shok
-
టెల్కోలకు సుప్రీం షాక్
న్యూఢిల్లీ: టెల్కోల రాబడి (ఏజీఆర్) నిర్వచనం, కేంద్రానికి చెల్లించాల్సిన లైసెన్సు ఫీజులపై టెలికం కంపెనీలకు సుప్రీం కోర్టు షాకిచ్చింది. ఏజీఆర్‌కు సంబంధించి టెలికం శాఖ (డాట్) నిర్వచనం సరైనదేనని స్పష్టం చేసింది. టెల్కోల నుంచి రూ. 92,000 కోట్లు రాబట్టుకోవడానికి డాట్‌కు అనుమతిచ్చింది. జస్టిస్ అరుణ్ మిశ్రా సారథ్యంలోని త్రిసభ్య బెంచ్ గురువారం ఈ మేరకు తీర్పునిచ్చింది. ‘ఏజీఆర్ నిర్వచనం సరైనదేనని న్యాయస్థానం భావిస్తోంది. డాట్ అప్పీలును సమర్ధిస్తూ, లైసెన్సీల (టెల్కోలు) పిటిషన్‌ను కొట్టివేయడం జరిగింది‘ అని పేర్కొంది. టెలికం కంపెనీల మిగతా అభ్యర్ధనలను కూడా తిరస్కరిస్తున్నట్లు తెలిపింది. దీనిపై తదుపరి వాదనలేవీ ఉండబోవని స్పష్టం చేసిన సుప్రీం కోర్టు .. నిర్దేశిత గడువులోగా జరిమానాలు, వడ్డీతో కలిపి డాట్‌కు బకాయిలన్నీ కట్టాలని ఆదేశించింది. ఈ ఏడాది జూలై నాటికి డాట్ లెక్కల ప్రకారం ఎయిర్టెల్ అత్యధికంగా రూ. 21,682.13 కోట్లు, వొడాఫోన్ రూ. 19,823.71 కోట్లు లైసెన్సు ఫీజు కింద బకాయి పడ్డాయి. వివాదం ఇదీ.. కొత్త టెలికం విధానం ప్రకారం.. టెల్కోలు తమ సవరించిన స్థూల రాబడి (ఏజీఆర్)లో నిర్దిష్ట వాటాను ప్రభుత్వానికి వార్షిక లైసెన్సు ఫీజుగా కట్టాల్సి ఉంటుంది. దీనితో పాటు స్పెక్ట్రం వినియోగానికి గాను నిర్దిష్ట చార్జీలు (ఎస్‌యూసీ) చెల్లించాలి. అయితే ఈ ఏజీఆర్ లెక్కింపు విషయంలో వివాదం నెలకొంది. అద్దెలు, స్థిరాస్తుల విక్రయంపై లాభాలు, డివిడెండు మొదలైన టెలికంయేతర ఆదాయాలు కూడా ఏజీఆర్ కిందే వస్తాయని, దానిపైనే లైసెన్సు ఫీజు కట్టాల్సి ఉంటుందని టెలికం వివాదాల పరిష్కార, అపీలేట్ ట్రిబ్యునల్ (టీడీశాట్) గతంలో ఆదేశాలు ఇచ్చింది. దీనివల్ల ప్రభుత్వానికి చెల్లించాల్సిన లైసెన్సు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల భారం భారీగా పెరిగిపోనుండటంతో టీడీశాట్ ఆదేశాలను సవాల్ చేస్తూ టెల్కోలు .. సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. దీనిపై జూలైలో అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం తమ వాదనలు వినిపించింది. అప్పటిదాకా టెల్కోలు రూ. 92,000 కోట్ల మేర లైసెన్సు ఫీజులు బకాయి పడ్డాయని తెలిపింది. తాజాగా ప్రభుత్వ వాదనలతో ఏకీభవిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చింది. 1.4 లక్షల కోట్లపైనే భారం జరిమానాలు, వడ్డీల్లాంటివన్నీ కలిపితే.. సవరించిన ఆదాయాల ప్రకారం టెలికం ఆపరేటర్లు కట్టాల్సిన బకాయిలు ఏకంగా రూ. 1.4 లక్షల కోట్ల పైగా ఉంటాయని అధికారిక వర్గాలు తెలిపాయి. ‘టెల్కోలు కట్టాల్సిన బకాయిలను మళ్లీ లెక్కిస్తే సుమారు రూ. 1.34 లక్షల కోట్లకు చేరుతుంది. మరో త్రైమాసికం లెక్కలు కూడా జోడిస్తే.. ఇది ఇంకో 4–5 శాతం పెరగవచ్చు‘ అని పేర్కొన్నాయి. 10 రోజుల్లో అందరు ఆపరేటర్స్‌కి డిమాండ్ నోటీసులు పంపిస్తామని, అవి అందిన 15 రోజుల్లోగా చెల్లించాల్సి ఉంటుందని తెలిపాయి. కొత్త లెక్కల ప్రకారం లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీలన్నీ కలిపి భారతి ఎయిర్టెల్ అత్యధికంగా రూ. 42,000 కోట్లు, వొడాఫోన్–ఐడియా రూ. 40,000 కోట్లు చెల్లించాల్సి రావొచ్చని అంచనా. జియో కేవలం రూ. 14 కోట్లు కట్టాల్సి రావచ్చు. వొడాఐడియా షేరు కుదేల్.. లైసెన్సు ఫీజుపై సుప్రీం కోర్టు ప్రతికూల ఆదేశాలతో గురువారం వొడాఫోన్ ఐడియా షేరు ఇంట్రాడేలో ఏకంగా 27 శాతం క్రాష్ అయ్యింది. బీఎస్ఈలో ఒక దశలో రూ. 4.10 (52 వారాల కనిష్ట స్థాయి)కి పడిపోయింది. చివరికి కొంత కోలుకుని 23 శాతం నష్టంతో రూ. 4.33 వద్ద క్లోజయ్యింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ. 3,793 కోట్ల మేర హరించుకుపోయి.. రూ. 12,442 కోట్లకు పరిమితమైంది. మరోవైపు, భారతి ఎయిర్టెల్ కూడా ఇంట్రాడేలో సుమారు 10 శాతం క్షీణించి రూ. 325.60కి పడిపోయినప్పటికీ.. తర్వాత కోలుకుని 3.31 శాతం లాభంతో రూ. 372.45 వద్ద క్లోజయ్యింది. కేంద్రం పునఃసమీక్షించాలి: టెల్కోలు ఇప్పటికే ఆర్థిక సమస్యలతో కుదేలవుతున్న టెలికం పరిశ్రమను తాజా తీర్పు మరింత సంక్షోభంలోకి నెట్టివేస్తుందని వొడాఫోన్ఐడియా ఆందోళన వ్యక్తం చేసింది. రివ్యూ పిటిషన్ అవకాశాలపై న్యాయనిపుణులను సంప్రతిస్తామని పేర్కొంది. టెల్కోలపై తీర్పు పెనుభారం మోపుతుందని, కేంద్రం దీన్ని పునఃసమీక్షించాలని ఎయిర్టెల్ తెలిపింది. తీవ్రంగా నిరాశపర్చింది: సీవోఏఐ సుప్రీంకోర్టు తీర్పు తీవ్రంగా నిరాశపర్చిందని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ (సీవోఏఐ) వ్యాఖ్యానించింది. దాదాపు రూ. 4 లక్షల కోట్ల పైచిలుకు రుణభారంతో కుంగుతున్న టెలికం పరిశ్రమకు ఇది గొడ్డలిపెట్టులాంటిదని ఆందోళన వ్యక్తం చేసింది. డిజిటల్ ఇండియా లక్ష్యాల సాధనపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొంది. -
డెలాయిట్, బీఎస్ఆర్ సంస్థలకు చుక్కెదురు
ముంబై: ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంస్థకు ఆడిటింగ్ సేవలు అందించిన డెలాయిట్, బీఎస్ఆర్ అసోసియేట్స్(కేపీఎంజీ సంస్థ)కు ఎన్సీఎల్టీ షాకిచ్చింది. ఐఎల్ఎఫ్ఎస్ గ్రూపులో లోపాలపై ముందుగానే హెచ్చరించడంలో ఇవి విఫలమైన సంగతి తెలిసిందే. దీంతో ఈ సంస్థలపై ఐదేళ్లపాటు నిషేధం విధించాలంటూ కేంద్ర కార్పొరేట్ శాఖ లోగడ పిటిషన్ దాఖలు చేసింది. కాగా, తమపై నిషేధం విధించాలన్న ప్రభుత్వ అభ్యర్థనపై నిర్ణయించే విషయంలో జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) అధికార పరిధిని ప్రశ్నిస్తూ డెలాయిట్, బీఎస్ఆర్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. కంపెనీల చట్టం కింద నెట్వర్క్ సంస్థలైన డెలాయిట్, బీఎస్ఆర్లను విచారించే న్యాయాధికారం తమకు ఉందని ఎస్‌సీఎల్‌టీ స్పష్టం చేసింది. దీంతో ఈ రెండు సంస్థలపై ఐదేళ్ల నిషేధానికి అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కేసు జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ), సుప్రీంకోర్టు ముందుకు వెళుతుందని తమకు తెలుసునంటూ ఆదేశాల జారీ సందర్భంగా ఎన్సీఎల్టీ బెంచ్ వ్యాఖ్యానించడం గమనార్హం. -
యువతి సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతుండగా.. విషాదం
బొంరాస్‌పేట: ఇంట్లో సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతూ విద్యుదాఘాతానికి గురైన ఓ గిరిజన యువతి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా బొంరాస్‌పేట మండల పరిధిలోని వడిచర్ల పంచాయతీ ఊరెనికితండాలో శుక్రవారం చోటుచేసుకుంది. తండాలోని రుక్కిబాయి, రాంసింగ్‌ల కుమార్తె అర్చన(20) వ్యవసాయ కూలీ పనులు చేస్తూ తల్లిదండ్రులకు సహాయపడుతోంది. తల్లి రుక్కిబాయి తండాలోని పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీ కార్మికురాలిగా పనిచేస్తుంది. శుక్రవారం మధ్యాహ్నం తల్లికి బదులుగా పాఠశాలకు వెళ్లిన అర్చన వంటచేసి ఇంటికి వచ్చింది. ఇంట్లో సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతూ విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది. అర్చన మృతితో తండాలో విషాదం అలుముకుంది. కాగా తండాలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు ఎర్తింగ్ సమస్య ఉండొచ్చని, సరిచేయాలని తండావాసులు కోరుతున్నారు. -
సబ్సిడీ సిలిండర్‌పై రూ.2.89 పెంపు
న్యూఢిల్లీ: ఎల్పీజీ వినియోగదారులకు ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు మరోసారి షాక్ ఇచ్చాయి. 14.2 కిలోల బరువున్న సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్‌పై రూ.2.89, సబ్సిడీ లేని ఎల్పీజీ సిలిండర్‌పై రూ.59 పెంచుతున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణించిన నేపథ్యంలో సబ్సిడీలేని సిలిండర్‌పై రూ.59 పెంచామని వెల్లడించింది. ఇక జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడంతో సబ్సిడీ సిలిండర్‌పై రూ.2.89 అదనపు భారం పడిందని పేర్కొంది. అలాగే వినియోగదారులకు చెల్లిస్తున్న నగదు బదిలీ మొత్తాన్ని రూ.320.49 నుంచి రూ.376.6కు పెంచినట్లు ఐవోసీ తెలిపింది. -
జైపాల్‌రెడ్డి పేరునూ పక్కన పెట్టిన రాహుల్
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లోని కాంగ్రెస్ నేతలకు ఆ పార్టీ అధిష్టానం షాక్ ఇచ్చింది! ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూసిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన ఒక్క నేతకు కూడా చోటు కల్పించకపోవడం విస్మయానికి గురిచేసింది. రెండు రాష్ట్రాల్లో సీనియర్ నేతగా గుర్తింపు ఉన్న కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి పేరు మొన్నటివరకూ సీడబ్ల్యూసీ కోటాలో వినిపించినప్పటికీ ఆయన పేరును కూడా రాహుల్‌గాంధీ పక్కన పెట్టేయడం గమనార్హం. దీంతో రెండు రాష్ట్రాల్లోని సీనియర్ నేతలు అధిష్టానంపై ఒకింత కినుక వహించారన్న చర్చ జరుగుతోంది. ముఖ్యంగా తెలంగాణకు చెందిన సీనియర్ నేతలు కొందరు ఈ విషయంపై ఢిల్లీ పెద్దల వద్దకు రాయబారాలు పంపారని, కనీసం ఒక్కరికయినా అవకాశం కల్పించాలని కోరినట్టు సమాచారం. 51 మందిలో ఒక్కరు లేరు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆమోదం మేరకు మంగళవారం ప్రకటించిన సీడబ్ల్యూసీలో దేశవ్యాప్తంగా మొత్తం 51 మంది నేతలకు అవకాశం కల్పించారు. 28 మందిని సీడబ్ల్యూసీ సభ్యులుగా, 18 మందిని శాశ్వత ఆహ్వానితులుగా, 10 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు. ఇందులో దక్షిణాదికి చెందిన వారు ఐదుగురే ఉన్నారు. కేవలం కేరళ, కర్ణాటక రాష్ట్రాల నేతలకు అవకాశమిచ్చిన అధిష్టానం తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నేతలకు మొండిచేయి చూపింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాలు చూస్తున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్.సి.కుంతియాను శాశ్వత ఆహ్వానితుల జాబితాలో, ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డిని ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో చేర్చారు. కానీ ఆ ఇద్దరికీ తెలంగాణ కోటాలో స్థానం లభించలేదు. కుంతియాను ఒడిశా కోటాలో నియమించగా, సంజీవరెడ్డికి ఐఎన్టీయూసీ అధ్యక్ష హోదాలో అవకాశం కల్పించారు. తమిళనాడు, తెలంగాణలో పార్టీ చాలా బలహీనంగా ఉన్న నేపథ్యంలో తెలంగాణకు అయినా సీడబ్ల్యూసీలో స్థానం దక్కుతుందని టీపీసీసీ నేతలు భావించారు. కానీ అధిష్టానం మాత్రం అవకాశం కల్పించకపోవడం పార్టీలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీనియర్ నేతలకు అవకాశం కల్పించినట్టయితే పార్టీకి కొంత ఊపు వచ్చి ఉండేదని కాంగ్రెస్ నేతలంటున్నారు. ఇలా జరుగుతుందని తాము ఊహించలేదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఢిల్లీ స్థాయిలో పరిచయాలున్న పీసీసీ నాయకుడొకరు దీనిపై మాట్లాడుతూ.. ‘‘అసలు తెలుగు రాష్ట్రాల్లో సీడబ్ల్యూసీలోకి తీసుకునే స్థాయి ఉన్న వారు లేరన్న అభిప్రాయంతోనే ఇలా జరిగి ఉంటుంది. జైపాల్ ఉన్నా ఆయన అనుభవాన్ని మరో విధంగా ఉపయోగించుకునే యోచనలో అధిష్టానం ఉంది. అందుకే ఆయన పేరును చేర్చలేదు’’అని పేర్కొన్నారు. రాష్ట్రంలో మార్పులు లేనట్టేనా? ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర కాంగ్రెస్‌లో సంస్థాగత మార్పులుంటాయన్న చర్చ జరుగుతోంది. పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేతల్లో ఒకరిని మారుస్తారని, మేనిఫెస్టో, కో–ఆర్డినేషన్, ప్రచార కమిటీలను నియమిస్తారని గాంధీభవన్ వర్గాల్లో ప్రచారం ఉంది. పలువురి పేర్లతో లీకేజీలు సైతం వచ్చాయి. కానీ ఈ కమిటీల ప్రస్తావన, మార్పుచేర్పులను ప్రస్తుతానికి ఏఐసీసీ పక్కన పెట్టిందని సమాచారం. జైపాల్‌రెడ్డికి సీడబ్ల్యూసీలో అవకాశం రాకపోతే రాష్ట్రా నికి చెందిన మరో సీనియర్ నేత జానారెడ్డిని తీసుకోవాలనే చర్చ అధిష్టానం వద్ద జరిగిందని తెలుస్తోంది. ఆయన్ను సీడబ్ల్యూసీలోకి తీసుకు ని, సీఎల్పీ నేతగా ఇంకొకరిని నియమించాలని అధిష్టానం భావించింది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో సీఎల్పీ నేతగా ఆయన్నే కొనసాగించాలన్న నిర్ణయం జరిగిందని సమాచారం. ఇక ఇప్పట్లో పార్టీ సంస్థాగత మార్పులు ఉండే అవకాశం లేదని గాంధీభవన్ వర్గాలంటున్నాయి. -
పుదుచ్చేరిలో బీజేపీ ఎమ్మెల్యేలకు షాక్
సాక్షి, చెన్నై: పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ నామినేట్ చేసిన ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ వైద్యలింగం షాకిచ్చారు. మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యేలు వి.స్వామినాథన్, కె.జి.శంకర్, ఎస్.సెల్వగణపతిలను సభలోకి రాకుండా అడ్డుకున్నారు. దీంతో అసెంబ్లీలోకి దూసుకెళ్లేందుకు యత్నించిన ముగ్గురు ఎమ్మెల్యేలను మార్షల్స్ బయటకు ఈడ్చుకొచ్చి పడేశారు. ప్రభుత్వ వ్యవహారశైలిపై తీవ్రంగా మండిపడ్డ స్వామినాథన్.. స్పీకర్ వైద్యలింగంపై కోర్టు ధిక్కార కేసు వేయనున్నట్లు మీడియాకు తెలిపారు. -
రైతులకు పరిహారం రూ.5
చెన్నై: వాతావరణం సహకరించక పంట దెబ్బతిని నష్టపోయిన తమిళనాడు రైతులకు బీమా కంపెనీలు షాకిచ్చాయి. దిండిగల్, నాగపట్నం జిల్లాల్లో పంట నష్టపోయిన రైతులకు రూ.10, రూ.5, రూ.4, రూ.2 చొప్పున నష్టపరిహారాన్ని విడుదల చేశాయి. ఈ మొత్తాన్ని దిండిగల్ కేంద్ర సహకార బ్యాంక్ రైతులకు చెక్కుల రూపంలో ఫిబ్రవరిలో అందించింది. ఈ విషయంపై తమిళనాడు శాసనసభ గురువారం దద్దరిల్లింది. మాజీ మంత్రి, డీఎంకే నేత కె.పిచండి ఈ చెక్కులను సభలో ప్రదర్శించారు. ‘కరుపసామి రూ.102 ప్రీమియం కట్టినప్పటికీ ఆయనకు రూ.10 మాత్రమే నష్టపరిహారంగా అందింది. తిరుమలైసామి అనే మరో రైతు రూ.50 ప్రీమియం కట్టగా, ఆయనకు కేవలం రూ.5 నష్టపరిహారం ఇచ్చారు. ఈ చెక్కుల్ని మార్చుకోవాలంటే బ్యాంకుకు వెళ్లి రూ.500తో ఖాతాను తెరవాలి. మరి వీటితో ఉపయోగం ఏముంది?’ అని ధ్వజమెత్తారు. -
విద్యుదాఘాతానికి విద్యార్థి బలి
మానేపల్లి (పి.గన్నవరం) : విద్యుదాఘాతానికి గురైన సంఘటనలో శుక్రవారం రాత్రి మానేపల్లి గ్రామానికి చెందిన డిగ్రీ ఫైనలియర్ విద్యార్థి మరణించాడు. వివరాలిలా ఉన్నాయి. వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా కార్యదర్శి పితాని నర్సింహరావు కుమారుడు తేజ(22) డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నాడు. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో నర్సింహరావు తన భార్య, కుమార్తెతో కలిసి జగ్గన్నపేట సెంటర్‌కు షాపింగ్ కోసం వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న తేజ స్నానం చేసేందుకు వేడినీళ్ల కోసం బకెట్లో వాటర్ హీటర్ పెట్టాడు. కొంత సేపటికి నీళ్లు బాగా మరిగి, పొంగిపోయాయి. అదే సమయంలో బాత్రూంలోకి వెళ్లిన నీళ్లపై అడుగు పెట్టడంతో విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కొంతసేపటి తర్వాత నర్సింహరావు బంధువు ఇంటికి వచ్చాడు. తలుపులు తీసి ఉన్నా.. ఎవ్వరూ కనిపించక పోవడంతో, లోనికి వెళ్లిచూగా.. బాత్రూంలో పడిఉన్న తేజ కనిపించాడు. వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేసి స్థానికులకు, తేజ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తేజను ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. తేజ మృతితో తల్లిదండ్రులు నర్సింహరావు, చంద్రకళ, సోదరి అంబికాదేవి విషాదంలో మునిగిపోయారు. గ్రామంలో విషాదఛాయలు అందరితో కలివిడిగా ఉండే తేజ మరణించడంతో మానేపల్లి గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. తేజ సేవా కార్యక్రమాలతో పాటు వైఎస్సార్ సీపీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. తనతో పాటు స్నేహితులతో కలిసి ప్రాణాపాయంలో ఉన్న అనేకమందికి రక్తదానం చేయించాడు. పుత్రవియోగంతో ఉన్న నర్సింహరావును వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి మిండగుదిటి మోహనరావు, పి.గన్నవరం కో–ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు, కుడుపూడి సూర్యనారాయణరావు తదితరులు పరామర్శించారు. -
పంజాబ్ ఎవరిది?
-
ఎలా చెప్పను
పల్లెటూరి నేపథ్యంలో సాగే ప్రేమకథతో రూపొందిన తమిళ చిత్రం ‘కోళి కూవుదు’ తెలుగులో ‘ఎలా చెప్పను’ పేరుతో విడుదల కానుంది. లక్ష్మీ పిక్చర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని తాండ్ర కుమార్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. 15న సినిమాని విడుదల చేస్తున్న సందర్భంగా తాండ్ర కుమార్ మాట్లాడుతూ - ‘‘తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉండే కథ కావడంతో ఇక్కడ విడుదల చేస్తున్నాను. రామ్‌రాజు స్వరపరచిన పాటలు సినిమాకి ఎస్సెట్‌గా నిలుస్తాయి. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం ఇది. ‘యు’ సర్టిఫికెట్ లభించింది. ఏపీలో మొత్తం 100 థియేటర్లలో విడుదల చేయనున్నాం. తమిళంలో ఘనవిజయం సాధించినట్లుగానే తెలుగులో కూడా ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు. అశోక్, శిజారోజ్ జంటగా నటించిన ఈ చిత్రానికి కె.ఐ. రంజిత్ దర్శకత్వం వహించారు.