ఇదేమి విచారణ?
ఇదేమి విచారణ?
Published Thu, Mar 23 2017 12:02 AM | Last Updated on Tue, Sep 5 2017 6:48 AM
ఇరుపక్షాల పెదవి విరుపు
కాపు ఉద్యమాన్ని అణిచివేసినట్టే విచారణ
కూడా అర్ధాంతరంగా ముగించేశారు
కాపు నేతల వాదనలకు ప్రతిగా మా వాదనలు వినరేం : బీసీల ఆగ్రహం
జాబితాలో పేరేలేని కాపు కార్పొరేషన్ చైర్మన్‌కు అవకాశంపై విమర్శలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ : కాపులకు బీసీ రిజర్వేషన్ల కోసం ఏర్పాటైన మంజునాథ కమిషన్ విచారణ అర్థాంతరంగా ముగియడం వెనుక సర్కార్ కుట్ర దాగి ఉందని కాపులు అనుమానాన్ని వ్యక్తం చేయగా...తమ వాదనకు అడ్డుకట్ట వేశారని బీసీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ అభిప్రాయాలను, తమ వాదనలను పూర్తిగా కమిషన్ దృష్టికి తీసుకువెళ్లలేకపోయామనే ఆవేదన ఇరువర్గాల్లో కనిపించింది. కాపు నేతల వాదనలపై ప్రతి వాదనలను వినిపించకుండా కట్టడి చేయడాన్ని బీసీలు తప్పుపడుతున్నారు. రాష్ట్రం లోని 13 జిల్లాల్లో బీసీ, కాపుల మధ్య వాగ్వాదా లు, పరస్పర దూషణల మధ్య కమిషన్ విచారణ జరగ్గా ఈ జిల్లాకు వచ్చేసరికి అందుకు భిన్నంగా అర్ధాంతరంగా ముగించడంపై ఇరుపక్షాలూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం మొదటి నుంచీ కాపు ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తున్నట్టే కమిషన్ విచారణ కూడా అర్ధాంతరంగా ముగించి కాపుల గొంతును నొక్కేశారని ధ్వజమెత్తారు.
సుదీర్ఘ జాబితాపై కమిషన్ అభ్యంతరం...
మంజునాథ కమిషన్ విచారణలో వాదనలు వినిపించే వారి జాబితా పరిమితంగా ఉండాలనుకున్నారు. అందుకు అనుగుణంగానే విచారణకు ఇరుపక్షాల నుంచి 175 మంది వంతున విచారణ జరుగుతున్న కాకినాడ రంగరాయ వైద్యకలాశాల ఆడిటోరియానికి అనుమతించాలని నిర్ణయించారు. విచారణ ఉదయం 10 గంటలకు ప్రారంభం కాగానే తొలుత వాదనలు వినిపించే అవకాశాన్ని బీసీలకు కల్పించారు. బీసీలలో ప్రధానమైన శెట్టిబలిజ సామాజిక వర్గంతోపాటు ఉపకులాల నుంచి ఒకరిద్దరు వంతున సుమారు 15 మంది నేతలు వాదనలు వినిపించారు. కాపు జేఏసీ నేతలు కాపుల నుంచి ఒక జాబితాను జస్టిస్ మంజునాథకు అందజేశారు. ఇంత మంది వాదనలు వినిపించడం అసాధ్యమన్న కమిషన్‌కు ఎంత మందిని అనుమతిస్తే అంత మందే మాట్లాడతారని కాపు జేఏసీ నేతలు విన్నవించారు.
ప్రతివాదనలకు నో...
ఉదయం నుంచి భోజన విరామ సమయం వరకు బీసీల్లో ఉపకులాల వారీగా వాదనలు వినిపించే అవకాశం కల్పించారు. మధ్యాహ్నం భోజన విరామం తరువాత కాపు జేఏసీ నేతలు తమ వాదనలు వినిపిస్తుండగా ప్రతి వాదనకు అవకాశం కల్పించాలని బీసీ నేతలు మంజునాథను కోరగా అందుకు ఆయన తిరస్కరించారు. కమిషన్ ఆదేశాలతో ఎస్పీ రవిప్రకాష్, అదనపు ఎస్పీ దామోదర్ జోక్యం చేసుకున్నా తమకు అన్యాయం జరుగుతోందని బీసీలు విచారణను బహిష్కరించాల్సి వచ్చింది. ఆ సందర్భంలో ప్రతి వాదనలు వినిపించే అవకాశం కల్పిస్తే రాద్ధాంతం జరుగుతుందనే ముందుచూపుతోనే కమిషన్ ససేమిరా అని ఉంటుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
జాబితాలో పేరే లేని చలమశెట్టిని ఎందుకు అవకాశం ఇచ్చినట్టో...?
అటు బీసీలు, ఇటు కాపుల నుంచి వాదనలు వినిపించేందుకు చాలా మంది ప్రయత్నించినా పరిమిత సంఖ్యలో ఓ వైపు అనుమతిసూ్త...జిల్లాతో సంబంధం లేని కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయకు మరోవైపు మాట్లాడే అవకాశం ఏ ప్రాతిపదికన ఇవ్వాల్సి వచ్చిందో అర్థం కావడం లేదని పలువురు తప్పుపడుతున్నారు. ఎక్కడో గుంటూరు జిల్లాకు చెందిన రామానుజయ ఇంత దూరం జిల్లాకు రావడమే కాకుండా నేరుగా విచారణలో కమిషన్ ఎదుట సీఎం చంద్రబాబు బాకా ఊదే ప్రయత్నం చేసి భంగపడ్డారు. కాపుల ఇబ్బందులను కమిషన్ దృష్టికి తీసుకువెళ్లేందుకు కాపు జేఏసీ నేతలు ఇచ్చిన జాబితాలో కనీసం నలుగురైదుగురు కూడా మాట్లాడకుండానే జాబితాలో అసలు పేరే లేని రామానుజయకు అవకాశం ఇవ్వడంలో ఆంతర్యమేమిటనే ప్రశ్న∙కాపు నేతల నుంచి వినిపిస్తోంది. ఏ జిల్లాకు ఆ జిల్లాకు వెళ్లి కమిషన్ విచారణ చేపట్టినప్పుడు సొంత జిల్లాలో రామానుజయ ఏమి చేశారని, ఇంత దూరం రావడం వెనుక సర్కార్ ప్రమేయం లేకపోలేదనే అనుమానాన్ని కాపు జేఏసీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. పేద కాపులకు మంచి జరిగే రీతిలో రామానుజయ మాట్లాడి ఉంటే ఆయన రాకలో చిత్తశుద్ధి ఉందని నమ్మే వారమంటున్నారు. ఆ దిశగా ఆయన ఒక ముక్కైనా మాట్లాడకుండా సర్కారు డప్పు వాగించడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వంతో నియమితమైన కార్పొరేషన్‌కు చైర్మన్ హోదాలో ఉండి కమిషన్ విచారణను అర్ధాంతరంగా ముగిసేలా కుట్రపూరితంగా వ్యవహరించారని కాపు జేఏసీ నేతలు మండిపడుతున్నారు. ఇదే విషయాన్ని కమిషన్ విచారణ ముగిసిన అనంతరం ఎన్‌ఎఫ్‌సీఎల్ రోడ్డులోని కాపు కల్యాణ మండపంలో ముద్రగడ పద్మనాభం తదితర నేతలు సమావేశమై ఇదే అనుమానాన్ని వ్యక్తం చేయడం గమనార్హం.
ముద్రగడ సొంతజిల్లా కావడమే అర్ధాంతర
ముగింపునకు కారణమా...?
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సొంత జిల్లా కావడంతో ఇక్కడ కమిషన్ విచారణ సజావుగా సాగకూడదనే సర్కార్ పెద్దలు పక్కా ప్లా¯ŒS ప్రకారమే ఇదంతా సృష్టించినట్టుగా ఉందని ఆక్షేపిస్తున్నారు. లేదంటే కమిషన్ వాదనలు ఆలకించే సందర్భంలో బీసీలు, కాపుల మధ్య ఎటువంటి వివాదం తలెత్తకపోవడాన్ని వారు ఈ సందర్బంగా ఉదహరిస్తున్నారు. విచారణ సందర్భంగా మిగిలిన జిల్లాల్లో కాపు, బీసీ వర్గాల మధ్య రచ్చరచ్చయిన సందర్భాలు ఉన్నాయి. జిల్లాలో రెండు సామాజిక వర్గాల మధ్య సున్నితమైన అంశం కావడంతో పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తీరా ఆ రెండు సామాజిక వర్గాల మధ్య విచారణ సందర్భంగా స్వల్ప పొరపొచ్చాలు తలెత్తినా, రామానుజయ సీఎంకు భజన చేయడంతో తలెత్తిన వివాదం చివరకు కమిషన్ విచారణను సగంలోనే ముగిసేందుకు దారితీయడం విస్మయాన్ని కలిగించింది. బీసీలున్నంతలో తమ వాదనలు వినిపించే అవకాశం లభించగా భోజన విరామం అనంతరం తమకు పూర్తిస్థాయిలో అవకాశం దక్కలేదని కాపులు ఆవేదన చెందుతున్నారు. మొత్తంమీద కమిషన్ విచారణ సగంలోనే ముగిసిపోవడంపై ఇరుపక్షాలు పెదవి విరుస్తున్నాయి.
Advertisement