ముంబై: ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంస్థకు ఆడిటింగ్ సేవలు అందించిన డెలాయిట్, బీఎస్‌ఆర్ అసోసియేట్స్(కేపీఎంజీ సంస్థ)కు ఎన్‌సీఎల్‌టీ షాకిచ్చింది. ఐఎల్‌ఎఫ్‌ఎస్ గ్రూపులో లోపాలపై ముందుగానే హెచ్చరించడంలో ఇవి విఫలమైన సంగతి తెలిసిందే. దీంతో ఈ సంస్థలపై ఐదేళ్లపాటు నిషేధం విధించాలంటూ కేంద్ర కార్పొరేట్ శాఖ లోగడ పిటిషన్ దాఖలు చేసింది. కాగా, తమపై నిషేధం విధించాలన్న ప్రభుత్వ అభ్యర్థనపై నిర్ణయించే విషయంలో జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) అధికార పరిధిని ప్రశ్నిస్తూ డెలాయిట్, బీఎస్‌ఆర్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. కంపెనీల చట్టం కింద నెట్‌వర్క్ సంస్థలైన డెలాయిట్, బీఎస్‌ఆర్‌లను విచారించే న్యాయాధికారం తమకు ఉందని ఎస్‌సీఎల్‌టీ స్పష్టం చేసింది. దీంతో ఈ రెండు సంస్థలపై ఐదేళ్ల నిషేధానికి అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కేసు జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ), సుప్రీంకోర్టు ముందుకు వెళుతుందని తమకు తెలుసునంటూ ఆదేశాల జారీ సందర్భంగా ఎన్‌సీఎల్‌టీ బెంచ్ వ్యాఖ్యానించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment