స్టాక్‌హోమ్: అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి పురస్కారం ఇరాన్‌కు చెందిన మానవ హక్కుల కార్యకర్త నర్గిస్ మొహమ్మదికి లభించింది. ఇరాన్‌లో మహిళల అణచివేత, మానవ హక్కులపై అవగాహన, అందరికీ స్వేచ్ఛ, మరణ శిక్ష రద్దు కోసం అలుపెరగకుండా ఆమె చేస్తున్న పోరాటానికి అత్యున్నత పురస్కారం దక్కింది. మహిళల కోసం జీవితాన్ని ధారపోసినందుకు నర్గిస్‌ను శాంతి పురస్కారానికి ఎంపిక చేసినట్టుగా నార్వే నోబెల్ కమిటీ ప్రకటించింది.
ప్రస్తుతం ఆమె టెహ్రాన్‌లోని ఎవిన్ జైల్లో ఉన్నారు. ‘‘నర్గిస్ చేసిన పోరాటం అత్యంత సాహసోపేతమైనది. మహిళా హక్కుల కోసం ఆమె తన వ్యక్తిగత జీవితాన్ని పణంగా పెట్టారు. ఇరాన్‌లో ఏడాదిగా సాగుతున్న మహిళా హక్కుల పోరాటానికి నోబెల్ శాంతి తొలి గుర్తింపు. జైలు నుంచే ఈ ఉద్యమానికి ఊపిరిలా మారిన వివాదరహితురాలైన నర్గిస్ మొహమ్మదికి నోబెల్ శాంతి బహుమతిని ప్రకటిస్తున్నాం’’అని కమిటీ చైర్ పర్సన్ బెరిట్ రెసి అండర్సన్ వెల్లడించారు. నోబెల్ శాంతి పురస్కారం కింద ఆమెకు 1.1 కోట్ల స్వీడిష్ క్రోనర్లు (దాదాపుగా 10 లక్షల డాలర్లు) నగదు బహుమానం, 18 కేరట్ గోల్డ్ మెడల్, డిప్లొమా లభిస్తుంది,.
డిసెంబర్‌లో జరిగే అవార్డు ప్రదానోత్సవం సమయానికి నర్గిస్ జైలు నుంచి విడుదల కావాలని, స్వయంగా పురస్కారాన్ని అందుకోవాలని నోబెల్ కమిటీ ఆశాభావం వ్యక్తం చేసింది. ఇరాన్‌లో మహిళా హక్కుల ఉద్యమానికి అంతర్జాతీయ గుర్తింపు రావడంతో తనపై మరింత బాధ్యత పెరిగిందని నర్గిస్ జైలు నుంచే న్యూయార్క్ టైమ్స్‌కి ఒక ప్రకటన పంపారు. ‘‘నోబెల్ శాంతి పుర స్కారం నాలో మరింత స్ఫూర్తిని నింపింది. మహిళల సమస్యలు పరిష్కారమవుతాయన్న ఆశ పెరిగింది. ఇరాన్‌లో మార్పు కోసం పోరాడుతున్న వారి లో మరింత బలం పెరుగుతుంది. ఇక విజయం సమీపంలో ఉంది’’అని ఆ ప్రకటనలో ఆశాభావం వ్యక్తం చేశారు.
13 సార్లు అరెస్ట్..31 ఏళ్ల జైలు శిక్ష
హక్కుల పోరాటంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా నర్గిస్ వెనుకంజ వేయలేదు. ఇరాన్ ప్రభుత్వం ఆమెను ఇప్పటికి 13 సార్లు అరెస్ట్ చేసింది. అయిదు సార్లు దోషిగా నిర్ధారించింది. 31 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 154 సార్లు కొరడా దెబ్బల శిక్ష విధించింది. అయినా ఆమె అదరలేదు. బెదరలేదు. 1998లో ఇరాన్ ప్రభుత్వాన్ని విమర్శించి తొలిసారి అరెస్టయి ఏడాది జైల్లో ఉన్నారు. హ్యూమన్ రైట్స్ సంస్థలో చేరి మళ్లీ అరెస్టయ్యారు. 2011లో జాతి విద్రోహ కార్యకలాపాలు సాగిస్తున్నారంటూ మరోసారి అరెస్ట్ చేశారు. ఇరాన్‌లో మరణశిక్షలకు వ్యతిరేకంగా గళమెత్తినందుకు 2015లో జైలుకు పంపారు. ఇలా తన జీవితంలో సగభాగం ఆమె జైల్లోనే గడుపుతున్నారు.
అన్నీ కోల్పోయినా....
సంప్రదాయం పేరుతో మహిళలపై ఆంక్షలు విధిస్తూ హిజాబ్ కాస్త పక్కకి జరిగినా జైలు పాల్జేయడమో, కొట్టి చంపేయడమో చేసే దేశంలో పుట్టి మహిళా హక్కుల కోసం జీవితాన్ని ధారపోస్తున్న నర్గిస్ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించిన సమయంలో నాలుగ్గోడల మధ్య బందీగా ఉన్నారు. వ్యక్తి గత జీవితాన్ని, ఆరోగ్యాన్ని, స్వేచ్ఛని పణంగా పెట్టి 51 ఏళ్ల వయసున్న నర్గిస్ ఇంకా మార్పు కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు.
‘‘ప్రభుత్వం నన్ను ఎంత అణగదొక్కాలని చూస్తే, ఎంతగా శిక్షిస్తే నాలో పోరాట స్ఫూర్తి అంతకంతకూ పెరుగుతుంది. దేశంలో మహిళలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే వరకు ఈ పోరాటం ఆగదు’’అని నర్గిస్ పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఇరాన్‌లోని జంజన్ పట్టణంలో 1972, ఏప్రిల్ 21న ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి ఒక రైతు. తల్లి ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. 1979లో ఇరాన్ విప్లవం సమయంలో రాచరికం రద్దయిందో అప్పుడే నర్గిస్ తల్లి సోదరుడు, మరో ఇద్దరు కుటుంబసభ్యులు జైలు పాలయ్యారు. వారిని ప్రతీ వారం కలుసుకోవడానికి తల్లితో పాటు జైలుకు వెళ్లే చిన్నారి నర్గిస్‌కు తమ బతుకులు ఎందుకంత అణచివేతకు గురవుతున్నాయో అర్థం కాక తీవ్ర సంఘర్షణకు లోనయ్యేది.
అది చూసి ఆమె తల్లి తనకున్న అనుభవంతో రాజకీయాలు, వ్యవస్థల జోలికి వెళ్లొద్దని హితవు చెప్పింది. అయినప్పటికీ నర్గిస్‌లో చిన్నప్పట్నుంచి ధైర్యసాహసాలు, పోరాట స్ఫూర్తి ఆమెను హక్కుల పోరాటంలో ముందుకు నడిపించాయి. ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసిన తర్వాత ఆమె కొన్నాళ్లు వార్తాపత్రికలకు కాలమిస్ట్‌గా చేశారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత షిరిన్ ఎబది స్థాపించిన డిఫెండర్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సెంటర్‌లో 2003లో చేరిన ఆమె ప్రస్తుతం ఉపాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. కాలేజీలో సహచర విద్యారి్థగా పరిచయమైన ప్రఖ్యాత సామాజిక కార్యకర్త తాఘి రెహమనీను ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం రెహమనీ తన పిల్లలతో కలిసి పారిస్‌కు ప్రవాసం వెళ్లిపోయారు. తన భర్త, పిల్లలతో మాట్లాడి, ప్రేమతో వారిని అక్కున చేర్చుకొని ఆమెకు ఏళ్లు గడిచిపోయాయి.
జైలు నుంచే పోరాటం
జైలు నుంచి ఆమె ఎందరిలోనో ఉద్యమ స్ఫూర్తి రగిలిస్తున్నారు. రాజకీయ ఖైదీలు, మహిళా ఖైదీలపై జరుగుతున్న లైంగిక హింసకు వ్యతిరేకంగా జైల్లోనే ఆమె ఉద్యమం ప్రారంభించారు. జైల్లో కూడా ఆమెకు మద్దతుదారులు పెరగడంతో అధికారులు ఆమెపై పలు ఆంక్షలు విధించారు. అయినా ఆమె బెదరలేదు. జైలు నుంచే పలు వ్యాసాలు న్యూయార్క్ టైమ్స్, బీబీసీ వంటి వాటికి పంపించారు. 2022 సెపె్టంబర్‌లో హిజాబ్ ధరించనందుకు మాసా అమిని అనే యువతిని ఇరాన్ పోలీసులు అరెస్ట్ చేయగా కస్టడీలో తీవ్ర గాయాలపాలై ఆమె మరణించిన విషయం తెలిసిందే. దీంతో ఇరాన్‌లో భారీగా యువతీ యువకులు ఆందోళనలు చేపట్టి రోడ్లపైకి వచి్చనప్పుడు జైలు నుంచే ఆమె తన గళాన్ని వినిపించారు. పోరాడే వారిలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తోటి మహిళా ఖైదీల అనుభవాలతో వైట్ టార్చర్ అనే పుస్తకాన్ని రాశారు. ప్రపంచంలో అత్యధికంగా ఉరిశిక్షలు విధించే ఇరాన్‌లో అత్యంత క్రూరమైన ఆ శిక్షను రద్దు చేసే వరకు తన పోరాటం ఆగదని నర్గిస్ ఎలుగెత్తి చాటుతున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment