మృత్యుపాశం
♦ చిన్నారిని బలితీసుకున్న 11కేవీ విద్యుత్ తీగ
♦ ఇంటిడాబాపై బంతిని తీసుకుంటుండగా
♦ విద్యుదాఘాతంతో ఘోరం బూడిదంపాడులో దుర్ఘటన
ఖమ్మం అర్బన్: బంతితో ఆడుకుంటుండగా..పక్కింటి డాబాపై అది పడిపోవడంతో తీసుకొచ్చేందుకు ఎక్కిన బాలుడిని కరెంట్ తీగ రూపంలో మృత్యువు మింగేసింది. సెలవుల కోసం చుట్టాలింటికొచ్చిన పిల్లోడు మద్దినేని దీత్రిక్‌చౌదరి(8) విద్యుదాఘాతానికి గిలగిలా కొట్టుకొని ఊపిరొదిలిన ఘటన బుధవారం రఘునాథపాలెం మండలం బూడిదంపాడులో చోటు చేసుకుంది. అంతసేపు అక్కడే ఆనందంగా ఆడుకున్న బాలుడు క్షణాల్లో విగతజీవిగా మారడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అయ్యో..చిన్నా..అంటూ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు.
సెలవుల్లో బంధువులింటికొచ్చి..
కొణిజర్లకు చెందిన మద్దినేని నరసింహారావు, నాగమణి ఖమ్మం వీడీఓస్ కాలనీలో ఉంటూ..రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ కొడుకు దీత్రిక్, కూతురు ఉషశ్రీని చదివించుకుంటున్నారు. పాఠశాలకు రంజాన్ పండుగ సెలవులు ఇవ్వడంతో రఘునాథపాలెం మండలంలోని బూడిదంపాడులో తన సోదరి రమ ఇంటికి మంగళవారం తండ్రి పంపాడు. మేనత్త పిల్లలతో కలిసి బుధవారం ఇంటి ఎదుట బంతితో ఆడుకుంటుండగా..ఎగిరి పక్కింటి డాబాపై పడింది. బంతికోసం స్లాబ్‌పైకి దీత్రిక్ ఎక్కి..
దానిని చేతిలోకి తీసుకునేందుకు కిందికి వంగిన క్రమంలో డాబాను ఆనుకునేలా తక్కువ ఎత్తులో ఉన్న 33/11కేవీ విద్యుత్ సరఫరా లైన్ తగలడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే చనిపోయాడు. బాలుడి చేతులు, శరీరం కమిలినట్లు నల్లగా మారింది. బంతి కోసం వెళ్లి ఎంతకూ రాలేదని తోటి పిల్లలు డాబా ఎక్కి చూడగా అక్కడ పడిపోయి ఉండడాన్ని గమనించి పెద్దలకు చెప్పారు. వాళ్లు వచ్చి చూసి అప్పటికే చనిపోయినట్లు గుర్తించి బోరున విలపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం స్వగ్రామం కొణిజర్లకు తీసుకెళ్లారు. అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పైపు చుట్టినా..గోడ కట్టినా..ఘోరం ఆగలే
డాబాపై ఓ పక్క నుంచి విద్యుత్ హైటెన్షన్ వైర్లు వెళ్లడంతో ముందు జాగ్రత్త చర్యగా అటువైపు ఎవ్వరూ వెళ్లకుండా అడ్డుగా చిన్న గోడకూడా కట్టారు. విద్యుత్ వైర్లకు కొద్దిమేర ప్లాస్టిక్ పైపు కూడా తొడిగించారు. అయితే..చిన్నారి బాల్ కోసం పిట్టగోడపై నుంచి లోపలికి వెళ్లగా, ప్లాస్టిక్ పైపులైన్ లేని చోట తగిలి విద్యుత్ షాక్‌కు గురై బలయ్యాడు. తన ఇంటిపై ఈ ఘోరం జరగడం చలించివేసిందని ఇంటి యజమాని వల్లభనేని బాబూరావు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ అధికారులు విద్యుత్ లైన్ రూట్ మార్చాలని కోరారు.