ట్రాఫిక్‌ ఆంక్షలు | police alert manjunathan commision tour | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్‌ ఆంక్షలు

Published Tue, Mar 21 2017 11:18 PM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM

ట్రాఫిక్‌ ఆంక్షలు - Sakshi

ట్రాఫిక్‌ ఆంక్షలు

మంజునాథ కమిషన్‌ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు
1,715 మందితో పోలీసు బందోబస్తు
కాకినాడ క్రైం: మంజునాథ కమిషన్‌ ఆ«ధ్వర్యంలో బుధవారం రంగరాయ మెడికల్‌ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణను పురస్కరించుకుని కాకినాడలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించినట్టు ట్రాఫిక్‌ డీఎస్పీ కేవీ సత్యనారాయణ తెలిపారు. మంగళవారం కాకినాడ టూటౌన్‌ ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.  ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొనేందుకు వచ్చే పలు సామాజిక వర్గాలకు చెందిన ప్రతినిధులు నిర్దేశించిన రూట్లలో వచ్చి, పార్కింగ్‌ స్థలాల్లో వాహనాలు నిలపాలని కోరారు. జిల్లాలో సెక‌్షన్‌ 30 అమల్లో ఉన్న నేపథ్యంలో గుంపులు, ర్యాలీలు చేపట్ట వద్దన్నారు.  బుధవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. పదో తరగతి విద్యార్థులు ప్రయాణించే వాహనాలకు ఎలాంటి ట్రాఫిక్‌ ఆంక్షలు వర్తించవని స్పష్టం చేశారు. 
వాహనాలు వెళ్లాల్సిన మార్గాలు
1. విశాఖపట్నం, తుని నుంచి కాకినాడకు వచ్చే భారీ వాహనాలు అచ్చంపేట సెంటర్‌ నుంచి ఏడీబీ రోడ్డు బీచ్‌ రోడ్డు మీదుగా వాకలపూడి, పోర్టు నుంచి జగన్నాథపురం బ్రిడ్జి నుంచి వెళ్లాలి.
2. విశాఖ, తుని నుంచి కాకినాడ ఆర్టీసీ బస్టాండ్‌కు వచ్చే బస్సులు సర్పవరం జంక‌్షన్‌ నుంచి గంగరాజు నగర్, ఆర్టీసీ ఆఫీసు సెంటర్‌ నుంచి డీమార్టు, లక్ష్మి హాస్పిటల్స్, మదర్‌థెరిస్సా విగ్రహం, వైఎస్సార్‌ విగ్రహం సెంటర్‌ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్‌కు చేరుకోవాలి.
3. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్సు నుంచి తుని, విశాఖ వెళ్లే ఆర్టీసీ బస్సులు వైఎస్సార్‌ విగ్రహం సెంటర్‌ నుంచి మదర్‌థెరిస్సా సెంటర్, లక్ష్మీ హాస్పిటల్స్, ఆర్టీవో ఆఫీస్‌ సెంటర్, నాగమల్లితోట మీదుగా సర్పవరం సెంటర్‌ నుంచి వెళ్లాలి, 
4. ఆర్టీసీ కాంప్లెక్సు నుంచి రాజమహేంద్రవరం, అమలాపురం, విజయవాడ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు వైఎస్సార్‌ బొమ్మ సెంటర్, వైఎస్సార్‌ బ్రిడ్జిపై నుంచి కల్పనా సెంటర్‌ మీదుగా మెయిన్‌రోడ్డు, బాలాజీచెరువు నుంచి ప్రభుత్వ ఆస్పత్రి మీదుగా వెళ్లాలి. 
5.  రాజమహేంద్రవరం, అమలాపురం, విజయవాడ, జగ్గంపేట నుంచి కాకినాడకు వచ్చే ఆర్టీసీ బస్సులు   కల్పనా సెంటర్‌, వైఎస్సార్‌ బ్రిడ్జి మీదుగా ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లాలి.
6. రావులపాలెం, అమలాపురం నుంచి వచ్చే భారీ వాహనాలు, లారీలన్నీ అన్నమ్మఘాటీ జగన్నాథపురం, కొత్త వంతెన మీదుగా కమర్షియల్‌ రోడ్డు సెంటర్‌ నుంచి బీచ్‌రోడ్డు మీదుగా వాకలపూడి, అచ్చంపేట నుంచి వెళ్లాలి.
వాహనాల పార్కింగ్‌ స్థలాలు
మంజునాథ కమిషన్‌ ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొనేందుకు వచ్చే వాహనాలను పార్కింగ్‌ చేసుకునేందుకు ఈ కింది విధంగా స్థలాలను కేటాయించారు. 
1. తుని వైపు నుంచి కాకినాడకు వచ్చే భారీ వాహనాలు సర్పవరం సెంటర్‌, ఆశ్రమ పబ్లిక్‌ స్కూల్‌ నుంచి ద్వారంపూడి భాస్కరరెడ్డి కల్యాణ మండపం ఎదురుగా గల ఖాళీ స్థలం, జేఎన్‌టీయూకే కళాశాల ఆడిటోరియం గ్రౌండ్‌లో పార్కింగ్‌ చేసుకోవాలి. 
2. తుని వైపు నుంచి కాకినాడకు వచ్చే చిన్న వాహనాలు, మోటార్‌ సైకిళ్లు, ఆటోలు, చిన్నకారులను ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లోను, ప్రభుత్వ ఐటీఐ గ్రౌండ్‌లో పార్కింగ్‌ చేసుకోవాలి.
3. రాజమహేంద్రవరం, రావులపాలెం, అమలాపురం నుంచి వచ్చే భారీ వాహనాలన్నీ పీఆర్‌ కళాశాల గ్రౌండ్, మెక్లారిన్‌ హైస్కూలు గ్రౌండ్‌లో పార్కింగ్‌ చేసుకోవాలి.
4. రాజమహేంద్రవరం, రావులపాలెం, అమలాపురం నుంచి వచ్చే చిన్న వాహనాలు మెటార్‌ సైకిళ్లు, చిన్నకారులు, ఆటోలు పోలీస్‌ గ్రౌండ్‌లో పార్కింగ్‌ చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. 
1,715 మందితో పోలీసు బందోబస్తు
ప్రశాంత వాతావరణంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగేందుకు జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాశ్‌ చర్యలు చేపట్టారు.  రంగరాయ మెడికల్‌ కళాశాల ఆడిటోరియం వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆడిటోరియం కెపాసిటీ 350 మంది ఉండేందుకు అవకాశం ఉండటంతో 175 మంది చొప్పున రెండు సామాజిక వర్గాల వారి ప్రతినిధులను పంపేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. అందరినీ ఒకేసారి ఆడిటోరియంలోకి పంపకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఆడిటోరియం వద్ద, లోపల, సిటీ పరిధి, ముఖ్యమైన కూడళ్ల వద్ద ఇద్దరు ఏఎస్పీలతో 1,715 మందితో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.  ఇద్దరు ఏఎస్పీలు, 14 మంది డీఎస్పీలు, 36 మంది సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లు, 170 మంది ఎస్సైలు, 335 మంది ఏఎస్సైలు, హెచ్‌సీలు, 900 మంది కానిస్టేబుళ్లు, 200 మంది మహిళా పోలీసు కానిస్టేబుళ్లు, 60 మంది హోమ్‌గార్డులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్టు ట్రాఫిక్‌ డీఎస్పీ సత్యనారాయణ వెల్లడించారు. 
ప్రత్యేక నిఘా నీడలో... 
ఏలూరు రేంజ్‌ డీఐజీ రామకృష్ణ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాశ్‌ ప్రత్యేక ఏర్పాటు చేశారు. బాడీ వార్న్‌ కెమెరాలను వినియోగించేందుకు చర్యలు చేపట్టారు. మంజునాథ కమిషన్‌ సభ్యులు నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణ ఆడిటోరియంలోకి వెళ్లే సామాజిక వర్గాల ప్రతినిధులను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే లోపలి అనుమతించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రవేశద్వారం వద్ద బ్రీత్‌ ఎనలైజర్‌లను సిద్ధం చేశారు. మద్యం తాగొచ్చి గలాటా సృష్టించకుండా, కార్యక్రమం సజావుగా కొనసాగేందుకు బ్రీత్‌ ఎనలైజర్లతో తనిఖీలు చేపట్టనున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement