
జగ్గయ్యపేట: రైలుబండి మీద సెల్ఫీ దిగాలన్న సరదా ఓ విద్యార్థి ప్రాణాలు తీసింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సమీపంలోని తొర్రకుంట పాలేనికి చెందిన పగడాల రామసాయి(15) పట్టణంలోని ఓ స్కూల్లో ఈ ఏడాది పదో తరగతి పూర్తిచేశాడు. ఇటీవల వెలువడిన ఫలితాల్లో 9.6 పాయింట్లు సాధించాడు.
అయితే బుధవారం మధ్యాహ్నం సమీపంలోని గూడ్సు రైల్వే స్టేషన్‌కు వెళ్లాడు. అక్కడ స్నేహితులతో ఆటలాడిన తర్వాత గూడ్సు రైలెక్కి సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పైన ఉన్న హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగలడంతో 70 శాతానికి పైగా కాలిపోయి రైలుమీదే కుప్పకూలిపోయాడు.
విద్యార్థిని 108 ద్వారా జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో గొల్లపూడి ఆంధ్రా ఆస్పత్రికి, అక్కడ నుంచి గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.