ఎవరు ఆ ఐఏఎస్ అధికారి!
ఆవిన్ పాల కల్తీ వ్యవహారం ఉన్నత స్థాయి అధికారుల మెడకు బిగిసే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఓ ఐఏఎస్ అధికారి నిర్బంధం, అవినీతితో కల్తీ సాగుతున్నట్టుగా ఆ కేసులో పట్టుబడ్డ అన్నాడీఎంకే మాజీ నాయకుడు వైద్యనాథన్ ఆరోపించారు. తమ పార్టీ అధినేత్రి జయలలితకు ఆ ఐఏఎస్ అధికారి బండారాన్ని వివరిస్తూ వైద్యనాథన్ లేఖరాసి ఉండడంతో ఆ అధికారి ఎవరన్న చర్చ బయలుదేరి ఉన్నది.
సాక్షి, చెన్నై: రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని ఆవిన్ పాల ప్యాకెట్లలో సాగుతున్న కల్తీ గుట్టు గత ఏడాది వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో పాల ట్యాంకర్ల ఒప్పందదారుడు, అన్నాడీఎంకే నాయకుడు వైద్యనాథన్ అరెస్టు అయ్యారు. ఆయన అరెస్టుతో పార్టీ నుంచి ఆయనకు ఉద్వాసన పలుకుతూ అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత చర్యలు తీసుకున్నారు. ఏళ్ల తరబడి సాగుతున్న ఈ రాకెట్ వెనుక ఉన్న ఏ ఒక్కర్నీ ఉపేక్షించకుండా చర్యలు తీసుకునే విధంగా విచారణ సాగుతూ వస్తోంది.
ఈకేసులో నాలుగు నెలలకుపైగా కారాగార వాసాన్ని అనుభవిస్తూ వస్తున్న వైద్యనాథన్ బెయిల్ కోసం తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. అయినా ఫలితం శూన్యం. ఈ పరిస్థితుల్లో తనకు బెయిల్ రానివ్వకుండా చేస్తున్నారని, ఉన్నత స్థాయిలో ఉన్న ఓ ఐఏఎస్ అధికారి, ఆయన అల్లుడు నిర్బంధ, అవినీతితోనే పాల కల్తీ సాగుతూ వస్తోందని ఆరోపిస్తూ అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు వైద్యనాథన్ లేఖ రాసి ఉన్నారు. కడలూరు జైలు నుంచి ఆయన ఈ లేఖను పంపించడం గమనార్హం.
ఎవరు ఆ అధికారి
ఆవిన్‌కల్తీలో కీలక పాత్రదారుడిగా ప్రచారంలో ఉన్న ఆ ఐఏఎస్ అధికారి ఎవరన్న చర్చ బయలు దేరింది. వైద్యనాథన్‌ను శుక్రవారం విల్లుపురం కోర్టుకు పోలీసులు తీసుకొచ్చారు. రిమాండ్ పొడిగింపు ఆదేశాలతో జైలుకు వెళ్తూ, తాను రాసిన లేఖ గురించి మీడియా ముందు కుండబద్దలు కొట్టి వెళ్లారు. ఆవిన్ పాల సరఫరాకు సంబంధించి 70 రకాల ఆంక్షలు అమల్లో ఉండేవని, తాను, కొందరు ఒప్పందదారులు కలిసి కోర్టుకు వెళ్లడంతో కొన్ని సవరించడం జరిగిందన్నారు.
గతంలో ఉత్తరాదికి చెందిన ఒకే వ్యక్తికి ఒప్పందాలు దక్కేవని, అయితే, ప్రస్తుతం 47 మంది మధ్యవర్తులతో కలిసి తాను సరఫరా ఒప్పందాలు దక్కించుకున్నట్టు వివరించారు. గతంలో సాగిన కల్తీ వ్యవహారాన్ని ఆ ఐఏఎస్ అధికారి కొనసాగించే విధంగా నిర్బంధించారని ఆరోపించారు. ఆ ఐఏఎస్ ఎవరన్న విషయాన్ని జయలలితకు రాసిన లేఖలో తెలియజేసినట్టు పేర్కొన్నారు.
ఈ కేసులో నేరం నిరూపితమయితే తనకు మహా అంటే ఏడేళ్లు జైలు శిక్ష పడుతుందని, ఈ కేసులో అరెస్టయిన వారికి 60 రోజుల్లో బెయిల్ రావాల్సి ఉందన్నారు. అయితే, 130 రోజులైనా తనకు బెయిల్ రావడం లేదని, తనకు బెయిల్‌రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ, తనకు న్యాయం చేయాలని జయలలితకు రాసిన లేఖలో వైద్యనాథన్ విజ్ఞప్తిచేసి ఉన్నారు.