అధికారులతో సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి సీతక్క
ఆదిలాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫిబ్రవరి 2న ఉద్యమాల గడ్డ ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వద్ద నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పంచాయతీరాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. బుధవారం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్, కలెక్టర్ రాహుల్‌రాజ్, ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో ఖుష్బూ గుప్తా, జిల్లా ఎస్పీ గౌష్ ఆలాంలతో కలిసి కేస్లాపూర్ నాగోబా ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. నాగోబా దర్బార్ హాల్‌లో సీఎం పర్యటనపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏర్పాట్లపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సభ ఏర్పాట్లను పరిశీలించారు.
జల్ జంగల్ జమీన్ కోసం పోరాడి అసువులు బాసిన అమరుల జ్ఞానకార్థంగా కోటి రూపాయలతో నిర్మించే స్మృతివనం శంకుస్థాపన కోసం ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. సీఎం మధ్యాహ్నం 1:30 గంటలకు నాగోబా ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం దర్బార్‌హాల్‌లో 400మంది స్వయం సహాయక సంఘాల మహిళా సంఘాల సభ్యులతో సమావేశం నిర్వహిస్తారని, అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. అలాగే అమరవీరుల స్తూపాన్ని సందర్శించి నివాళులర్పిస్తారని వివరించారు.
అలాగే సీఎం పర్యటన ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం నుంచి ప్రారంభించనున్నట్లు చెప్పారు. వెనుకబడిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై ప్రత్యేక అభిమానం ఉందని, అన్ని విధాలుగా జిల్లాను అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు. అభివృద్ధికి ముందడుగు ఇక్కడి నుంచే బాటలు పడుతాయన్నారు. రేవంత్‌రెడ్డి మొదటి సభ, బట్టి విక్రమార్క పాదయాత్ర ఈ జిల్లా నుంచే ప్రారంభించారని వివరించారు. అందుకే అధికారంలోకి వచ్చిన తరువాత మొదటి సభ ఇంద్రవెల్లిలోనే నిర్వహించడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారని చెప్పారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ కట్టిన కడెం ప్రాజెక్టును పట్టించుకోలేదన్నారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని, ఇష్టానుసారంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ప్రొఫెసర్ కోదండరాంను వాడుకున్నారని, ఉద్యమకారులకు గుర్తింపు లేకుండా కుట్రలు చేశారన్నారు. బీఆర్‌ఎస్ ఉద్యమ పార్టీ కాదని, కల్వకుంట్ల కుటుంబ పార్టీ అని ఆరోపించారు. కార్యక్రమంలో శిక్షణ సహాయ కలెక్టర్ వికాస్ మహతో, డీఆర్‌డీవో పీడీ కిషన్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, ఉట్నూర్ ఆర్‌డీవో జివకర్‌రెడ్డి, డీఎల్పీవో బిక్షపతిగౌడ్, నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్‌రావ్, సర్పంచ్ మెస్రం రేణుకనాగ్‌నాథ్, మెస్రం వంశం ఉద్యోగస్తులు మనోహర్, శేఖర్‌బాబు, సోనేరావ్ ఉన్నారు.
ఇవి చదవండి: సీఎం సారూ.. సమస్యలివీ! ప్రజల వినతి..
Comments
Please login to add a commentAdd a comment