అడగక ఇచ్చిన వరం | The grant of wrong | Sakshi
Sakshi News home page

అడగక ఇచ్చిన వరం

Published Thu, May 15 2014 10:46 PM | Last Updated on Wed, Apr 3 2019 4:08 PM

అడగక ఇచ్చిన వరం - Sakshi

అడగక ఇచ్చిన వరం

దైవికం
 
దేవుడిని వరంఇమ్మని అడక్కుండానే ఆయన ఇచ్చిన వరమే చెట్లు. అలాంటి చెట్లను మనం నరికేస్తున్నాం!
 
 ‘‘ఆవులకు మేత లేదు. వెళ్లి గడ్డి కోసుకురా’’ అని భక్త కబీరు తన కొడుకును ఊరి చివరున్న పొలాలకు పంపించాడు.
 
కానీ ఎంతసేపైనా కొడుకు రాలేదు. సాయంత్రం అవుతోంది. అయినా రాలేదు. సహనం కోల్పోయిన కబీరు కొడుకు ఎక్కడున్నాడో చూద్దామని బయలుదేరాడు.
 
తనయుడు  నిగనిగలాడుతున్న పచ్చికబయలుపై తదేకంగా నిల్చుని కనిపించాడు! పిల్లగాలులు వీస్తున్నాయి. పచ్చిగడ్డి గాలిని ఆస్వాదిస్తూ అటూ ఇటూ రమ్యంగా ఊగుతున్నాయి. ఆ సన్నివేశాన్ని చూసిన కబీరు కుమారుడు పచ్చిక ఆనందంతో మమేకమైపోయాడు. ఆనందంలో మునిగితేలుతున్నాడు. తన తండ్రి వచ్చిన విషయాన్ని కూడా అతను గమనించలేదు. దాంతో క బీరుకు కోపం వచ్చింది.
 
‘‘నీకేమైనా పిచ్చా? నేనేం చెప్పాను? నువ్వేం చేస్తున్నావు?’’ అని గట్టిగా కోప్పడ్డాడు.
 ‘‘నేనిక్కడికి వచ్చేసరికి ఈ పచ్చగడ్డి... గాలి స్పర్శకు పరవశించిపోయి ఆనందంతో నృత్యం చేస్తుండటం చూస్తూ నన్ను నేను మరచిపోయాను. నా మనసెంతో ఆనందంగా ఉంది. ఈ ఆనందంలో నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో మరచిపోయాను. ఇప్పుడు చెప్పండి నాన్నగారూ, నన్ను ఇక్కడికి ఎందుకు పంపారు?’’ అని నిదానంగా అడిగాడు కుమారుడు.

 దాంతో కబీరు కోపం రెట్టింపైంది.
 ‘‘నిన్ను ఇక్కడికి గడ్డి కోసుకు రమ్మని పంపాను’’ అన్నాడు.
 ‘‘మన్నించండి నాన్నగారూ... నేను ఎంతో సంతోషంగా నృత్యం చేస్తున్నట్లున్న ఈ పచ్చగడ్డిని నేను నా చేతులతో నరకలేను. మీరు నన్ను ఎంత తిట్టినా ఈ విషయంలో మాత్రం నేను ఏమీ చెయ్యలేను. నేనిప్పటి వరకు ఓ ఆనంద జగత్తులో ఉన్నాను. అది కాస్తా మీ రాకతో చెదరిపోయింది. ఆ ప్రపంచాన్ని మాటల్లో వర్ణించలేను. ఆ సౌందర్య సన్నివేశం ఎవరికి వారు చూసి తరించాల్సిందే. ఒకరు చెప్తే పొందేది కాదు’’ అన్నాడు కబీరు పుత్రుడు.
 
కబీరు అతని మాటలు విని నిశ్చేష్టుడయ్యాడు. అప్పుడే ఆ క్షణంలోనే తన కుమారుడికి కమాల్ అని పేరు పెట్టాడు. అందరూ అతనిని ఆ క్ష ణం నుంచి కమాల్ అని పిలవడం మొదలుపెట్టారు.
 
తన కొడుకు పచ్చికతో ఓ గాఢమైన బంధాన్ని ఊహించుకుని చెప్పడం కబీర్‌కు ఆనందమేసింది. తన సుపుత్రుడిలో ఒక గొప్ప వ్యక్తిని చూశాడు.
 
నిజమాలోచిస్తే మనిషికీ, పచ్చగడ్డికీ అనుబంధముంది. పరిణామక్రమంలో తొలుత పచ్చికై, పురుగై, చెట్టై, పక్షై, జంతువై ఆ తర్వాత రకరకాల వాటి తర్వాత మనం పుట్టాం. ఈ పరిణామక్రమాన్ని మనం మరిస్తే మరచిపోవచ్చు కానీ చెట్లనూ, మనుషులనూ ఒకే దేవుడు సృష్టించాడన్న విషయాన్ని మరచిపోకూడదు. కనుక చెట్లకూ, మనుషులకూ మధ్య విడదీయరాని బంధముంది. దేవుడు మనకన్నా ముందు చెట్లను పుట్టించాడు. ఆ తర్వాత మనిషి పుట్టాడు. అంటే చెట్లు మనకన్నా పూర్వం నుంచే ఉన్నాయి. కానీ మనుషులు ఈ సంగతి మరచిపోతున్నారు. కమాల్‌కు పచ్చగడ్డితో అనుబంధం యాదృచ్ఛికంగా వచ్చిన గొప్ప జ్ఞాపకం. అది అద్భుత విషయం.
 
చెట్లతో మనకున్న బంధాన్ని తెలుసుకోవడం జ్ఞానానికి సంకేతం. కనుక చెట్లను నరికే వ్యక్తి తన బంధాన్ని తానే తెంచుకుంటున్నాడని అర్థం. ఆదివాసీలను మనం చిన్న చూపు చూశాం. కానీ వాళ్లే మనకన్నా జ్ఞానవంతులు. వాళ్లు చెట్లను ప్రాణప్రదంగా చూసుకున్నారు. ఆస్ట్రేలియాలోని ఆదివాసీలు చెట్లను నరకరు, అవి చనిపోయిన తర్వాతే వాటిని ఉపయోగిస్తారు. నాగరికులమని తలచే మనం చెట్లను నరుకుతున్నాం. కనుక ఎవరు ఆటవికులో తెలుసుకోవాలి. చెట్ల కొమ్మలు మేఘాలను చూసి మనిషి కోసం వర్షాన్ని యాచిస్తాయి. అలాంటి చెట్లను మనం నరికేస్తుంటాం. చెట్లు శిశుప్రాయంలో ఉయ్యాలలవుతున్నాయి. నడిచే ప్రాయంలో వాహనాలవుతున్నాయి.

విశ్రమించేటప్పుడు మంచాలవుతున్నాయి. వృద్ధాప్యమొచ్చినప్పుడు చేతికర్రలవుతున్నాయి. ఇలా చేదోడువాదోడుగా ఉన్న చెట్లను స్వార్థానికి నరకడం ఎంత వరకు సబబో ఆలోచించాలి. దేవుణ్ణి వరమివ్వు అని అడక్కుండానే ఆయనిచ్చే వరమే చెట్లు. అలాంటి వరాన్ని నాశనం చేసే మనిషి నాగరికుడా? చెట్లను నరికే మనిషి నిజానికి వాటిని హత్య చేయడం లేదు. ఆత్మహత్య చేసుకుంటున్నాడని అర్థం. ఎందుకంటే చెట్లు నశిస్తే మనిషి మనుగడా క్రమేపీ క్షీణిస్తుంది.

- అంబడిపూడి శర్వాణి
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement