కుమరం భీం: మహబూబ్‌నగర్ నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఇన్‌చార్జిగా ఇష్టంతో వచ్చానని, ఇక్కడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి ధనసరి అనసూయ(సీతక్క) అన్నారు. ఇంద్రవెల్లిలో శుక్రవారం నిర్వహించే సీఎం రేవంత్‌రెడ్డి సభను విజయవంతం చేసేందుకు అన్ని గ్రామాల నుంచి పెద్దఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని రోజ్ గార్డెన్‌లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో బుధవారం సాయంత్రం సన్నాహక సమావేశం నిర్వహించారు.
మంత్రి మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందు ఇంద్రవెల్లి నుంచే దళిత గిరిజన దండోరా శంఖం పూరించి అధికారం సాధించారన్నారు. అదే పోరాట స్ఫూర్తితో ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లి సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు, రహదారుల నిర్మాణాలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు ప్రేమ పంచుతున్నారని, కాళ్లు కడిగి గ్రామాలకు ఆహ్వానించడం ఇక్కడి ప్రజల గొప్పతనమని పేర్కొన్నారు. ప్రజలు చూపిన అభిమానంతోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఇన్‌చార్జి మంత్రిగా ఎంచుకున్నానని, ప్రజల కష్టసుఖాలు పంచుకుంటానన్నారు.
బీఆర్‌ఎస్ నాయకులు ఇతరుల రక్తం తాగి రాజభోగం అనుభవించారని విమర్శించారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న అటవీ భూమికి రైతుబంధు ఇవ్వని బీఆర్‌ఎస్ హైవేలకు మాత్రం ఇచ్చిందని ఎద్దేవా చేశారు. పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ను అధికా రంలోకి తెచ్చే బాధ్యతను ప్రజలు తీసుకోవాలని కోరారు. ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడుతున్న డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాదరావుకు నామినేటెడ్ పోస్టు ఒక్కటే పరిష్కారమన్నారు.
డీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ 95 శాతం పూర్తయిన కుమురంభీం, జగన్నాథ్‌పూర్ ప్రాజెక్టుల ద్వారా సాగు నీరందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసానికే భగీరథ నీరు రావడం లేదంటే, గడచిన పదేళ్లలో అభివృద్ధి ఏ మేరకు జరిగిందో ప్రజలు ఆలోచించాలన్నారు. ఈ సందర్భంగా మంత్రిని శాలువాతో సన్మానించారు. కార్యక్రమానికి ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి అజ్మీరా శ్యాంనాయక్ అధ్యక్షత వహించారు. ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్, నాయకులు రావి శ్రీనివాస్, గణేశ్ రాథో డ్, గుండ శ్యాం, ఆసిఫ్, గోపి, కుసుంరావు, మునీర్ అహ్మద్, అశోక్, మంగ తదితరులు పాల్గొన్నారు.
ఇవి చదవండి: బీఆర్‌ఎస్ ఉక్కిరిబిక్కిరి! అరూరికి కష్టకాలమేనా?
Comments
Please login to add a commentAdd a comment