సీఎం జాప్యం.. అధికారులకు శాపం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వాకానికి ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. సచివాలయంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ల(ఏఎస్‌ఓ) సీనియారిటీ జాబితాను ఆమోదించడంలో ముఖ్యమంత్రికి గతేడాది నవంబర్ నుంచి తీరిక లేకుండా పోయింది. ఫలితంగా కోర్టు ధిక్కార నేరంగా పరిగణిస్తూ హైకోర్టు ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులు పీవీ రమేశ్, లింగరాజు పాణిగ్రాహికి రూ.2,000 చొప్పున జరిమానా విధించింది. ఈ జరిమానాను నాలుగు వారాల్లోగా చెల్లించాలని, లేదంటే వారం రోజులపాటు జైలు శిక్ష విధిస్తామని హైకోర్టు తీర్పులో స్పష్టం చేసింది.
సచివాలయంలో పనిచేసే డెరైక్ట్ రిక్రూట్‌మెంట్ ఏఎస్‌ఓల సీనియారిటీ జాబితాను ఆమోదించడంలో ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును, హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. సచివాలయంలో పనిచేసే 141 మంది ఏఎస్‌ఓల సీనియారిటీ జాబితా ప్రకారం వారికి పదోన్నతులు కల్పించాలని 2012లో హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై ప్రభుత్వం స్పందించకపోవడంతో ఏఎస్‌ఓలు రెండుసార్లు హైకోర్టును ఆశ్రయించారు.
ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో కోర్టు ధిక్కార నేరం కింద పరిగణిస్తూ హైకోర్టు ఈ నెల 12న తీర్పునిచ్చింది. ఇందుకుగాను ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పీవీ రమేశ్, సాధారణ పరిపాలన శాఖ (సర్వీసెస్) ముఖ్య కార్యదర్శి లింగరాజు పాణిగ్రాహికి రూ.2,000 చొప్పున జరిమానా విధించింది. వాస్తవానికి లింగరాజు పాణిగ్రాహి గతేడాది అక్టోబర్‌లోనే ఏఎస్‌ఓల సీనియారిటీ జాబితాను రూపొందించారు. సీఎం ఆమోదం కోసం నవంబర్‌లో పంపించారు. చంద్రబాబు సంబంధిత ఫైలును చూడకుండా పక్కన పెట్టారు. అప్పుడే స్పందించి ఉంటే ఐఏఎస్‌లకు శిక్ష తప్పేది.