక్తి 'క్రేజీ'అని తన ఫేస్ బుక్ పేజీతో పోస్ట్ చేశాడు. కొందరు అధికారులు ఈ విషయంపై ఫిర్యాదు చేయగా, పోలీసులు సమాచారం అందుకుని అతడిని అరెస్ట్ చేశారని, తొమ్మిది నెలల జైలుశిక్ష విధించారని బాధితుడి భార్య హిన్ హిన్ విన్ ఆవేదన వ్యక్తంచేసింది. సెప్టెంబర్ 23 తన భర్తను ఈ కేసులో నిందితుడిగా ఆరోపిస్తూ అరెస్ట్ చేశారని తెలిపింది. వాస్తవానికి అక్కడి టెలికమ్యూనికేషన్ రూల్స్ ప్రకారం.. అధ్యక్షుడిని, ఆ తరహా హోదాలో ఉండే వ్యక్తిని 'ఇడియట్' అని, లేదా 'క్రేజీ' అని ఆన్ లైన్లో సంబోధిస్తూ కామెంట్ చేయడం నేరం కిందకి వస్తుంది. 2013లో టెలికమ్యూనికేషన్ చట్టం ప్రతిపాదించారు. అయితే అప్పట్లో మయన్మార్ లో సైనిక తరహా నియంతృత్వ పాలన కొనసాగేది. ప్రజాస్వామ్య పద్ధతిలో అక్కడ గత మార్చిలో ఎన్నికలు జరిగినా.. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కొన్ని చట్టాలు కఠినంగా ఉండటం వల్ల సాధారణ పౌరులకు ఇక్కట్లు తప్పడం లేదని ఆంగ్ విన్ హ్లెయింగ్ భార్య ఆరోపించింది. గత నెలలో ఆర్మీపై కామెంట్లు చేశాడన్న ఆరోపణలతో నటుడికి మూడేళ్ల జైలుశిక్ష విధించిన విషయం తెలిసిందే. -
మయన్మార్ అధ్యక్షునిగా టిన్ క్వా ప్రమాణం
విదేశాంగ మంత్రిగా సూచీ నేపితా: మయన్మార్ కొత్త అధ్యక్షునిగా ఆంగ్ సాన్ సూచీ ప్రధాన అనుచరుడు టిన్ క్వా(60) బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. క్వా ప్రమాణ స్వీకారంతో 50 ఏళ్ల మిలిటరీ పాలన తర్వాత సూచీ ప్రజాస్వామ్య ఉద్యమంతో మయన్మార్‌లో కొత్త శకానికి పునాది పడినట్లయ్యింది. మరోవైపు సూచీ.. క్వా కేబినెట్లో విదేశాంగ శాఖతో పాటు విద్య, ఇంధన, అధ్యక్ష కార్యాలయ శాఖల బాధ్యతలనూ నిర్వర్తించనున్నారు. మాజీ జనరల్ థీన్ సేన్ స్థానంలో టిన్ క్వా కొత్త అధ్యక్షుడిగా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. క్వా.. సూచీకి స్కూల్ స్నేహితుడు. అలాగే నమ్మకమైన వ్యక్తి. ఆర్మీ తెచ్చిన కొత్త రాజ్యాంగం వల్ల అధ్యక్షురాలయ్యే అవకాశం సూచీ కోల్పోయినా.. క్వా ద్వారా ఆమె పరోక్షంగా దేశాన్ని నడిపించనున్నారు. గతేడాది నవంబర్‌లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో సూచీ పార్టీ నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ(ఎన్ఎల్డీ) ఘన విజయం సాధించడం తెలిసిందే. కాగా, ప్రజాస్వామ్య ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్త శకానికి స్వాగతమని, దేశ రాజ్యాంగాన్ని, చట్టాలను గౌరవిస్తానని క్వా తెలిపారు. గణతంత్ర మయన్మార్ ప్రజలకు నిజాయితీగా సేవ చేస్తానన్నారు. -
సూచీకి కీలక బాధ్యతలు
యంగోన్: ఎన్నికల్లో ఘనవిజయం సాధించినా.. సైన్యం మార్చిన రాజ్యాంగ నిబంధనల వల్ల మయన్మార్ అధ్యక్ష పదవికి అనర్హురాలైన నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ అధ్యక్షురాలు ఆంగ్ సాన్ సూచీ కొత్త ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపట్టే అవకాశముంది. మంత్రి పదవి చేపట్టరాదని సూచీ భావించినా, ఆమెకు కీలక శాఖలు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. మయన్మార్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన సూచీ ప్రధాన అనుచరుడు, గతంలో ఆమెకు డ్రైవర్‌గా పని చేసిన టిన్ క్వా .. పార్లమెంట్‌కు పంపిన 18 మంది కొత్త మంత్రుల జాబితాలో ఆమె పేరు ఉంది. సూచీకి విదేశీ వ్యవహారాల శాఖతో పాటు ఇంధన, విద్యాశాఖలను కేటాయించే అవకాశముంది. టిన్ క్వా కేబినెట్లో సూచీ మినహా మరో మహిళ పేరు లేదు. నవంబర్ నాటి పార్లమెంటు ఎన్నికల్లో సూచీ పార్టీ నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ (ఎన్ఎల్డీ) ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే సైన్యం గతంలో మార్చిన రాజ్యాంగ నిబంధనల వల్ల అధ్యక్ష పదవికి అనర్హురాలయ్యారు. అధ్యక్ష పగ్గాలు చేపట్టే వ్యక్తి విదేశీయుల్ని పెళ్లి చేసుకొని ఉండరాదు. అలాగే ఆ వ్యక్తికి విదేశీ పౌరసత్వం ఉన్న పిల్లలు ఉండకూడదు. సూచీ భర్త మైఖేల్ బ్రిటిషర్ కావడం, ఆమె ఇద్దరు పిల్లలకు బ్రిటన్ పౌరసత్వం ఉండటంతో అధ్యక్షురాలయ్యేందుకు అనర్హురాలయ్యారు. -
ఆమె డ్రైవరే దేశాధ్యక్షుడు!
నెపిడా: మయన్మార్ కొత్త అధ్యక్షుడిగా హితిన్ చా పేరును ప్రకటించారు. నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్ఎల్డీ) పార్టీ తమ అధినేతగా ఆంగ్ సాన్ సూచీ చిన్ననాటి స్నేహితుడు, సన్నిహితుడైన హితిన్ చా ను ఎన్నుకున్నారు. ఆయన గతంలో డ్రైవర్ గా విధులు నిర్వహించడం గమనార్హం. సూచీ ఉద్యమం చేస్తున్న సమయంలో ఆమెకు డ్రైవర్ గా పని చేశారు. ప్రస్తుతం ఆంగ్ సాన్ సూచీ చారిటీ ఫౌండేషన్ ను నిర్వహిస్తున్నారు. ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు, మిలిటరీ ఆధిపత్యాన్ని తప్పించేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ ముగిశాయి. అందుకు ప్రత్యామ్నాయంగా రాజకీయ వారసత్వాన్ని హితిన్ కు కట్టబెట్టాల్సి వచ్చిందని ఓ ప్రకటనలో ఆంగ్ సాన్ సూచీ వెల్లడించారు. ఇక్కడ మన్మోహన్.. అక్కడ హితిన్ చా గతంలో యూపీఏ ప్రభుత్వం గెలిచినప్పటికీ విదేశీ అనే ఆరోపణలు వచ్చి వ్యతిరేకత రావడంతో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధాని పగ్గాలను విశ్వాసపాత్రుడైన మన్మోహన్ సింగ్ కు అప్పగించారు. ఇప్పుడు మయన్మార్ లో అదే సీన్ రిపీట్ అయింది. నిబంధనల వల్ల సూచీ విదేశీ కావడంతో పాలన పగ్గాలను సన్నిహితుడు, మిత్రుడు హితిన్ చా చేతిలో పెట్టారు. నిర్ణయాలు మాత్రం సూచీ తీసుకునే అవకాశాలు ఉన్నాయని, అధ్యక్ష పదవి కంటే పెద్ద స్థానంలోనే సూచీ ఉందని నేతలు పేర్కొంటున్నారు. అధ్యక్షుడి ఎన్నికపై సూచీ సొంత పార్టీ ఎన్ఎల్డీ లో కూడా కాస్త వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోంది. ఎగువ సభలో మరో అభ్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ మెజార్టీ పార్టీ ఆంగ్ సాన్ సూచీ నేతృత్వంలోని ఎన్ఎల్డీ ఓట్లతో హితిన్ చా కొత్త అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. అధ్యక్షుడి భార్య అధికార పార్టీ ఎన్ఎల్డీ ఎంపీ. ఆమె పేరు సు సు లిన్. గతంలో ఆమె తండ్రి ఎన్ఎల్డీ పార్టీ అధికారప్రతినిధిగా పనిచేశారు. సూచీని అడ్డుకున్న రాజ్యాంగం! గత ఏడాది నవంబర్ 8న మయన్మార్ లో జరిగిన ఎన్నికల్లో ప్రజాస్వామిక ఉద్యమ కారిణి ఆంగ్ సాన్ సూచీ సారథ్యంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్ఎల్డీ) పార్టీ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఆ దేశ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు సూకికి రాజ్యాంగపరంగా ఇబ్బంది కూడా ఉంది. ఆ రాజ్యాంగంలోని నిబంధన 59(ఎఫ్) విదేశీయులను భర్తగా చేసుకున్న ఓ వ్యక్తి అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు అనుమతించదు. సూకి భర్త బ్రిటన్ దేశానికి చెందిన వ్యక్తి. వీరికి ఇద్దరు పిల్లలు. మయన్మార్‌లో ప్రజాస్వామ్య బద్ధంగా ఉద్యమించడంలో కీలక పాత్ర పోషించినప్పటికీ రాజ్య నియమాలకు కట్టుబడి అధ్యక్ష పదవిపై ఆసక్తి చూపలేదు.