సీఎం పర్యటనలో అపశ్రుతి
పోలవరం : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన సందర్భంగా అపశ్రుతి దొర్లింది. సీఎం బందోబస్తు కోసం పోలవరం వస్తున్న పోలీసు జీపు దూసుకెళ్లిన ఘటనలో పోలవరంలోని ఎడ్లగూడెంకు చెందిన ఇర్లపాటి మంగమ్మ (70) అనే వృద్ధురాలు మృత్యువాతపడగా, ఎడ్ల దేవళమ్మ అనే వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వారి మీదుగా దూసుకెళ్లిన పోలీసు జీపు సమీపంలోని ఇంటిని ఢీకొట్టగా గోడకూలింది.
ఆ సమయంలో ఆ ఇంటి అరుగుపై కూర్చుని ఉన్న అంపా పెద సుబ్బారావు అనే వృద్ధుడు, అతని కోడలు భద్రమ్మ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతానికి చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి పట్టిసీమ ఎత్తిపోతల పథకం చూసేందుకు వస్తున్నారని తెలిసి బందోబస్తు నిమిత్తం కొందరు పోలీసులు పోలవరంలోని ఆర్యవైశ్య కల్యాణ మండపం నుంచి పాత నూతనగూడెం మీదుగా పట్టిసీమ హెడ్‌వర్క్స్ నిర్మాణ ప్రాంతానికి బయలుదేరారు. రోడ్డుకు ఎడమ వైపు నుంచి వెళ్లాల్సిన జీపు రాంగ్ రూట్‌లో ప్రయాణిస్తూ నడిచి వెళుతున్న వృద్ధుల మీదుగా దూసుకుపోయి సమీపంలోని ఇంటిని ఢీకొట్టింది. మృతిచెందిన మంగమ్మ, తీవ్రంగా గాయపడిన దేవళమ్మ స్థానిక వృద్ధాశ్రమంలో భోజనం చేసి ఇంటికి వెళుతుండగా ప్రమాదం బారిన పడ్డారు. వెంటనే వారిద్దరినీ పోలీసులు జీపులో ఎక్కించుకుని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే మంగమ్మ మృతి చెందింది. దేవళమ్మ తలకు గాయం కావటంతో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ఆమెను రాజమండ్రి తరలించామని వైద్యులు తెలిపారు.
మద్యం సేవించిన డ్రైవర్?
ప్రమాదానికి కారణమైన జీపులో బుట్టాయగూడెం పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న రాంబాబుతోపాటు మరో ముగ్గురు పోలీసులు ఉన్నారు. జీపు నడిపిన హోంగార్డు రాంబాబు ఆ సమయంలో మద్యం తాగి ఉన్నాడని పోలీసులు ధ్రువీకరించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ రాంబాబును అదుపులోకి తీసుకున్నామని, కేసు నమోదు చేశామని పోలవరం ఎస్సై కె.శ్రీహరిరావు తెలిపారు. బాధిత కుటుంబాల వారిని పోలవరం ప్రభుత్వ వైద్యశాలలో హోంమంత్రి ఎన్.చినరాజప్ప, పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు పరామర్శించారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా హోంమంత్రి విలేకరులతో మాట్లాడుతూ జీపు డ్రైవర్‌ను అరెస్ట్ చేశారని, అతడిని సస్పెండ్ చేయాల్సిందిగా ఎస్పీని ఆదేశించామని చెప్పారు. ప్రమాద సమయంలో జీపులో ఉన్న అందరిపైనా విచారణ జరపాల్సిందిగా ఆదేశించామన్నారు. చనిపోయిన మహిళ కుటుంబానికి రూ.5 లక్షలు, గాయపడిన మహిళ కుటుంబానికి రూ.2.50 లక్షల నష్టపరిహారాన్ని ముఖ్యమంత్రి ప్రకటించారన్నారు. గాయపడిన వృద్ధురాలికి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్యం చేయిస్తామని తెలిపారు.
సీఎం పర్యటనలో అపశ్రుతి
Published Fri, Jul 3 2015 12:33 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement