పరలోకాన్ని దూరం చేసిన ‘అనుమానం’!! | Knowing New Things is More Important Than Practicing The Truth of God | Sakshi
Sakshi News home page

పరలోకాన్ని దూరం చేసిన ‘అనుమానం’!!

Published Sun, Sep 15 2019 1:05 AM | Last Updated on Sun, Sep 15 2019 1:05 AM

Knowing New Things is More Important Than Practicing The Truth of God - Sakshi

ఇంత అందమైన తోటలోని మధురాతిమధురమైన ఫలాల్లో కొన్నింటిని దేవుడు తినొద్దన్నాడా? దేవుడు నిజంగా అలా అన్నాడా?’ అన్న సాతాను ప్రశ్న, తొలి మానవులైన ఆదాం, హవ్వలను సందిగ్ధంలో, ఆ తర్వాత ఆత్మీయమైన అగాథంలో పడేసింది.  యుక్తిపరులు అబద్ధాల ప్రచారం కోసం ఇలాంటి  తెలివైన ప్రశ్నలు వేస్తుంటారు. అప్పుడప్పుడే తొలి మానవులతో ఆరంభమైన ఈ లోక సందడి, చరిత్ర, సంస్కృతిలో, సాతాను ఇక నుండీ తాను నాటబోయే అబద్దాలకోసం ’ఇది నిజమా?’ అన్న తన ప్రశ్నతో మనిషి హృదయంలోనే ఒక వేదికను నిర్మించుకున్నాడు. దేవుడు తన నివాస స్థానమైన పరలోకానికి, తన సొంతమైన శాశ్వతత్వానికి ముంగుర్తుగా  తానే స్వయంగా తొలి మానవుల కోసం నిర్మించిన ఏదెను తోటను ధ్వంసం చేసేందుకు పన్నిన కుట్రలో భాగంగా సాతాను ముందుగా మనిషి హృదయంలో ఇలా పాగా వేశాడు. సత్యాన్ని దేవుడు తన మాటలు, చేతలతో ప్రతిష్ఠిస్తే, దానికి పోటీగా అనుమానాలే పునాదిగా సాతాను అబద్ధాలను నిర్మిస్తాడు.

తాను ప్రకటించిన ‘సత్యాన్ని’ మనిషి సంపూర్ణ విధేయతతో జీవితంలో ఆచరించాలన్నదే దేవుని అభీష్టం కాగా, ‘మీకు తెలియని సంగతులు చాలా ఉన్నాయి’ అన్న పద్ధతిలో సాతానేమో తొలిమానవులకు ‘జ్ఞానాన్ని’ నూరిపోసేందుకు ప్రయత్నించడంతో అసలు సమస్యంతా ఆరంభమయ్యింది. దేవుడు ప్రతిష్టించిన ‘సత్యం’ కన్నా సాతాను నూరిపోసిన జ్ఞానమే ఆదాము, హవ్వలను ఆకట్టుకోవడంతో, అంత కాలం వాళ్లు చూసేందుకు కూడా భయపడిన ‘నిషిద్ధ వృక్షఫ లం’ ఇపుడు సాతాను తెరిచిన లోకజ్ఞానమనే నేత్రాలతో చూస్తుంటే ‘ఆహారానికి మంచిదిగా, చూసేందుకు అందమైనదిగా, వివేకాన్నిచ్చే రమ్యమైనదిగా’  ఆ ఇద్దరికీ కనిపిస్తోంది (ఆది 3:6). మానవాళి సంక్షేమం కోసం దేవుడు సరిహద్దులనేర్పరచి వారిని విశ్వాసులను చేయాలనుకుంటే, సరిహద్దుల్ని తామే చెరిపేసుకొని భ్రష్టత్వాన్ని సంపాదించుకొనే జ్ఞానబోధతో నింపబడి, ఆదాము, హవ్వలు అపరమేధావులయ్యారు.

దేవుని సత్యాన్ని ఆచరించడం కన్నా, ‘కొత్త విషయాలు తెలుసుకోవడం’ అనే మేధావితనమే, మానవాళికి అప్పటి నుండి ప్రధానమయ్యింది. దేవుని ఆజ్ఞ కన్నా, తాము పొందిన కొత్త బోధనే నమ్ముకొని వాళ్ళు నిషిద్ధఫలాన్ని తిని, పరలోకాన్ని, ఏదెను తోటను, దేవుని నిత్యసహవాసాన్ని కూడా పోగొట్టుకొని నిజంగానే దిగంబరులయ్యారు. అందువల్ల దేవుడు మానవాళికివ్వాలనుకునే పరలోకం పూర్తిగా విశ్వాసి విధేయతకు సంబంధించిన అంశమే అని తెలుసుకోవాలి. సూక్తులు, బోధలు, సలహాలు, జ్ఞానాంశాలున్న పుస్తకం కాదు బైబిల్‌!! విశ్వాసులంతా తూచా తప్పకుండా ఆచరించి జీవనసాఫల్యాన్ని పొందేందుకు గాను దేవుడు నిర్దేశించిన ఖచ్చితమైన ఆజ్ఞలు అందులో ఉన్నాయి. అందువల్ల వాటిపై చర్చలకు, వాటిలో మార్పులు చేర్పులకు ఏ మాత్రం తావు లేదు. ‘నిన్నువలె నీ పొరుగు వాణ్ని ప్రేమించు’ అన్నది ఆజ్ఞే, ‘నీ శత్రువును ప్రేమించు’ అన్నది కూడా ఆజ్ఞే!! అవి పాటించక పోతే దేవుణ్ణి ధిక్కరించినట్టే...ఈ విధేయతలోని రహస్యం తెలిసిన వాళ్ళే నిజమైన విశ్వాసులు, ఈ లోకాన్ని దేవుని రాజ్యంగా మార్చగల దేవుని పిల్లలు, దైవిక సాధనాలు.
– రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్‌
సంపాదకులు – ఆకాశధాన్యం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement