డ్రగ్‌ లార్డ్‌ క్వింటెరో అమెరికాకు తరలింపు  | Mexico Extradites Drug Lord Rafael Caro Quintero To US | Sakshi
Sakshi News home page

డ్రగ్‌ లార్డ్‌ క్వింటెరో అమెరికాకు తరలింపు 

Published Sat, Mar 1 2025 6:25 AM | Last Updated on Sat, Mar 1 2025 8:36 AM

Mexico Extradites Drug Lord Rafael Caro Quintero To US

మరో 28 మంది నేరగాళ్లు సైతం 

ట్రంప్‌ టారిఫ్‌ ఒత్తిళ్లకు దిగొచ్చిన మెక్సికో

మెక్సికో సిటీ: డ్రగ్స్‌ ముఠాలపై ఉక్కుపాదం మోపా లన్న ట్రంప్‌ యంత్రాంగం ఒత్తిళ్లు మెక్సికో ప్రభుత్వంపై పనిచేశాయి. యూఎస్‌ డ్రగ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీ(డీఈఏ) అధికారి హత్య కేసులో ఆరోపణలున్న కరడుగట్టిన డ్రగ్స్‌ ముఠా నాయకుడు రఫేల్‌ కారో క్వింటెరో సహా 29 మంది మాఫియా ముఖ్యులను మెక్సికో ప్రభుత్వం అమెరికాకు అప్పగించింది. 

మాదక ద్రవ్యాల మాఫియా ముఖ్యులను తమకు అప్పగించకుంటే మంగళవారం నుంచి అన్ని రకాల మెక్సికో దిగుమతులపై 25 శాతం సుంకాలను విధించక తప్పదన్న ట్రంప్‌ ప్రభుత్వం హెచ్చరికలతో మెక్సికో ప్రభుత్వ యంత్రాంగం మునుపెన్నడూ లేని విధంగా సహకరించేందుకు ముందుకు రావడం గమనార్హం. మెక్సికోలోని వే ర్వేరు జైళ్లలో ఉన్న డ్రగ్‌ మాఫి యా పెద్దతలలను గురు వారం రాజధాని మెక్సికో సిటీ లో విమానాలకు ఎక్కించారు. మొత్తం 29 మందిని అమెరికా వ్యాప్తంగా ఉన్న ఎనిమిది నగరాల్లోని జైళ్లకు తరలించారు. 

వీరిలో అమెరికా ప్రభుత్వం ఇటీవల విదేశీ ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించిన ఆరు గ్రూపులకు గాను ఐదు గ్రూపులకు చెందిన వారున్నారు. కారో క్వింటెరోతోపాటు సినలోలా కార్టెల్‌లోని రెండు గ్రూపులకు చెందిన ముఖ్యులు, 2022లో నార్త్‌ కరోలినాలో పోలీసు అధికారి హత్య కేసులో నిందితుడొకరు ఇందులో ఉన్నారని మెక్సికో అధికారులు వెల్లడించారు. డ్రగ్స్‌ అక్రమ రవాణా, హత్య తదితర నేరారోపణల కింద వీరిపై విచారణ జరపనున్నామని అమెరికా అటార్నీ జనరల్‌ పమేలా బోండి చెప్పారు. డ్రగ్స్‌ ముఠాలపై ఉక్కుపాదం మోపడం, అక్రమ వలసదా రులను నిలువరించడం, ప్రమాదకరమైన డ్రగ్‌ ఫెంటానిల్‌ ఉత్పత్తిని నిలిపివేయడం వంటివి మానుకో కుంటే టారిఫ్‌లు తప్పవని, సానుకూలంగా స్పందించిన పక్షంలో టారిఫ్‌ల అమలును వాయిదా వేస్తామని గతంలో ట్రంప్‌ హెచ్చరికలు చేశారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement