ఇలపకుర్రు (యలమంచిలి) :ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా పాఠశాల ఆవరణలో వేసిన విద్యుత్ కనెక్షన్ ఓ విద్యార్థినిని బలిగొంది. యలమంచిలి మండలం ఇలపకుర్రు గ్రామంలోని జెడ్పీ హైస్కూల్‌లో సోమవారం ఉదయం విద్యుత్ తీగ తగిలి చెల్లుబోయిన మౌనిక (11) అనే బాలిక మృత్యువాత పడింది. ఈ దుర్ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. గ్రామంలోని చిలువూరి కుమార దత్తాత్రేయవర్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చింతదిబ్బ గ్రామానికి చెందిన మౌనిక 6వ తరగతి చదువుతోంది. ఒంటిపూట తరగతులు నిర్వహిస్తుండటంతో ఉదయం 7.45 గంటలకే మౌనిక పాఠశాలకు వచ్చినట్టు తోటి విద్యార్థులు చెబుతున్నారు.
ఆ సమయంలోనే మౌనిక మూత్ర విసర్జన శాలకు వెళ్లి వస్తూ కాళ్లు కడుక్కునేందుకు పక్కనున్న చేతిపంపు వద్దకు వెళ్లింది. విద్యుత్ తీగలు చేతిపంపునకు ఆనుకుని ఉండటంతో మౌనిక విద్యుదాఘాతానికి గురై పడిపోయింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో గమనించలేదు. పాఠశాలలో ప్రార్థన ముగిసిన అనంతరం 8 గంటలకు తరగతులు ప్రారంభమయ్యాయి. సుమారు 8.15 గంటల సమయంలో స్థానిక మహిళ రామేశ్వరపు కుమారి దుస్తులు ఆరవేసేందుకు చేతిపంపు సమీపానికి వెళ్లింది. అక్కడ పడిపోయి ఉన్న మౌనికను చూసి ఉపాధ్యాయులకు విషయం చెప్పింది. వెంటనే ఉపాధ్యాయులు మౌనిక కాళ్లకు, చేతులకు పసుపు రాసి పాలకొల్లులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలిక మరణించిందని వైద్యులు ధ్రువీకరించారు.
ఆ విద్యుత్ కనెక్షనే ప్రాణం తీసింది
మౌనిక మరణించడానికి కారణమైన విద్యుత్ తీగ నిజానికి పాఠశాల విద్యుత్ కనెక్షన్‌కు సంబంధించినది కాదు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దొడ్డిపట్లలో జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో పాల్గొనేం దుకు వచ్చారు. ఆ సమయంలో ఇలపకుర్రు హైస్కూల్ గ్రౌండ్‌లో హెలిపాడ్ నిర్మించారు. ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు వచ్చే అధికారులు, పోలీసుల కోసం పాఠశాల ఆవరణలోని చేతి పంపు వద్ద మరుగుదొడ్లను నిర్మించారు. ఆ చేతిపంపునకు మోటార్ అమర్చారు. సమీపంలోని విద్యుత్ స్తంభం నుంచి విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. ముఖ్యమంత్రి పర్యటన తరువాత ఆ కనెక్షన్‌ను తొలగించలేదు. అలా అక్కడ అనధికారికంగా వేసిన మోటార్ విద్యుత్ కనెక్షనే ఇప్పుడు మౌనిక మరణానికి కారణమైందని స్థానికులు చెబుతున్నారు.
తల్లిదండ్రులు, బంధువులు రోదన
మౌనిక తండ్రి బాలబాలాజీ ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లి నెల క్రితమే స్వగ్రామానికి వచ్చాడు. మౌనిక తల్లి లక్ష్మి గృహిణి కాగా, తమ్ముడు యువకృష్ణ చింతదిబ్బలోని ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు. బాలాజీ మొక్కు తీర్చుకునేందుకు కుటుంబ సమేతంగా ఆదివారం మొగల్తూరు మండలం ముత్యాలమ్మ ఆలయానికి వెళ్లాడు. సోమవారం పాఠశాలకు వెళ్లిన కొద్దిసేపటికే మౌనిక విద్యుదాఘాతానికి గురైందని ఫోన్ రావడంతో వారంతా పాల కొల్లు చేరుకున్నారు. వారు వెళ్లేసరికే మౌనిక చనిపోయిందని చెప్పగా, గుండెలవిసేలా రోదించారు.
ఇలపకుర్రు సెంటర్లో రాస్తారోకో
ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్లే మౌనిక చనిపోయిందని, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ మౌనిక బంధువులు, చింతదిబ్బ గ్రామస్తులు ఇలపకుర్రు సెంటర్లో రాస్తారోకో చేశారు. సుమారు మూడు గంటలపాటు రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న నరసాపురం డీఎస్పీ పి.సౌమ్యలత, పాలకొల్లు సీఐ ఆరుమిల్లి చంద్రశేఖర్, ఎస్సై బి.శ్రీనివాస్ అక్కడకు చేరుకుని గ్రామస్తులతో మాట్లాడారు. వారంతా న్యాయం చేయాలని నినాదాలు చేయడంతో ‘ముందు మీరు పిర్యాదు చేయండి. అనంతరం కేసు నమోదు చేసి న్యాయం చేస్తా’మని డీఎస్పీ హామీ ఇచ్చారు. విద్యార్థిని మృతిచెందిన సమాచారం తెలుసుకుని డీఈవో దుక్కిపాటి మధుసూదనరావు ఇలపకుర్రు వచ్చారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి, ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రికి వెళ్లి మౌనిక తల్లిదండ్రులను ఓదార్చి,
సంతాపం తెలిపారు.
మృత్యుపాశం
Published Tue, Mar 17 2015 2:42 AM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM
Advertisement
Advertisement