సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లోని కాంగ్రెస్ నేతలకు ఆ పార్టీ అధిష్టానం షాక్ ఇచ్చింది! ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూసిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన ఒక్క నేతకు కూడా చోటు కల్పించకపోవడం విస్మయానికి గురిచేసింది. రెండు రాష్ట్రాల్లో సీనియర్ నేతగా గుర్తింపు ఉన్న కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి పేరు మొన్నటివరకూ సీడబ్ల్యూసీ కోటాలో వినిపించినప్పటికీ ఆయన పేరును కూడా రాహుల్‌గాంధీ పక్కన పెట్టేయడం గమనార్హం. దీంతో రెండు రాష్ట్రాల్లోని సీనియర్ నేతలు అధిష్టానంపై ఒకింత కినుక వహించారన్న చర్చ జరుగుతోంది. ముఖ్యంగా తెలంగాణకు చెందిన సీనియర్ నేతలు కొందరు ఈ విషయంపై ఢిల్లీ పెద్దల వద్దకు రాయబారాలు పంపారని, కనీసం ఒక్కరికయినా అవకాశం కల్పించాలని కోరినట్టు సమాచారం.
51 మందిలో ఒక్కరు లేరు
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆమోదం మేరకు మంగళవారం ప్రకటించిన సీడబ్ల్యూసీలో దేశవ్యాప్తంగా మొత్తం 51 మంది నేతలకు అవకాశం కల్పించారు. 28 మందిని సీడబ్ల్యూసీ సభ్యులుగా, 18 మందిని శాశ్వత ఆహ్వానితులుగా, 10 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు. ఇందులో దక్షిణాదికి చెందిన వారు ఐదుగురే ఉన్నారు. కేవలం కేరళ, కర్ణాటక రాష్ట్రాల నేతలకు అవకాశమిచ్చిన అధిష్టానం తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నేతలకు మొండిచేయి చూపింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాలు చూస్తున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్.సి.కుంతియాను శాశ్వత ఆహ్వానితుల జాబితాలో, ఐఎన్‌టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డిని ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో చేర్చారు. కానీ ఆ ఇద్దరికీ తెలంగాణ కోటాలో స్థానం లభించలేదు. కుంతియాను ఒడిశా కోటాలో నియమించగా, సంజీవరెడ్డికి ఐఎన్‌టీయూసీ అధ్యక్ష హోదాలో అవకాశం కల్పించారు.
తమిళనాడు, తెలంగాణలో పార్టీ చాలా బలహీనంగా ఉన్న నేపథ్యంలో తెలంగాణకు అయినా సీడబ్ల్యూసీలో స్థానం దక్కుతుందని టీపీసీసీ నేతలు భావించారు. కానీ అధిష్టానం మాత్రం అవకాశం కల్పించకపోవడం పార్టీలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీనియర్ నేతలకు అవకాశం కల్పించినట్టయితే పార్టీకి కొంత ఊపు వచ్చి ఉండేదని కాంగ్రెస్ నేతలంటున్నారు. ఇలా జరుగుతుందని తాము ఊహించలేదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఢిల్లీ స్థాయిలో పరిచయాలున్న పీసీసీ నాయకుడొకరు దీనిపై మాట్లాడుతూ.. ‘‘అసలు తెలుగు రాష్ట్రాల్లో సీడబ్ల్యూసీలోకి తీసుకునే స్థాయి ఉన్న వారు లేరన్న అభిప్రాయంతోనే ఇలా జరిగి ఉంటుంది. జైపాల్ ఉన్నా ఆయన అనుభవాన్ని మరో విధంగా ఉపయోగించుకునే యోచనలో అధిష్టానం ఉంది. అందుకే ఆయన పేరును చేర్చలేదు’’అని పేర్కొన్నారు.
రాష్ట్రంలో మార్పులు లేనట్టేనా?
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర కాంగ్రెస్‌లో సంస్థాగత మార్పులుంటాయన్న చర్చ జరుగుతోంది. పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేతల్లో ఒకరిని మారుస్తారని, మేనిఫెస్టో, కో–ఆర్డినేషన్, ప్రచార కమిటీలను నియమిస్తారని గాంధీభవన్ వర్గాల్లో ప్రచారం ఉంది. పలువురి పేర్లతో లీకేజీలు సైతం వచ్చాయి. కానీ ఈ కమిటీల ప్రస్తావన, మార్పుచేర్పులను ప్రస్తుతానికి ఏఐసీసీ పక్కన పెట్టిందని సమాచారం. జైపాల్‌రెడ్డికి సీడబ్ల్యూసీలో అవకాశం రాకపోతే రాష్ట్రా నికి చెందిన మరో సీనియర్ నేత జానారెడ్డిని తీసుకోవాలనే చర్చ అధిష్టానం వద్ద జరిగిందని తెలుస్తోంది. ఆయన్ను సీడబ్ల్యూసీలోకి తీసుకు ని, సీఎల్పీ నేతగా ఇంకొకరిని నియమించాలని అధిష్టానం భావించింది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో సీఎల్పీ నేతగా ఆయన్నే కొనసాగించాలన్న నిర్ణయం జరిగిందని సమాచారం. ఇక ఇప్పట్లో పార్టీ సంస్థాగత మార్పులు ఉండే అవకాశం లేదని గాంధీభవన్ వర్గాలంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment