ఆ ఆక్రందన వినబడదా?
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్‌సాన్ సూచీ మార్గదర్శకత్వంలో మయన్మార్‌లో రెండేళ్ల క్రితం ఏర్పడ్డ పౌర ప్రజాస్వామ్య ప్రభుత్వం విశ్వసనీయత నేడు ప్రశ్నార్థకంగా మారింది. వాయవ్య రాష్ట్రమైన రఖీన్ ఉత్తర భాగంలో సైన్యం సాగిస్తున్న జాతి విద్వేష మారణకాండ ఫలితంగా పెద్ద ఎత్తున రోహింగియాలు ప్రాణాలు అరచేత పట్టుకుని బంగ్లాదేశ్ తదితర పొరుగు దేశాలకు పారి పోతున్నారు. 1978 నుంచి దఫదఫాలుగా చెలరేగుతున్న ఈ హింసాకాండ ఫలితంగా ఒక్క బంగ్లాదేశ్‌లోనే మూడు లక్షల మంది రోహింగియాలు ఆశ్రయం పొందుతున్నారు.
తాజా హింసాకాండతో మరో 30 వేల మంది శరణార్థులు వచ్చి పడటంతో బంగ్లాదేశ్ సరిహద్దులను మూసేసింది. మరింత మంది శరణార్థులను స్వీకరించే స్థితిలో బంగ్లాదేశ్‌లేక పోయినా గత్యంతరం లేదని, వారిని చిత్రహింసలకు, మారణకాండకు బలిచేయడమే అవుతుందని ఐక్యరాజ్యసమితి శరణార్థుల సంస్థ స్థానిక అధిపతి జాన్ మెక్ కిస్సిక్ నిస్సహాయతను వ్యక్తం చేశారు.
సముద్రం మీదుగా ఇండోనేసియా, మలేసియా, థాయ్‌లాండ్‌లకు చేరుకోవాలని చిన్న పడవలలో పయనిస్తున్న వేలాది మంది రోహింగియాలలో పలువురు జల సమాధి అయిపోతున్నారు. సిరియా, యెమెన్‌లలోని మానవతావాద సంక్షోభ స్థాయికి విస్తరి స్తున్న ఈ సంక్షోభం అంతర్జాతీయ ప్రపంచానికి అంతగా పట్టకపోవడం విచార కరం. తరతరాలుగా రఖీన్‌లో నివసిస్తున్న రోహింగియాలకు పూర్తి స్థాయి పౌర సత్వ హక్కులను ఇవ్వకపోతే మయన్మార్ తాను కోరుకుంటున్న దేశంగా అవతరిం చలేదని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం పలుమార్లు విజ్ఞప్తి చేశారు. అయినా పౌర ప్రభుత్వం కూడా సైనిక పాలకులలాగే రోహింగియాలను ‘బయటి నుంచి వచ్చినవారు’ ‘చట్టవిరుద్ధంగా వలసవచ్చినవారు’ ‘విదేశీయులు’ ‘బెంగా లీలు’ ‘ఇస్లామిక్ ఉగ్రవాదులు’ అని వాదిస్తుండటం విభ్రాంతికరం.
1784లో అటు నుంచి బెంగాల్ నవాబులు, 1785లో ఇటు నుంచి బమార్ బౌద్ధ రాజుల ఆక్రమణకు గురికావడానికి ముందు.. నేటి మయన్మార్‌లోని రఖీన్ నుంచి బంగ్లాదేశ్‌లోని చిటగాంగ్ ప్రాంతం వరకు అరఖాన్ రాజ్యం విస్తరించి ఉండేది. అప్పట్లో ఆ ప్రాంతంలో ఇస్లాంగానీ, బౌద్ధంగానీ లేవు. రోహింగియాలు అంటే అరఖాన్ వాసులు, అరఖాన్ భాష మాట్లాడేవారు. అరఖాన్‌కు ముస్లింలు పెట్టిన పేరు రోహింగా. బెంగాల్‌లోని రోహింగియాలు కాలక్రమేణా అక్కడి పౌరు లుగా, నేడు బంగ్లాదేశీలుగా విలీనంకాగా, మయన్మార్‌లోని రోహింగియాలకు 1960ల నుంచి ‘విదేశీయుల’ ముద్ర వేయడం ప్రారంభమైంది.
రఖీన్ ప్రజలు ఏ మతస్తులైనా వారు మాట్లాడే అరఖానీకి బెంగాలీ, అరబ్బీ, బర్మీలతో పోలికే ఉండదు. చిట్టగాంగ్ ఆదివాసుల భాషతో దానికి మాండలిక భేదాలే కనిపిస్తాయి. మయన్మార్‌ను దశాబ్దాల తరబడి పాలించిన సైనిక పాలకులు బహుజాతుల నిల యమైన దేశంలో జనాభాలో 60 శాతంగా ఉన్న బమర్ జాత్యహంకారాన్ని, బౌద్ధ మతోన్మాదాన్ని పెంచి పోషించారు. 1962 నుంచి బర్మాలో దఫదఫాలుగా జాతి విద్వేష జ్వాలలను రగిల్చి లబ్ధి పొందారు. వాయవ్యాన ముస్లిం రోహింగియా లపైనా, తూర్పున కచిన్, కరెన్ తదితర క్రైస్తవ జాతులపైన సాగిన దాడుల ఫలి తంగా వివిధ జాతుల ప్రజలు పెద్ద ఎత్తున పొరుగు దేశాలకు తరలిపోయారు.
2012లో సైన్యం రోహింగియాలపై సాగించిన మారణకాండ సందర్భంగా పలు హక్కుల సంఘాలు ఈ పరిస్థితి ఇస్లామిక్ మిలిటెన్సీకి దారితీయవచ్చని హెచ్చరించాయి. అక్టోబర్ రెండవ వారంలో బంగ్లా సరిహద్దుల్లో గుర్తు తెలియని దుండగులు తొమ్మిది మంది పోలీసు అధికారులను కాల్చి చంపారు. అది రోహిం గియా మిలిటెంట్ల పనే అని ప్రభుత్వ వాదన. అది సాకుగా సైన్యం ఉత్తర రఖీన్ అంతటా బీభత్సకాండను తీవ్రతరం చేసింది. సైన్యం, బౌద్ధ మిలీషియాలూ రోహింగియాల ఆస్తులను దగ్ధం చేసి, సామూహిక హత్యలు, మానభంగాలకు పాల్పడుతున్నట్టుగా హక్కుల సంస్థల కథనం. రఖీన్‌లోని నాజీ కాన్‌సెంట్రెషన్ క్యాంపులలాంటి సైనిక శిబిరాల్లోకి రోహింగియాలను తరలిస్తున్నారు. అలా బందీ లుగా ఉన్న 1,50,000 మంది రోహింగియాలు ఆహారం, వైద్యం కోసం అలమ టిస్తున్నారని, 3,000 మంది పసిపిల్లలు మృత్యువు అంచుల్లో నిలిచారని ఐరాస ఆందోళన వ్యక్తం చేసిందంటేనే పరిస్థితి తీవ్రత అర్థమౌతుంది.
ఇంటర్నేషనల్ స్టేట్ క్రైమ్ ఇనిషియేటివ్ ఈ మారణకాండను సంఘటిత జాతి నిర్మూలనగా అభి వర్ణించింది. రోహింగియాలను భౌతికంగా నిర్మూలించాలని, దేశం నుంచి తరిమే యాలని సైన్యం ప్రయత్నిస్తోందని ఆ సంస్థ ఆరోపించింది. అంతర్జాతీయ హక్కుల సంస్థలను, మీడియాను రఖీన్‌లోకి అనుమతించక పోవడంతో అవి రోహింగి యాలపై మారణకాండ పేరిట కట్టుకథలను వ్యాపింప జేస్తున్నాయని ప్రభుత్వం అంటోంది. పత్రికలపైన సైతం సైనిక పాలన తరహా నిర్బంధం అమలవుతోంది. రఖీన్ మానవతావాద సంక్షోభంపై కథనాన్ని వెలువరించిన ఒక విలేకరిని ఉద్యోగం నుంచి తొలగించినా ఒక ప్రధాన ఆంగ్ల దినపత్రిక ప్రచురణ నిలిచిపోక తప్పింది కాదు. కాగా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించడం కోసం రోహింగియాలు తమ గ్రామాలను తామే తగులబెట్టుకున్నారని సూచీ అధికారిక ప్రతినిధి జాటే ప్రకటించారు. దీంతో ఆమె ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారని కొందరు భావిస్తు న్నారు.
మరోవంక ప్రభుత్వం రోహింగియాల వేటకు ప్రైవేటు మిలీషియాల ఏర్పా టుకు పచ్చజెండా చూపింది. పౌర ప్రభుత్వానికి ఎలాంటి అధికారం, అదుపూలేని సైన్యాన్ని కట్టడి చేయడానికి సూచీ ఏం చేస్తారోనని ప్రపంచం ఆమె వైపే చూస్తోంది. ఏది ఏమైనా రోహింగియాల సమస్య మానవతావాద మహా విపత్తుగా మారకముందే అంతర్జాతీయ సమాజం మేల్కొనకపోతే మయన్మార్ మరో రువాండాగా మారే ప్రమాదం ఉంది. ‘‘ప్రపంచం మాకు సహాయం చేయలేకపోతే పోనీ, ఓ బాంబేసి ఒక్కసారే చంపేయరాదా?’’ అని ఆక్రందిస్తున్న రోహింగియా తల్లుల ఆవేదనను అంతర్జాతీయ సమాజం ఇప్పటికైనా పట్టించుకునేలా కృషి చేయాల్సిన బాధ్యత భారత్‌పై ఉంది.