ఖమ్మం లీగల్: యాసిడ్ దాడి కేసులో ఓ మహిళకు కింది కోర్టు విధించిన ఐదేళ్ల జైలు శిక్షను పై కోర్టు ఖరారు చేసింది. దీనికి సంబంధించి, ప్రాసిక్యూషన్ తెలిపిన ప్రకారం... ఖమ్మం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మామిళ్ళగూడెంలోని అపార్ట్‌మెంట్‌లో లక్ష్మీమాధురి నివసిస్తోంది. ఆమె వద్దకు బంధువైన కొదుమూరి లక్ష్మీఅనూష వచ్చింది. తాను చేసుకోవాలనుకున్న వ్యక్తికి లక్ష్మీమాధురి భార్య కాబోతోందన్న సమాచారాన్ని లక్ష్మీఅనూష తట్టుకోలేకపోయింది. ఆమె హత్యకు పథకం రూపొందించింది.
2011 జూన్ 20వ తేదీ అర్ధరాత్రి లక్ష్మీమాధురిపై ముఖంపై యాసిడ్ పోసింది. ఈ దాడిలో లక్ష్మీమాధురి తీవ్రంగా గాయపడింది. ఆమె ఫిర్యాదుతో టూటౌన్ పోలీసులు లక్ష్మీఅనూషను అరెస్టు చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన అప్పటి ఖమ్మం అసిస్టెంట్ సెషన్స్ జడ్జి సుశీల్‌కుమార్ పాత్రుడు.. నిందితురాలైన లక్ష్మీఅనూషకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రెండువేల రూపాయల జరిమానా విధించారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ జిల్లా కోర్టులో నిందితురాలు అప్పీలు దాఖలు చేసింది. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న జిల్లా సెషన్స్ జడ్జి ఐ.రమేష్.. కింది కోర్టు విధించిన శిక్షను ధ్రువీకరిస్తూ గురువారం తీర్పు చెప్పారు.ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం.నాగేశ్వరరావు వాదించారు. ఆయనకు లైజన్ ఆఫీసర్లు రాజారావు, మోహన్‌రావు, హోంగార్డు యూసుఫ్ సహకరించారు.
యాసిడ్ దాడి కేసులో... మహిళకు ఐదేళ్ల జైలు
Published Fri, Aug 29 2014 2:43 AM | Last Updated on Fri, Aug 17 2018 2:10 PM
Advertisement
Advertisement