
మాధవ్ శింగరాజు
ఇప్పటికీ నాకు ఒక కల వస్తూ ఉంటుంది. ఇప్పటికీ అంటే, పాతికేళ్లు దాటిపోయినప్పటిMీ ! బహుశా ఇంకో పాతికేళ్లు దాటి పోయినా ఆ కల నాకు వస్తూనే ఉంటుందనుకుంటాను. అది ఎప్పుడూ వచ్చిపోతుండే కలే అయినా, అప్పుడే మొదటిసారిగా ఆ కలను కన్నట్లుగా ప్రతిసారీ నేను దిగ్గున మేల్కొంటాను! గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. నుదురు చెమట పట్టి ఉంటుంది. గొంతు ఆర్చుకునిపోయి ఉంటుంది. ‘‘సిద్ధివినాయకా! నాపై నీకెంత అనుగ్రహం! ఇది వట్టి కలేనా...’’ అని మనసులోనే ఆయనకు ప్రణమిల్లి పైకి లేస్తాను. ఒక గ్లాసు నీళ్లు తాగుతాను. అమ్మతో మాట్లాడతాను. నాన్నను పలకరిస్తాను. రణ్‌వీర్‌ను లేపుతాను. నా ఐదు నెలల కూతురు దువాను ముద్దాడతాను. నా స్ట్రెస్ అంతా పోతుంది.
‘పరీక్షా పే చర్చ’ కోసం ఢిల్లీ నుండి ఆహ్వానం రాగానే మొదట నాకు నా కలే గుర్తొచ్చింది! పిల్లల్లో పరీక్షల భయం పోగొట్టటం కోసం ‘మోదీజీ మోటివేషన్ టీమ్’ నన్నక్కడికి పిలిపించింది.నా ఎదురుగా స్కూలు ఫైనల్ పరీక్షలకు సిద్ధమౌతున్న చిన్నారులు కూర్చొని ఉన్నారు. అంతా పద్నాలుగూ పదిహేనేళ్ల వాళ్లు. ‘‘దీపికాజీ! చదువుతుంటే స్ట్రెస్‌గా ఉంటోంది. చదివింది ఒక్కటీ గుర్తుండటం లేదు. ఏం చేయమంటారు?’’ అని ఒక స్టూడెంట్!
25 ఏళ్ల క్రితం మోదీజీ ప్రధానిగా ఉండి, ఇరవై ఐదేళ్ల క్రితమే ‘పరీక్షా పే చర్చ’ ఉండి ఉంటే... అలా ఆ ప్రశ్నను అడిగిన అమ్మాయి కచ్చితంగా దీపికా పదుకోన్ అయి వుండేది! అప్పుడు నేను టెన్త్‌కి ప్రిపేర్ అవుతున్నాను. సోఫియా హైస్కూల్‌లో చదివే అమ్మాయిలకు పరీక్షలంటే భయం ఉండదని టీచర్లు గొప్పగా చెబుతుండేవారు! పేరెంట్స్ ఆ మాటను ఇంకా గొప్పగా వింటుండేవారు. కానీ నాకు భయంగా ఉండేది. ‘మిస్’తో నా భయం గురించి చెబితే, ‘‘ఏ సబ్జెక్ట్ అంటే భయపడుతు న్నావో, ఆ సబ్జెక్ట్‌తో ఫ్రెండ్షిప్ చెయ్యి’’ అనేశారు! ఇదెక్కడి గొడవ!
నేను ఫ్రెండ్షిప్ చేస్తాను సరే, నాతో ఫ్రెండ్షిప్ ఆ సబ్జెక్ట్‌కి ఇష్టమవ్వాలి కదా! అది ఆలోచించినట్లు లేరు మా మిస్. టీచర్లు ఇచ్చే టిప్స్ ఇలాగే అసాధ్యమైన ఫ్రెండ్షిప్‌లతో నిండి ఉండేవి! ఇప్పుడు మోదీజీ చెబుతున్నట్లుగా... ‘‘కంటి నిండా నిద్రపోండి. కలత లేకుండా చదవండి...’’ అని మేడ్ ఈజీగా ఒక్కమాటైనా అనేవాళ్లు కాదు.
కొరివి దెయ్యాల్లాంటి పరీక్షల్ని వాకిట్లో పెట్టుకుని నిద్ర పోవటం, నిద్ర పట్టటం అయ్యే పని కాకపోయినా... మోదీజీ అంత బిజీలోనూ పిల్లలతో ఇంటరాక్ట్ అవటం; సద్గురువులను, న్యూట్రిషనిస్ట్‌లను ఇంటరాక్ట్ చేయించటం... ఇలా కదా పరీక్షల భయాన్ని పోగొట్టటం!
నిజానికి – బోర్డ్ ఎగ్జామ్స్ కంటే కఠినమైనవి జీవితం పెట్టే పరీక్షలు! జీవితం పెట్టే పరీక్షలకు సిలబస్ ఉండదు. స్కూళ్లు, ట్యూషన్‌లు ఉండవు. టిప్స్ ఇచ్చేవాళ్లున్నా అవి మనకు పనికొచ్చేవై ఉండవు. జీవితంలో ప్రతిదీ ఫైనల్ ఎగ్జామే. పాసైన సంతోషమైనా, ఫెయిల్ అయిన విచారమైనా జీవితం మళ్లీ ఇంకో పరీక్ష పెట్టేవరకే!
టెన్త్ ఎగ్జామ్స్ జన్మకోసారి. కానీ జన్మ మొత్తం కలలోకి వచ్చి జడిపిస్తూనే ఉంటాయి. పెళ్లయి, పేరెంట్స్‌మి అయి, పిల్లలు టెన్త్‌కి వచ్చినా కూడా... మన టెన్త్ మన కలలోకి వస్తూనే ఉంటుంది. రేపే పరీక్ష ఉన్నట్లు, అసలేమీ చదవనట్లు, ‘హే... గణేశా! ఎలా రాయాలి తండ్రీ...’ అని కలలో మొరపెట్టుకుంటూ ఉంటాం!
‘పరీక్షా పే చర్చ’లో పిల్లలకు నేను నాలుగు టిప్స్ ఇచ్చాను. స్లీప్, ఎక్స్‌ప్రెస్, హైడ్రేట్, మెడిటేట్! నాన్న నాకు చిన్నప్పుడు చెప్పిన టిప్స్ అవి. పెద్దయ్యాక, చిన్నప్పటి ‘పరీక్ష కల’ వెంటాడకుండా ఉండేందుకు కూడా ఏవైనా టిప్స్ ఉండి ఉంటాయా?! ఉన్నా అవసరం లేదు. కొన్ని కలలు వెంటాడుతుంటేనే జీవితం పాస్ అవుతున్న ఫీల్ ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment