
సనత్‌నగర్: తమ్ముడి భార్య కుటుంబసభ్యుల వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ సెల్ఫీ వీడియో తీసుకుని ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ ముత్తుయాదవ్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బబ్బుగూడకు చెందిన శీలం వీరస్వామి, పుష్ప దంపతులకు ముగ్గురు కుమారులు.
వీరస్వామి రెండో కుమారుడు హరినాథ్‌కు 2020లో తాండూరుకు చెందిన భాగ్యలక్ష్మీతో వివాహం జరిగింది. వారికి సంతానం కలగకపోవడంతో ఆ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో భాగ్యలక్ష్మీ ఆరు నెలల క్రితం పుట్టింటికి వెళ్ళిపోయింది. అదనపు కట్నం కోసం అత్తింటివారు తనను వేధిస్తున్నారని భర్త హరినాథ్‌తో పాటు అతడి సోదరుడు ప్రసాద్, ఇతర కుటుంబసభ్యులపై తాండూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
దీంతో పోలీసులు ఏడుగురిపై కేసు నమోదు చేశారు. భాగ్యలక్ష్మీకి రూ.12 లక్షలు ఇచ్చి రాజీ చేసుకోవాలని ఇరు కుటుంబాలు అంగీకారానికి వచ్చాయి. ఒప్పందం ప్రకారం పలు దఫాలుగా డబ్బు చెల్లించాల్సి ఉంది. గత నెల రూ. 2 లక్షలు చెల్లించాల్సి ఉండగా సర్దుబాటు కాకపోవడంతో చెల్లించలేదు. దీంతో భాగ్యలక్ష్మి సోదరుడు హనుమంతు తరచూ ప్రసాద్‌కు ఫోన్ చేసి వేధిస్తుండేవాడు. అతడితో పాటు పోలీసులు కూడా ఫోన్ చేస్తుండడంతో మనస్తాపానికిలోనైన ప్రసాద్ గురువారం ఉదయం తమ్ముడి భార్య కుటుంబ సభ్యుల వేధింపులను వివరిస్తూ సెల్ఫీ వీడియో తీసి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
(చదవండి: తండ్రిని హతమార్చిన కూతురు)