భారత్‌పై వ్యతిరేకతకు చోటివ్వం
నేపిడా (మయన్మార్): భారత్‌కు వ్యతిరేకంగా మయన్మార్‌లో ఎలాంటి కార్యకలాపాలను అనుమతించేది లేదని భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు మయన్మార్ నేతలు హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత భారత్ నుంచి తొలిసారిగా అత్యున్నత స్థాయి బృందం సోమవారం మయన్మార్‌లో పర్యటించింది. దీనిలో భాగంగా అధ్యక్షుడు యు హిటిన్ క్యాతో పాటు స్టేట్ కౌన్సిలర్, విదేశాంగ మంత్రి అంగ్‌సాన్ సూచీతో సుష్మ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చొరబాట్లు, సీమాంతర వ్యవహారాలు వంటి ద్వైపాక్షిక అంశాలపై కీలకమైన చర్చలు జరిపారు.
భారత్‌తో స్నేహపూర్వక సంబంధాలు కోరుకుంటున్నామని అధ్యక్షుడు హిటిన్ తెలిపారు. భారత్‌కు వ్యతిరేకంగా కార్యకపాలు నిర్వహించే చొరబాటుదారులకు తమ భూ భాగంలో చోటిచ్చేదిలేదన్నారు. ప్రజాస్వామ్య విలువ విషయంలో భారత్‌ను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఐదు దశాబ్దాల మిలిటరీ పాలనను అంతమొందించి ప్రజాస్వామ్య పాలన తీసుకువచ్చినందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ తరఫున సూచీకి శుభాకాంక్షలు తెలిపారు.