విప్లవారాధనకు వినాయకుడు | Vinayak Damodar Savarkar special | Sakshi
Sakshi News home page

విప్లవారాధనకు వినాయకుడు

Published Sun, Apr 28 2019 12:16 AM | Last Updated on Sun, Apr 28 2019 12:17 AM

Vinayak Damodar Savarkar special - Sakshi

‘యాభై సంవత్సరాల కారాగార శిక్ష.... ఏకాంతవాసం... యాభై ఏళ్లు ఈ చీకటికొట్లోనే గడిచిపోతాయా! ఇలాంటి నరకం ఈ భూమ్మీద ఉంటుందా? అయితేనేం, బతకాలి...’ ఇవి ఒక యోధుడు రాసుకున్న తన కారాగార జ్ఞాపకాలలోని మాటలు.భారత ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం (1857) ఆయనకు ఆదర్శం. ఇటలీ ఏకీకరణ యోధుడు, విప్లవ విధాత గ్లుసెప్పె మేజనీ అంటే ఆరాధన. ఫ్రెంచ్‌ విప్లవం అంటే గురి. అమెరికన్‌ స్వాతంత్య్ర పోరాటమంటే గౌరవం. ఇంగ్లండ్‌ మీద కత్తికట్టిన ఐర్లాండ్‌ విప్లవకారులంటే ప్రేమ. ఇవన్నీ చిన్నతనంలోనే ఆయనను విప్లవ పంథాలోకి నడిపించాయి. ఆయనే వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌. ఆయన మీద ఒక్కటే ఆరోపణ. అయినప్పటికీ భారత స్వాతంత్య్ర పోరాటంలో విప్లవ పంథాకీ, సంస్కరణోద్యమానికీ, అంటరాని తనం మీద పోరాటానికీ ఆయన అందించిన సేవలు అనన్య సామాన్యమైనవి. ఇవన్నీ ఒక ఎత్తయితే చరిత్ర రచనలో సావర్కర్‌ కృషి మహోన్నతమైనది. ఆయన యోధుడు. సంస్కర్త. వక్త, రచయిత.   వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ (మే 28, 1883–ఫిబ్రవరి 26, 1966) భాగూర్‌లో పుట్టారు. ఇది నాటి బొంబాయి ప్రెసిడెన్సీలోని నాసిక్‌ సమీపంలో ఉంది. తండ్రి దామోదర్‌ పంత్‌. తల్లి రాధాబాయి. ఆయనకు ఇద్దరు సోదరులు, ఒక సోదరి ఉన్నారు. అన్నగారి పేరు గణేశ్, తమ్ముడు నారాయణ్‌. సోదరి మెయినిబాయి. తల్లి ఆయన పదో ఏటనే కలరాతో కన్నుమూశారు. తల్లి కన్నుమూసిన ఆరేళ్లకే ప్లేగు సోకి తండ్రి తుదిశ్వాస విడిచారు. అన్నగారు గణేశ్‌ (బాబారావ్‌) సంరక్షణలోనే వినాయక్‌ దామోదర్, నారాయణ్‌ పెరిగారు. ఆ ఇద్దరు కూడా స్వాతంత్య్ర సమరయోధులే. అన్నదమ్ములు ముగ్గురు కూడా సాయుధ సమరంతోనే దేశానికి స్వాతంత్య్రం వస్తుందని నమ్మినవారే. 

సావర్కర్‌ ప్రాథమిక విద్య స్థానికంగానే శివాజీ ఉన్నత పాఠశాలలో జరిగింది. ఆరో ఏటనే ఆయన వార్తాపత్రికలు చదవడం అలవాటు చేసుకున్నారు. గ్రంథపఠనం కూడా మొదలుపెట్టారు.  ఆ వయసులోనే అంటే 1899లోనే సావర్కర్‌ ‘మిత్ర మేళా’ అన్న సంఘాన్ని స్థాపించారు.  తరువాత పూనాలో ఉన్న ఫెర్గూసన్‌ కళాశాలలో1902లో  చేరారు.  అక్కడే ఆయన జాతీయ భావాలకు, ఆ భావాలతో నడిచే ఉద్యమాలకు దగ్గరయ్యారు. 1904లో రెండు వందల మంది సభ్యులతో మిత్రమేళా సమావేశం ఏర్పాటు చేశారాయన. ఆ సమావేశంలోనే మిత్ర మేళా పేరును అభినవ భారత్‌ అని మార్చారు. ఈ సంస్థ ఉద్దేశం సాయుధ విప్లవం ద్వారా బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని తరిమివేయడమే. ఇంతలోనే బెంగాల్‌ విభజన వ్యతిరేకోద్యమం పెల్లుబుకింది. అక్టోబర్‌ 7, 1905న సావర్కర్‌ పూనాలో విదేశీ వస్తు సముదాయాన్ని దగ్ధం చేశాడు. బెంగాల్‌ విభజనను వ్యతిరేకిస్తూ దేశమంతటా రాజకీయ చైతన్యాన్ని నింపిన లాల్‌ పాల్‌ బాల్‌ అంటే సావర్కర్‌కు వీరాభిమానం. విదేశీ వస్తు దగ్ధకాండ దేశంలో తొలిసారి సావర్కర్‌ నిర్వహించారన్న వాదన ఉంది. నిజానికి అప్పటికే ఆయన విదేశీ వస్తువులను బహిష్కరించాలనీ, మన దేశంలో మన నేతకారులు నేసిన బట్టలే ధరించాలని ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ చూసి కళాశాల నుంచి బహిష్కరించారు. కొన్ని ఇబ్బందులు పెట్టిన తరువాత మొత్తానికి బిఎ డిగ్రీ ఇచ్చారు. 

అప్పుడే ఇంగ్లండ్‌లో బారెట్లా చదవాలనుకునే వారికి విద్యార్థి వేతనాల కోసం దరఖాస్తులు కోరారు శ్యామ్‌జీ కృష్ణవర్మ. ఆయన లండన్‌లో ఉన్న ప్రముఖ భారతీయుడు. ధనవంతుడు. భారత స్వాతంత్య్రోద్యమానికి మద్దతుగా, నిలిచి విప్లవయోధులకు ఆశ్రయం ఇస్తున్నారు.  సావర్కర్‌ దరఖాస్తు చేశారు. అందులో, ‘స్వేచ్ఛాస్వాతంత్య్రాలే ఒక జాతికి ఉచ్ఛ్వాసనిశ్వాసాలని నేను భావిస్తాను. నా కౌమారం నుంచి యౌవనం వరకు నా దేశం కోల్పోయిన స్వాతంత్య్రం గురించి, ఆ స్వాతంత్య్రాన్ని తిరిగి సాధించుకోవడం గురించే రేయింబవళ్లు యోచిస్తున్నాను’ అని రాశారని సావర్కర్‌ జీవితచరిత్ర (వీర్‌సావర్కర్‌)లో ధనంజయ్‌కీర్‌ నమోదు చేశారు. శ్యామ్‌జీ సాయంతోనే లండన్‌  చేరుకుని బారెట్లా కోసం గ్రేస్‌ ఇన్‌ లా కళాశాలలో 1906లో చేరారు. నివాసం ఇండియా హౌస్‌. ఇది పేరుకు భారతదేశం నుంచి చదువు కోసం ఇంగ్లండ్‌ వచ్చిన విద్యార్థులకు వసతిగృహం. వాస్తవంæ– భారత స్వాతంత్య్రమే లక్ష్యంగా సాగే విప్లవ కార్యకలాపాలకు ఇది కేంద్రం. దీనిని స్థాపించినవారే శ్యామ్‌జీ కృష్ణవర్మ. లండన్‌లోనే హైగేట్‌ ప్రాంతంలో ఉండేది. నిరంతరం పోలీసు నిఘా కూడా ఉండేది. అక్కడే ఫ్రీ ఇండియా సొసైటీ స్థాపించారు సావర్కర్‌.  ఇండియా హౌస్‌లో ప్రతి ఆదివారం సమావేశాలు జరిగేవి. పండుగలు, దేశభక్తుల ఉత్సవాలు నిర్వహించేవారు. ఇక రాజకీయ చర్చలు సరేసరి. 1909లో ‘ది వార్‌ ఆఫ్‌  ఇండియన్‌ ఇండిపెండెన్స్‌’ అచ్చయింది. దీనిని వెంటనే నిషేధించారు. 1906లో ఒక హిందూ పండుగ సందర్భంలోనే గాంధీజీని ఇండియా హౌస్‌కు ఆహ్వానించారు. అక్కడే సావర్కర్‌ గాంధీజీని తొలిసారి కలుసుకున్నారు. 

1907లో ప్రథమ స్వాతంత్య్ర సమరం యాభయ్‌ ఏళ్ల సందర్భాన్ని సావర్కర్‌ ఇంగ్లండ్‌లో నిర్వహించారు. భారతీయ విద్యార్థులు ‘ప్రథమ స్వాతంత్య్ర సమరయోధుల గౌరవార్ధం’ అని రాసిన బాడ్జీలను జేబులకు తగిలించుకున్నారు.  ఏదో కారణంగా ఘర్షణ జరిగింది. పోలీసులు వచ్చారు. ఘర్షణకు కారణం శ్యామ్‌జీ కృష్ణవర్మ అన్న అనుమానంతో అరెస్టు చేయాలని చూశారు. ఆయన పారిస్‌ పారిపోయారు. దీనితో ఇండియా హౌస్‌ నిర్వహణ బాధ్యత సావర్కర్‌ మీద పడింది. అదే సమయంలో పూనాలో అభినవ్‌ భారత్‌ సభ్యుడు అనంత్‌ లక్ష్మణ్‌ కన్హారే ఆ జిల్లా కలెక్టర్‌ ఏఎంటీæ జాక్సన్‌ను ఒక నాటకశాలలో చంపాడు. ఎందుకంటే అతడు అభినవ్‌ భారత్‌ను అణచివేయడమే ధ్యేయంగా ఆ సంస్థ సభ్యుల మీద తీవ్రమైన అణచివేత చర్యలు చేపట్టాడు. 

 పంజాబ్‌ నుంచి ఇండియా హౌస్‌కు వచ్చి, సావర్కర్‌ ప్రభావం పడినవాడు మదన్‌లాల్‌ థింగ్రా. ఇతడు కర్జన్‌ను చంపాలనుకుని కర్జన్‌వైలీని హత్య చేశాడు. థింగ్రాకు మరణశిక్ష విధించారు. అక్కడ ఉన్న భారతీయులు కూడా థింగ్రా చర్యను ఖండించారు. కానీ సావర్కర్‌ సమర్థించాడు. తరువాత సావర్కర్‌కు కూడా లండన్‌లో ఉండడం సమస్యగా మారింది. దీనితో ఆయన కూడా 1910 జనవరిలో పారిస్‌ వెళ్లిపోయారు. అక్కడ మేడమ్‌ కామా ఆశ్రయంలో ఉన్నారు. బారెట్లా పూర్తయింది. కానీ ఆ లా కాలేజీ పట్టా ఇవ్వడానికి అంగీకరించలేదు. కారణం– సావర్కర్‌ బ్రిటిష్‌ వ్యతిరేకత. రాజకీయోద్యమాలకు దూరంగా ఉంటానని రాసి ఇస్తే పట్టా ఇస్తామని అధికారులు చెప్పారు. సావర్కర్‌ తిరస్కరించారు.  అప్పుడే భారత్‌లో వైస్రాయ్‌ని చంపడానికి బాంబుదాడి జరిగింది. ఇందులో సావర్కర్‌ సోదరుడు నారాయణ్‌ను అరెస్టు చేశారు. అలాగే లండన్‌లో ఉన్న సావర్కర్‌ను వెంటనే అరెస్టు చేయవలసిందని టెలిగ్రామ్‌ ఆదేశాలు వెళ్లాయి. లండన్‌లో సావర్కర్‌ మీద అరెస్ట్‌ వారెంట్‌ జారీ అయింది. 1910 మార్చిలో ఆయన ఇంగ్లండ్‌ రాగానే పోలీసులు అరెస్టు చేసి బ్రిక్‌స్టన్‌ జైలుకు తరలించారు. కొంత తర్జనభర్జన తరువాత ఆయనను భారతదేశంలోనే విచారించాలని భావించారు. దీనితో ఎస్‌ఎస్‌ మోరియా అన్న నౌకలో జూలై 1న ఎక్కించారు. ఆ నౌక మార్సెల్స్‌ రాగానే సావర్కర్‌ తప్పించుకుని ఫ్రెంచ్‌ భూభాగం మీద అడుగు పెట్టారు.  అయినా ఇంగ్లండ్‌ పోలీసులు మళ్లీ పట్టుకుని తీసుకుపోయారు. ఈ చర్యను సావర్కర్‌ అభిమానులు  అంతర్జాతీయ కోర్టులో సవాలు చేశారు. కానీ ఆయనకు వ్యతిరేకంగా తీర్పు రావడంతో బొంబాయి తీసుకువచ్చారు. విచారణలో రెండు జీవితకాలాల శిక్ష పడింది. పైగా ప్రవాసం. ఇది అప్పట్లో అంతర్జాతీయ వార్త అయింది. ఒక మనిషికి యాభై ఏళ్లు శిక్ష ఏమిటన్నదే ప్రశ్న.

అండమాన్‌జైలులో 1911 నుంచి 1921 వరకు ఉన్నారు. కఠిన కారాగార శిక్ష అనుభవించారు. నూనె గానుగను కూడా తిప్పించారు. అలాంటి దారుణమైన శిక్షలు అక్కడ ఉన్న అనేక మంది స్వాతంత్య్రం సమరయోధులు అనుభవించారు. అండమాన్‌లో ఉండగానే ‘హిందూయిజం’ పుస్తకం రాశారు. విఠల్‌భాయి పటేల్, గాంధీ వినతి మేరకు సావర్కర్‌ను బొంబాయి ప్రెసిడెన్సీకి తీసుకువచ్చారు. 1924 వరకు రత్నగిరి, యరవాడ జైళ్లలో ఉంచిన తరువాత విడుదల చేశారు. అయితే ఆయన రాజకీయ కార్యకలాపాలలో పాల్గొనరాదన్న షరతుతోనే ఇది జరిగింది. అలాగే రత్నగిరి జిల్లా దాటి బయటకు రాకూడదు. కానీ ఆయన తనను విడుదల చేయవలసిందిగా నాలుగు సార్లు బ్రిటిష్‌ అధికారులకు విన్నవించాడు. అందులో క్షమాపణలు కోరారు. కానీ ఆ విన్నపాలు ఆయనకు ఉపయోగపడలేదు. రత్నగిరికే పరిమితమై స్వాతంత్య్రోద్యమంలో పాల్గొనకుండా సావర్కర్‌ సంఘ సంస్కరణోద్యమాన్ని చేపట్టారు. అంటరానివారికి ఆలయ ప్రవేశం చేయించారాయన.  అంటరానితనం మీద పోరాడారు. అందుకే సావర్కర్‌ వి«ధానాలను కొన్నింటిని వ్యతిరేకిస్తూనే, ఆయన సంస్కరణోద్యమానికి చేసిన సేవను అంబేడ్కర్‌ కూడా శ్లాఘించారు. 

స్వాతంత్య్రం పోరాటంలో గాంధీజీ మార్గాన్ని సావర్కర్‌ పూర్తిగా వ్యతిరేకించారు. హిందుత్వ ప్రాతిపదికగా ఉద్యమాలు, రాజకీయాలు నడవాలని ఆశించారు. అసలు హిందువులు సైన్యంలో చేరి సైనిక శిక్షణ తీసుకుని బ్రిటిష్‌ జాతి మీద పోరాటానికి సిద్ధంగా ఉండాలని కూడా ప్రబోధించారు. ఆయనను 1937లో హిందూ మహాసభకు అధ్యక్షుడిని చేశారు. 1942 నాటి క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని ముస్లిం లీగ్, కమ్యూనిస్టులతో పాటు సావర్కర్‌ కూడా వ్యతిరేకించారు. సావర్కర్‌ రచయితగా ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఆయనకు ఆదర్శం మేజినీ. అందుకే మేజినీ జీవితచరిత్ర సావర్కర్‌ రాశారు. ఆయన అటు చరిత్ర రచనతో పాటు, సృజనాత్మక రచనలు కూడా చేశారు. ది వార్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండిపెండెన్స్‌ పుస్తకం అజరామరమైనది. ఇది 1909లో అచ్చయింది. కానీ ఈ రచనకు కావలసిన సమాచారమంతా అంతకు ఏడేళ్ల క్రితమే సేకరించి పెట్టుకున్నారు. అంటే ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం జరిగిన దాదాపు అరవై ఏళ్ల తరువాత. అప్పటికి ఆ మహా సంగ్రామాన్ని చూసినవారు కొందరు బతికి ఉన్నారు. ఆ ప్రదేశాలు తిరిగి, అలాంటి వారితో మాట్లాడి సావర్కర్‌ ఈ పుస్తకం రచించారు. ఆయన మరాఠీలో రచించగా, ఐసీఎస్‌ చదవడానికి ఇంగ్లండ్‌ వచ్చిన కొంతమంది యువకులు ఆంగ్లంలోకి అనువదించారు. ఆ పుస్తకాన్ని మేడం కామా అచ్చు వేయించారు. కానీ వెంటనే నిషేధానికి గురైంది. దీనితో చాలా జాగ్రత్తగా భారత్‌కు చేర్చారు. ఇది కాకుండా హింద్‌ పద్‌పద షాహి మరొక పుస్తకం. ఇందులో మరాఠీ ఔన్నత్యం గురించి ఎక్కువగా వర్ణించారాయన. 

సావర్కర్‌ మీద దు్రçష్పచారం చేసినట్టుగా ఆయన కాలాన్ని వెనక్కి తిప్పాలని తపన పడినవాడు కాదు. లొంగిపోవడం ఆయన నైజం కాదు. అదొక వ్యూహమనిపిస్తుంది.. కారాగారం నుంచి వచ్చాక రత్నగిరి జిల్లాలో సావర్కర్‌ చేసిన సామాజిక ఉద్యమం ఇందుకు నిదర్శనం.ఆయన హిందుత్వను నమ్మడం నిజం. కానీ భారత రాజకీయాలు, ఉద్యమాలు భారతీయ విలువల ఆధారంగా జరగాలని ఆయన కోరుకున్నారు. కానీ అవసరమైనప్పుడు ముస్లిం లీగ్‌తో కలసి కూడా పనిచేశారు. సంస్కర్తగా ఆయన జీవితం ఉత్తేజకరమైనది. అభినవ భారత్‌ సంస్థ తరఫున ఆయన రష్యా, ఐర్లాండ్, ఈజిప్ట్, చైనా విప్లవకారులతో సంప్రతింపులు కూడా జరిపారు. ఆనాడు విశ్వవ్యాప్తంగా విప్లవ సిద్ధాంతంతో ప్రభావితమైన వారిలో సావర్కర్‌ ఒకరు. వీరందరికీ ఆదర్శం మేజని. సావర్కర్‌ జీవిత చరమాంకం విస్తుగొలుపుతుంది. 1948లో గాడ్సే గాంధీని హత్య చేస్తే ఆ హత్య కుట్రలో సావర్కర్‌ భాగస్వామి అని భారత ప్రభుత్వం ఆయనను బోను ఎక్కించింది. ఎందుకంటే గాడ్సే హిందూ మహాసభ సభ్యుడు. కానీ ఆ కేసులో సావర్కర్‌ను నిర్దోషిగా తేల్చారు. వీర్‌ సావర్కర్‌ తన మరణాన్ని ముందుకు తెచ్చుకున్నారు. 1963లో ఆయన భార్య యమున మరణించారు. 1966 ఫిబ్రవరిలో ఆయన ఒక్కసారిగా మందులు, ఆహారం, నీరు కూడా ఆపేశారు. ఆత్మార్పణ చేసుకున్నారు. 
- డా. గోపరాజు నారాయణరావు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement