President of Myanmar
-
సరదా కామెంట్.. ఎంత పని చేసింది!
నేపితా: దేశాధ్యక్షుడిపై సోషల్ మీడియాలో సరదాగా చేసిన ఓ కామెంట్ జైలుకు పంపేలా చేస్తుందని మయన్మార్ యువకుడు కూడా ఊహించి ఉండడు. తన భర్తను అరెస్ట్ చేశారని బాధితుడి భార్య శుక్రవారం మీడియాకు వెల్లడించింది. ఆ వివరాలిలా ఉన్నాయి. మయన్మార్ అధ్యక్షుడు టిన్ క్వాను ఉద్దేశించి ఆంగ్ విన్ హ్లెయింగ్ అనే వ్యక్తి 'క్రేజీ'అని తన ఫేస్ బుక్ పేజీతో పోస్ట్ చేశాడు. కొందరు అధికారులు ఈ విషయంపై ఫిర్యాదు చేయగా, పోలీసులు సమాచారం అందుకుని అతడిని అరెస్ట్ చేశారని, తొమ్మిది నెలల జైలుశిక్ష విధించారని బాధితుడి భార్య హిన్ హిన్ విన్ ఆవేదన వ్యక్తంచేసింది. సెప్టెంబర్ 23 తన భర్తను ఈ కేసులో నిందితుడిగా ఆరోపిస్తూ అరెస్ట్ చేశారని తెలిపింది. వాస్తవానికి అక్కడి టెలికమ్యూనికేషన్ రూల్స్ ప్రకారం.. అధ్యక్షుడిని, ఆ తరహా హోదాలో ఉండే వ్యక్తిని 'ఇడియట్' అని, లేదా 'క్రేజీ' అని ఆన్ లైన్లో సంబోధిస్తూ కామెంట్ చేయడం నేరం కిందకి వస్తుంది. 2013లో టెలికమ్యూనికేషన్ చట్టం ప్రతిపాదించారు. అయితే అప్పట్లో మయన్మార్ లో సైనిక తరహా నియంతృత్వ పాలన కొనసాగేది. ప్రజాస్వామ్య పద్ధతిలో అక్కడ గత మార్చిలో ఎన్నికలు జరిగినా.. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కొన్ని చట్టాలు కఠినంగా ఉండటం వల్ల సాధారణ పౌరులకు ఇక్కట్లు తప్పడం లేదని ఆంగ్ విన్ హ్లెయింగ్ భార్య ఆరోపించింది. గత నెలలో ఆర్మీపై కామెంట్లు చేశాడన్న ఆరోపణలతో నటుడికి మూడేళ్ల జైలుశిక్ష విధించిన విషయం తెలిసిందే. -
మయన్మార్ అధ్యక్షునిగా టిన్ క్వా ప్రమాణం
విదేశాంగ మంత్రిగా సూచీ నేపితా: మయన్మార్ కొత్త అధ్యక్షునిగా ఆంగ్ సాన్ సూచీ ప్రధాన అనుచరుడు టిన్ క్వా(60) బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. క్వా ప్రమాణ స్వీకారంతో 50 ఏళ్ల మిలిటరీ పాలన తర్వాత సూచీ ప్రజాస్వామ్య ఉద్యమంతో మయన్మార్లో కొత్త శకానికి పునాది పడినట్లయ్యింది. మరోవైపు సూచీ.. క్వా కేబినెట్లో విదేశాంగ శాఖతో పాటు విద్య, ఇంధన, అధ్యక్ష కార్యాలయ శాఖల బాధ్యతలనూ నిర్వర్తించనున్నారు. మాజీ జనరల్ థీన్ సేన్ స్థానంలో టిన్ క్వా కొత్త అధ్యక్షుడిగా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. క్వా.. సూచీకి స్కూల్ స్నేహితుడు. అలాగే నమ్మకమైన వ్యక్తి. ఆర్మీ తెచ్చిన కొత్త రాజ్యాంగం వల్ల అధ్యక్షురాలయ్యే అవకాశం సూచీ కోల్పోయినా.. క్వా ద్వారా ఆమె పరోక్షంగా దేశాన్ని నడిపించనున్నారు. గతేడాది నవంబర్లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో సూచీ పార్టీ నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ(ఎన్ఎల్డీ) ఘన విజయం సాధించడం తెలిసిందే. కాగా, ప్రజాస్వామ్య ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్త శకానికి స్వాగతమని, దేశ రాజ్యాంగాన్ని, చట్టాలను గౌరవిస్తానని క్వా తెలిపారు. గణతంత్ర మయన్మార్ ప్రజలకు నిజాయితీగా సేవ చేస్తానన్నారు.