లండన్: మయన్మార్‌లో రోహింగ్యాల ఆక్రందన కొనసాగుతూనే ఉంది. ఈ విషయంలో నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్న మయన్మార్ అనధికార ప్రభుత్వాధినేత ఆంగ్‌సాన్ సూచీకి ఆక్స్‌ఫర్డ్ సిటీ కౌన్సిల్ షాక్ ఇచ్చింది. ఆమెకు గౌరవసూచకంగా ప్రదానం చేసిన 'ఫ్రీడమ్ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్' బిరుదును వెనుకకు తీసుకుంది. మయన్మార్ నియంత పాలనలో ప్రజాస్వామ్యం కోసం పోరాడినందుకు 1997లో ఆక్స్‌ఫర్డ్ కౌన్సిల్ ఆమెకు ఈ గౌరవాన్ని ప్రకటించింది.
మంగళవారం భేటీ అయిన కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా ఆమెకు ప్రకటించిన గౌరవ బిరుదును వెనుకకు తీసుకుంది. ఆమె ఈ గౌరవానికి ఇక ఎంతమాత్రం అర్హురాలు కాదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. సిటీ కౌన్సిల్ చరిత్రలో ఇది అసాధారణ చర్య అని కౌన్సిల్ లీడర్ బాబ్ ప్రైస్ తెలిపారు. నోబెల్ శాంతి పురస్కార గ్రహీత అయిన సూచీకి ఆక్స్‌ఫర్డ్ నగరంతో మంచి అనుబంధం ఉంది. 1964-67 మధ్య ఇక్కడే సెయింట్ హ్యుగ్ కాలేజీలో చదివిన ఆమె.. కొంతకాలం ఇక్కడ కుటుంబంతో కలిసి నివసించారు కూడా. ఇటీవల సెయింట్ హ్యూగ్ కాలేజీ ప్రవేశమార్గంలో ఉన్న ఆమె చిత్రాన్ని తొలగించారు. ఈ నేపథ్యంలోనే సిటీ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
మయన్మార్ రఖైన్ రాష్ట్రంలో ముస్లిం మైనారిటీలైన రోహింగ్యాల దుస్థితి కొనసాగుతోంది. ఇక్కడ తలపెట్టిన ఆర్మీ ప్రేరేపిత హింస, సంఘర్షణ నుంచి తప్పించుకునేందుకు ఇప్పటికే 50వేలకుపైగా మంది రోహింగ్యాలు నిరాశ్రయులయ్యారు. శరణార్థులుగా పొరుగు దేశాలకు వలస పోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment