ప్రమాదంలో దెబ్బతిన్న బస్సు
తాండూర్(బెల్లంపల్లి) : తీర్థయాత్ర ఆ కుటుంబంలో అంతులేని విషాదాన్ని నింపింది. దైవ దర్శనానికి వెళ్లిన ఆ కుటుంబంలోని ఒకరు తిరిగిరాని లోకాలకు వెళ్లారు. మరికొద్ది సేపట్లో దర్గాకు వెళ్లి మొక్కులు చెల్లించుకుందామనుకున్న వారిని లారీ మృత్యువు రూపంలో కబళించింది. రాజస్తాన్ రాష్ట్రం అజ్మీర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. మృతి చెందిన వారిలో తాండూర్ మండలానికి చెందిన ఒక మహిళ ఉండగా అదే కుటుంబానికి చెందిన మరో ఇద్దరు మహిళలు తీవ్ర గాయాలపాలవడం తాండూర్‌లో విషాదాన్ని నింపింది.
మండల కేంద్రానికి చెందిన జాఫర్‌ఖాన్ భార్య షమీం ఉన్నిసాబేగం, కొడుకు జియాఉల్లాఖాన్, మరో కొడుకు భార్య రఫత్‌బేగం, బంధువులు షాహిదా ఫర్హాన్, ఆసిఫ్ అలీ, సదా అర్ఫాన్, మరో కుటంబానికి చెందిన రఫీ ఉల్లాఖాన్, అతని భార్య అనిసా సుల్తానా, కుమారుడు సోహైల్ ఖాన్‌లు గురువారం అజ్మీర్ దర్గా యాత్రకు తాండూర్ నుంచి బయల్దేరి వెళ్లారు. రైల్లో వెళ్లిన వీరు శుక్రవారం ఢిల్లీకి చేరుకొని అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు చెందిన మరికొందరితో కలిసి టూరిస్టు వాహనంలో అజ్మీర్‌కు పయనమయ్యారు. అజ్మీర్‌కు 60 కిలో మీటర్ల దూరంలో శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో వీరు ప్రయాణిస్తున్న బస్సును ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో రఫత్‌బేగం (28) అక్కడికక్కడే మృతి చెందగా, షమీం ఉన్నిసాబేగం, షాహిదా ఫర్హాన్‌లు తీవ్ర గాయాలపాలయ్యారు. దీంతో అక్కడి పోలీసులు క్షతగాత్రులను జైపూర్ ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందించారు. చనిపోయిన రఫత్ బేగంకు 6 సంవత్సరాలలోపు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న జాఫర్‌ఖాన్ అతని కుమారుడు గౌస్‌ఖాన్‌తోపాటు బంధువులు, స్థానికులు హుటాహుటినా జైపూర్‌కు విమానంలో బయల్దేరి వెళ్లారు. పుణ్యక్షేత్ర దర్శనానికి వెళ్లి ప్రమాదం బారిన పడడంతో తాండూర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment