విద్యుదాఘాతానికి విద్యార్థి బలి
Published Sat, Dec 24 2016 10:41 PM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM
మానేపల్లి (పి.గన్నవరం) :
విద్యుదాఘాతానికి గురైన సంఘటనలో శుక్రవారం రాత్రి మానేపల్లి గ్రామానికి చెందిన డిగ్రీ ఫైనలియర్ విద్యార్థి మరణించాడు. వివరాలిలా ఉన్నాయి. వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా కార్యదర్శి పితాని నర్సింహరావు కుమారుడు తేజ(22) డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నాడు. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో నర్సింహరావు తన భార్య, కుమార్తెతో కలిసి జగ్గన్నపేట సెంటర్‌కు షాపింగ్ కోసం వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న తేజ స్నానం చేసేందుకు వేడినీళ్ల కోసం బకెట్‌లో వాటర్ హీటర్ పెట్టాడు. కొంత సేపటికి నీళ్లు బాగా మరిగి, పొంగిపోయాయి. అదే సమయంలో బాత్రూంలోకి వెళ్లిన నీళ్లపై అడుగు పెట్టడంతో విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కొంతసేపటి తర్వాత నర్సింహరావు బంధువు ఇంటికి వచ్చాడు. తలుపులు తీసి ఉన్నా.. ఎవ్వరూ కనిపించక పోవడంతో, లోనికి వెళ్లిచూగా.. బాత్రూంలో పడిఉన్న తేజ కనిపించాడు. వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేసి స్థానికులకు, తేజ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తేజను ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. తేజ మృతితో తల్లిదండ్రులు నర్సింహరావు, చంద్రకళ, సోదరి అంబికాదేవి విషాదంలో మునిగిపోయారు.
గ్రామంలో విషాదఛాయలు
అందరితో కలివిడిగా ఉండే తేజ మరణించడంతో మానేపల్లి గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. తేజ సేవా కార్యక్రమాలతో పాటు వైఎస్సార్ సీపీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. తనతో పాటు స్నేహితులతో కలిసి ప్రాణాపాయంలో ఉన్న అనేకమందికి రక్తదానం చేయించాడు. పుత్రవియోగంతో ఉన్న నర్సింహరావును వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి మిండగుదిటి మోహనరావు, పి.గన్నవరం కో–ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు, కుడుపూడి సూర్యనారాయణరావు తదితరులు పరామర్శించారు.
Advertisement
Advertisement