ఆంగ్ సాన్ సూకీ (74)
మయన్మార్ నాయకురాలు, ప్రస్తుత స్టేట్ కౌన్సెలర్ (ప్రధాని పదవికి సమానమైన హోదా) ఆంగ్‌సాన్ సూకీని ఏనాటికీ దేశాధ్యక్షురాలు కానివ్వకుండా అక్కడి విపక్షాలు జాగ్రత్త పడుతున్నాయి. ఆమెకు దేశాధ్యక్షురాలు అయ్యే అవకాశాన్ని కల్పించడానికి ఉద్దేశించిన బుధవారం నాటి తాజా రాజ్యాంగ సవరణ బిల్లుకు సైతం మయన్మార్ పార్లమెంటులోని మెజారిటీ సభ్యుల ఆమోదం లభించలేదు.
మయన్మార్ స్వేచ్ఛకోసం బందీ అయిన యోధురాలు ఆంగ్ సాన్ సూకీ. 1989 జూలై 20 నుంచి 2010 నవంబర్ 13 వరకు ఇరవయ్యొక్కేళ్ల కాలంలో మధ్య మధ్య స్వల్ప విరామాలతో దాదాపు 15 ఏళ్ల పాటు బర్మా సైనిక పాలకుల నిర్బంధంలో గడిపారు. నిర్బంధం నుంచి సూకీ విడుదలయ్యాక మయన్మార్‌లో జరిగిన ఒక కీలక పరిణామం... ఉప ఎన్నికలు. సూకీ విడుదలవడానికి సరిగ్గా ఆరు రోజుల ముందు 2010లో ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో తర్వాత్తర్వాత ఏర్పడ్డ ఖాళీల భర్తీకి ఈ ఉపఎన్నికలు అవసరమయ్యాయి. అప్పటి సార్వత్రిక ఎన్నికల్లో సూకీ పార్టీ ‘నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ’ (ఎన్.ఎల్.డి.) పాల్గొనేందుకు వీలు లేకపోవడంతో ఉప ఎన్నికలకు ఎన్.ఎల్.డి. సిద్ధమైంది. పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన సూకీ... కాము టౌన్‌షిప్ నియోజకవర్గం నుంచి దిగువసభకు పోటీ చేశారు. అధికార ‘యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్‌మెంట్ పార్టీ అభ్యర్థిపై మంచి మెజారిటీతో గెలిచారు.
ఈ ఒక్క సీటే కాదు, ఖాళీ అయిన అన్ని సీట్లను దాదాపుగా ఎన్.ఎల్.డి.నే గెలుచుకుంది. ఉప ఎన్నికల ప్రచారంలో సూకీ ప్రధానంగా అవినీతి, నిరుద్యోగ నిర్మూలన అనే అంశాలపైనే దృష్టి సారించారు. అలాగే ‘2008 రాజ్యాంగం’ లోని లోపాలను సవరించి, సంస్కరించడం ద్వారా మయన్మార్‌లో ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణకు, స్వయంప్రతిపత్తి గల న్యాయవ్యవస్థ ఏర్పాటుకు ఎన్.ఎల్.డి. కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. పర్యవసానమే సూకీ ఘన విజయం. ఫలితాలు వెల్లడవగానే ఐరోపా, ఆస్ట్రేలియా, ఉత్తరమెరికా, దక్షిణమెరికా, ఇజ్రాయిల్, జపాన్, ఫిలిప్పీన్స్, దక్షిణ కొరియాల నుంచి సూకీకి అభినందలను వెల్లువెత్తాయి. ‘‘మయన్మార్‌కి మంచి భవిష్యత్తు ఉంది.
అది మీ వల్లే సాధ్యమౌతుంది’’ కొందరు దేశాధినేతలు సూకీకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. తిరిగి 2015 ఎన్నికల్లోనూ సూకీ ఘన విజయం సాధించారు. ఈ ఏడాది మళ్లీ ఎన్నికలు ఉన్నాయి. అయితే ఆంగ్‌సాన్ సూకీ ఎప్పటికీ అధ్యక్షురాలు కాకుండా ఉండడం కోసం 2008లో మయన్మార్ మిలటరీ ప్రభుత్వం ఒక రాజ్యాంగ సవరణ చేసింది. దాని ప్రకారం.. జీవిత భాగస్వామి గానీ, పిల్లలు గానీ విదేశీ పౌరులై ఉంటే ఆ వ్యక్తి మయన్మార్ అధ్యక్షులు అయ్యేందుకు లేదు. సూకీ ఇప్పుడు అధ్యక్షురాలు అవాలంటే ఆ క్లాజును రద్దు చేస్తూ రాజ్యాంగ సవరణ తేవాలి. ఆ సవరణ తెచ్చేందుకే బుధవారం పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెడితే.. రెండింట మూడొంతుల మద్దతు లభించక అదే ఆమోదం పొందలేదు. సూకీ భర్త, ఇద్దరు కొడుకులు బ్రిటన్ జాతీయులు. ఆమె భర్త 1999లో చనిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment