సాక్షి, హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో రేపు(శుక్రవారం) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. సీఎం అయిన తర్వాత ఇది ఆయన మొదటి జిల్లా పర్యటన కాగా, ఇంద్రవెల్లి సభలో మూడు గ్యారెంటీలను ప్రకటించనున్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే సిలిండర్ పథకాలను సీఎం ప్రకటించనున్నారు. మూడు పథకాల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. 200 యూనిట్లు వాడే కుటుంబాలు 90 లక్షలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
కాగా, సీఎం రేవంత్‌రెడ్డి ఇంద్రవెల్లి గడ్డను సెంటిమెంట్‌గా తీసుకున్నారు. అప్పట్లో టీపీసీసీ అధ్యక్షుడిగా నియామకం తర్వాత 2021 ఆగస్టు 9న ఇక్కడే మొదటి సభ నిర్వహించారు. నాడు ‘దళిత, గిరిజన దండోరా’ పేరిట నిర్వహించిన సభకు లక్షకు పైగా జనం విచ్చేశారు. సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో రేవంత్ రెడ్డి ఇక వెనుదిరిగి చూడలేదు. ఆ తర్వాత రాష్ట్రంలో పలు సభలు నిర్వహించారు. అప్పటినుంచే కాంగ్రెస్‌పై ప్రజల్లో మక్కువ పెరిగిందన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తమైంది.
దానికి తగ్గట్టుగానే ఎన్నికల్లో హస్తం పార్టీ విజయం సాధించడం, రేవంత్‌రెడ్డి సీఎం కావడం జరిగిపోయాయి. తాజాగా పార్లమెంట్ ఎన్నికల నగారాను కూడా ఇంద్రవెల్లి గడ్డ మీదనుంచే మొదలుపెట్టాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు.
ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా, శాసనసభ ఎన్నికల్లో నాలుగు బీజేపీ, రెండు బీఆర్‌ఎస్ గెలువగా, ఖానాపూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మ బొజ్జు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయినప్పటికీ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఈ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచే సవాల్‌గా తీసుకొని సెంటిమెంట్‌ను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ రసవత్తరంగా మారనుంది. మొత్తంగా ప్రతికూల పరిస్థితుల నుంచి అనుకూల ఫలితం సాధించే దిశగా పార్లమెంట్ ఎన్నికలకు ఈ గడ్డ మీద నుంచి సమరశంఖం పూరించనున్నారు.
ఇదీ చదవండి: కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment