rohingiyas
-
శరణార్థుల గోడు పట్టదా?
రోహింగ్యా శరణార్థుల అంశం మళ్ళీ పతాక శీర్షికలకెక్కింది. అధికారంలో ఉన్నవారికి ఈ కాందిశీ కుల పట్ల అనుసరించాల్సిన వైఖరిలో స్పష్టత లేదని మరోసారి రుజువైంది. మురికివాడల్లోని 1100 మంది రోహింగ్యాలను ఢిల్లీ శివార్లలోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు ఉద్దేశించిన నివాసాల్లోకి తరలించి, ప్రాథమిక వసతులు కల్పించి, పోలీసు భద్రత కల్పిస్తామంటూ కేంద్ర గృహనిర్మాణ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ఆగస్ట్ 17న ట్వీట్ చేశారు. కానీ, అమిత్ షా సారథ్యం లోని హోమ్ శాఖ తక్షణమే రంగంలోకి దిగి, ‘‘చట్టవిరుద్ధమైన రోహింగ్యా విదేశీయులకు’’ ఆ నివాసాలివ్వాలంటూ ఎలాంటి ఆదేశాలూ జారీ చేయలేదని వివరణనిచ్చింది. కొద్ది గంటల తేడాలో ఒకే అంశంపై రెండు మంత్రిత్వశాఖలు రెండు రకాలుగా స్పందించడం విడ్డూరం. కాందిశీకుల అంశంపై దేశంలో జాతీయ స్థాయిలో ఓ చట్టం అవసరమని తాజా వివాదం మరోసారి గుర్తుచేస్తోంది. గతంలో యూపీ నీటిపారుదల శాఖ స్థలంలో ఉంటున్న నివాసాలు ప్రభుత్వం నోటీసిచ్చిన మరునాడే అనూహ్యంగా అగ్నికి ఆహుతయ్యాక, ఢిల్లీ శివారులోని ఓ ఇస్లామిక్ ఛారిటీకి చెందిన స్థలంలో తాత్కాలిక నివాసాల్లో, దగ్గరలో మరుగుదొడ్లు కూడా లేని దుర్భరస్థితిలో రోహింగ్యాలు బతుకులు వెళ్ళదీస్తున్నారు. వారికి కనీస వసతులు కల్పిస్తామని సర్కార్ 2021లోనే అంది. ఆ పరిణామ క్రమంలోనే దౌత్యవేత్త, సీనియర్ మంత్రి పూరీ తాజా ట్వీట్ వచ్చింది. తీరా విశ్వహిందూ పరిషత్ సహా అధిక సంఖ్యాక హిందూ సమర్థకుల విమర్శలకు వెరచి, ప్రభుత్వం ప్లేటు ఫిరాయిం చడం శోచనీయం. రోహింగ్యా అనేది పశ్చిమ మయన్మార్ (బర్మా)లోని రఖైన్ ప్రావిన్స్‌కు చెందిన సమూహం. ముస్లిమ్లైన వీరు బెంగాలీలోని ఓ మాండలికంలో మాట్లాడతారు. మయన్మార్ వీరిని ‘నివాసిత విదేశీయులు’ అనీ, ‘సహచర పౌరుల’నీ పేర్కొంటోంది. 2012 నుంచి వరుస హింసా కాండలతో వీరు మయన్మార్‌ను వదిలిపోవాల్సి వచ్చింది. 5 లక్షల మంది సౌదీ అరేబియాకు పారి పోయారు. 2017లో మళ్ళీ మయన్మార్ సైన్యం దాడులతో, లక్షలాది రోహింగ్యాలు బంగ్లాదేశ్‌లో తలదాచుకున్నారు. 2012లో 1200 మంది తొలి బృందం శరణార్థులుగా ఢిల్లీకి వచ్చింది. అయితే, 2018 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు భారత్ మొత్తం 12 మంది శరణార్థుల్ని మయన్మార్‌కు తిప్పి పంపింది. ఇది రోహింగ్యాల అంశంపై గళం విప్పుతున్న ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ బృందం లెక్క. వారందరూ స్వచ్ఛందంగా తిరిగి వెళ్ళారని సర్కారు వారి మాట. కానీ, ఐరాస శరణార్థి సంస్థ స్వతంత్రంగా ఆ సంగతి నిర్ధారించుకొనేందుకు పదే పదే అభ్యర్థించినా, అనుమతి నిరాకరించడం గమనార్హం. మన దేశంలో మొత్తంగా 40 వేల మంది రోహింగ్యా కాందిశీకులు ఉన్నారు. వారిలో 5700 మంది జమ్మూలో, మిగిలినవారు తెలంగాణ, పంజాబ్, హర్యానా, యూపీ, రాజస్థాన్‌లలో తలదాచుకున్నారు. అయితే వీరిలో 16 వేల మందే ఐరాస శరణార్థి సంస్థ వద్ద నమోదు చేసుకున్నారు. రోహింగ్యాలు దేశభద్రతకు ముప్పు అని చిత్రీకరిస్తూ మెజారిటీ వర్గీయులు పోనుపోనూ స్వరం పెంచుతున్నారు. రోహింగ్యాలకు వ్యతిరేకంగా ఎంత గట్టిగా మాట్లాడితే, అంత ఎక్కువగా జాతీయతావాదులనే కీర్తి దక్కుతుందని భావిస్తున్నారు. నిజానికి, 1951 నాటి ఐరాస అంతర్జాతీయ శరణార్థుల ఒప్పందంపై కానీ, కాందిశీకుల హోదాకు సంబంధించిన 1967 నాటి ప్రోటోకాల్‌పై కానీ భారత్ సంతకం చేయలేదు. కాబట్టి, అవతలి దేశంలో పీడనకు గురవుతారని తెలిసీ రోహింగ్యాలను మయన్మార్‌కు బలవంతాన పంపేయడం చట్టప్రకారం సరైనదేనని వాదించవచ్చు. అందుకు మునుపటి సుప్రీమ్ కోర్ట్ తీర్పుల్నీ ఉదాహరణగా చూపవచ్చు. కానీ, తెలిసి తెలిసీ అలా పంపరాదన్నదే సంతకాలతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ చట్టంలో అందరూ అనుసరించే సంప్రదాయం, ధర్మం. న్యాయస్థానం సైతం ఈ నిస్సహాయులకు అండగా నిలవకపోవడం విషాదం. హోమ్‌శాఖ 2011లో జారీ చేసిన ‘ప్రత్యేక వ్యవహార సూత్రాలు’ మినహా ఇప్పటికీ మన దేశంలో అంతర్జాతీయ ఆదర్శాలకు తగ్గట్టు శరణార్థులకు ఓ జాతీయ చట్టమంటూ లేకపోవడమే దీనికి కారణం. శశిధరూర్ ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టినా రాజకీయ ఏకాభిప్రాయం లేక, లాభం లేకపోయింది. ఇప్పటికీ పాకిస్తానీ హిందువులు, శ్రీలంక తమిళులు, టిబెటన్లు దేశంలోని శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఏ ప్రాంతానికీ చెందని ఇలాంటివారు దేశంలో 2.89 లక్షల మంది ఉన్నారు మరి, ఐరాస గుర్తింపుకార్డులిచ్చిన రోహింగ్యాల పట్ల పాలకులు అదే తరహా వైఖరి చూపడానికి ఇబ్బందేమిటి? పదేళ్ళుగా ఈ గడ్డపైనే ఉంటున్న సాటి మనుషులుగా రోహింగ్యాలు మెరుగైన జీవితం గడిపేలా చూడడం మానవత్వం. ఆ మేరకు గతంలో చేసిన బాసలకు భారత్ కట్టుబడాలి. వేదికలపై ‘వసుధైక కుటుంబం’ లాంటి కబుర్లు చెప్పే పాలకులు తీరా చేతల్లో తద్భిన్నంగా వ్యవహరిస్తే ఎలా? శరణార్థులపై విదేశాంగ విధానాల్లో ఒక మాట, దేశంలో రాజకీయ లబ్ధి కోసం వారినే ‘చెదలు’ అని ఈసడిస్తూ మరోమాట మాట్లాడడం ఏ రకంగా సమర్థనీయం? రోహింగ్యాలంటే తీవ్రవాదులే అన్న భావన ఎవరు, ఎందుకు కల్పిస్తున్నారు? ‘అంతర్జాతీయ శరణార్థుల ఒప్పందా’న్ని భారతదేశం గౌరవిస్తుంది. జాతి, మతం, ధార్మిక విశ్వాసాల సంబంధం లేకుండా అందరికీ ఆశ్రయమిస్తుంది’ అనే మంత్రి గారి మాట ఉత్తుత్తిదేనా? శరణు కోరినవారిని కాపాడమనే శ్రీరాముడే ఆదర్శం అనే పాలకులు ఆలోచించాలి. -
మయన్మార్ టు హైదరాబాద్
మయన్మార్ నుంచి బంగ్లాదేశ్ మీదుగా భారత్‌కు వలసవచ్చి, నగరంలో శరణార్థులుగా స్థిరపడి, దేశ పౌరులుగా ప్రకటించుకొని గుర్తింపు కార్డులు పొందిన ముగ్గురు రోహింగ్యాలను దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వీరు కొన్ని ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధిపొందినట్లు గుర్తించామని అదనపు డీసీపీ ఎస్.చైతన్యకుమార్ బుధవారం వెల్లడించారు. మయన్మార్‌లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో పలువురు రోహింగ్యాలు భారత్‌కు వలస వస్తున్నారు. వీరిలో కొందరు శరణార్థులుగా, మరికొందరు అక్రమమార్గంలో వచ్చి చేరుతున్నారు. సాక్షి, సిటీబ్యూరో: మయన్మార్ నుంచి బంగ్లాదేశ్ మీదుగా భారత్‌కు వలసవచ్చి, నగరంలో శరణార్థులుగా స్థిరపడి, దేశ పౌరులుగా ప్రకటించుకుని గుర్తింపుకార్డులు పొందిన ముగ్గురు రోహింగ్యాలను దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వీరు కొన్ని ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధిపొందినట్లు గుర్తించినట్లు అదనపు డీసీపీ ఎస్.చైతన్యకుమార్ బుధవారం వెల్లడించారు. మయన్మార్‌లోని బుథీడంగ్ ప్రాంతానికి చెందిన మమ్మద్ ఇబ్రహీం 2013లో ఆ ప్రాంతాన్ని వదిలేశాడు. రెండేళ్లు బంగ్లాదేశ్‌లో ఉన్న ఇతను 2015లో హైదరాబాద్ వచ్చి బహదూర్‌పురలోని ఎన్ఎం గూడలో ఉంటున్నాడు. 2017లో మయన్మార్ శరణార్థి అయిన అఖితారా బేగంను వివాహం చేసుకున్నాడు. ఇతడికి ఐక్యరాజ్య సమితి జారీ చేసిన శరిణార్థి కార్డు కూడా ఉంది. అదేదేశానికి చెందిన నూర్ ఉల్ అలీం 2007లో తల్లి, ఐదుగురు సోదరులు, సోదరితో హైదరాబాద్‌కు వచ్చి ఎంఎన్ గూడలో స్థిరపడ్డాడు. మయన్మార్‌కే చెందిన రజియా బేగంను వివాహం చేసుకున్నాడు. ఇతడికీ శరణార్థి కార్డు ఉంది. మూడో వ్యక్తి అయిన షేక్ అజహర్ కిషన్‌బాగ్‌లో ఉంటూ హైదరాబాద్‌కు చెందిన షకీనా బేగంను వివాహం చేసుకున్నాడు. 2012లో మహ్మద్ అజహర్ పేరుతో గుర్తింపుకార్డులు పొందిన అతను ఆపై 2015లో అసలు పేరుతో మరోసారి కార్డులు తీసుకున్నాడు. ఇతడికి శరణార్థి కార్డు లేకపోవడంతో భారత్‌లో అక్రమంగా నిసిస్తున్నట్లు భావిస్తున్నారు. ఈ ముగ్గురూ తాము భారతీయులుగా పేర్కొంటూ క్లైమ్ చేసుకుంటున్నారు. మహ్మద్ ఇబ్రహీం తన భార్యకు కేసీఆర్ కిట్‌ను కూడా తీసుకున్నాడు. ఈ ముగ్గురి వ్యవహారంపై సమాచారం అందుకున్న సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.మధుమోహన్‌రెడ్డి నేతృత్వంలో ఎస్సైలు ఎన్.శ్రీశైలం, కేఎన్ ప్రసాద్‌వర్మ, వి.నరేందర్, మహ్మద్ త ఖ్రుద్దీన్ తమ బృందంతో వలపన్ని పట్టుకున్నారు. రోహింగ్యాల ‘ప్రయాణం’ ఇలా... మయన్మార్‌లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో పలువురు రోహింగ్యాలు భారత్‌కు వలసవస్తున్నారు. వీరిలో కొందరు శరణార్థులుగా, మరికొందరు అక్రమమార్గంలో వచ్చి చేరుతున్నారు. ఈ ముగ్గురి విచారణలో మయన్మార్ నుంచి హైదరాబాద్ వరకు వారి ‘ప్రయాణం’, ఇక్కడగుర్తింపుకార్డులు పొందుతున్న వైనం బయటపడ్డాయి. ♦ మయన్మార్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన రోహింగ్యాలు అడవుల వెంట కాలినడకన ఆదేశంలోని మాంగ్డో ప్రాంతానికి చేరుకుంటున్నారు. ♦ ఈ మార్గంలో ఎక్కడా తమ ఉనికి పోలీసులు, సాయుధ బలగాలకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. ♦ దళారుల సహకారంతో మాంగ్డో నుంచి బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని నఫ్ నది తీరానికి చేరుకుంటున్నారు. ♦ రాత్రి వేళల్లో చిన్న చిన్న పడవలపై నఫ్ నదిని దాటుతున్న వీరిని బంగ్లాదేశ్‌లో ఉన్న దళారులు రిసీవ్ చేసుకుని, భద్రత బలగాల కంట పడకుండా టెక్నాఫ్ అనే నగరానికి తరలిస్తున్నారు. ♦ టెక్నాఫ్ నుంచి బస్సుల్లో ప్రపంచంలోనే అతిపెద్ద రోహింగ్యాల శరణార్థి శిబిరమైన కాక్స్ బజార్‌కు చేరుకుంటున్నారు. అక్కడే అనేక మందిఐక్యరాజ్య సమితి శరణార్థి కార్డు పొందుతున్నారు. ♦ ఈ శిబిరంలో కొన్నాళ్లు తలదాచుకుంటున్న రోహింగ్యాలు ఢాకా చేరుకుని, అక్కడ నుంచి బస్సుల్లో ఇండో–బంగ్లా సరిహద్దుల్లోని భోమ్రా ప్రాంతానికి చేరుతున్నారు. ♦ దళారులు వీరిని భద్రతా బలగాల కళ్ళుగప్పిఇచ్ఛామతి నదిని దాటిస్తూ భారత్‌లోకి పంపుతున్నారు. ♦ పశ్చిమ బెంగాల్‌లోని బసిర్హట్ ప్రాంతానికి చేరుకునే వీరు అక్కడి నుంచి హౌరాకు వచ్చి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి స్థిరపడుతున్నారు. ప్రధానంగా హైదరాబాద్‌తో పాటు బీహార్, జమ్మూకాశ్మీర్‌లకు వీరి తాకిడి ఎక్కువగా ఉంది. ♦ ఎక్కడికి వెళ్లినా తాము పశ్చిమ బెంగాల్ వాసులుగా చెప్పుకుంటూ ఇంటిని అద్దెకు తీసుకుంటున్నారు. ♦ అద్దె ఇంటి కరెంట్ బిల్లు ఆధారంగా, వ్యవస్థాగతంగా ఉన్న లోపాలను వాడుకుంటూ ఓటర్ ఐడీలు పొందుతున్నారు. దీని ఆధారంగా ఆధార్, రేషన్‌కార్డు, పాస్‌పోర్ట్ తదితర గుర్తింపుకార్డులు తీసుకుంటున్నారు. ♦ ఆ తర్వాత ఇదే పాస్‌పోర్ట్‌తో ఇతర దేశాలకు వెళుతున్నట్లు గుర్తించారు. ♦ కాక్స్ టౌన్లో నివసిస్తే నెలకు కేవలం రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకే సంపాదన ఉంటోందని, అదే హైదరాబాద్ లాంటి నగరాలకు వచ్చేస్తే రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు సంపాదిస్తున్నామని టాస్క్‌ఫోర్స్‌కు చిక్కిన ముగ్గురు రోహింగ్యాలు వెల్లడించారు. -
నోటిదురుసుతో అందాల కిరీటం మిస్
నేపిడా: తన నోటిదురుసుతో తాను కైవసం చేసుకున్న అందాల కిరీటాన్ని మయన్మార్ బ్యూటీ క్వీన్ కోల్పోయింది. రోహింగ్యా సంక్షోభంపై వ్యాఖ్యానించి మిస్ గ్రాండ్ మయన్మార్ టైటిల్‌ను షుయెన్ సి(19) పోగొట్టుకుంది. మయన్మార్‌లో రోహింగ్యా మిలిటెంట్లు అశాంతిని ప్రేరేపించారనే వీడియోను ఆమె తన ఫేస్బుక్ పేజ్‌లో పోస్ట్ చేశారు. రోహింగ్యాలు, వారి మద్దతుదారులు మీడియాలో పథకం ప్రకారం ప్రచారం సాగిస్తున్నారని ఆరోపించారు. దీంతో షుయెన్ సి మిస్ గ్రాండ్ మయన్మార్ టైటిల్‌ను రద్దు చేస్తున్నట్టు టైటిల్ నిర్వాహకులు పేర్కొన్నారు. ఆమె దిగజారుడు వ్యాఖ్యలతో రోల్‌మోడల్‌గా విఫలమయ్యారని చెప్పారు. వివాదాలతో బ్యూటీ టైటిల్‌ను కోల్పోవడం సీ ఒక్కరికే అనుభవంలోకి రాలేదు. గత నెలలో టర్కీ నేషనల్ బ్యూటీ 2017 టైటిల్‌ను దక్కించుకున్న ముద్దుగుమ్మ కూడా ఓ వివాదాస్పద ట్వీట్‌ను పోస్ట్ చేయడంద్వారా తన టైటిల్‌కే ఎసరు తెచ్చుకున్నారు. -
ఆ ఆక్రందన వినబడదా?
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్‌సాన్ సూచీ మార్గదర్శకత్వంలో మయన్మార్‌లో రెండేళ్ల క్రితం ఏర్పడ్డ పౌర ప్రజాస్వామ్య ప్రభుత్వం విశ్వసనీయత నేడు ప్రశ్నార్థకంగా మారింది. వాయవ్య రాష్ట్రమైన రఖీన్ ఉత్తర భాగంలో సైన్యం సాగిస్తున్న జాతి విద్వేష మారణకాండ ఫలితంగా పెద్ద ఎత్తున రోహింగియాలు ప్రాణాలు అరచేత పట్టుకుని బంగ్లాదేశ్ తదితర పొరుగు దేశాలకు పారి పోతున్నారు. 1978 నుంచి దఫదఫాలుగా చెలరేగుతున్న ఈ హింసాకాండ ఫలితంగా ఒక్క బంగ్లాదేశ్‌లోనే మూడు లక్షల మంది రోహింగియాలు ఆశ్రయం పొందుతున్నారు. తాజా హింసాకాండతో మరో 30 వేల మంది శరణార్థులు వచ్చి పడటంతో బంగ్లాదేశ్ సరిహద్దులను మూసేసింది. మరింత మంది శరణార్థులను స్వీకరించే స్థితిలో బంగ్లాదేశ్లేక పోయినా గత్యంతరం లేదని, వారిని చిత్రహింసలకు, మారణకాండకు బలిచేయడమే అవుతుందని ఐక్యరాజ్యసమితి శరణార్థుల సంస్థ స్థానిక అధిపతి జాన్ మెక్ కిస్సిక్ నిస్సహాయతను వ్యక్తం చేశారు. సముద్రం మీదుగా ఇండోనేసియా, మలేసియా, థాయ్‌లాండ్‌లకు చేరుకోవాలని చిన్న పడవలలో పయనిస్తున్న వేలాది మంది రోహింగియాలలో పలువురు జల సమాధి అయిపోతున్నారు. సిరియా, యెమెన్‌లలోని మానవతావాద సంక్షోభ స్థాయికి విస్తరి స్తున్న ఈ సంక్షోభం అంతర్జాతీయ ప్రపంచానికి అంతగా పట్టకపోవడం విచార కరం. తరతరాలుగా రఖీన్లో నివసిస్తున్న రోహింగియాలకు పూర్తి స్థాయి పౌర సత్వ హక్కులను ఇవ్వకపోతే మయన్మార్ తాను కోరుకుంటున్న దేశంగా అవతరిం చలేదని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం పలుమార్లు విజ్ఞప్తి చేశారు. అయినా పౌర ప్రభుత్వం కూడా సైనిక పాలకులలాగే రోహింగియాలను ‘బయటి నుంచి వచ్చినవారు’ ‘చట్టవిరుద్ధంగా వలసవచ్చినవారు’ ‘విదేశీయులు’ ‘బెంగా లీలు’ ‘ఇస్లామిక్ ఉగ్రవాదులు’ అని వాదిస్తుండటం విభ్రాంతికరం. 1784లో అటు నుంచి బెంగాల్ నవాబులు, 1785లో ఇటు నుంచి బమార్ బౌద్ధ రాజుల ఆక్రమణకు గురికావడానికి ముందు.. నేటి మయన్మార్‌లోని రఖీన్ నుంచి బంగ్లాదేశ్‌లోని చిటగాంగ్ ప్రాంతం వరకు అరఖాన్ రాజ్యం విస్తరించి ఉండేది. అప్పట్లో ఆ ప్రాంతంలో ఇస్లాంగానీ, బౌద్ధంగానీ లేవు. రోహింగియాలు అంటే అరఖాన్ వాసులు, అరఖాన్ భాష మాట్లాడేవారు. అరఖాన్కు ముస్లింలు పెట్టిన పేరు రోహింగా. బెంగాల్‌లోని రోహింగియాలు కాలక్రమేణా అక్కడి పౌరు లుగా, నేడు బంగ్లాదేశీలుగా విలీనంకాగా, మయన్మార్‌లోని రోహింగియాలకు 1960ల నుంచి ‘విదేశీయుల’ ముద్ర వేయడం ప్రారంభమైంది. రఖీన్ ప్రజలు ఏ మతస్తులైనా వారు మాట్లాడే అరఖానీకి బెంగాలీ, అరబ్బీ, బర్మీలతో పోలికే ఉండదు. చిట్టగాంగ్ ఆదివాసుల భాషతో దానికి మాండలిక భేదాలే కనిపిస్తాయి. మయన్మార్‌ను దశాబ్దాల తరబడి పాలించిన సైనిక పాలకులు బహుజాతుల నిల యమైన దేశంలో జనాభాలో 60 శాతంగా ఉన్న బమర్ జాత్యహంకారాన్ని, బౌద్ధ మతోన్మాదాన్ని పెంచి పోషించారు. 1962 నుంచి బర్మాలో దఫదఫాలుగా జాతి విద్వేష జ్వాలలను రగిల్చి లబ్ధి పొందారు. వాయవ్యాన ముస్లిం రోహింగియా లపైనా, తూర్పున కచిన్, కరెన్ తదితర క్రైస్తవ జాతులపైన సాగిన దాడుల ఫలి తంగా వివిధ జాతుల ప్రజలు పెద్ద ఎత్తున పొరుగు దేశాలకు తరలిపోయారు. 2012లో సైన్యం రోహింగియాలపై సాగించిన మారణకాండ సందర్భంగా పలు హక్కుల సంఘాలు ఈ పరిస్థితి ఇస్లామిక్ మిలిటెన్సీకి దారితీయవచ్చని హెచ్చరించాయి. అక్టోబర్ రెండవ వారంలో బంగ్లా సరిహద్దుల్లో గుర్తు తెలియని దుండగులు తొమ్మిది మంది పోలీసు అధికారులను కాల్చి చంపారు. అది రోహిం గియా మిలిటెంట్ల పనే అని ప్రభుత్వ వాదన. అది సాకుగా సైన్యం ఉత్తర రఖీన్ అంతటా బీభత్సకాండను తీవ్రతరం చేసింది. సైన్యం, బౌద్ధ మిలీషియాలూ రోహింగియాల ఆస్తులను దగ్ధం చేసి, సామూహిక హత్యలు, మానభంగాలకు పాల్పడుతున్నట్టుగా హక్కుల సంస్థల కథనం. రఖీన్లోని నాజీ కాన్సెంట్రెషన్ క్యాంపులలాంటి సైనిక శిబిరాల్లోకి రోహింగియాలను తరలిస్తున్నారు. అలా బందీ లుగా ఉన్న 1,50,000 మంది రోహింగియాలు ఆహారం, వైద్యం కోసం అలమ టిస్తున్నారని, 3,000 మంది పసిపిల్లలు మృత్యువు అంచుల్లో నిలిచారని ఐరాస ఆందోళన వ్యక్తం చేసిందంటేనే పరిస్థితి తీవ్రత అర్థమౌతుంది. ఇంటర్నేషనల్ స్టేట్ క్రైమ్ ఇనిషియేటివ్ ఈ మారణకాండను సంఘటిత జాతి నిర్మూలనగా అభి వర్ణించింది. రోహింగియాలను భౌతికంగా నిర్మూలించాలని, దేశం నుంచి తరిమే యాలని సైన్యం ప్రయత్నిస్తోందని ఆ సంస్థ ఆరోపించింది. అంతర్జాతీయ హక్కుల సంస్థలను, మీడియాను రఖీన్లోకి అనుమతించక పోవడంతో అవి రోహింగి యాలపై మారణకాండ పేరిట కట్టుకథలను వ్యాపింప జేస్తున్నాయని ప్రభుత్వం అంటోంది. పత్రికలపైన సైతం సైనిక పాలన తరహా నిర్బంధం అమలవుతోంది. రఖీన్ మానవతావాద సంక్షోభంపై కథనాన్ని వెలువరించిన ఒక విలేకరిని ఉద్యోగం నుంచి తొలగించినా ఒక ప్రధాన ఆంగ్ల దినపత్రిక ప్రచురణ నిలిచిపోక తప్పింది కాదు. కాగా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించడం కోసం రోహింగియాలు తమ గ్రామాలను తామే తగులబెట్టుకున్నారని సూచీ అధికారిక ప్రతినిధి జాటే ప్రకటించారు. దీంతో ఆమె ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారని కొందరు భావిస్తు న్నారు. మరోవంక ప్రభుత్వం రోహింగియాల వేటకు ప్రైవేటు మిలీషియాల ఏర్పా టుకు పచ్చజెండా చూపింది. పౌర ప్రభుత్వానికి ఎలాంటి అధికారం, అదుపూలేని సైన్యాన్ని కట్టడి చేయడానికి సూచీ ఏం చేస్తారోనని ప్రపంచం ఆమె వైపే చూస్తోంది. ఏది ఏమైనా రోహింగియాల సమస్య మానవతావాద మహా విపత్తుగా మారకముందే అంతర్జాతీయ సమాజం మేల్కొనకపోతే మయన్మార్ మరో రువాండాగా మారే ప్రమాదం ఉంది. ‘‘ప్రపంచం మాకు సహాయం చేయలేకపోతే పోనీ, ఓ బాంబేసి ఒక్కసారే చంపేయరాదా?’’ అని ఆక్రందిస్తున్న రోహింగియా తల్లుల ఆవేదనను అంతర్జాతీయ సమాజం ఇప్పటికైనా పట్టించుకునేలా కృషి చేయాల్సిన బాధ్యత భారత్‌పై ఉంది.