
అంగ్ సాన్ సూకీ (ఫైల్ ఫోటో)
యంగూన్ : నోబెల్ శాంతి పురస్కారాన్ని వెనక్కి తీసుకునే విషయంలో అంగ్ సాన్ సూకీకి ఊరట లభించింది. సూకీకి ప్రదానం చేసిన నోబెల్ శాంతి బహుమతిని వెనక్కి తీసుకోబోవడం లేదంటూ నోబెల్ ప్రైజ్ కమిటీ ప్రకటించింది. ఈ విషయం గురించి నార్వే నోబెల్ కమిటీ కార్యదర్శి ఓలావ్ నోజెలాడ్స్.. ఒక్కసారి ఎవరికైనా నోబెల్ పురస్కారాన్ని ప్రదానం చేస్తే దాన్ని రద్దు చేయడం.. వెనక్కి తీసుకోవడం వంటివి కుదరవని తెలిపారు.అలా చేయడం నోబెల్ అవార్డుల నియమ నిబంధనలకు వ్యతిరేకమని వివరించారు. అంతేకాక స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలకోసం అంగ్ సాన్ సూకీ చేసిన కృషికిగాను 1991లో ఆమెకి నోబెల్ శాంతి పురస్కారాన్ని ప్రదానం చేశారు. కాబట్టి ఇప్పుడు దాన్ని ఉపసంహరించుకోవడం కుదరదని ఓలావ్ నోజెలాడ్స్ తెల్చి చెప్పారు.
రోహింగ్యా ముస్లిం పట్ల మయన్మార్ అవలంబిస్తోన్న విధానాలకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. ఈ విషయంలో మయన్మార్ ప్రభుత్వ కౌన్సిలర్‌గా ఉన్న అంగ్ సాన్ సూకీ తీరు పట్ల ప్రపంచవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ఐక్యరాజ్య సమితి కూడా అంగ్ సాన్ సూకీ తీరును తప్పుపట్టింది. ఈ సందర్భంగా పలు ప్రపంచ దేశాలు గతంలో సూకీకి ప్రదానం చేసిన గౌరవ పురస్కారాలని వెనక్కి తీసుకుంటున్నాయి. ఫలితంగా 1997లో అందుకున్న ‘ఫ్రీడమ్ ఆఫ్ ఆక్సఫర్డ్’ గౌరవ పురస్కారాన్ని సూకీ కోల్పోయారు. ఈ క్రమంలోనే 1991లో అంగ్‌సాన్ సూకీకి ప్రదానం చేసిన ‘నోబెల్ శాంతి పురస్కారా’న్ని కూడా వెనక్కి తీసుకోవాలనే ప్రతిపాదనలు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment