నేడు నాగ్‌పూర్ నుంచి నేరుగా ఆదిలాబాద్‌కు మోదీ
పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
పార్టీ ఎన్నికల ప్రచారాన్ని సైతం ప్రారంభించనున్న మోదీ
బహిరంగ సభలు పార్టీకి మరింత ఊపు తెస్తాయని భావిస్తున్న బీజేపీ నేతలు
స్వాగతం పలకనున్న గవర్నర్, సీఎం, ఇతర నేతలు
సాక్షి, హైదరాబాద్/ సాక్షి, ఆదిలాబాద్/ సాక్షి, న్యూఢిల్లీ: ప్రదానమంత్రి నరేంద్ర మోదీ రెండురోజుల పర్యటన నిమిత్తం సోమవారం రాష్ట్రానికి రానున్నారు. మొత్తం రూ.15,718 కోట్ల అభివృద్ధి పనులకు (4న ఆదిలాబాద్‌లో రూ.6,697 కోట్లు, 5న సంగారెడ్డిలో రూ.9,021 కోట్లు) శ్రీకారం చుట్టనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లకు గాను ఇప్పటికే 9 మంది అభ్యర్థులను బీజేపీ నాయకత్వం ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో ప్రధాని సభలు పార్టీ యంత్రాగానికి మరింత ఊపు తెస్తాయని బీజేపీ నేతలు భావిస్తున్నారు.
హైదరాబాద్ నుంచి సంగారెడ్డికి
ప్రధాని సోమవారం మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి ఉదయం 10.20 గంటలకు ఆదిలాబాద్ జిల్లా కేందానికి చేరుకుంటారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం రేవంత్‌రెడ్డితో పాటు కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి ప్రధానికి స్వాగతం పలకనున్నారు. కాగా మోదీ రోడ్డు మార్గంలో స్టేడియానికి చేరుకుంటారు. అక్కడ రెండు వేదికలు ఏర్పాటు చేయగా, అందులో మొదటి వేదిక నుంచి పలు అభివృద్ధి పనులకు వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపనలు, ప్రారం¿ోత్సవాలు చేస్తారు. ఈ కార్యక్రమంలో గవర్నర్, సీఎం, కేంద్రమంత్రి పాల్గొంటారు.
అనంతరం రెండో వేదికపైకి వెళ్లి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఇందులో కిషన్‌రెడ్డితో పాటు ఒకరిద్దరు కేంద్ర మంత్రులు, పార్టీ నేతలు బండి సంజయ్, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఈటల రాజేందర్ తదితరులు పాల్గొననున్నారు. ఆదిలాబాద్‌లో మోదీ సుమారు రెండు గంటల పాటు ఉండనున్నారు. ఇక్కడినుంచి మధ్యాహ్నం 12.10 గంటలకు హెలికాప్టర్‌లో బయల్దేరి నాందేడ్‌కు, అక్కడినుంచి ప్రత్యేక విమానంలో చెన్నైకు వెళ్లనున్నారు. సాయంత్రానికి హైదరాబాద్ చేరుకుని రాత్రికి రాజ్‌భవన్‌లో బస చేయనున్నారు.
మంగళవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లో సివిల్ ఏవియేషన్ రీసెర్చి ఆర్గనైజేషన్ (సీఏఆర్‌ఓ)ను జాతికి అంకితం చేస్తారు. అనంతరం సంగారెడ్డి పర్యటనలో పాల్గొంటారు. అక్కడ కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారం¿ోత్సవాలు చేయనున్నారు. ప్రధాని పర్యటన పురస్కరించుకుని మొత్తం 2 వేల మంది పోలీసులతో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఇలావుండగా సోమవారం ఆదిలాబాద్‌కు వస్తున్న ప్రధాని మోదీకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఘన స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేశామని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క తెలిపారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లపై దాడి!
రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ల విధానాలపై విమర్శలు ఎక్కుపెట్టడంతో పాటు ఈ రెండు పార్టీలు కుటుంబ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాయంటూ తీవ్రస్థాయిలో ఎండగట్టడం ద్వారా తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి ప్రధాని శ్రీకారం చుట్టనున్నట్టు తెలుస్తోంది. పదేళ్లుగా తమ ప్రభుత్వం దేశాభివృద్ధికి పాటుపడుతుంటే...కాంగ్రెస్, బీఆర్‌ఎస్ లాంటి పార్టీలు వారసత్వ రాజకీయాలతో పాటు అవినీతి, నిరంకుశ రాజకీయాలు చేస్తున్నాయంటూ విరుచుకుపడనున్నట్టు సమాచారం. పలు కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి, దేశ సర్వతోముఖాభివృద్ధికి, ప్రపంచ దేశాల్లో భారత్ గౌరవాన్ని సమున్నతంగా నిలబెట్టేందుకు తాము చేస్తున్న కృషిని వివరించనున్నారని సమాచారం
Comments
Please login to add a commentAdd a comment