Nobel committee
-
Nobel Prize in Economics 2024: అర్థశాస్త్రంలో ముగ్గురికి నోబెల్
స్టాక్‌హోమ్: దేశంలోని సంస్థలు, వ్యవస్థల అసమర్థత కారణంగా ఆ దేశం ఎలా పేదరికంలోనే మగ్గిపోతుందనే అంశాలపై విస్తృత పరిశోధనలు చేసిన ముగ్గురు ఆర్థికవేత్తలకు అర్థశాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ పురస్కారం దక్కింది. ఆయా సమాజాల్లో నిబంధనలను తుంగలో తొక్కడం, సంస్థలు, వ్యవస్థల్లో లోపాలు ఆ దేశాభివృద్ధికి ఎలా పెనుశాపాలుగా మారతాయనే అంశాలను డరేన్ ఎసిమోగ్లూ, సైమన్ జాన్సన్, జేమ్స్ ఏ రాబిన్సన్లు చక్కగా విడమర్చి చెప్పారని రాయల్ స్వీడిష్ అకాడమీ సైన్స్ విభాగ నోబెల్ కమిటీ కొనియాడింది. ఈ మేరకు ముగ్గురికీ నోబెల్‌ను ప్రకటిస్తూ సోమవారం కమిటీ ఒక ప్రకటన విడుదలచేసింది. ఎసిమోగ్లూ, జాన్సన్‌లు అమెరికాలోని ప్రతిష్టాత్మక మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సేవలందిస్తుండగా షికాగో విశ్వవిద్యాలయంలో రాబిన్సన్ పనిచేస్తున్నారు. ‘‘ దేశాల మధ్య ఆర్థిక అసమానతలను తగ్గించడం అనేది శతాబ్దాలుగా ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటి. ఆదాయ, ఆర్థికాభివృద్ధి అసమానతలను రూపుమాపడంలో అక్కడి వ్యవస్థల కీలకపాత్రను ఆర్థికవేత్తలు స్పష్టంగా పేర్కొన్నారు’’ అని ఆర్థికశాస్త్ర కమిటీ చైర్మన్ జాకబ్ సెవెన్సన్ వ్యాఖ్యానించారు. తనకు నోబెల్ రావడంపై 57 ఏళ్ల ఎసిమోగ్లూ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. దేశాలు ఎందుకు సక్సెస్ కాలేవు? అవార్డ్ విషయం తెలిశాక తుర్కియే దేశస్థుడైన ఎసిమోగ్లూ మాట్లాడారు. ‘‘ప్రజాస్వామ్యయుత వ్యవస్థల గొప్పతనాన్ని ఈ అవార్డ్ గుర్తించింది. అభివృద్ధిలో దేశాలు ఎందుకు వెనుకబడతాయని రాబిన్సన్, నేను కలిసి పరిశోధించాం. ప్రజాస్వామ్యం అనేది సర్వరోగ నివారిణి కాదు. ఒక్కోసారి ఎన్నికలు వచి్చనప్పుడే సంక్షోభాలు ముంచుకొస్తాయి’’ అని అన్నారు. ఒకే పార్టీ ఏలుబడిలో ఉన్న చైనా ఎలా అభివృద్ధి పథంలో దూసుకుపోగల్గుతోందని విలేఖరులు ప్రశ్నించగా.. ‘‘ శక్తివంతమైన అధికారయంత్రాంగం ఉన్న చైనా లాంటి దేశాల్లో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, వినూత్న ఆవిష్కరణల కోసం ఎన్నో అవరోధాలను దాటుతున్నారు’’ అని అన్నారు. 12 ఏళ్ల క్రితం ఎసిమోగ్లూ, రాబిన్సన్ రాసిన ‘ వై నేషన్స్ ఫెయిల్: ది ఆరిజన్స్ ఆఫ్ పవర్, ప్రాస్పారిటీ, పూర్’ పుస్తకం అత్యధిక కాపీలు అమ్ముడుపోయింది. వ్యక్తుల తప్పిదాలే ఆయా దేశాలను పేదదేశాలుగా మిగిలిపోవడానికి కారణమని రచయితలు ఆ పుస్తకంలో వివరించారు. సరిగ్గా అమెరికా–మెక్సికో సరిహద్దులో ఉన్న ఆరిజోనా రాష్ట్ర నోగేల్స్ సిటీ భిన్న పరిస్థితులను ఆర్థికవేత్తలు చక్కటి ఉదాహరణగా తీసుకున్నారు. అమెరికా వైపు ఉన్న నోగేల్స్ సిటీ ఉత్తరప్రాంత వాసులు ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఆయుర్దాయం ఎక్కువ. ఎక్కువ మంది విద్యార్థులు హైసూ్కల్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేస్తున్నారు. అదే దక్షిణవైపు ప్రాంత ప్రజలు పేదరికంలో మగ్గిపోతున్నారు. అక్కడ వ్యవస్థీకృత నేరాలు ఎక్కువ. ఆ ప్రాంతంలో వ్యాపారాలు చేయడం కూడా రిస్క్‌తో కూడిన వ్యవహారం. అవినీతి రాజకీయనేతలను అధికారం నుంచి కిందకు దింపడం కూడా చాలా కష్టం. అమెరికాలో అయితే పౌరుల ఆస్తిహక్కుల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. ఇలాంటి విధానాలే ఒకరకంగా దేశం బాగుపడటానికి బాటలువేస్తాయి ’’ అని ఎసిమోగ్లూ వివరించారు. వ్యవస్థలకు తగ్గుతున్న ఆదరణ దురదృష్టవశాత్తు ఇటీవలి కాలంలో అమెరికా, యూరప్‌లలో ప్రజాస్వామ్యయుత వ్యవస్థలకు ఆదరణ తగ్గుతోంది. తమకు అన్యాయం జరిగిందని ప్రజలు భావించిన సందర్భాల్లో ప్రజాస్వామ్యదేశాలు ఓడిపోయినట్లే లెక్క. ఇలాంటి ఉదంతాలు ప్రజాస్వామ్యదేశాలు మేల్కొనాల్సిన తరుణం వచి్చందని గుర్తుచేస్తాయి. సుపరిపాలన అందించేందుకు దేశాలు మళ్లీ ప్రయత్నించాలి’’ అని ఎసిమోగ్లూ అన్నారు. -
ఇరాన్ హక్కుల యోధురాలికి నోబెల్ శాంతి
స్టాక్‌హోమ్: అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి పురస్కారం ఇరాన్‌కు చెందిన మానవ హక్కుల కార్యకర్త నర్గిస్ మొహమ్మదికి లభించింది. ఇరాన్లో మహిళల అణచివేత, మానవ హక్కులపై అవగాహన, అందరికీ స్వేచ్ఛ, మరణ శిక్ష రద్దు కోసం అలుపెరగకుండా ఆమె చేస్తున్న పోరాటానికి అత్యున్నత పురస్కారం దక్కింది. మహిళల కోసం జీవితాన్ని ధారపోసినందుకు నర్గిస్ను శాంతి పురస్కారానికి ఎంపిక చేసినట్టుగా నార్వే నోబెల్ కమిటీ ప్రకటించింది. ప్రస్తుతం ఆమె టెహ్రాన్‌లోని ఎవిన్ జైల్లో ఉన్నారు. ‘‘నర్గిస్ చేసిన పోరాటం అత్యంత సాహసోపేతమైనది. మహిళా హక్కుల కోసం ఆమె తన వ్యక్తిగత జీవితాన్ని పణంగా పెట్టారు. ఇరాన్లో ఏడాదిగా సాగుతున్న మహిళా హక్కుల పోరాటానికి నోబెల్ శాంతి తొలి గుర్తింపు. జైలు నుంచే ఈ ఉద్యమానికి ఊపిరిలా మారిన వివాదరహితురాలైన నర్గిస్ మొహమ్మదికి నోబెల్ శాంతి బహుమతిని ప్రకటిస్తున్నాం’’అని కమిటీ చైర్ పర్సన్ బెరిట్ రెసి అండర్సన్ వెల్లడించారు. నోబెల్ శాంతి పురస్కారం కింద ఆమెకు 1.1 కోట్ల స్వీడిష్ క్రోనర్లు (దాదాపుగా 10 లక్షల డాలర్లు) నగదు బహుమానం, 18 కేరట్ గోల్డ్ మెడల్, డిప్లొమా లభిస్తుంది,. డిసెంబర్లో జరిగే అవార్డు ప్రదానోత్సవం సమయానికి నర్గిస్ జైలు నుంచి విడుదల కావాలని, స్వయంగా పురస్కారాన్ని అందుకోవాలని నోబెల్ కమిటీ ఆశాభావం వ్యక్తం చేసింది. ఇరాన్లో మహిళా హక్కుల ఉద్యమానికి అంతర్జాతీయ గుర్తింపు రావడంతో తనపై మరింత బాధ్యత పెరిగిందని నర్గిస్ జైలు నుంచే న్యూయార్క్ టైమ్స్‌కి ఒక ప్రకటన పంపారు. ‘‘నోబెల్ శాంతి పుర స్కారం నాలో మరింత స్ఫూర్తిని నింపింది. మహిళల సమస్యలు పరిష్కారమవుతాయన్న ఆశ పెరిగింది. ఇరాన్లో మార్పు కోసం పోరాడుతున్న వారి లో మరింత బలం పెరుగుతుంది. ఇక విజయం సమీపంలో ఉంది’’అని ఆ ప్రకటనలో ఆశాభావం వ్యక్తం చేశారు. 13 సార్లు అరెస్ట్..31 ఏళ్ల జైలు శిక్ష హక్కుల పోరాటంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా నర్గిస్ వెనుకంజ వేయలేదు. ఇరాన్ ప్రభుత్వం ఆమెను ఇప్పటికి 13 సార్లు అరెస్ట్ చేసింది. అయిదు సార్లు దోషిగా నిర్ధారించింది. 31 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 154 సార్లు కొరడా దెబ్బల శిక్ష విధించింది. అయినా ఆమె అదరలేదు. బెదరలేదు. 1998లో ఇరాన్ ప్రభుత్వాన్ని విమర్శించి తొలిసారి అరెస్టయి ఏడాది జైల్లో ఉన్నారు. హ్యూమన్ రైట్స్ సంస్థలో చేరి మళ్లీ అరెస్టయ్యారు. 2011లో జాతి విద్రోహ కార్యకలాపాలు సాగిస్తున్నారంటూ మరోసారి అరెస్ట్ చేశారు. ఇరాన్లో మరణశిక్షలకు వ్యతిరేకంగా గళమెత్తినందుకు 2015లో జైలుకు పంపారు. ఇలా తన జీవితంలో సగభాగం ఆమె జైల్లోనే గడుపుతున్నారు. అన్నీ కోల్పోయినా.... సంప్రదాయం పేరుతో మహిళలపై ఆంక్షలు విధిస్తూ హిజాబ్ కాస్త పక్కకి జరిగినా జైలు పాల్జేయడమో, కొట్టి చంపేయడమో చేసే దేశంలో పుట్టి మహిళా హక్కుల కోసం జీవితాన్ని ధారపోస్తున్న నర్గిస్ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించిన సమయంలో నాలుగ్గోడల మధ్య బందీగా ఉన్నారు. వ్యక్తి గత జీవితాన్ని, ఆరోగ్యాన్ని, స్వేచ్ఛని పణంగా పెట్టి 51 ఏళ్ల వయసున్న నర్గిస్ ఇంకా మార్పు కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. ‘‘ప్రభుత్వం నన్ను ఎంత అణగదొక్కాలని చూస్తే, ఎంతగా శిక్షిస్తే నాలో పోరాట స్ఫూర్తి అంతకంతకూ పెరుగుతుంది. దేశంలో మహిళలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే వరకు ఈ పోరాటం ఆగదు’’అని నర్గిస్ పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఇరాన్‌లోని జంజన్ పట్టణంలో 1972, ఏప్రిల్ 21న ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి ఒక రైతు. తల్లి ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. 1979లో ఇరాన్ విప్లవం సమయంలో రాచరికం రద్దయిందో అప్పుడే నర్గిస్ తల్లి సోదరుడు, మరో ఇద్దరు కుటుంబసభ్యులు జైలు పాలయ్యారు. వారిని ప్రతీ వారం కలుసుకోవడానికి తల్లితో పాటు జైలుకు వెళ్లే చిన్నారి నర్గిస్‌కు తమ బతుకులు ఎందుకంత అణచివేతకు గురవుతున్నాయో అర్థం కాక తీవ్ర సంఘర్షణకు లోనయ్యేది. అది చూసి ఆమె తల్లి తనకున్న అనుభవంతో రాజకీయాలు, వ్యవస్థల జోలికి వెళ్లొద్దని హితవు చెప్పింది. అయినప్పటికీ నర్గిస్లో చిన్నప్పట్నుంచి ధైర్యసాహసాలు, పోరాట స్ఫూర్తి ఆమెను హక్కుల పోరాటంలో ముందుకు నడిపించాయి. ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసిన తర్వాత ఆమె కొన్నాళ్లు వార్తాపత్రికలకు కాలమిస్ట్‌గా చేశారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత షిరిన్ ఎబది స్థాపించిన డిఫెండర్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సెంటర్లో 2003లో చేరిన ఆమె ప్రస్తుతం ఉపాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. కాలేజీలో సహచర విద్యారి్థగా పరిచయమైన ప్రఖ్యాత సామాజిక కార్యకర్త తాఘి రెహమనీను ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం రెహమనీ తన పిల్లలతో కలిసి పారిస్‌కు ప్రవాసం వెళ్లిపోయారు. తన భర్త, పిల్లలతో మాట్లాడి, ప్రేమతో వారిని అక్కున చేర్చుకొని ఆమెకు ఏళ్లు గడిచిపోయాయి. జైలు నుంచే పోరాటం జైలు నుంచి ఆమె ఎందరిలోనో ఉద్యమ స్ఫూర్తి రగిలిస్తున్నారు. రాజకీయ ఖైదీలు, మహిళా ఖైదీలపై జరుగుతున్న లైంగిక హింసకు వ్యతిరేకంగా జైల్లోనే ఆమె ఉద్యమం ప్రారంభించారు. జైల్లో కూడా ఆమెకు మద్దతుదారులు పెరగడంతో అధికారులు ఆమెపై పలు ఆంక్షలు విధించారు. అయినా ఆమె బెదరలేదు. జైలు నుంచే పలు వ్యాసాలు న్యూయార్క్ టైమ్స్, బీబీసీ వంటి వాటికి పంపించారు. 2022 సెపె్టంబర్లో హిజాబ్ ధరించనందుకు మాసా అమిని అనే యువతిని ఇరాన్ పోలీసులు అరెస్ట్ చేయగా కస్టడీలో తీవ్ర గాయాలపాలై ఆమె మరణించిన విషయం తెలిసిందే. దీంతో ఇరాన్లో భారీగా యువతీ యువకులు ఆందోళనలు చేపట్టి రోడ్లపైకి వచి్చనప్పుడు జైలు నుంచే ఆమె తన గళాన్ని వినిపించారు. పోరాడే వారిలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తోటి మహిళా ఖైదీల అనుభవాలతో వైట్ టార్చర్ అనే పుస్తకాన్ని రాశారు. ప్రపంచంలో అత్యధికంగా ఉరిశిక్షలు విధించే ఇరాన్లో అత్యంత క్రూరమైన ఆ శిక్షను రద్దు చేసే వరకు తన పోరాటం ఆగదని నర్గిస్ ఎలుగెత్తి చాటుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మానవ హక్కుల పోరాటాలకు నోబెల్ శాంతి బహుమతి
ఓస్లో: మానవ హక్కుల పరిరక్షణ కోసం కొనసాగుతున్న ఉద్యమాలకు నోబెల్ కమిటీ అత్యున్నత గౌరవాన్ని కల్పించింది. బెలారస్ మానవ హక్కుల ఉద్యమకారుడు అలెస్ బియాల్‌యాస్కీ(60), రష్యా మానవ హక్కుల సంస్థ ‘మెమోరియల్’, ఉక్రెయిన్ సంస్థ ‘సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్’కు సంయుక్తంగా 2022 సంవత్సరానికి గాను నోబెల్ శాంతి బహుమతిని శుక్రవారం ప్రకటించింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రెండు దేశాల్లోని సంస్థలు ప్రపంచ ప్రతిష్టాత్మక బహుమానానికి ఎంపిక కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉక్రెయిన్‌పై దండెత్తుతున్న రష్యా అధినేత పుతిన్ ఏకపక్ష వైఖరిపై ఇదొక నిరసన అని నిపుణులు అంచనా వేస్తున్నారు. బెలారస్, రష్యా, ఉక్రెయిన్‌లో మానవ హక్కులు, ప్రజాస్వామ్యం, శాంతియుత సహజీవనం వంటి అంశాల్లో గొప్ప చాంపియన్లు అయిన ముగ్గురిని (ఒక వ్యక్తి, రెండు సంస్థలు) శాంతి బహుమతితో గౌరవిస్తుండడం ఆనందంగా ఉందని నార్వే నోబెల్ కమిటీ చైర్మన్ బెరిట్ రీస్–ఆండర్సన్ చెప్పారు. ఆమె మీడియాతో మాట్లాడారు. వారంతా సైనిక చర్యలను వ్యతిరేకిస్తూ మానవీయ విలువలు, న్యాయ సూత్రాల రక్షణ అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. దేశాల మధ్య శాంతి, సౌభ్రాతృత్వం వర్థిల్లాలని ఆల్ఫెడ్ నోబెల్ ఆకాంక్షించారని గుర్తుచేశారు. బియాల్‌యాస్కీని విడుదల చేయండి జైలులో ఉన్న అలెస్ బియాల్‌యాస్కీని విడుదల చేయాలని బెలారస్ పాలకులకు బెరిట్ రీస్–ఆండర్సన్ విజ్ఞప్తి చేశారు. బహుమతి బియాల్యాస్కీలో నైతిక స్థైర్యాన్ని పెంచుతుందని, ఆయనపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపించబోదని భావిస్తున్నట్లు తెలిపారు. రష్యా మానవ హక్కుల సంస్థకు శాంతి బహుమతి ప్రకటించడం ద్వారా.. శుక్రవారం 70వ పుట్టినరోజు జరుపుకుంటున్న పుతిన్‌కు ఉద్దేశపూర్వకంగా ఏదైనా సంకేతం పంపదలిచారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా... ప్రజలకు మంచి చేసేవారికి బహుమతి ఇస్తుంటామని, అంతేతప్ప తాము ఎవరికీ వ్యతిరేకం కాదని, వ్యక్తుల పుట్టినరోజులతో తమకు సంబంధం లేదని బెరిట్ రీస్–ఆండర్సన్ బదులిచ్చారు. ఈ ప్రైజ్ పొందడం ద్వారా ఆయా సంస్థల వెనుక ఉన్న వ్యక్తులు వారు నమ్మినదాని కోసం మరింత ఉత్సాహంతో కృషి సాగిస్తారన్న నమ్మకం తమకు ఉందన్నారు. గత ఏడాది(2021) నోబెల్ శాంతి బహుమతిని సంయుక్తంగా అందుకున్న రష్యా జర్నలిస్టు దిమిత్రీ మురతోవ్, ఫిలిప్పైన్స్ జర్నలిస్టు మారియా రెస్సా అక్కడి ప్రభుత్వాల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాము పనిచేస్తున్న మీడియా సంస్థల్లో ఉద్యోగాలను కాపాడుకోవడానికి పెద్ద పోరాటమే చేయాల్సి వస్తోంది. భావవ్యక్తీకరణ స్వేచ్ఛ కోసం సాగించిన పోరాటానికి వీరిద్దరికి నోబెల్ లభించింది. యుద్ధంపై ఎక్కుపెట్టిన ఆయుధం ఉక్రెయిన్‌లోని కొందరు శాంతి కాముకులు 2007లో ‘సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్’ను ఏర్పాటు చేశారు. అప్పట్లో దేశంలో అశాంతి రగులుతున్న తరుణంలో మానవ హక్కుల పరిరక్షణ, ప్రజాస్వామ్య ఉద్యమాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ సంస్థకు శ్రీకారం చుట్టారు. ఉక్రెయిన్ పౌర సమాజాన్ని బలోపేతం తదితరాలు సంస్థ ముఖ్య లక్ష్యాలు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలైన తర్వాత ఈ సంస్థ మరింత క్రియాశీలకంగా పనిచేస్తోంది. సాధారణ ప్రజలపై రష్యా యుద్ధ నేరాలను రికార్డు చేసి, ప్రపంచానికి తెలియజేస్తోంది. ఈ యుద్ధ నేరాలకు రష్యాను జవాబుదారీగా మార్చేందుకు కృషి చేస్తోంది. యుద్ధానికి వ్యతిరేకంగా ఎక్కుపెట్టిన అసలైన ఆయుధం మానవ హక్కుల పోరాటమేనని ‘సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్’ చెబుతోంది. అంకితభావం గల ఉద్యమకారుడు అలెస్ బియాల్‌యాస్కీ నేటి రష్యాలోని వైర్టిసిల్లాలో 1962 సెప్టెంబర్ 25వ తేదీన జన్మించారు. ఆ తర్వాత వారి కుటుంబం బెలారస్‌కు వలస వెళ్లింది. విద్యాభ్యాసం అనంతరం బియాల్‌యాస్కీ కొంతకాలంపాటు పాఠశాల ఉపాధ్యాయుడిగా, తర్వాత సైన్యంలో డ్రైవర్‌గా పనిచేశారు. 1980వ దశకం నుంచి బెలారస్లో ఆయన మానవ హక్కుల ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. 1996లో ‘వియాస్నా హ్యూమన్ రైట్స్ సెంటర్’ అనే ప్రభుత్వేతర సంస్థను స్థాపించారు. అంకితభావం కలిగిన మానవ హక్కుల, పౌరస్వేచ్ఛ, ప్రజాస్వామ్య ఉద్యమకారుడిగా ప్రజల్లో గుర్తింపు పొందారు. ఎన్నో పోరాటాలను ముందుండి నడిపించారు. హవెల్స్ ఫర్ హ్యూమన్ రైట్స్ అవార్డును 2013లో, నోబెల్‌కు ప్రత్యామ్నాయంగా భావించే రైట్ లైవ్లీçహుడ్ అవార్డును 2020లో గెలుచుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలకు సారథ్యం వహిస్తున్న బియాల్‌యాస్కీని పన్నులు ఎగవేశారన్న కారణంతో బెలారస్ పాలకులు 2021 జూలై 14న నిర్బంధించారు. ఆయన ప్రస్తుతం ఎలాంటి విచారణ లేకుండా జైలులో మగ్గుతున్నారు. ఆయనను విడుదల చేయాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నా పాలకులు లెక్కచేయడం లేదు. ఎన్నో అవరోధాలు, బెదిరింపులు ఎదురైనా వెనక్కి తగ్గకుండా నమ్మిన సిద్ధాంతానికి బియాల్‌యాస్కీ కట్టుబడి ఉండడం విశేషం. సైనిక చర్యలకు వ్యతిరేకంగా పోరాటం ‘మెమోరియల్’ సంస్థ 1989 జనవరి 28న అప్పటి సోవియట్ యూనియన్ చివరిదశలో ఉన్న సమయంలో ఏర్పాటైంది. ప్రధానంగా ఇది న్యాయ సేవా సంస్థ. కమ్యూనిస్టు పాలకుల అణచివేత చర్యల వల్ల ఇబ్బందులు పడుతున్నవారికి అండగా నిలిచింది. రష్యాలో మానవ హక్కుల విధ్వంసంపై, రాజకీయ ఖైదీల స్థితిగతులపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తోంది. సైనిక చర్యలకు వ్యతిరేకంగా పోరాడుతోంది. ‘మెమోరియల్’ ప్రధాన కార్యాలయం రష్యా రాజధాని మాస్కోలో ఉంది. సంస్థ బోర్డు చైర్మన్‌గా యాన్ రచిన్‌స్కీ వ్యవహరిస్తున్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో ఈ సంస్థను ఈ ఏడాది ఏప్రిల్ 5న రష్యా ప్రభుత్వం మూసివేసింది. అయినప్పటికీ ‘మెమోరియల్’ కార్యకలాపాలు అనధికారికంగా కొనసాగుతూనే ఉండటం విశేషం. -
‘కేరళ మత్స్యకారులకు నోబెల్ ఇవ్వండి’
తిరువనంతపురం: కేరళలో వరదల సందర్భంగా అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించి తోటి ప్రజలను కాపాడిన మత్స్యకారులను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్ నోబెల్ శాంతి పురస్కారానికి సిఫార్సుచేశారు. ఈ మేరకు ఆయన నార్వే నోబెల్ ఎంపిక కమిటీ చైర్మన్‌కు లేఖ రాశారు. 2019 నోబెల్ పురస్కారాల ఎంపికలో మత్స్యకారులను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. గత ఆగస్టులో కేరళలో వరదలు ప్రళయం సృష్టిస్తున్న సమయంలో సహాయక చర్యల్లో పాలుపంచుకుని మత్స్యకారులు ప్రదర్శించిన సమయస్ఫూర్తి, తెగువను కొనియాడారు. ‘కేరళలో అంత పెద్ద విపత్తులో మత్స్యకారులు తమకు జీవనాధారమైన పడవల్ని సైతం పణంగా పెట్టి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. తమ పరిసరాల్లో చిక్కుకున్న వారిని కాపాడటంతోపాటు ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిలో చిక్కుకున్న సహాయక బృందాల పడవలను బయటపడేశారు’ అని థరూర్ లేఖలో పేర్కొన్నారు. ఓ మత్స్యకారుడు నీటిలో వంగినపుడు వృద్ధులు అతని వీపుపై కాలుపెట్టి పడవ ఎక్కిన దృశ్యం చిరకాలం గుర్తుండిపోతుందని తెలిపారు. -
అవార్డు విషయంలో అంగ్‌సాన్ సూకీకి ఊరట
యంగూన్ : నోబెల్ శాంతి పురస్కారాన్ని వెనక్కి తీసుకునే విషయంలో అంగ్ సాన్ సూకీకి ఊరట లభించింది. సూకీకి ప్రదానం చేసిన నోబెల్ శాంతి బహుమతిని వెనక్కి తీసుకోబోవడం లేదంటూ నోబెల్ ప్రైజ్ కమిటీ ప్రకటించింది. ఈ విషయం గురించి నార్వే నోబెల్ కమిటీ కార్యదర్శి ఓలావ్ నోజెలాడ్స్.. ఒక్కసారి ఎవరికైనా నోబెల్ పురస్కారాన్ని ప్రదానం చేస్తే దాన్ని రద్దు చేయడం.. వెనక్కి తీసుకోవడం వంటివి కుదరవని తెలిపారు.అలా చేయడం నోబెల్ అవార్డుల నియమ నిబంధనలకు వ్యతిరేకమని వివరించారు. అంతేకాక స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలకోసం అంగ్ సాన్ సూకీ చేసిన కృషికిగాను 1991లో ఆమెకి నోబెల్ శాంతి పురస్కారాన్ని ప్రదానం చేశారు. కాబట్టి ఇప్పుడు దాన్ని ఉపసంహరించుకోవడం కుదరదని ఓలావ్ నోజెలాడ్స్ తెల్చి చెప్పారు. రోహింగ్యా ముస్లిం పట్ల మయన్మార్ అవలంబిస్తోన్న విధానాలకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. ఈ విషయంలో మయన్మార్ ప్రభుత్వ కౌన్సిలర్‌గా ఉన్న అంగ్ సాన్ సూకీ తీరు పట్ల ప్రపంచవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ఐక్యరాజ్య సమితి కూడా అంగ్ సాన్ సూకీ తీరును తప్పుపట్టింది. ఈ సందర్భంగా పలు ప్రపంచ దేశాలు గతంలో సూకీకి ప్రదానం చేసిన గౌరవ పురస్కారాలని వెనక్కి తీసుకుంటున్నాయి. ఫలితంగా 1997లో అందుకున్న ‘ఫ్రీడమ్ ఆఫ్ ఆక్సఫర్డ్’ గౌరవ పురస్కారాన్ని సూకీ కోల్పోయారు. ఈ క్రమంలోనే 1991లో అంగ్‌సాన్ సూకీకి ప్రదానం చేసిన ‘నోబెల్ శాంతి పురస్కారా’న్ని కూడా వెనక్కి తీసుకోవాలనే ప్రతిపాదనలు వచ్చాయి. -
27 ఏళ్ల తర్వాత ఖండించింది
రష్డీపై ఫత్వాను ఖండించిన నోబెల్ కమిటీ స్టాక్‌హోం: బ్రిటిష్ ఇండియన్ నవలా రచయిత, వివాదాస్పద సెటానిక్ వర్సెస్ పుస్తకాన్ని రాసిన సల్మాన్ రష్డీపై ఇరానియన్ మతపెద్ద అయతున్లా రుహుల్లా కొమైనీ జారీ చేసిన ఫత్వాను స్వీడిష్ అకాడమీ గురువారం ఖండించింది. నోబెల్ సాహిత్య విజేతను ఎంపిక చేసే ఈ కమిటీ నుంచి 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత ఈ నిర్ణయం వెలువడింది. సెటానిక్ వర్సెస్ పుస్తకంలో ఇస్లాంను కించపరచారనే ఆరోపణలతో రష్డీపై ఫత్వా జారీ అయింది. అయితే 1989లో దీన్ని ఖండించడానికి అకాడమీ నిరాకరించడంతో ఇద్దరు సభ్యులు తమ పదవులనుంచి తప్పుకున్నారు. ఈ పుస్తకంపై రాజకీయ దుమారం రేగడంతో స్వీడిష్ అకాడమీ వ్యక్తికి భావప్రకటనా స్వేచ్ఛ ఉందని చెబుతూనే రష్డీకి మద్దతు మాత్రం ప్రకటించలేదు. ఏదేమైనప్పటికీ ఇన్నాళ్లకు రష్డీపై ఫత్వాను ఖండించిన స్వీడిష్ అకాడమీ ఆయన తలకు వెలకట్టడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని తన వెబ్సైట్లో పేర్కొంది.