మంజునాథ కమిషన్ ఎదుట శాంతియుతంగా వాదనలు వినిపించాలి
మంజునాథ కమిషన్ ఎదుట శాంతియుతంగా వాదనలు వినిపించాలి
Published Mon, Mar 20 2017 11:26 PM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
కాకినాడ సిటీ : జస్టిస్ మంజునాథ కమిషన్ ఎదుట ఆయా సంఘాలు శాంతియుతంగా వారి వాదనలు వినిపించాలని జిల్లా అదనపు ఎస్పీ దామోదర్ కోరారు. కలెక్టరేట్ విధాన గౌతమి సమావేశ హాలులో కాపు, బీసీ నాయకులతో అధికారులు సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దామోదర్ మాట్లాడుతూ సమన్వయంతో వ్యవహరించి విచారణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కమిషన్ ముందు ప్రతి ఒక్కరూ మాట్లాడేందుకు అవకాశం ఉంటుందన్నారు. సెక‌్షన్-30 అమలులో ఉన్నందున ఎక్కడా ర్యాలీలు, ధర్నాలు చేయకూడదని, బ్యానర్లు కూడా కట్టకూడదని స్పష్టం చేశారు. అల్లర్లు, గొడవలకు తావు లేకుండా శాంతియుతంగా వ్యవహరించాలని చెప్పారు. కమిషన్ విచారణ జరిగే రంగరాయ వైద్య కళాశాల ఆడిటోరియం లోపలికి పరిమిత సంఖ్యలో అనుమతించి, వారు బయటకు వచ్చాక మరికొంతమందిని లోపలకు పంపుతామన్నారు. విచారణ జరిగే ఆవరణలో హాలు బయట టెంట్ వేసి వేచి ఉండే అవకాశం కల్పిస్తామన్నారు. పిఠాపురంవైపు నుంచి వచ్చే కాపు వర్గాలకు ఐటీఐ పక్కన ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లోనూ, బీసీ వర్గాలకు జేఎన్‌టీయూకే ఆవరణలోను వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేశామన్నారు. అలాగే జగన్నాథపురం, ఇంద్రపాలెం వైపు నుంచి వచ్చే కాపు వర్గాలకు పీఆర్ కళాశాల ఆవరణలోను, బీసీ వర్గాలకు మెక్లారిన్ హైస్కూల్ ఆవరణలోను పార్కింగ్ సౌకర్యం కల్పించామని అదనపు ఎస్పీ చెప్పారు. ఈ సమావేశంలో కాపు నాయకులు వీవై దాసు, నల్లా విష్ణు, ఆకుల రామకృష్ణ, సంగిశెట్టి అశోక్; బీసీ నాయకులు చొల్లంగి వేణుగోపాల్, పంపన రామకృష్ణ, కుడుపూడి సూర్యనారాయణ, కుండల సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.
అమలాపురం టౌన్ : కాకినాడలో మంజునాథ కమిషన్ బీసీలు, కాపుల నుంచి బుధవారం ప్రజాభిప్రాయ సేకరణ, వినతుల స్వీకరణ నిర్వహిస్తున్న క్రమంలో కోనసీమ నుంచి ఆయా సామాజిక వర్గాల వారు భారీ తరలి వెళ్లేందుకు సన్నహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో సామాజిక వర్గాల మధ్య వైషమ్యాలు తలెత్తకుండా, కాకినాడకు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రశాంత వాతావరణంలో వెళ్లాలని పోలీసులు సూచిస్తూనే ముందు జాగ్రత్తగా అమలాపురంలో ఆయా సామాజిక వర్గాలకు చెందిన దాదాపు 500 మంది ప్రతినిధులకు నోటీసులు జారీ చేశారు. జిల్లాలో సెక‌్షన్ 30 అమలులో ఉందని, దానికి వ్యతిరేకంగా ఏ సంఘటనలోనైనా మీరు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గాని పాల్గొని శాంతి భద్రతకు భంగం కలిగేలా ప్రవర్తిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పోలీసులు ఆ నోటీసులో హెచ్చరించారు. సీఐ వైఆర్‌కే శ్రీనివాస్ నుంచి పట్టణంలో 500 మంది బీసీ, కాపు ప్రతనిధులకు ఒకే రోజు అందడంతో చర్చనీయాంశమైంది. ఇప్పటికే డీఎస్పీ లంక అంకయ్య, సీఐ శ్రీనివాస్‌లు పట్టణంలోని బీసీ, కాపు నేతల ఇళ్లకు స్వయంగా వెళ్లి మంజునాథ కమిషన్ వద్ద శాంతియుతంగా వ్యవహరించాలని, నినాదాలు, ర్యాలీలతో వెళ్లవద్దని, భావోద్వేగాలకు, ఆవేశకావేశాలకు తావు లేకుండా ప్రశాంత, ఆత్మీయ వాతావరణంలో కమిషన్‌ను కలవాలని కోరారు. అమలాపురంలో బీసీ నేతలు కుడుపూడి చిట్టబ్బాయి, కుడుపూడి సూర్యనారాయణరావు, కాపు నేతలు నల్లా విష్ణుమూర్తి, కల్వకొలను తాతాజీ, నల్లా పవన్, మిండగుదటి మోహన్, మెట్ల రమణబాబు తదితర నేతల ఇళ్లకు పోలీసు అధికారులు వెళ్లి బుధవారం కాకినాడ వెళ్లేటప్పుడు రంగరాయ మెడికల్ కళాశాలలో బీసీ కమిషన్‌ను కలిసినప్పుడు అనుసరించాల్సిన పద్ధతులను వివరించారు.
Advertisement