![Google Maps updates Gulf of Mexico name for US users](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/USA.jpg.webp?itok=knlvEIgB)
శాన్ ఫ్రాన్సిస్కో: అమెరికా ప్రభుత్వ ఆదేశాల మేరకు అమెరికా తీరప్రాంతమైన చరిత్రాత్మక ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో(Gulf of Mexico)’పేరును సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్.. ‘గల్ఫ్ ఆఫ్ అమెరికా’(Gulf of America)గా పేర్కొంది. అయితే ఈ పేరు మార్పును కేవలం అమెరికా ఇంటర్నెట్ వినియోగదారులకు పరిమితం చేసింది. మెక్సికోలో ఇంటర్నెట్ వినియోగదారులు ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’అని టైప్ చేస్తే అదే పాత పేరుతోనే సెర్చ్ రిజల్ట్ వస్తుంది. మిగతా ప్రపంచానికి గల్ఫ్ ఆఫ్ మెక్సికో(గల్ఫ్ ఆఫ్ అమెరికా) అని కనిపిస్తుంది. ఈ విషయాన్ని తమ ‘గూగుల్ మ్యాప్స్(Google Maps)’బ్లాగ్‌లో గూగుల్ పోస్ట్ చేసింది.
ఇలా ఒకేప్రాంతానికి మూడు పేర్లతో పిలవనున్నట్లు గూగుల్ తన వెబ్‌మ్యాపింగ్ ప్లాట్‌ఫామ్‌లో పేర్కొంది. అంటే ప్రపంచంలోని ఒకే భౌగోళిక ప్రాంత మ్యాప్ అమెరికాలో ఒక పేరుతో, మెక్సికోలో ఇంకో పేరుతో, మిగతా దేశాలకు రెండూ కలిపి కనిపిస్తుందన్నమాట. ‘‘అమెరికాలో జియోగ్రాఫిక్ నేమ్స్ ఇన్ఫర్మేషన్ సిస్టం (జీఎన్‌ఐఎస్) అధికారికంగా ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’ను ‘గల్ఫ్ ఆఫ్ అమెరికా’గా మార్చేసింది. మేము రెండు వారాల క్రితం ప్రకటించినట్లుగా, మేం అనుసరిస్తున్న విధానాలకు అనుగుణంగా ఈ మార్పులను చేశాం’’అని బ్లాగ్‌లో గూగుల్ పేర్కొంది. ‘‘అమెరికాలో గూగుల్ మ్యాప్‌ను ఉపయోగించే వినియోగదారులకు ఆ భౌగోళిక ప్రాంతం ‘గల్ఫ్ ఆఫ్ అమెరికా’గా కనిపిస్తుంది. మెక్సికో ప్రజలకు ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’గా కనిపిస్తుంది. ప్రపంచంలోని మిగతా దేశాల్లో యూజర్లకు గల్ఫ్ ఆఫ్ మెక్సికో(గల్ఫ్ ఆఫ్ అమెరికా) అని కనిపిస్తుంది.
‘గల్ఫ్ ఆఫ్ అమెరికా డే’
పేరు మార్పు కోసం కార్యనిర్వాహక ఉత్తర్వు జారీ చేసిన తరువాత ఫిబ్రవరి 9వ తేదీని ‘గల్ఫ్ ఆఫ్ అమెరికా దినోత్సవం’గా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. గల్ఫ్‌లో ఉన్న న్యూ ఓర్లీన్స్‌లోని సూపర్»ౌల్‌కు వెళ్తూ ఫిబ్రవరి 10న డిక్లరేషన్‌పై ఆయన సంతకం చేశారు. ‘‘గల్ఫ్ ఆఫ్ అమెరికా పేరు మార్చిన తర్వాత ఈ రోజు నేను తొలిసారి సందర్శిస్తున్నాను’’అని వైట్‌హౌస్ వెబ్‌సైట్‌లో ప్రచురించిన డిక్లరేషన్‌లో ట్రంప్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 9న వేడుకలు జరుపుకోవాలని, పలు కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన ప్రభుత్వ అధికారులకు, అమెరికా ప్రజలకు పిలుపునిచ్చారు.
ప్రమాణ స్వీకారం రోజే పేరు మార్పు
జనవరి 20న అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’పేరు మార్పుకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఇంటీరియర్ డిపార్ట్‌మెంట్‌కు 30 రోజుల గడువు ఇస్తూ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ట్రంప్ ప్రభుత్వంలోని అంతర్గత విభాగం అధికారికంగా పేరు మార్పును అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. వెంటనే, యూఎస్ కోస్ట్‌గార్డ్ సైతం గల్ఫ్ ఆఫ్ అమెరికాను ఉపయోగించడం ప్రారంభించింది. అధ్యక్షుడి ఆదేశాల మేరకు గల్ఫ్ ఆఫ్ మెక్సికోను అధికారికంగా గల్ఫ్ ఆఫ్ అమెరికాగా, ఉత్తర అమెరికాలోని ఎత్తైన శిఖరం డెనాలీ పేరును దాని పూర్వపు పేరు ‘మౌంట్ మెక్ కిన్లీ’గా మారుస్తున్నట్లు అంతర్గత విభాగం తెలిపింది. 2015లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా అలాస్కా పర్వతాన్ని డెనాలీగా అధికారికంగా గుర్తించారు. ఈ పేరును శతాబ్దాలుగా అలాస్కా స్థానికులు ఉపయోగిస్తున్నారు. అయితే ట్రంప్ పేరు మార్పును అలాస్కాలోని స్థానిక సమూహాలు విమర్శిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment