అమెరికాకు చెందిన ఓ వ్యక్తి తన భార్యను కిరాతకంగా హత్య చేశాడు. ఆమెను చంపిన తర్వాత తనకేం తెలియదన్నట్లు పెద్ద నాటకమే ఆడాడు. భార్య కనిపించడం లేదని తానే స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా.. ఆమె మరణానంతరం ఏం జరుగుతుందని గూగుల్‌లో సెర్చ్ కూడా చేశాడు. అయితే తన నాటకం ఎన్నో రోజులు నడవలేదు. చివరికి పోలీసులు భర్తే హంతకుడని తేల్చి కటకటాల వెనక్కి పంపారు.
వర్జినియాకు చెందిన నరేష్ భట్(33).. నేపాల్‌కు చెందిన తన భార్య మమతా కప్లే భట్(28)తో కలిసి జీవిస్తున్నాడు. వీరికి ఓకూతురు కూడా ఉంది. మమతా గత జూలై 19 నుంచి కనిపించకుండాపోయింది. ఆసుపత్రిలో నర్స్‌గా పనిచేస్తున్న మమతా.. ఆ రోజు సాయంత్రం హెల్త్ ప్రిన్స్ విలియం మెడికల్ సెంటర్‌లో చివరిసారిగా కనిపించింది. తరువాత ఆమె ఆచూకీ తెలియరాలేదు. దీంతో పనికి వెళ్లిన తన భార్య కనిపించకుండాపోయిందని భర్త ఆగష్టు 5న పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అనేక మందిని విచారించారు. కానీ ఇప్పటి వరకు ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించలేక పోయారు. ఈ క్రమంలో మొదట ఆమె న్యూయార్క్, టెక్సాస్‌లో ఉన్న బంధువులను కలిసేందుకు వెళ్లి ఉంటుందని పోలీసులకు చెప్పాడు. కానీ తరువాత, ఆమెకు ఆ రాష్ట్రాల్లో ఎవరూ బంధువులు లేరని, ఆమె ఫోన్ ఆగస్టు 1వ తేదీ వరకు ఆన్‌లో ఉందని పోలీసులు కనుగొన్నారు. ఈ క్రమంలో పోలీసులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పడంలో అతడు తడబడ్డాడు.
ఆగస్టు 22న నరేష్ ఇంట్లో తనిఖీలు చేపట్టిన పోలీసులు అనుమానం వచ్చి భర్త నరేష్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ క్రమంలో తన భార్యతో విడియేందుకు సిద్ధమైనట్లు పోలీసులకు చెప్పాడు. అంతేగాక ‘భార్య చనిపోయిన తర్వాత మరో పెళ్లి చేసుకోవడానికి ఎంత సమయం పడుతుంది. భాగస్వామి చనిపోయాక అప్పులు ఏమవుతాయి.. వర్జినీయాలో జీవిత భాగస్వామి కనిపించకుండా పోతే ఏం జరుగుతుంది’ అంటూ నరేష్ గూగుల్‌లో సెర్చ్ చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
అయితే భర్త మమతాను హత్య చేసి ఉంటాడని భావిస్తున్న పోలీసులు ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అంతేగాక నరేష్ తన ఇంటి సమీపంలోని వాల్‌మార్ట్‌లో మూడు కత్తులను కొనుగోలు చేసినట్లు ఆధారలు వెలువడ్డాయి. వాటిలో రెండిటి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. భార్య అదృశ్యమైన తర్వాత భట రక్తంతో తడిసిన బాత్ మ్యాట్, బ్యాగ్‌లను చెత్త కాంపాక్టర్‌లో పడేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
చెత్త సంచులను పారవేస్తున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డవ్వడంతో మమతను ఆమె భర్తే హత్య చేసి ఉంటాడనే పోలీసుల అనుమానం బలపడింది. దీని ద్వారా తన నేరాన్ని దాచడానికి ప్రయత్నించాడని పోలీసులు భావిస్తున్నారు. నిందితుడికి సెప్టెంబర్‌లో బెయిల్ నిరాకరించడంతో కస్టడీలోనే ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment