అన్నాకుట్టి
కంచికి వెళ్లలేకపోయినా, కంచికి వెళ్లొచ్చినవాళ్లను తాకితే బల్లి దోషం పోతుందని ఒక విశ్వాసం. కేరళ, ఇడుక్కి జిల్లాలోని కునింజి అనే చిన్న గ్రామంలో ఉంటున్న అన్నా కుట్టి సైమన్ (అన్నాకుట్టి) ని ఒక్కసారి కలిస్తే అంతవరకు మనల్ని ఆవహించి ఉన్న నీరసం, నిరాశ వంటివి ఆమడ దూరం పరుగులు తీసి మనలో భ్రమణకాంక్ష కలుగుతుంది! ఇది విశ్వాసం కాదు. వాస్తవం. అమ్మాచ్చిని కనుక బ్రాండ్ అంబాసిడర్‌గా చేసుకుంటే‘ఎయిర్ ఇండియా’కు కూడా కొత్తగా రెక్కలొచ్చేస్తాయేమో అనిపిస్తుంది!అన్నాకుట్టి వయసు 95 సంవత్సరాలు. ఇప్పుడు మూడోసారి విదేశీయానానికి సన్నద్ధులయ్యారు. ఆమెకు ప్రయాణాలన్నా, అదే పనిగా ప్రయాణించడమన్నా చాలా ఇష్టం. అది కూడా స్నేహితులు, సన్నిహితులతో కాదు, ఒంటరిగానే! ఆమె కుటుంబంలో పిల్లలు, మనుమలు, మునిమనుమలు కలిపి మొత్తం 70 మంది దాకా ఉన్నారు. వాళ్లను కూడా వెంట తీసుకెళ్లరు! నాకు భాష సమస్య లేదు. కేవలం మలయాళం మాత్రమే వచ్చు. ఆ భాషతోనే ఎక్కడకు వెళ్లినా చక్కగా నా పనులన్నీ చేసుకుంటాను. నా భాషలో నేను అడుగుతాను, వారి భాషలో వారు చెబుతారు. బాగానే అర్థం చేసుకుంటాను’’ అంటారు అన్నా కుట్టి.. ఎంతో ఆత్మవిశ్వాసంతో!
కల్వరికి వెళ్లలేకపోయారు
తన మొట్టమొదటి విదేశీ యాత్ర ప్రారంభించినప్పుడు అన్నాకుట్టి వయసు 75 సంవత్సరాలు.అప్పటికి ముప్పై ఏళ్ల క్రితమే ఆమె తన భర్తను కోల్పోయారు. అన్నాకుట్టి ఇప్పటి వరకు ఇటలీ, జర్మనీ, ఇజ్రాయెల్, ఫ్రాన్స్, యుఏఈ పర్యటించారు. ‘జెరూసలేంలోని కల్వరి వెళ్లాలని కోరికగా ఉంది. కాని నా వయసురీత్యా వారు వీసా అనుమతి నిరాకరించారు’’ అని నిరుత్సాహంగా చెబుతారు అన్నాకుట్టి. అన్నాకుట్టిని ఇరుగుపొరుగు అంతా ఆప్యాయంగా అమ్మాచ్చి (మలయాళంలో నానమ్మ) అని పిలుచుకుంటారు. ‘‘నేను చాలా ఫిట్‌గా ఉన్నాను. ఒంటరిగా ఎంత దూరమైనా ప్రయాణించగలను. నాకు షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, మతిమరుపు వంటి ఏ అనారోగ్యమూ లేదు’’ అని అంటున్నప్పుడు ఆమెలో తన ఆరోగ్యం గురించి «ధీమా కనిపిస్తుంది.
ఇటలీ వెళ్లినా ఇడుక్కి మహిళే
అన్నాకుట్టి ఏ దేశం వెళ్లినా, తన సంప్రదాయ దుస్తులను మార్చుకోవడానికి కూడా ఇష్టపడరు. ‘‘మా పిల్లలు, మనుమలు నన్ను పైజమా, కుర్తీ వేసుకోమంటారు. నేను సంప్రదాయ దుస్తులే (ఛట్టా, ముండు) ధరిస్తాను. ఫ్రాన్స్‌లో ఉన్నా, ఇడుక్కిలో ఉన్నా నా వేషధారణలో మార్పు ఉండదు. చెవులకు కూడా సంప్రదాయంగా వచ్చే తోడాలే ధరిస్తాను’’ అంటారు. అన్నాకుట్టికి భారతీయ సంప్రదాయమంటే గౌరవం.
బెరుకు, భయం లేనే లేవు!
అన్నాకుట్టి తొలిసారి 1997లో జర్మనీ టూర్ వెళ్లారు. తిరువనంతపురంలో మొట్టమొదటిసారి విమానం ఎక్కినప్పుడు కూడా అన్నాకుట్టి బెరుగ్గా ఏమీ లేరు. ధైర్యంగా ఎక్కి కూర్చున్నారు. ‘‘మా పిల్లలంతా నా గురించి భయపడ్డారు. నేను ఏమాత్రం భయపడలేదు’’ అంటారామె నవ్వుతూ. అన్నాకుట్టి ఎక్కువ చదువుకోలేదు. ఇంకా చెప్పాలంటే ఆవిడ నిరక్షరాస్యురాలితో సమానం. ‘‘నేను శ్రీలంక, దుబాయ్ మీదుగా జర్మనీ వరకు ప్రయాణించాను. అది అంత సులువైన ప్రయాణం కాదు. ముఖ్యంగా నా వంటి చదువురాని వారికి ఈ ప్రయాణం కష్టంతో కూడినదే’’ అంటున్న అన్నాకుట్టి చాలా క్షేమంగా, ప్రశాంతంగా జర్మనీ వెళ్లివచ్చారు.
ఆరోగ్యం వెనుక రహస్యం
అమ్మాచ్చి సమాజాన్ని మెరుగు పరిచే కార్యక్రమాలు కూడా చేపడుతుంటారు! రోడ్డు పాడయితే తనే స్వయంగా నడుం బిగించి, రోడ్డు బాగు చేయడం ప్రారంభిస్తారు. ఎవరికైనా పొలంలో విత్తనాలు చల్లాలంటే తనే ముందుంటారు. ఇక్కడొక విశేషం చెప్పాలి. ఇటీవల వచ్చిన ‘అబీ’ మలయాళ చిత్రంలో అన్నాకుట్టి నటించారు కూడా! అయితే.. ‘‘నేను నటించలేదు. నాకు అసలు నటించడం రాదు, నేను నిజ జీవితంలో ఎలా ఉంటానో అలాగే ఉన్నాను’ అంటూ చిరునవ్వులు చిందిస్తూ చెబుతారు అన్నాకుట్టి. ఇంతకీ.. అన్నాకుట్టి ఆరోగ్యం వెనుక రహస్యం ఏమిటి? ’’నేను ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండను. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉంటాను. అదే నాకు పరమౌషధం’’ అంటారు అన్నాకుట్టి.
చెల్లెలొక్కరే మిగిలారు!
కొట్టాయంలోని కాడనాడు నుంచి అన్నాకుట్టి కుటుంబం తిరువనంతపురానికి వలస వచ్చింది. తల్లిదండ్రులకు ఆమె పదో సంతానం. 1936లో తన పద్నాల్గవ ఏట అన్నాకుట్టి పెందనాథు సైమన్‌ను వివాహం చేసుకున్నారు. అబ్బాయిలు, అమ్మాయిలు కలిపి పది మందికి పైగా సంతానం. పెద్ద కుమారుడి స్నేహితుడిని కూడా అన్నాకుట్టీనే పెంచి పెద్ద చేశారు. ఆ పిల్లవాడు బాల్యంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడు. అన్నాకుట్టికి మొత్తం అక్కచెల్లెళ్లు 12 మంది. ‘‘మా ఆఖరి చెల్లాయి మరియాకుట్టి మాత్రమే జీవించి ఉంది. ప్రస్తుతం తను కోళికోడ్‌లో ఉంటోంది. అప్పుడప్పుడు వెళ్లి, ఆమెను చూసి వస్తుంటాను’’ అని ఎంతో సంతోషంగా చెబుతుంటారు అన్నా కుట్టి.
– రోహిణి
Comments
Please login to add a commentAdd a comment