చేయని తప్పునకు శిక్ష అనుభవించడం, నిందలు మోయడం నిజంగా బాధాకరమే. అమెరికాలోని ఒక్లహోమాకు చెందిన 70 సంవత్సరాల గ్లిన్ సైమన్స్‌కు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఏ నేరమూ చేయకపోయినా ఏకంగా 48 సంవత్సరాల ఒక నెల 18 రోజులు జైలు శిక్ష అనుభవించాల్సి వచి్చంది. జీవితంలో విలువైన సమయం జైలుపాలయ్యింది. న్యాయం అతడి పక్షాన ఉండడంతో ఎట్టకేలకు నిర్దోషిగా బయటపడ్డాడు.
అమెరికాలో చేయని తప్పునకు అత్యధిక కాలం శిక్ష అనుభవించింది గ్లిన్ సైమన్స్ అని నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ ఎగ్జోజనరేషన్స్ అధికారులు చెప్పారు. 1974 డిసెంబర్‌లో ఒక్లహోమాలోని ఓ లిక్కర్ స్టోర్‌లో హత్య జరిగింది. ఇద్దరు దుండగులు లిక్కర్ స్టోర్ క్లర్క్‌ను కాల్చి చంపి, మద్యం సీసాలు ఎత్తుకెళ్లారు. అప్పుడు గ్లిన్ సైమన్స్ వయసు 22 ఏళ్లు. సైమన్స్‌తోపాటు డాన్ రాబర్ట్స్ అనే వ్యక్తి ఈ హత్య చేశారని పోలీసులు తేల్చారు. వారిద్దరికీ న్యాయస్థానం జైలుశిక్ష విధించింది.
తాము ఈ నేరం చేయలేదని మొత్తుకున్నా అప్పట్లో ఎవరూ వినిపించుకోలేదు. పోలీసులు వారిని జైలుకు పంపించారు. డాన్ రాబర్ట్స్ 2008లో పెరోల్‌పై విడుదలయ్యాడు. కేసును మళ్లీ విచారించాలని సైమన్స్ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశాడు. దాంతో కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసును మళ్లీ విచారించారు.
సైమన్స్ హత్య చేయలేదని గుర్తించారు. అతడిని జైలు నుంచి విడుదల చేస్తూ ఒక్లహోమా కంట్రీ జిల్లా కోర్టు రెండు రోజుల క్రితం తీర్పు ఇచ్చింది. అంతేకాదు అతడికి 1.75 లక్షల డాలర్ల (రూ.1.45 కోట్లు) నష్ట పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సైమన్స్ మంగళవారం కారాగారం నుంచి బయటకు వచ్చాడు. తాను నేరం చేయలేదు కాబట్టి శిక్షను ధైర్యంగా ఎదుర్కొన్నానని, ఎప్పటికైనా నిర్దోషిగా విడుదలవుతానన్న నమ్మకంతో ఉన్నానని సైమన్స్ చెప్పాడు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment