
అర్చన మృతదేహం
బొంరాస్‌పేట: ఇంట్లో సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతూ విద్యుదాఘాతానికి గురైన ఓ గిరిజన యువతి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా బొంరాస్‌పేట మండల పరిధిలోని వడిచర్ల పంచాయతీ ఊరెనికితండాలో శుక్రవారం చోటుచేసుకుంది. తండాలోని రుక్కిబాయి, రాంసింగ్‌ల కుమార్తె అర్చన(20) వ్యవసాయ కూలీ పనులు చేస్తూ తల్లిదండ్రులకు సహాయపడుతోంది. తల్లి రుక్కిబాయి తండాలోని పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీ కార్మికురాలిగా పనిచేస్తుంది.
శుక్రవారం మధ్యాహ్నం తల్లికి బదులుగా పాఠశాలకు వెళ్లిన అర్చన వంటచేసి ఇంటికి వచ్చింది. ఇంట్లో సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతూ విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది. అర్చన మృతితో తండాలో విషాదం అలుముకుంది. కాగా తండాలోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌కు ఎర్తింగ్ సమస్య ఉండొచ్చని, సరిచేయాలని తండావాసులు కోరుతున్నారు.