Dhanasari Anasuya
-
సీఎం సభ విజయవంతం చేయాలి.. : మంత్రి సీతక్క
ఆదిలాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫిబ్రవరి 2న ఉద్యమాల గడ్డ ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వద్ద నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పంచాయతీరాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. బుధవారం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్, కలెక్టర్ రాహుల్‌రాజ్, ఐటీడీఏ ఇన్చార్జి పీవో ఖుష్బూ గుప్తా, జిల్లా ఎస్పీ గౌష్ ఆలాంలతో కలిసి కేస్లాపూర్ నాగోబా ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. నాగోబా దర్బార్ హాల్లో సీఎం పర్యటనపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏర్పాట్లపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సభ ఏర్పాట్లను పరిశీలించారు. జల్ జంగల్ జమీన్ కోసం పోరాడి అసువులు బాసిన అమరుల జ్ఞానకార్థంగా కోటి రూపాయలతో నిర్మించే స్మృతివనం శంకుస్థాపన కోసం ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. సీఎం మధ్యాహ్నం 1:30 గంటలకు నాగోబా ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం దర్బార్‌హాల్‌లో 400మంది స్వయం సహాయక సంఘాల మహిళా సంఘాల సభ్యులతో సమావేశం నిర్వహిస్తారని, అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. అలాగే అమరవీరుల స్తూపాన్ని సందర్శించి నివాళులర్పిస్తారని వివరించారు. అలాగే సీఎం పర్యటన ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం నుంచి ప్రారంభించనున్నట్లు చెప్పారు. వెనుకబడిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై ప్రత్యేక అభిమానం ఉందని, అన్ని విధాలుగా జిల్లాను అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు. అభివృద్ధికి ముందడుగు ఇక్కడి నుంచే బాటలు పడుతాయన్నారు. రేవంత్‌రెడ్డి మొదటి సభ, బట్టి విక్రమార్క పాదయాత్ర ఈ జిల్లా నుంచే ప్రారంభించారని వివరించారు. అందుకే అధికారంలోకి వచ్చిన తరువాత మొదటి సభ ఇంద్రవెల్లిలోనే నిర్వహించడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ కట్టిన కడెం ప్రాజెక్టును పట్టించుకోలేదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని, ఇష్టానుసారంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ప్రొఫెసర్ కోదండరాంను వాడుకున్నారని, ఉద్యమకారులకు గుర్తింపు లేకుండా కుట్రలు చేశారన్నారు. బీఆర్ఎస్ ఉద్యమ పార్టీ కాదని, కల్వకుంట్ల కుటుంబ పార్టీ అని ఆరోపించారు. కార్యక్రమంలో శిక్షణ సహాయ కలెక్టర్ వికాస్ మహతో, డీఆర్డీవో పీడీ కిషన్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, ఉట్నూర్ ఆర్డీవో జివకర్రెడ్డి, డీఎల్పీవో బిక్షపతిగౌడ్, నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్, సర్పంచ్ మెస్రం రేణుకనాగ్‌నాథ్, మెస్రం వంశం ఉద్యోగస్తులు మనోహర్, శేఖర్‌బాబు, సోనేరావ్ ఉన్నారు. ఇవి చదవండి: సీఎం సారూ.. సమస్యలివీ! ప్రజల వినతి.. -
ఇష్టంతో ఉమ్మడి జిల్లాకు వచ్చా! : మంత్రి సీతక్క
కుమరం భీం: మహబూబ్‌నగర్ నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఇన్చార్జిగా ఇష్టంతో వచ్చానని, ఇక్కడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి ధనసరి అనసూయ(సీతక్క) అన్నారు. ఇంద్రవెల్లిలో శుక్రవారం నిర్వహించే సీఎం రేవంత్‌రెడ్డి సభను విజయవంతం చేసేందుకు అన్ని గ్రామాల నుంచి పెద్దఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని రోజ్ గార్డెన్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో బుధవారం సాయంత్రం సన్నాహక సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందు ఇంద్రవెల్లి నుంచే దళిత గిరిజన దండోరా శంఖం పూరించి అధికారం సాధించారన్నారు. అదే పోరాట స్ఫూర్తితో ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లి సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు, రహదారుల నిర్మాణాలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు ప్రేమ పంచుతున్నారని, కాళ్లు కడిగి గ్రామాలకు ఆహ్వానించడం ఇక్కడి ప్రజల గొప్పతనమని పేర్కొన్నారు. ప్రజలు చూపిన అభిమానంతోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా ఎంచుకున్నానని, ప్రజల కష్టసుఖాలు పంచుకుంటానన్నారు. బీఆర్ఎస్ నాయకులు ఇతరుల రక్తం తాగి రాజభోగం అనుభవించారని విమర్శించారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న అటవీ భూమికి రైతుబంధు ఇవ్వని బీఆర్ఎస్ హైవేలకు మాత్రం ఇచ్చిందని ఎద్దేవా చేశారు. పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ను అధికా రంలోకి తెచ్చే బాధ్యతను ప్రజలు తీసుకోవాలని కోరారు. ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడుతున్న డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాదరావుకు నామినేటెడ్ పోస్టు ఒక్కటే పరిష్కారమన్నారు. డీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ 95 శాతం పూర్తయిన కుమురంభీం, జగన్నాథ్‌పూర్ ప్రాజెక్టుల ద్వారా సాగు నీరందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసానికే భగీరథ నీరు రావడం లేదంటే, గడచిన పదేళ్లలో అభివృద్ధి ఏ మేరకు జరిగిందో ప్రజలు ఆలోచించాలన్నారు. ఈ సందర్భంగా మంత్రిని శాలువాతో సన్మానించారు. కార్యక్రమానికి ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి అజ్మీరా శ్యాంనాయక్ అధ్యక్షత వహించారు. ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్, నాయకులు రావి శ్రీనివాస్, గణేశ్ రాథో డ్, గుండ శ్యాం, ఆసిఫ్, గోపి, కుసుంరావు, మునీర్ అహ్మద్, అశోక్, మంగ తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి! అరూరికి కష్టకాలమేనా? -
వెంటాడుతున్న కేసులు: కోర్టుకు ముగ్గురు ఎమ్మెల్యేలు
హైదరాబాద్: అధికార, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు మంగళవారం హైదరాబాద్ నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు వరుస కట్టారు. టీఆర్ఎస్కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌కు చెందిన ఓ ఎమ్మెల్యే హాజరయ్యారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై కోర్టు విచారణకు వచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క (ములుగు)పై జారీ చేసిన నాన్ బెయిల్ వారెంట్‌ను కోర్టు ఉప సంహరించుకోగా.. అయితే రూ.10 వేల పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. తొలుత ఎన్నికల నియమావళి కేసుపై విచారణ జరిగింది. ఈ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క విచారణకు హాజరయ్యారు. వేర్వేరు కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి (పటాన్చెరు), దుర్గం చిన్నయ్య (బెల్లంపల్లి) కూడా కోర్టుకు హాజరయ్యారు. కోర్టు ముందు విచారణ కోసం వచ్చారు. అయితే మరో కేసులో విచారణకు కావాలని మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లకు న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. ఇంకొక కేసులో సమన్లు జారీ చేసిన కూడా గైర్హాజరవడంతో నిజామాబాద్ రూరల్ పీఎస్ ఎస్హెచ్ఓపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌పై ఎన్బీడబ్ల్యూ అమలు చేయకపోవడంపై అతడిని కోర్టు పిలిచింది. అయితే ఎస్హెచ్ఓ కోర్టుకు హాజరు కాలేదు. దీంతో ఆగ్రహించిన ధర్మాసనం నిందితుడిగా ఉన్న బాజిరెడ్డి గోవర్ధన్‌కు సహకరించేలా అతడు వ్యవహరిస్తున్నారని డీజీపీకి సమాచారం అందించింది. నిజామాబాద్ రూరల్ ఎస్హెచ్ఓపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డీజీపీకి సూచించింది. -
కేసీఆర్‌కు పుట్టగతులుండవ్
హన్మకొండ: తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన ఆదివాసీ బిడ్డలను సీమాంధ్రులకు బలిచ్చిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు పుట్టగతులుండవని ములుగు మాజీ ఎమ్మెల్యే ధనసరి అనసూయ (సీతక్క) మండిపడ్డారు. మహాజన సోషలిస్టు పార్టీ(ఎంఎస్పీ) ఆధ్వర్యంలో ఆదివారం వరంగల్‌లో జరిగిన జలదీక్ష కార్యక్రమానికి ఆమె సంఘీభావం తెలిపారు. కాపువాడ శివారులోని భద్రకాళి చెరువు మత్తడి వద్ద ఎంఎస్పీ నేతలతో కలిసి చెరువులో దిగి దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ నెల రోజుల నుంచి రక్షించండని ఆదివాసీలు రోదిస్తున్నా కేసీఆర్‌కు వినిపించ లేదా అని ప్రశ్నించారు. పోలవరం టెండర్లు దక్కించుకున్నందుకే నేడు కేసీఆర్ ఆదివాసీలను ముంచేందుకు సిద్ధపడ్డాడని దయ్యబట్టారు. ఇప్పటికైనా ఆదివాసీల పక్షాన నిలబడకుంటే గిరిజనుల బాణాలకు బలికాక తప్పదని సీతక్క హెచ్చరించారు. ఎంఎస్పీ సమన్వయకర్త మంద కుమార్ మాట్లాడుతూ ఒక్క గ్రామాన్ని కూడా వదులు కోవడానికి సిద్ధంగా లేమని ప్రకటించిన కేసీఆర్... 200కు పైగా ఆదివాసీ గ్రామాలు పోలవరంలో మునుగుతుంటే ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.