joy
-
అంత్యక్రియల నిర్వాహకుడు
ఇల్లు మార్చిన అంత్యక్రియల నిర్వాహకుడు ఏడ్రియన్ పాత ఇంట్లో ఇంకా మిగిలిన శవపేటికలు తీసుకెళ్లి తన బండికెక్కించాడు. బండికి కట్టిన బక్కగుర్రాలు బస్బనయా వీధి నుండి ఏడ్రియన్ కొత్త ఇల్లుండే నికిట్స్కయా వీధికి కాళ్ళీడ్చుకుంటూ బయలుదేరాయి.ఏడ్రియన్ కొట్టుకు తాళం వేసి ‘ఇల్లు అద్దెకైనా ఖరీదుకైనా ఇవ్వబడుతుంది’ అని రాసిన ఒక బోర్డును తలుపుపై మేకులతో బిగించి కొత్తింటికి నడుచుకుంటూ వెళ్లాడు. ఆ ఇల్లు కొనాలని అతనికి చాలా ఉంది. చివరకు ఈనాటికా కోరిక తీరింది. అందుకతను చెల్లించిన మొత్తం చిన్నదేం కాదు. కాని ఏడ్రియన్ తన కొత్త ఇంటి పసుపు పచ్చని గోడలను సమీపించే సరికి తనకు కొంచెం కూడా సంతోషం కలగనందుకు ఆశ్చర్యమయింది. తనకింకా కొత్తగా ఉన్న గడపదాటి ఇంట్లోకి వెళ్లాడు. సామానింకా సర్దలేదు. ఇల్లంతా గందరగోళంగా ఉంది. 18 ఏండ్లుగా పూచిక పుల్లతో కూడా, ఎక్కడ ఉండవలసిన సామాను అక్కడ ఉంటూ ఉండిన తన పాత మట్టికొంప జ్ఞాపకం వచ్చి దీర్ఘంగా నిట్టూర్చాడు. ‘‘ఏమింత నిదానంగా పనిచేస్తున్నారు’’ అని పనిమనిషిని కూతుళ్ళనిద్దరినీ కసరుకొని సామాను సర్దడంలో వారికి తోడ్పడ్డాడు.ఇల్లు చక్కపెట్టడం త్వరగా పూర్తి అయింది. దేవుని మందసం, పింగాణీ సామానూ, బీరువా, బల్ల, పడకకుర్చీ, మంచాలు, ఇవన్నీ వెనకగదిలో ఏ మూల ఏది ఎలా ఉండాలో అలా సర్దాడు.ఇక ఇంటియజమాని ముఖ్యమైన ఆస్తి–రంగురంగుల శవపేటికలు, అంత్యక్రియల సందర్భంలో ఉపయోగించే నల్లహాట్లు, అంగవస్త్రాలూ, దివిటీలు–ఇవన్నీ వంట ఇంట్లోనూ, ముందర గదిలోను పేర్చి పెట్టారు. దివిటీని తలక్రిందుగా పట్టుకొన్న ఒక మన్మథుని బొమ్మగల బోర్డును ఇంటిముందు గేటుకు తగిలించారు. ఆ బొమ్మకింద ‘శవపేటికలు, మామూలువి, రంగువేసినవి, ముసుగు వస్త్రాలతో సహా ఇక్కడ అద్దెకుగాని, ఖరీదుకుగానీ దొరుకుతాయి. పాత శవపేటికలు రిపేరు కూడాచేయబడతాయి’ అని రాసి ఉంది.పనంతా ముగిసిన తరువాత, ఏడ్రియన్ కూతుళ్ళిద్దరూ తమ గదిలోకి వెళ్లిపోయారు. ఏడ్రియన్ ఇంటినొకసారి తనిఖీ చేసివచ్చి కిటికీ వద్ద కుర్చీలో కూర్చొనిసిమోవార్ వేడి చేయమని పనిమనిషికి చెప్పాడు.కాటికాపరులు చీకూ చింతలేని కబుర్లరాయుళ్ళుగా షేక్స్పియర్, సర్వాల్టర్ స్కాట్ తమ రచనల్లో చిత్రించారు. వారి వృత్తికి, వారి ప్రవృత్తికి మధ్యగల వైపరీత్యంతో రసపోషణ చేసి పాఠకులను ఉర్రూతలూగించాలని వారలా చిత్రించారు. కాని, సత్యాన్ని పోషించదలచుకొన్న మేము, ఈ సందర్భంలో వీరిని అనుకరించలేక పోతున్నాము. మేము పేర్కొంటున్న అపరక్రియల నిర్వాహకుని స్వభావం అతని వృత్తికి అనుగుణంగానే ఉందని మేము అంగీకరించక తప్పదు. ఏడ్రియన్ ఎప్పుడూ ముఖం వేలాడేసుకొని విచారంగా ఉంటాడు. అతను మాట్లాడడమే అరుదు. తన కూతుళ్లు దోవన పొయ్యేవాళ్లను కిటికీ గుండా చూసుకుంటూ ఊరకే నిల్చొని ఉండడానికలవాటు పడితే వాళ్లను మందలించడానికో లేక తన కొట్టులోని వస్తువులు కావలసి వచ్చిన దురదృష్టవంతుల నుండి (సందర్భాన్ని బట్టి వాళ్లు అదృష్టవంతులైనా కావచ్చు) ఇంకా నాలుగు డబ్బులు గుంజడానికో తప్ప ఇతరత్రా అతను నోరు తెరిచేవాడే కాదు.ఏడ్రియన్ టీ తాగుతూ మామూలులాగే ఏదో చింత చేస్తూ కూర్చున్నాడు. ఆరవకప్పు అయిపోయింది. ఏడోది తాగుతున్నాడు. రిటైరైన బ్రిగేడియర్ శవాన్ని గడిచినవారం తీసుకొనిపోతుంటే, ఊరేగింపు సరిగ్గా టోల్గేట్ దగ్గరకు వచ్చినప్పుడు కుండపోతగా వర్షం ప్రారంభమయిన సంగతెందుకో అతనికి జ్ఞాపకానికి వచ్చింది.శవపేటిక వెంట వస్తున్న వాళ్లందరి అంగవస్త్రాలు తడిసి ముద్దయ్యాయి. చాలామంది హాట్ల అంచులు వంకరలు పోయినాయి. బ్రిగేడియర్ అంత్యక్రియలకు తాను సప్లై చేసిన హాట్లు, అంగవస్త్రాలు పాతసరుకయినందువల్ల వర్షంలో బాగా దెబ్బతిన్నాయి. వాటి రిపేరుకు చేతి నుంచి కొంతడబ్బు వదులుతుందని ఏడ్రియన్ అనుకున్నాడు. ఒక్క సంవత్సరం నుంచి కాటికి కాలు చాచుకొని ఉన్న ముసల్ది ట్రుఖినా చస్తే ఈ నష్టం పూడ్చుకోవచ్చు. అయితే ట్రుఖినా రజ్గుల్యా వద్ద మంచంలో పడిఉంది. ఆ ముసలిదాని వారసులు అంతదూరం నుంచి తన కోసం చెప్పి పంపారేమో అనే భయం ఏడ్రియన్‌కు పట్టుకొంది. బహుశా వాళ్లు దగ్గరున్న మరే కాంట్రాక్టరుతోనో ఒప్పందం చేసుకోవచ్చు. ఎవరో వీధి తలుపు మూడుసార్లు తట్టడంతో ఏడ్రియన్ ఆలోచనలు మధ్యలో ఆగిపోయాయి. ‘ఎవరది?’ అని అరిచాడు. తలుపు తెరచుకొని ఒక కొత్త మనిషి లోపల ప్రవేశించాడు. అతనొక జర్మన్ వృత్తికారుడని చూస్తూనే చెప్పవచ్చు. వచ్చీరాని రష్యన్ భాషలో ఇలా అన్నాడతను:‘‘క్షమించండి. మీ పనికి అంతరాయం కలిగిస్తున్నానేమో. మీ పరిచయం చేసుకోవాలని వచ్చాను. నేను జోళ్లు కుట్టేవాణ్ణి. నా పేరు గొట్టియబ్ స్కూల్‌ట్‌జ్. మీ కిటికీ నుంచి కనబడే ఆ ఎదురింట్లోనే నా కాపురం. నా పెళ్లై రేపటికి ఇరవైఅయిదు సంవత్సరాలు. మా వివాహరజతోత్సవం జరుపుకుంటున్నాం. మీరూ, మీ కుమార్తెలు రేపు మా ఇంటికి భోజనానికి రావాలి’’సరే తప్పక వస్తానని ఏడ్రియన్ అతణ్ణి కూర్చోబెట్టి కప్పు టీ పుచ్చుకొమ్మని బలవంతం చేశాడు. గొట్టియబ్ స్కూల్‌ట్‌జ్ కలుపుగోలుతనం వల్ల, ఇద్దరూ చిరకాల మిత్రుల్లా మాట్లాడుకోసాగారు.‘‘మీ వ్యాపారం ఎలా ఉంది?’’ అని ఏడ్రియన్ ప్రశ్నించాడు.‘‘ఎలా ఉందని చెప్పను! ఈరోజు గిరాకీ అయితే రేపు మందం. ఒకేరకంగా ఉండి చావదు. మొత్తంపైన ఫరవాలేదు లెండి. కాని మావి మీ సరుకుల్లాంటివి కాదుగా, బతికి ఉన్న వాళ్లు జోళ్లు లేకపోయినా జరుపుకొంటారు. చచ్చినవాళ్లు శవపేటికలు లేకుండా క్షణముండలేరు కదూ!’’ఇలా నడిచింది సంభాషణ. కొంతసేపటికి స్కూల్‌ట్‌జ్ లేచి సెలవు తీసుకొంటూ తాను వచ్చిన పని మరొకసారి ఏడ్రియన్‌కు జ్ఞాపకం చేసి వెళ్లిపోయాడు.మరుసటిరోజు మధ్యాహ్నానికి ఏడ్రియన్, అతని కూతుళ్లిద్దరూ, తాము కొత్తగా కొన్న ఇంటి గేటు దాటిస్కూల్ట్జ్ ఇంటికి బయలుదేరారు. ఏడ్రియన్ ప్రొకోరస్ ధరించిన రష్యాదేశపు దుస్తుల్ని కులినా, కార్యాలిద్దరూ యూరోపియన్ పద్ధతిలో ముస్తాబైన వైనం నేనిక్కడ వర్ణించడం లేదు, ఆధునిక నవలాకారుల్లా.అయితే ఆ యువతులిద్దరూ ఇలాంటి ప్రత్యేక సమయాల్లో ధరించే పసుపువన్నె హేట్లని, ఎర్రని స్లిప్పర్లను పేర్కొనడం అసందర్భం కాదంటాను.గొట్టియబ్ స్కూల్‌ట్‌జ్ ఇంట్లోని చిన్నగదిఅతిథులతో నిండిపోయింది. వారిలో ఎక్కువమంది జర్మన్ కారువులు, వారి భార్యలూ, వారి వద్ద వృత్తి నేర్చుకునే యువకులూ, విందుకు వచ్చినవారిలో ఒక్క రష్యన్ ఉద్యోగి కూడా ఉన్నాడు. అతను పోలిస్ కానిస్టేబుల్ అయినప్పటికీ ఇంటియజమాని అతడిని ప్రత్యేకంగా ఆదరించాడు. యుర్కోపెగోరెన్స్కీ చిత్రించిన పోస్టుమాస్టరులాగా ఇరవై అయిదు ఏళ్లుగా భయభక్తులతో ఉద్యోగం చేస్తున్నాడు. ఆ పురాతన రాజధాని నగరం 1812లో అగ్నికి ఆహుతి అయినప్పుడు అతని పసుపుపచ్చని కాపలాబడ్డీ బూడిద అయిపోయింది. కాని శత్రుసైన్యాలను దేశం నుంచి తరిమివేసిన తరువాత, దాని స్థానే, తెల్లని డోలిక్ స్థంభాలతో బూడిదరంగు వేసిన కొత్త బడ్డీ తలెత్తింది. యుర్కో దాని ముందు మళ్లీ మునపటిలా సాయుధుడై పారా ప్రారంభించాడు. నికిట్స్ గేట్‌కు చుట్టుపట్ల కాపురముండే చాలామంది జర్మనులు అతనికి తెలుసు. వాళ్లలో కొందరు తప్పతాగి ఆదివారాల్లో రాత్రిపూట ఆ బడ్డీలోనే గడపవలసి వచ్చేది కూడా. అతనితో తనకు ఏనాడైనా పనిపడక తప్పదని గ్రహించిన ఏడ్రియన్, అక్కడికి వచ్చిన వెన్వెంటనే అతన్ని పరిచయం చేసుకున్నాడు.టేబుల్ ముందు అందరూ భోజనానికి కూర్చున్నప్పుడు, ఏడ్రియన్, యుర్కోలు ఎదురుబొదురుగా కూర్చున్నారు. స్కూల్‌ట్‌జ్ దంపతులు, వాళ్ల పదిహేనేళ్ల కూతురు లాట్చెన్, అతిథులతో కలసి భోజనం చేస్తూ మధ్యమధ్య అతిథులకు వడ్డిస్తున్నారు. బీర్ మంచినీళ్లలా ప్రవహిస్తోంది. యుర్కో నలుగురు తినేంత తిన్నాడు. ఏడ్రియన్ కూడా అతనికేమీ తీసిపోలేదు. అతిథులంతా జర్మన్ భాషలో మాట్లాడుకొంటున్నారు.రాను రాను మాటల సందడి హెచ్చింది.హఠాత్తుగా స్కూల్‌ట్‌జ్ ‘‘ఒక్కమాట! ఇలా వినండి!’’ అని బిగ్గరగా అంటూ తారు పూసిన ఒక సీసా బిరడా తీసి ‘‘యోగ్యురాలు, నా లూయిసా ఆయురారోగ్యానికి!’’ అని అన్నాడు.షాంపెన్ బుసబుసమని నురగలు కక్కుతోంది.స్కూల్‌ట్‌జ్ లేచి ఉన్న తన అర్థాంగి ముఖం ముద్దు పెట్టుకున్నాడు. అతిథులు యోగ్యురాలయిన లూయిసా ఆయురారోగ్యానికై గ్లాసులెత్తి ఖాళీ చేశారు.‘‘నా అతిథుల ఆరోగ్యానికి’’ అంటూ గృహస్తు ఇంకొక సీసా బిరడా తీశాడు. అతిథులు గ్లాసులు నింపి ఖాళీ చేశారు. ఈ ధోరణిలో సీసాలు సీసాలు ఎగిరిపొయ్యాయి. అక్కడ చేరిన ప్రతి ఒక్కరి ఆయురారోగ్యానికని, మాస్కో నగరానికని, జర్మనీలోని ఒక డజన్ మారుమూల పట్టణానికని, అన్నివృత్తులకని, తరువాత ఫలానాఫలానా వృత్తికని, వృత్తికారుల ఆరోగ్యానికని, వారి కింద శిక్షణ పొందే వారి ఆరోగ్యానికని తాగారు. ఏడ్రియన్ ఒక్క టోస్టు కూడా విడిచి పెట్టకుండా బహు శ్రద్ధగా తాగాడు. తుదకు ఉత్సాహం పట్టలేక తనూ ఒక విచిత్రమైన టోస్టు ప్రతిపాదించాడు. అనంతరం ఒక స్థూలకాయుడైన రొట్టెల వ్యాపారి లేచి తన గ్లాసునెత్తి ‘‘మనమెవరి కోసమని పనిచేస్తున్నామో వారి కోసం’’ అని అన్నాడు. ఈ టోస్టు అంతమంది సంతోషంగా తాగారు. తరువాత అతిథులు ఒకరికొకరు తలవంచి నమస్కరించుకోవడం ప్రారంభించారు. దర్జీ చర్మకారునికి నమస్కరించాడు. చర్మకారుడు దర్జీకి ప్రతి సమస్కారం చేశాడు. రొట్టెలతను ఇద్దరికీ నమస్కరించాడు. అతిథులంతా కలిసి రొట్టెలతనికి నమస్కరించారు. ఇలాసాగిపోయింది.ఈ నమస్కార కార్యక్రమ సందర్భంలో యుర్కో ఏడ్రియన్ వైపు తిరిగి ఇలా అన్నాడు:‘‘నీవు సాగనంపిన మృతుల ఆయురారోగ్యానికై తాగుదాం!’’ అందరూ విరగబడి నవ్వారు.ఏడ్రియన్ మాత్రం కోపంతో ముఖం చిట్లించాడు. కాని ఇదెవ్వరూ గమనించలేదు.గ్లాసులు నింపడం, ఖాళీ చేయడం నిరాటంకంగా సాగిపోయింది. అతిథులు టేబుల్ నుంచి లేచేటప్పటికి సాయంత్రం ప్రార్థనలకు చర్చి గంటలు మోగుతున్నాయి.అతిథులు వారివారి ఇళ్లకు వెళ్లిపోయారు. చాలామంది పూర్తి నిషాలో ఉన్నారు. రొట్టెలతన్ని, బుక్బైండరూ పోలీసు కానిన్టేబులును చేరి ఒక వైపు చంకల కింద చేయివేసి మెల్లగా అతని బడ్డీకి నడిపించుకొని పొయ్యారు., తమ బాకీ చెల్లించివేశామనుకొంటూ.ఏడ్రియన్ సగం మత్తులో, సగం కోపంతో ఇంటికి తిరిగి వచ్చాడు.‘‘నా వృత్తి ఇతర వృత్తులంత గౌరవమయింది కాక పోయిందా? నేను ఉరి తీసేవాడితో సమానమా? నన్ను చూసి నవ్వడానికి ఈ విదేశీయులకేమి కనబడింది! నా గృహప్రవేశసందర్భంలో వీళ్లందరినీ పిలిచి విందు చేయాలనుకున్నాను. ఛీ! ఛీ! ఈ వెధవల్నా పిలవడం? నేను ఎవరి కోసం పని చేస్తున్నానో ఆ ప్రేతాలనే ఆహ్వానిస్తున్నాను’’‘‘అయ్యో! ఇదేమిటి బాబూ’’ అని ఏడ్రియన్ బూట్లు విప్పుతూ అంది పనిమనిషి ఆశ్చర్యంతో.‘‘మీరు తెలిసే మాట్లాడుతున్నారా? చెంపలు వేసుకోండి! గృహప్రవేశానికి చచ్చినవాళ్లను పిలవటమా? ఇంతకంటే ఘోరముందా?’’‘‘దేవుని సాక్షిగా చెబుతున్నాను నేను. ఆ పని చేసి తీరుతాను’’ అని ఏడ్రియన్ అన్నాడు. ‘‘రేపే ఆ పని చేస్తాను. నా శ్రేయోభిలాషులారా! రేపు రాత్రి నాతో విందారగించి నన్ను ధన్యుణ్ణి చేయండి! ఈ బీదవానికుండే సర్వస్వంమీదే’’ ఈ మాటలని ఏడ్రియన్ మేను వాల్చడో లేదో కొన్ని నిమిషాల్లో గురకలు పెట్టనారంభించాడు.ఏడ్రియన్‌కు మెలకువ వచ్చేసరికి ఇంకా చీకటి విచ్చలేదు. ఆ వ్యాపారస్తుని భార్య, ట్రియుఖీనా రాత్రి మరణించింది. ఆమె నౌకరొకడు వచ్చి ఈ వార్త ఏడ్రియన్‌కు తెలియజేశాడు. ఏడ్రియన్ వోడ్కాకని పది కొపెక్కులు వాడి చేతిలో పెట్టి, తొందరగా బట్టలు వేసుకొని ఒక గుర్రపుబండి అద్దెకు తీసుకొని రజ్గుల్యాకు వెళ్లాడు. పోలీసువాళ్లను గేటు దగ్గర కాపలా ఉంచారు. పీనుగ కోసం కాచుకొన్న రాబందుల్లా ఇటూ అటూ పచార్లు చేస్తున్నారు వ్యాపారస్తులు. శవాన్ని బల్లపై పడుకోబెట్టారు. ముఖం నల్లబడిపోయింది. అయితే గుర్తుపట్టడానికి వీలులేనంత వికృతవికారం కాలేదు. బంధువులు, ఇరుగుపొరుగువారు, నౌకర్లు చుట్టూ చేరారు. కిటికీలన్ని తెరిచి ఉన్నాయి. గదిలో కొవ్వొత్తులు వెలుగుతున్నాయి. మతగురువులు విగతజీవుల ఆత్మశాంతికై చేసే ప్రార్థనలు పఠిస్తున్నారు.ఏడ్రియన్, చనిపోయిన ముసలిదాని మరిది కొడుకు పరధ్యానంతో సరే మంచిదన్నాడు. డబ్బు విషయంలో బేరమాడదలచుకోలేదనీ, ఎందులోనూ లోపం చేయడనే నమ్మకంతో అన్ని ఏర్పాట్లు అతనికే వదలి వేస్తున్నాననీ అన్నాడు.ఏడ్రియన్ తన అలవాటు ప్రకారం ఒక్క చిల్లిగవ్వ కూడా ఎక్కువ పుచ్చుకోనని ప్రమాణం చేసి ముసలిదాని మరణవార్త తెలియజేసి నౌకరు వైపు సాభిప్రాయంగా చూచి, అపరక్రియలకు అవసరమైన ఏర్పాట్లు చేయడానికి వెళ్లిపోయాడు.ఆ పగలంతా రజ్గుల్యా వనికట్స్కీ గేటు మధ్య గుర్రపుబండిలో ఎన్నిసార్లు తిరిగాడో లెక్కలేదు. సాయంత్రానికి పని పూర్తయింది. బండివాడికి అద్దె ఇచ్చి పంపించివేసి కాలినడకన ఇంటికి బయలుదేరాడు.అది వెన్నెలరాత్రి. ఏడ్రియన్ నికిట్స్కీ గేటు సురక్షితంగా చేరుకున్నారు. చర్చి దాటి వెడుతుండే సమయంలో పారా కాస్తున్న యుర్కో ‘ఎవరది’ అని కేక వేసి, వెంటనే ఏడ్రియన్‌ను గుర్తించి ‘మీరా? గుడ్‌నైట్’ అన్నాడు. అప్పటికి చాలా పొద్దుపోయింది. ఏడ్రియన్ ఇంటి దగ్గరకు వస్తున్నాడు. హఠాత్తుగా వీధిలో నుంచి ఎవరో, తన ఇంటి గేటు తీసుకొని లోపలికి వెళ్లినట్లు అతనికి తోచింది.ఎవరతను? ఈ అగాథవేళలో నాతో ఎవరికి పని ఉంటుంది? రాత్రిల్లు, ఎవరైనా కుర్రకుంకలు నా మతిమాలిన పిల్లల దగ్గరకు వచ్చిపోతున్నారా ఏమిటి కొంపదీసి? తన స్నేహితుడు యుర్కోను సహాయానికి రమ్మని పిలుద్దామా అని కూడా అనుకున్నాడు. ఆ క్షణంలో ఇంకొకరు గేటు తీసుకొని లోపలికి అడుగు పెట్టబోతూ, హడావిడిగా వస్తున్న ఏడ్రియన్‌ను చూచి హాటు పైకెత్తి నమస్కరించాడు. ఏడ్రియన్ తొందరలో అతని ముఖం పరీక్షగా చూడలేదు. అతన్ని తానెక్కడనో చూశానని అనుకొన్నాడు. ‘‘మీరు నా కోసం వచ్చారా? లోపలికి దయచేయండి’’ అని ఎగపోసుకుంటూ అన్నాడు.‘‘మర్యాదపట్టింపులెందుకు? మీరు మొదట వెళ్లండి. అతిథులకు దారి చూపించండి’’ ఏడ్రియన్ తానుండే హడావుడిలో మర్యాదలను గూర్చి ఆలోచించే స్థితిలో లేడు.గేటు గడియా తీసేవుంది. మెట్లెక్కి తలవాకిలి సమీపించాడు. అతిథి వెనుకనే వస్తున్నాడు, ఇంట్లో చాలామంది ఇటూ అటు తిరుగుతున్నట్లు ఏడ్రియన్‌కు అనిపించింది.‘‘ఏమిటిదంతా?’’ అని అనుకుంటూ తలుపు తీసుకొని లోపలకడుగు పెట్టాడు...కాళ్లు గడగడ వణికాయి. గది నిండా ప్రేతలు తిరుగుతున్నాయి. కిటికీ గుండా లోపల పడుతున్న వెన్నెల వెలుగులో ప్రేతల పాలిపోయిన ముఖాలు, దిగజారిన నోళ్లూ, కాంతిహీనమైన అరమోడ్పు కళ్లూ, ఎత్తయిన ముక్కులూ కనబడుతున్నాయి...గతంలో తాను ఎవరెవరిని పాతి పెట్టడానికి తోడ్పడ్డాడో వాళ్లందరిని ఏడ్రియన్ గుర్తించాడు. అతని గుండెలు గుభేలుమన్నాయి. తనతో ఇంట్లోకి వచ్చినతను కుండపోతగా వర్షం కురుస్తుంటే, పాతిపెట్టిన బ్రిగేడియర్ అని ఏడ్రియన్ గుర్తించాడు.ఏడ్రియన్ లోపలికి రాగానే, గదిలో చేరినవారంతా స్త్రీలూ, పురుషులూ–ఏడ్రియన్ చుట్టూ చేరి నమస్కారం చేసి పలుకరించారు. ఒక పేదవాడు మాత్రం నమ్రతతో గదిలో దూరంగా ఒక మూల నిల్చున్నాడు తన చిరిగిన దుస్తులు చూసుకొని సిగ్గుపడుతున్న వానిలా. కొద్దిరోజుల క్రితం ఏడ్రియన్ ఇతని శవాన్ని ఉచితంగా పాతి పెట్టవలసి వచ్చింది. ఇతనొకడు తప్ప ఇతరులంతా మంచి దుస్తులు వేసుకున్నారు. అధికారులు యూనిఫారాలు ధరించారు. కాని వారి గడ్డాలు మాశాయి. వర్తకులు ఖరీదైన దుస్తులు వేసుకున్నారు. అక్కడ చేరిన వాళ్లందరి తరపున బ్రిగేడియర్ ఇలా అన్నారు: ‘‘ప్రొఖరొన్గారూ, మీ ఆహ్వానం అంగీకరించి మేమంతా లేచి వచ్చాము. పూర్తిగా శిథిలమై, వట్టి అస్థిపంజరాలుగా మిగిలిపోయి, నిస్సహాయస్థితిలో ఉన్న వారు మాత్రేమే వెనుక నిల్చిపోయారు. కాని వారిలో ఒక్కతను మాత్రం మిమ్మల్ని చూసి రావాలనే ఆదుర్దా కొద్ది రాకుండా ఉండలేకపొయ్యాడు...’’ఇలా అంటూ ఉండగానే, ఒక చిన్న అస్థిపంజరం గుంపును ఇటూ అటూ తోసుకుంటూ ఏడ్రియన్‌ను సమీపించింది. చర్మ మాంసాలు లేని అతని ముఖం ఆప్యాయతతో పళ్లికిలించింది. పచ్చని, ఎర్రని పేలికలూ, పట్టుచొక్కా, వెదురుబొంగుకు తగిలించినట్లుగా, ఆ ఎముకలగూడుకు అతుక్కొని ఉన్నాయి. దానిముంగలి ఎముకలు, ఎల్తైన గుర్రపు రౌతు బూట్లతో పళపళమని శబ్దం చేస్తున్నాయి రోల్లో రోకలిబండలా.‘‘ప్రొఖోరొవ్! నన్ను గుర్తించలేదూ! గార్డు దళంలో రిటైర్డు సార్జంట్పై తొర్పెచ్కురిల్కిన్ని. జ్ఞాపకం లేదూ? నీ మొట్ట మొదటి శవపేటిక అమ్మింది నాకే.1799లో(అది ఓక్ కర్రతో చేసిందన్నావు కాని డీల్ కర్రతో చేసిందిలే)’’ ఇలా అంటూ ఆ అస్థిపంజరం ఏడ్రియన్‌ను కౌగిలించుకోవడానికి తన చేతిఎముకలెత్తింది. భయవిహ్వలుడైన ఏడ్రియన్, తన బలమంతా కూడదీసుకొని గట్టిగా అరుస్తూ అతన్ని వెనుక్కు తోశాడు. పైటొర్ పెట్రోవిచ్ తూలి, కీళ్లు వదిలి విడిపోయిన ఎముకలపోగైకిందపడ్డాడు.ప్రేతాలు ఆ...ఆ...అన్నాయి కోపోద్రేకంతో.పళ్లు కొరుకుతూ, తిడుతూ, నిన్నేం చేస్తానో చూడమని బెదిరిస్తూ, తమ సహచరుని గౌరవం నిలబెట్టడానికై, ఏడ్రియన్ పైకి లేచాయి.చెవులు తూట్లు పడుతున్న వాటి అరుపులకు, ధాటికీ గుండె చెదిరి ఏడ్రియన్‌కు తెలివి తప్పి సార్జెంట్ ఎముకల పై దభాలుమని పడిపోయాడు.ఏడ్రియన్ మంచం పైన సూర్యకిరణాలు .ఏడ్రియన్కళ్లు తెరచి చూచేటప్పటికి పనిమనిషి. సామొవార్లో నిప్పులు రాజుకోడానికి ఊదుతోంది. రాత్రి జరిగిన సంఘటనలు ఏడ్రియన్‌కు గుర్తుకొచ్చి గుండె జలదరించింది.ట్రియుకినా, బ్రిగేడియర్ సార్జెంట్కురిల్కిన్ అతని హృదయాంతరాళంలో తారాడుతున్నారు. రాత్రి జరిగిన సంఘటన పరిణామం పనిమనిషినే చెప్పనిమ్మని ఏడ్రియన్ మౌనంగా ఉన్నాడు.‘‘ఎంతసేపు నిద్రపోయారు బాబూ!’’ అనిఅక్సిన్యా ఏడ్రియన్‌కు ఉదయం చొక్కా అందిస్తూ అన్నది.‘‘పక్కింటి దర్జీ మిమ్మల్ని చూడటానికి వచ్చారు. కాని మీరు గాఢనిద్రలో ఉన్నందువల్ల మేము మిమ్మల్ని లేపలేదు’’‘‘చనిపోయినట్టి ట్రియుకినాఇంటి నుంచి ఎవరైనా నా కోసం వచ్చారా?’’‘‘ట్రియుకినా? ఎందుకు? ఆమె పోయిందా?’’‘‘ఒట్టి మతిలేని మనిషివి నీవు. ఆమె అపరక్రియలకు అన్నీ సిద్ధం చేయడానికి నిన్న నీవే నాకు ?’’‘‘అయ్యో, బాబూ! మీకేమైనా మతిపోయిందా ఏమిటి? లేక నిన్న పగలంతా కూర్చొని తాగిన మత్తు వదల్లేదా? నిన్న ఎవరి అంత్యక్రియలూ జరగలేదు. నిన్న మీరు ఆ జర్మన్ వాళ్లింట్లో జరిగిన విందుకువెళ్లిపూర్తి నిషాతో వచ్చారు. వచ్చీ రావడంతో మంచం పైన పడి తెలివి లేకుండా నిద్రపోయారు. చర్చిగంటలు మోగడం ఇప్పుడే ఆగిపోయింది’’‘‘అట్లనా?’’ అన్నాడు ఏడ్రియన్ గుండె తేలికై.‘‘మరేమిటి?’’ అంది పనిమనిషి.‘‘అయితే వెళ్లి టీ కాచి, పిల్లల్ని పిలు’’ రష్యన్ మూలం : పుష్కిన్ తెలుగు: బి.రామచంద్రారావు -
ఎందుకలా ఉన్నావ్?
బాధ, సంతోషం కలసిందే జీవితం. ఎప్పటిమాట! ఎప్పటి మాటైనా ఎప్పటికీ తెలుసుకోవలసిన మాట. కలవడానికి ఏవైనా రెండు ఉండాలి. అందుకేమో జీవితంలో సుఖఃదుఖాలు కలిసి ఉంటాయి. కలవకుండా రెండూ వేర్వేరుగా ఉంటే? వేర్వేరుగా ఉండడం అంటే జీవితంలో ఏదో ఒకటే ఉండడం. బాధగానీ, సంతోషం గానీ! అలా ఉండదు కానీ, ఉంటే కనుక రెండిటికీ విలువ ఉండదు. అప్పుడిక జీవితం కూడా విలువను కోల్పోతుంది. ఏదో బతికేస్తున్నట్లుగా ఉంటుంది. ఎప్పుడూ సంతోషం విసుగనిపిస్తుంది. ఎప్పుడూ బాధ విరక్తి కలిగిస్తుంది. కాబట్టి రెండూ కలిసే ఉండాలి. మానవజన్మ చేసుకున్న అదృష్టం ఏంటంటే బాధలో, సంతోషంలో లోకం మన ముఖంలోకి ముఖం పెట్టి చూస్తూ ఉంటుంది! సంతోషంగా ఉంటే దూరం నుంచి చూసి సంతోషిస్తుంది. బాధలో ఉంటే దగ్గరకొచ్చి ‘ఎందుకలా ఉన్నావ్?’ అని అడుగుతుంది. ‘ఏం లేదు’ అంటే వదిలి పెట్టదు. ఏముందో చెప్పేవరకు వదిలి వెళ్లదు. కొన్నిసార్లు అనిపిస్తుంది. ఎందుకు బాధగా ఉన్నామో చెప్పుకోవడం కన్నా, మనసులోని బాధను అదిమిపట్టుకుని నవ్వు ముఖం పెట్టడం తేలికని! వాస్తవానికి మనం చెయ్యవలసింది కూడా అదే. బాధను ఉంచుకోవాలి. సంతోషాన్ని పంచుకోవాలి. -
హోలీ.. రంగేళి
–నగరంలో ఘనంగా వేడుకలు కర్నూలు(హాస్పిటల్): హోళీరే రంగేళీ హోళీ అంటూ చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు రంగుల హోళీ ఆడుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కర్నూలు నగరంలోని ప్రధాన వీధుల్లో రంగులు చల్లుకున్నారు. రాజవిహార్, పెద్దమార్కెట్, నెహ్రూరోడ్, ఎన్ఆర్ పేట, కొత్తపేట, ప్రకాష్‌నగర్, బుధవారపేట, చాణిక్యపురికాలనీ, శంకరమఠం, ఎన్సీసీ అధికారుల క్వార్టర్స్, మాధవీనగర్, టెలికాంనగర్, నంద్యాల చెక్‌పోస్ట్, బృందావన్‌నగర్, బళ్లారిచౌరస్తా, అశోక్‌నగర్, వెంకటరమణకాలనీ తదితర ప్రాంతాల్లో జనం రంగుల్లో మునిగిపోయారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందంగా గడిపారు. ప్రధానంగా ఆదివారం పండుగ రావడంతో పండుగ వాతావరణం మరింత రంగుల మయంగా మారింది. హోళీ అనంతరం సాయంత్రం కామదహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయంలోనూ ఎంపీ బుట్టా రేణుక, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డితో పాటు పార్టీ కార్యకర్తలు రంగులు పూసుకుని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. -
క్రీడలతో మానసిక ఉల్లాసం
* వ్యవసాయ విశ్వవిద్యాలయం డీన్ డాక్టర్ టి.రమేష్‌బాబు * అంతర్ కళాశాలల క్రీడాపోటీలు ప్రారంభం బాపట్ల: క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యాన్ని పెంచుతాయని వ్యవసాయ విశ్వవిద్యాలయం డీన్ డాక్టర్ టి.రమేష్‌బాబు చెప్పారు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో శనివారం అంతర్ కళాశాలల క్రీడాపోటీలను వైభవంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల్లో పట్టుదలను పెంపొందిస్తాయని తెలిపారు. క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. క్రీడల వల్ల మంచి శారీరక దారుఢ్యంతోపాటు ఉద్యోగ అవకాశాలు కూడా మెండుగా ఉంటాయని చెప్పారు. విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ టి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ వ్యవసాయ విద్యార్థులు, వ్యవసాయంతోపాటు క్రీడల్లోనూ నైపుణ్యాన్ని పెంపుందించుకుంటున్నారని చెప్పారు. క్రీడల్లోనూ నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం అభినందనీయమన్నారు. పోటీల్లో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వ్యవసాయ, వ్యవసాయ ఇంజినీరింగ్, ఫుడ్, హోమ్‌సైన్స్ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. బాపట్ల వ్యవసాయ కళాశాల విద్యార్థిని మంజీర క్లాసిక్ డ్యాన్సులో, సఫీయా మోగాసనాలు వేసి అబ్బురపరిచారు. తొలుత విశ్వవిద్యాలయం డీన్ డాక్టర్ టి.రమేష్‌బాబు, రిజిస్ట్రార్ టి.వి.సత్యనారాయణ తదితరులు పావురాళ్లను ఎగురవేసి క్రీడలను ప్రారంభించారు. కార్యక్రమంలో కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ పిఆర్‌కె.ప్రసాద్, డీన్ ఆఫ్ స్టూడెంట్స్ అఫైర్స్ డాక్టర్ సాంబశివరావు, ఫిజికల్ డైరెక్టర్ పురుషోత్తమరావు, వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాల డీన్ డాక్టర్ మణి తదితరులు పాల్గొన్నారు. హోరాహోరీగా ఫుట్‌బాల్ పోటీలు.. తొలి రోజు ఫుట్‌బాల్ పోటీలు హోరాహోరీగా సాగాయి. ఈ పోటీలో తొలుత బాపట్ల వ్యవసాయ కళాశాల, రాజమండ్రి కళాశాల జట్ల మధ్య పోటీ జరిగింది. ఈ పోటీలో 7–0 పాయింట్ల తేడాతో బాపట్ల కళాశాల జట్టు గెలుపొందింది. అదే విధంగా తిరుపతి, బాపట్ల కళాశాలల జట్లకు పోటీ జరగ్గా ఒక పాయింట్ తేడాతో తిరుపతి కళాశాల జట్టు విజయం సాధించింది. వీటితోపాటు నైరా కళాశాలకు మహానంది జట్ల మధ్య పోటీ జరగ్గా మహానంది జట్టు గెలుపొందింది. మడకశిర, బాపట్ల కళాశాలల మధ్య జరిగిన పోటీల్లో బాపట్ల కళాశాల విద్యార్థులు గెలుపొందారు. -
ఆబ్కారీ ఉద్యోగులకు క్రీడాపోటీలు
గుంటూరు స్పోర్ట్స్: ఆబ్కారీ శాఖ జిల్లా స్థాయి క్రీడాపోటీలు ముగిశాయి. రెండవ రోజు శనివారం స్థానిక బృందావన్ గార్డెన్స్‌లోని ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియంలో షటిల్ బ్యాడ్మింటన్, క్యారమ్స్, చెస్, టెబుల్ టెన్నిస్ క్రీడాంశాలలో పోటీలు జరిగాయి. 60 మంది ఆబ్కారీ ఉద్యోగులు క్రీడాపోటీలలో పాల్గొన్నారు. పోటీలను ఆబ్కారీ శాఖ డీసీ పి.శ్రీమన్నారాయణ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా స్థాయి పోటీలలో ప్రతిభకనబర్చిన క్రీడాకారులను విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి ఆబ్కారీ క్రీడాపోటీలకు పంపుతామన్నారు. కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరిడెంటెండెంట్ వి.రేణుక, అస్టింట్ కమిషనర్ డి.శ్రీకాంత్ రెడ్డి, సిబ్బంది, క్రీడాకారులు పాల్గొన్నారు. -
ఉల్లాసంగా..ఉత్సాహంగా
బుక్కరాయసముద్రం : మండల పరి«ధిలోని రోటరీపురంలో ఉన్న ఎస్ఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో సీఎస్ఈ డిపార్ట్మెంట్ ఆ ధ్వర్యంలో ఉత్సాహంగా ఫ్రె షర్స్‌డే శనివారం నిర్వహిం చా రు. కళాశాల ప్రిన్సిపల్ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఈఓ జగన్మోహన్రెడ్డి హాజ రయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కళాశాలలో విద్యార్థులు సీనియర్, జూని యర్ అనే భేదాలు లేకుండా స్నేహపూర్వకంగా మెలగాలన్నారు. విషయ పరిజ్ఞానాన్ని ఒకరినొకరు పంచుకొని నివృత్తి చేసుకోవాలన్నారు. అదే విధంగా విద్యార్థుల చదువుతోపాటు మానసిక ఉల్లాసం కూడా అవసరమన్నారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వాణి, డాక్టర్ జమీల్ బాషా, డాక్టర్ రవిచంద్ర, డాక్టర్ శ్రీనివాస్, విద్యార్థులు పాల్గొన్నారు. -
గ్రేటర్ బీజేపీలో ఆనందోత్సాహం
సాక్షి, సిటీబ్యూరో/అఫ్జల్‌గంజ్: మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో బీజేపీ విజయ కేతనం ఎగురవేయడంతో నగరంలో ఆ పార్టీ కార్యకర్తల్లో ఆనందం వెల్లివిరిసింది. ఆదివారం ఉదయం ఫలితాల సరళి తెలియడంతోనే పార్టీ శ్రేణులు బాణసంచా కాల్చి..స్వీట్లు పంచుకున్నారు. రంగులు జల్లుకున్నారు. మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రేమ్‌చంద్ రాథోడ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఆదివారం ఉదయం బీజేపీ నగర కార్యాలయానికి చేరుకున్నాయి. స్వీట్లు పంచుకున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేసి ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం ఖాయమని ఆ పార్టీ శాసన సభపక్ష నాయకుడు, ముషీరాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ తాజా గెలుపుతో గ్రేటర్ హైదరాబాద్‌లో కూడా రాజకీయ పునరేకీకరణకు ప్రధాన పక్షంగా బలం సాధించుకొనేందుకు వీలవుతుందని బీజేపీ గ్రేటర్ అధ్యక్షుడు బి.వెంకటరెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ విజయోత్సవాల్లో బీజేపీ నగర జనరల్ సెక్రటరీ ఉమామహేంద్ర, సెక్రటరీ రమేష్ యాదవ్, ఉపాధ్యక్షుడు ఎక్కాల నందు, మీడియా ఇన్చార్జి సి.మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక పార్టీ గన్‌ఫౌండ్రి డివిజన్ అధ్యక్షులు పీసీ సుకుమార్ ఆధ్వర్యంలో వందలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్దఎత్తున బాణాసంచా కాల్చి, ప్రజలకు మిఠాయిలు పంచిపెట్టి సంతోషం వ్యక్తం చేశారు. ర్యాలీలో డివిజన్ బీజేపీ యువమోర్చా అధ్యక్షులు గౌరీశంకర్, ప్రధాన కార్యదర్శి నితిన్ జైస్వాల్ తదితరులు పాల్గొన్నారు. -
పండగవేళ.. పల్లె కళ..
నేటి ఆధునిక ఫ్యాషన్లు చిన్నాపెద్దను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. అయితే, పరుగులు పెట్టే మోడ్రన్ ఏజ్‌లోనూ ఒక్కసారి ఆగి,ప్రకృతి సింగారాలను ఒళ్లంతా నింపుకొంటే... పల్లె సిరులను నట్టింటికి తెచ్చుకొంటే... ఆ అందం, ఆనందం ఇబ్బడి ముబ్బడి అవుతాయి. విఘ్నాధిపతి వినాయకుని మట్టితో మూర్తిగా మలిచి, అందంగా అలంకరించి శ్రద్ధగా పూజలు జరుపుతాం.అలాగే పడతుల అలంకరణలోనూ ప్రకృతి సిరులకు స్థానం ఇస్తే పండగ పూట కళగా వెలిగిపోతారు. చేనేత..కళనేత.. మంగళగిరి ప్రింటెడ్ కాటన్ మెటీరియల్‌తో పరికిణీని తీర్చిదిద్ది, ప్లెయిన్ షిఫాన్ ఓణీకి రాసిల్క్ బార్డర్ జత చేసి, డిజైనర్ బ్లౌజ్‌లు ధరిస్తే పల్లెకళతో వెలిగిపోతారు. వీటి మీదకు టైటా ఆభరణాలు, పొడవాటి కురులను అల్లిన జడలు ప్రత్యేక ఆకర్షణను తీసుకువస్తాయి. పోచంపల్లి, గద్వాల్, కలంకారీ, ఇక్కత్.. ఇలా మన చేనేత ఫ్యాబ్రిక్స్‌తో తయారుచేసుకున్న దుస్తులు ఎప్పటికీ కొత్తదనంతో ఆకట్టుకుంటూనే ఉంటాయి. - భార్గవి కూనమ్, ఫ్యాషన్ డిజైనర్ ప్రాచీన కళ.. టైటా... ఏ లోహపు ఆభరణాలకూ తీసిపోని విధంగా ప్రత్యేకతను చాటుతున్న ఈ ఆభరణాలను ఆధునిక యువతులు అమితంగా ఇష్టపడుతున్నారు. నదీ తీరంలో కొట్టుకువచ్చిన ఒండ్రుమట్టిని సేకరించి, పొడిచేసి, ఉడికించి, తగిన అచ్చులలో పోసి ఈ ఆభరణాలను తయారుచేస్తాను. వీటిని వెలిసిపోని రంగుల తో తీర్చిదిద్దుతాను. సంప్రదాయ, ఆధునిక దుస్తుల మీదకు అందంగా నప్పే ఈ ఆభరణాలలో యాంటిక్ గోల్డ్ జుంకాలు, హారాలు ప్రాచీనకళతో ఉట్టిపడుతుంటాయి. వీటి ధరలు రూ.350 నుంచి 5వేల రూపాయల వరకు ఉన్నాయి. ధరించే దుస్తుల రంగులను బట్టి ఆభరణాలను తయారు చేయవచ్చు. - అరుణా దీపక్, టైటా ఆభరణాల నిపుణురాలు యాంటిక్ లుక్‌తో కనువిందుచేసే ఈ ఆభరణాలు కంచి, ధర్మవరం, ఉప్పాడ.. పట్టు చీరలకు సరైన ఎంపిక. - నిర్వహణ: నిర్మలారెడ్డి -
సేవాగణితుడు
లెక్కలు అంటే ఎప్పుడూ చిక్కులు, చిక్కుముడులు విప్పడమే కాదు... ఆ సంఖ్యల వెనకున్న సత్యాలను తెలుసుకుంటే కోట్ల విలువ చేసే ధన సంపద, విజ్ఞాన సంపదను సాధించవచ్చు అని నిరూపించారొకరు. ఆయనే కనబడే, వినబడే ప్రతి అంశంలోనూ గణితాన్ని చూడగల మానవతావాది జేమ్స్ హెచ్.సిమన్స్. ఆయన కనిపెట్టిన జీవితపు ఈక్వేషన్స్ ఏంటో చూద్దాం. 12.5 బిలియన్ డాలర్ల ఆస్తి. కేవలం... సిమన్స్ గణితాన్ని నమ్మితే వచ్చినది కాదు. గణితం సిమన్స్‌ని నమ్మింది కాబట్టి చేకూరినది. 76 ఏళ్ల సిమన్స్ పుట్టి పెరిగింది బోస్టన్‌లో. పద్నాలుగేళ్ల వయస్సులో ఉన్నప్పుడు క్రిస్మస్ సెలవుల్లో స్టోర్ కీపర్‌గా చేరిన సిమన్స్, తన మతిమరుపు కారణంగా నెల తిరక్కుండానే ఆ ఉద్యోగం నుండి ఫ్లోర్ కీపర్‌గా డిమోట్ అయ్యారు. సెలవులు పూర్తయిన తర్వాత ఆ ఉద్యోగం వదిలేసిన సిమన్స్... గణితంపై పట్టు సాధించాలనే కోరికతో ఎమ్ఐటీలో చేరారు. కాలం, అంతరిక్షాలపై గురుత్వాకర్షణ చూపించే ప్రభావం మీద ఆయన పరిశోధన చేశారు. ఐన్‌స్టైన్ చేపట్టిన అతి క్లిష్టమైన సబ్జెక్ట్ అది. కొన్నాళ్లు ఎన్.ఎస్.ఎ.లో కోడ్ బ్రేకర్‌గా దేశానికి సేవ అందించిన తరువాత తిరిగి ఎమ్.ఐ.టి.లో చేరారు... కాకపోతే ఈసారి ప్రొఫెసర్‌గా. అక్కడ రెండేళ్లు పని చేశాక స్టోనీ బ్రాక్ యూనివర్సిటీలో మ్యాథ్స్ డిపార్ట్మెంట్ హెడ్‌గా పనిచేశారు. ఇవి ఎంతో కొంత తృప్తిని ఇచ్చినా, ఆయనకు ఏదో వెలితిగా ఉండేది. గణిత పరిజ్ఞానంతో ఏదైనా కొత్తగా చెయ్యాలనే తపనతో ఆయన రిమెనిసెన్స్ టెక్నాలజీస్ అనే సంస్థని ప్రారంభించారు. ఇది ఒక ఫండ్ మ్యానేజ్మెంట్ కంపెనీ. స్టోనీ బ్రాక్ యూనివర్సిటీలో ఒక చిన్న జాగాలో మొదలైంది ఈ కంపెనీ. వేరే కంపెనీల తాలూకు ఫండ్స్‌ని మ్యానేజ్ చేయడం ఆ కంపెనీ పని. ఏ రంగంలో ఇన్వెస్ట్ చేస్తే లాభం వస్తుంది అనే విషయం మీద సలహాలు ఇచ్చి, వారికి వచ్చే లాభం నుండి 5 శాతం ఫీజ్గా తీసుకుంటారు. ఇందులో ఆయన కొత్తగా చేసింది, మార్కెట్ సిద్ధాంతాలకు గణితాన్ని ఆపాదించడమే. స్టాక్‌మార్కెట్ స్థితిగతుల్ని ఒక మ్యాథ్స్ ఈక్వేషన్‌గా మార్చేవారు. ఇందుకోసం ఎందరో గణిత శాస్త్రజ్ఞులను నియమించి వారికి ఉపాధి కూడా కల్పించారు. ఇది అనుకున్నంత సులువుకాదు. ఎందుకంటే మార్కెట్ అనేది రోజు రోజుకీ కొత్త పుంతలు తొక్కుతూనే ఉంటుంది. అందుకు తగ్గట్టు గణితాన్ని కొత్త పుంతలు తొక్కించాలి. మ్యాథ్స్ అందం ఏంటంటే... సమస్యని ఫార్ములేట్ చేయడం కష్టమే కానీ ఒకసారి ఫార్ములా రూపొందించాక సమాధనాలు రాబట్టడం ఎంతో సులువు. అందుకే ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలు వారి సలహాల కోసం ఎగబడతారు. వారి లాభాల నుండి 5 శాతం ఫీజు తీసుకున్న రిమెనిసెన్స్ టెక్నాలజీస్ సంపదే 12 బిలియన్ ఉంటే... వారి సలహాలు తీసుకున్న కంపెనీలు ఇంకెంత లాభపడుంటాయో ఊహించవచ్చు. ఇది కేవలం ఒక అంశం మీద పట్టు ఉన్నవాళ్లకు సాధ్యమయ్యేది కాదు. పట్టుతో పాటు మ్యాథ్స్ అంటే పిచ్చి ఉన్నవారికే సాధ్యం. సిమన్స్ ఈ కోవ కిందికి వస్తారు. ఆయన జీవితాన్ని గణిత సమస్యలా చూస్తారు. కష్టసుఖాలను ప్లస్సు, మైనస్సుల్లా చూసే ఆయన జీవితంలో ఎన్ని మలుపులు! మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చారు. కొన్ని రాజకీయాల వల్ల ఎం.ఐ.టి.లో ఎంతో మంచి హోదాని వదులుకుని బయటకు వచ్చేయాల్సి వచ్చింది. అందివచ్చిన ఇద్దరు కొడుకులూ కళ్లముందే ప్రాణాలు వదిలారు. ఇలాంటివి ఆయన జీవితంలో ఎన్నో ఎదురయ్యాయి. కానీ సమస్యలన్నీ జీవితపు లెక్కలో ‘స్టెప్స్’ అనుకున్నారే తప్ప బాధపడి నీరుగారలేదు. అలా అని సిమన్స్ భావోద్వేగాలు లేని బండరాయి, మనుషులంటే లెక్క చేయని మొద్దుమనిషి కాదు. లేదంటే తన ఆస్తిని తిరిగి అమెరికా ప్రజలకోసం వాడేవారు కాదు కదా! తనకు ఇంత అనుభవాన్ని, ఐశ్వరాన్ని ఇచ్చిన గణితానికి తిరిగి ఏదైనా చెయ్యాలనే ఆలోచనతో ఎమ్ఎఫ్ఏ (మ్యాథ్స్ ఫర్ అమెరికా) అనే సేవాసంస్థని స్థాపించారు సిమన్స్. అందులో భాగంగా ప్రతి అమెరికన్ విద్యార్థికీ గణితం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో కోటి డాలర్లకు పైగా వెచ్చించి అధ్యాపకులకు గణితంలో శిక్షణ ఇస్తున్నారు. ప్రతి అమెరికన్ విద్యార్థికీ ‘సరైన’ విద్య అందాలని తలపెట్టిన కార్యక్రమం ఇది. అంతేకాదు తన ఆస్తిలో ఎంతో భాగం, సైన్స్, మ్యాథ్స్ మెడిసిన్ తదితర విభాగాలలో లోతైన పరిశోధనల పైనే ఖర్చవుతుంది. ఈ విధంగా ఆయన వైజ్ఞానిక సేవ చేయడమేకాక ఆటిజమ్ని రూపు మాపేందుకు కూడా వైద్య విభాగంలో పరిశోధనలు జరిపిస్తున్నారు. గణితం, సేవ... ఈ రెండూ ఆయనకు రెండు కళ్ళ లాంటివి. ‘‘నేను అంత చురుకైన వాడిని కాదు. మ్యాథ్ ఒలంపియాడ్లను సులువుగా చేధించలేను. కాని నాకు చూడడం ఇష్టం, శోధించడం ఇష్టం, తెలుసుకోవడం ఇష్టం. అదే నన్ను నడిపిస్తోంది’’ అని సంబరంతో చెబుతారు. ఒక ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తున్నప్పుడు... ఈజ్ ఈక్వల్ టు సింబల్‌కి అటు, ఇటుగా సంఖ్యలు మారుతున్నప్పుడు... ఆయన కళ్ళు ఉత్సుకతతో చూస్తాయి, తరువాత ఏమవుతుందా... అని! LHR = RHSఅని నిరూపించే వరకు విరామం లేదు ఆయనకు! - జాయ్ -
మృత్యువును జయించిన టైటానియమ్ తారక
లోహసుందరి వేమౌత్ (ఇంగ్లండ్) రోడ్ల మీద వయసుకి తగ్గ వేగంతో దూసుకుపోతోంది 17 ఏళ్ల కత్రినా బర్గెస్. మనసులో తన మోడలింగ్ కలలు నెరవేరబోతున్నాయన్న ఊహలు వేగంగా పరుగులు తీస్తుంటే వాటికి పోటీగా కారుని ఉరకలెత్తిస్తోంది కత్రినా. పార్టీకి టైమ్ అవుతోంది. యాక్సిలరేటర్‌ని గట్టిగా దబాయించింది. క్షణం గడవగానే ఏదో చెట్టు నడుచుకుంటూ తన కార్ వైపు వస్తున్నట్లు అనిపిచింది. ‘ఏమౌతుంది..’ అనే ఆలోచన కళ్లలోకి ప్రవేశిస్తుండగానే ఆ కారు వెళ్లి ఆ చెట్టుని గుద్దింది. కారు చిధ్రం అయిపోయింది. ఎవరో వచ్చి తనని స్ట్రెచర్ మీద తీసుకెళుతున్నట్టు లీలగా తెలుస్తోంది కత్రినాకు. శ్వాస పీలుస్తోంది కానీ వాసన తెలియడం లేదు. నాలుక రుచులు మర్చిపోయినట్టుగా ఉంది. మెల్లగా కళ్లు తెరిచి చూసింది కత్రినా. ‘ఏమైంది నాకు’ అని అడగటానికి ప్రయత్నం చేసినా మాట రావట్లేదు. తన నుండి ఏవో తీస్తున్నారు, వేస్తున్నారు డాక్టర్లు. ‘ఏమీ కాదు’ అన్నట్టు నవ్వింది అక్కడ ఉన్న ఒక డాక్టరు. మెల్లగా కారు, చెట్టు, యాక్సిడెంట్ గుర్తుకొచ్చాయి. నుదురు చిట్లించింది. తను ఎలా ఉందో చూసుకోవాలి. లేచేందుకు ఓపిక కూడా లేదు. తల కూడా లేపలేకపోయింది. కాస్త కష్టపడి తల తిప్పగా, తన బెడ్ పక్కన ఉన్న బెడ్ ప్యాన్‌లో తన ప్రతిరూపం కనిపించింది. మనిషిలా లేదు. మనిషి శరీరానికి ఉండాల్సిన నిర్మాణం చెల్లాచెదురైంది. ఎముకలు కూలి కొత్త ఆకారంలో ఉన్న తనని తాను చూసుకుని ఆరిచే ప్రయత్నం చేసింది. ఆ యాక్సిడెంట్లో తన వెన్నెముక పూర్తిగా విరిగిపోయింది. రెండు ఊపిరితిత్తులు చిల్లులు పడ్డాయి. మెడ ఎముక, తుంటి ఎముకతో పాటు ఎడమకాలు ఎముక కూడా విరిగిపోయింది. తన ప్రాణాలైనా పణంగా పెట్టడానికి సిద్ధమైంది కత్రినా. తన శరీరంలో విరిగిపోయిన ఎముకల్ని టైటానియమ్ రాడ్లతో రీప్లేస్ చేయడానికి సిద్ధపడ్డారు డాక్టర్లు. తన నడుము గుండా తన ఎడమ కాలిలో విరిగిన తొడ ఎముక స్థానంలో రాడ్‌ని అమర్చారు. తరువాత వారం, ఆరు టైటానియమ్ పిన్‌లను కలిిపి తన విరిగిన వెన్నెముక స్థానంలో పెట్టారు. మెడ స్థానంలో ఆ టైటానియమ్ పిన్ల గుండా ఒక టైటానియమ్ స్క్రూని పెట్టారు. 5 నెలల తరువాత తను లేచి నిలబడగలిగింది. ‘‘లేచి చిలుచున్నప్పుడు నాకే ఆశ్చర్యంగా అనిపించింది. మెడలో స్క్రూ ఉండడం విచిత్రంగా అనిపించింది’’ అని తన మనసులో భావనని డాక్టర్లకు చెప్పింది కత్రినా. యాక్సిడెంట్ అయిన తరువాత అమీబాలా రూపం పొగొట్టుకున్న కత్రినా ని తిరిగి అందంగా మార్చారు డాక్టర్లు. యాక్సిడెంట్ అయిన 5 నెలల తరువాత డాక్టర్ల చలవతో తిరిగి తన కెరీర్‌ను ఆరంభించడానికి సిద్ధపడింది కత్రినా. పదకొండు టైటానియం రాడ్లను ఒంట్లో దాచుకుని బయటకు నడిచింది తను తన కలల వైపు. - జాయ్ -
మీ హాస్యాభిలాషి
సందర్భం: నేడు డా. రాజేంద్రప్రసాద్ బర్త్‌డే దిగాలుగా రోడ్డు మీద నడుస్తున్న నాకు చార్లీచాప్లిన్ పోతూ పోతూ చేతిలో ఒక కాగితం పాడేసి పోయాడు! ‘జనాజవాజరజసుజడు’ అని రాసుంది దాని మీద 18 జూలై అని తేదీతో. ఆ కోడుని డీకోడించి, జోడించి అసలందులో ఏం జొప్పించాడో తెలుసుకోవాలని నాలో కుతూహలం మరిగిపోవడంతో దేశం మీద పడ్డా. బాదులు, వాడలు, గోడలు, మేడలు తిరిగి తిరిగి వైజాగుకి చేరా. పిచ్చాళ్ళ జాతికి సంబంధించిదై ఉంటుందేమో అని. ఫలితం లేక అరిగిన చెప్పులేసుకుని బీచంటా కాళ్ళీడిస్తూ తిరుగుతూ ఉంటే, చంకలో చెప్పులు పెట్టుకుని పిల్లి నడకలతో పరిగెడుతున్నాడొక ఆసామి. గబుక్కున వెళ్లి లటుక్కున ఆయన జబ్బ పట్టుకుని ‘‘ఆ చెప్పులు, అక్కడ పెట్టుకుని నడుస్తున్నారేం?’’ అని అంటే... ‘‘అరిగిపోతాయని చెప్పి’’... తిరిగి తన పిల్ల నడకలు సాగించాడాయన. ఆ అరవీర భయంకర పిసినారితనానికి జడుసుకుని... ‘‘సార్’’ అని నాచేతిలోని చిట్టీని అందించి ఈ అడ్డ దిడ్డ పదానికి గూడార్థం చెప్పండి అంటే’’ ఆ ఒక్కటి అడక్కు’’ అని అల్టిమేటం జారీ చేశాడాయన. ‘‘యే..?’’ అని గీతాంజలిలో నాగార్జునలా అడిగితే ‘‘ఆఫ్టర్ వన్ ఇయర్ ఐ విల్ బీ ద కింగ్ అప్పుడొచ్చి కలువు’’ అని పుసుక్కున మాయమయ్యారు ఆ చిట్టీ చేతిలో పెట్టుకుని. సరే అని తిరిగి సిటీకి చేరుకోగానే ఒక అందమైన ఆంటీ మీద కళ్ళు పడ్డాయి. ఎవరా అని చూడగా ‘‘ఏం మిస్టర్. ఏం చూస్తున్నావు’’ అని ఆవిడ అనగానే కళ్ళకు పట్టిన మబ్బు కరిగిపోయింది. ఆవిడ ‘ఆవిడ’ కాదని, ఆ ‘మేడమ్’ ఎవరో కాదు నా చిట్టీతో మాయమైన ‘మాయలోడ’ని అర్థమైంది. సార్, అని మళ్లీ వెంటపడ్డా. హచ్ యాడ్‌లా నేను ఆయన వెనకాల నడుస్తుంటే, ‘‘నేను ‘ఉ’ అనగానే స్విచ్ వెయ్. మాటలు బ్యాక్‌గ్రౌండ్‌లో ఎక్కడో వినపడ్డాయి. ఈయన కాసేపాగి ‘ఉ’ అన్నాడు. కుయ్‌మని అరిచి, ఎవరో నేల మీద పడ్డ శబ్దం వచ్చింది బ్యాక్‌గ్రౌండ్‌లో. ‘‘ఓయమ్మో ఏంటి ఈయన కాష్మోరాలా ఉన్నాడు’’ అని భయంతో నేనరిస్తే, వెంటనే ఆయన వైపు తిరిగి’’ యాక్చువల్లీ ఐ యామ్ అచ్ఛా బచ్ఛా. బట్టల సత్యం లుచ్ఛా’’ అని అన్నాడు. ఎవరా బట్టల సత్యం అని వెనక్కు తిరిగి చూసేసరిగి ఈయన మళ్లీ తుర్రుమన్నాడు. ఇలా కాదని ఈసారి మాటేసి ఆయన్ని పట్టుకుంటే ‘‘ఎక్స్పెక్ట్ చేశా’’ అని వెకిలి నవ్వు నవ్వి, ఏంటో చెప్పమన్నట్టు చూశాడు. నేను ఆవేశంతో రొప్పుతూ ‘‘అసలేమనుకుంటున్నారు నా గురించి?’’ అని గదమాయించాను. ‘‘బక్క చిక్కిన బొప్పాసి బోదలా ఉన్నా’’వన్నాడు. ఆయన సత్యశీలతకి షాక్ అయ్యి, ఆయనవైపు బిత్తర చూపులు చూస్తుంటే ‘‘ఏమనుకోకు. నేను సత్యవచనా వ్రతం చేస్తున్నా’’ అని అసలు నిజం చెప్పారు. అంతలోనే ముప్ఫై ఆరేళ్లు ఉన్న ఓ స్త్రీని చూసి ఆయన కళ్ళు మెరిశాయి. చూడంగానే జమజచ్చ అన్నారు. అంటే ఏంటి అన్నాను.’’ అది జా భాష! నేను అన్నదాన్నుండి ‘జ’ తీసేయ్’’ అన్నారు. ‘మచ్చ’ అన్న నేను ‘‘ఆ!’’ అని ప్రోత్సాహకంగా నవ్వి, తిరిగి నా చేతిలో చీటీ పెట్టాడు. అందులో నుండి ‘జా’లు తీసేస్తే... ‘నా వారసుడు’. డీకొడేశాను బాబోయ్ అని యురేకా రేంజ్లో అరిచా. అంతలోనే ఆ కోడ్ తాలూకు అర్థం తలకు తట్టింది. చాప్లిన్ వారసుడా ఈయన అనుకున్నాను. నిజమే... నడక నడత మాట మడతా అన్నీ కలగలిపి హాస్యంతో పోత పోసినట్టున్నాడు. వెళ్లి థ్యాంక్యూ సార్. నా కానుక అని కాస్త రుసుము ఆయన చేతిలో పెట్టగా... ‘‘రూపాయి రూపాయి. నువ్వేం చేస్తావంటూ’’ మొదలు పెట్టి రూపాయి అసలు రూపాన్ని బయటపెట్టారు. తత్వవేత్తలా మారిన హాస్య వేత్తగా కనిపించారాయన. అందుకే వెంటనే డబ్బుని లాక్కుని ఒక నవ్వుని గురు దక్షిణగా పాడేసి తిరిగి వచ్చా. నవ్వుల తోటలో చుక్కలు తెంపుకుందామని. - జాయ్ -
సున్నదరీమణులు
సున్నా! ఆర్యభట్ట మెదడులో పుట్టి, అలియాభట్ ఒంటి మీద వాలింది. ఆరు నూరవ్వలేదు కానీ, సున్నా అయింది. ఎంతలా అంటే ‘సున్న’టి నడుము ఉంటేనే సన్నని నడుము అన్నట్టు అయ్యింది పరిస్థితి. ఇంతకీ అన్నం తినకుండా అందం పెంచుకోవడం అనే దాంట్లో ఎంత నిజముంది? ఈ బాడీ లెంగ్త్ ఫ్యాషన్ వెనక ఉన్న ట్రూత్ ఎంత? మిత్ ఎంత? తెలుసుకోవాలంటే... ‘టు ఆల్ ద గర్ల్స్... థింక్ యూ ఆర్ ఫ్యాట్ బికాజ్ యు ఆర్ నాట్ ఎ జీరో సైజ్, యూ ఆర్ ద బ్యూటిఫుల్ వన్, ఇట్స్ ది సొసైటీ హూజ్ అగ్లీ’... జీరో సైజ్ గురించి మార్లిన్ మన్రో అన్న మాటలివి. ‘అందం అంటే సన్నబడడం ఒక్కటే కాదు’ అని ఆవిడ ఉద్దేశం. జీరోసైజ్ ఫ్యాషన్ మన దేశానికి 2007లో వచ్చినా ఇది మొదలైంది మాత్రం 1960లోనే. లెస్లీ లాసన్, బ్రిజెట్ బార్డాట్. వీరిద్దరే మొట్టమొదట సైజ్ జీరో మోడల్స్. నాజూకైన ఒళ్ళు, గాజు లాంటి కళ్ళతో ఉన్న లెస్లీ లాసన్ని చూసి ముగ్ధులవ్వని వాళ్ళు లేరు అప్పట్లో. తర్వాత మోడల్స్ అందరూ ఈమె స్ఫూర్తితోనే తమని తాము సన్నపెట్టుకోవడం మొదలుపెట్టారు. చాలా డిజైనర్ కంపెనీలు, డిజైనర్లు కూడా జీరో సైజ్ సుందరాంగులు వేసుకుంటేనే, తమ దుస్తుల డిజైన్ అందం తెలుస్తుందని ఈ ఫ్యాషన్‌ని విపరీతంగా ప్రోత్సహించారు. ఒకానొక కాలంలో జీరో సైజ్ ‘తప్పనిసరి’ అని నిబంధనలు విధించిన రోజులు కూడా ఉన్నాయి. వివిధ రకాల ఆరోగ్యసమస్యల గురించి డాక్టర్లు ఎంత హెచ్చరించినా ‘జీరో’ క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఈ క్రేజ్ మూలంగానే ‘లూయిసెల్ రామోర్’ అనే మోడల్ తన ప్రాణం పోగొట్టుకుంది. జీరో సైజ్ వల్ల వచ్చే ‘అనొరెక్సియా నెర్వోసా’ అనే డిజార్డర్‌తో ఆమె మరణించింది. ఈ దెబ్బతో ఈ ‘జీరో’ సైజ్ యూరప్ నుండి కనుమరుగవడం ప్రారంభించింది. కానీ అదే సమయంలో దాన్ని ఇండియాకి తీసుకొచ్చింది కరీనా! ‘తషన్’ చిత్రంలో 51 కేజీలు తూగిన కరీనా సన్నదనం చూసి స్టన్నయింది బాలీవుడ్. దీంతో మిగిలిన నటీమణులు కూడా క్యాలరీలు కట్చేసుకోవడం మొదలు పెట్టారు. ఇలా కరీనా తర్వాత దీపికా పదుకొనె, బిపాసా, అనుష్క శర్మ, వీళ్ళంతా జీరో బాట పట్టినవారే. కానీ ఆ నాజూకుతనం భారతీయ మగ కంటికి అంత ఇంపుగా అనిపించక పోవడంతో జీరో సైజ్‌ని ఎంచుకునేవారి సంఖ్య జీరోకి చేరుకుంటోంది. ఎనరెక్సియా నెర్వోసా ఇది అత్యధిక మోడళ్ళలో కనపడే డిజార్డర్. తిండి తినడం వల్ల బరువు పెరుగుతుందనే ఫోబియా వల్ల వచ్చే రోగం ఇది. ఇది ఒక సాంఘిక అంటువ్యాధి.. నాకన్నా ఆ అమ్మాయి సన్నగా ఉందనే ఆత్మన్యూనతా భావంతో ఈ డిజార్డర్ బారిన పడుతుంటారు. ఇలా కొలతల గురించి కలత చెంది ప్రాణాల మీదకు తెచ్చుకున్న మోడళ్ళు ఎందరో. ఫిజిక్స్ జీరో సైజ్ అంటే 30-20-30 అని అనుకుంటారందరూ. యూఎస్ సైజ్ రేంజ్ ప్రకారం 30-22-32 నుండి 33-25-35 మధ్య ఉండే మోడల్స్‌ని జీరో సైజ్‌గా పరిగణిస్తారు. ఇందులోనూ ‘0’, ‘00’ అని రెండు రకాలున్నాయి. రెండింటికి అర ఇంచు తేడా ఉంటుంది. ‘జీరో’ సైజ్ అనేది అందరి శరీర ఆకృతులకు సరిపోయేది కాదు. హైట్ టు వెయిట్ ఫ్యాక్టర్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఫ్యాషన్‌ని అనుసరించాలి. అందుకే మరీ పొడుగు, పొట్టిగా ఉండే మోడల్‌లు ‘జీరో’ సైజ్‌కి ప్రయత్నించి విఫలమౌతున్నారు. ఎకనామిక్స్ బరువు తగ్గించుకోవడానికి వేలం వెర్రిగా మోడళ్ళు పరిగెత్తినా, వారి వెనక నుండి పరిగెత్తించి డబ్బులు చేసుకునేది మాత్రం డిజైనర్లే. అప్పట్లో, కేవలం సైజ్ జీరో మోడళ్ళను మాత్రమే ఎంచుకుని వారికోసం క్యాట్‌వాక్‌లు నిర్వహించేవి ఎన్నో ఫ్యాషన్ కంపెనీలు. హ్యాలీబెరీ, నటాలీ పోర్ట్మన్ లాంటి ఎందరో జీరో సైజ్ నటీమణులకు ఉన్న క్రేజ్‌ని చూసి వారికి తగ్గట్లుగానే దుస్తులు డిజైన్ చేయడం కూడా ఒక కారణం. దీనివల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చినా... డబ్బు కూడా బాగా వస్తుందని ఎంత కష్టమైనా ఇష్టంగానే ఒళ్ళు కరిగించుకున్న మోడళ్ళు ఎందరో ఉన్నారు. బయాలజీ ఈ శరీరాకృతి సాధించడానికి చాలా పద్ధ్దతులున్నాయి. కానీ, ఆరోగ్యవంతమైనా పద్ధతులు చాలా తక్కువ. మగవాళ్ళు సిక్స్ ప్యాక్‌కి కష్టపడ్డట్టు, అమ్మాయిలు కూడా ‘జీరో’సైజ్‌కి అంతే కష్టపడాలి. ప్రత్యేకమైన డైట్లు, రోజువారీ ఎక్సర్సైజ్లు చేయాలి. ఇలా చేస్తే జీరో సైజ్ సాధించడానికి నెలల సమయం పడుతుంది. కానీ పోటీ తత్వం పెరగడంతో మోడళ్ళు షార్ట్‌కట్ రూట్లు వెతకడం వల్ల చాలా అనర్థాలే వచ్చాయి. కొందరు ఆహారం పూర్తిగా మానేసి కాఫీలు, సిగరెట్లను ఆశ్రయిస్తున్నారు. ఇంకొందరు స్టెరాయిడ్స్ తీసుకుంటూ... జీరో సైజ్ యావలో లైఫ్‌ని జీరో చేసుకుంటున్నారు. - జాయ్ -
క్షమించుకుందాం రా!
నేడు ప్రపంచ క్షమా దినం సరిగ్గా 2014 యేళ్ల క్రితం... రాతి కట్టడాల నడుమ రోమ్ నగరంలోని దారుల మీద అక్కడక్కడా రక్తపు చారల ఆనవాళ్లు. తమకు అతి దగ్గరగా ఉన్న ‘వ్యక్తి’ని అరాచకంగా చంపేశారని కొందరు ఏడుస్తున్నారు. ‘‘తప్పు చేశామా?’’... ఇనుప కవచాల వెనుక ఉన్న కరకు గుండెల్లో అపరాధభావం మొలకెత్తసాగింది. మూడు రోజులుగా నగరంలో ఈ పెనుగులాట జరుగుతుండగా... ఊహకందని విధంగా చావుని చీల్చుకుని వారి మధ్యకు వచ్చాడు ఆ వ్యక్తి ‘క్షమించడానికి’! ఆ ఒక్క క్షమాపణ... ఆ వ్యక్తిని దేవుణ్ని చేసింది. ఆ ఒక్క క్షమాపణ... ఒక కొత్త శకానికి నాంది పలికింది. మనం చేసిన పనిని తనదని చెప్పి క్రెడిట్ కొట్టేసే పై ఆఫీసర్ ఇంకా పెకైదుగుతాడు. అర్ధ రూపాయికే ఆకాశాన్ని నేలకు దింపి, అక్కడ నీకు ఇల్లిప్పిస్తానని ఎన్నికలప్పుడు వాగ్దానం చేసిన నాయకుడు... తీరా ఎన్నికలయ్యాక వెండికంచంలో బంగారాన్ని భోంచేస్తూ మొండి చేయి చూపిస్తాడు. నిన్నే పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి, నువ్విచ్చిన కాస్ట్లీ గిఫ్టును చక్కగా తీసుకుని, మర్నాడు సెంటీమీటరు మందమున్న పెళ్లికార్డును చేతిలో పెట్టి... ‘మా ఇంట్లో నాకు తెలీకుండా పెళ్లి కుదిర్చేశారు, చేసుకోకపోతే చచ్చిపోతామంటున్నారు, అందుకే చేసుకోక తప్పడం లేదు’ అని చెప్పేసి చేతులు దులుపుకుంటారు. వీరందరి మీద పగ.. కోపం.. ఉద్రేకం. దాచుకోవడమెందు? పగ తీర్చేసుకోండి. మనసు అనే గన్ తీసుకుని, క్షమాపణ అనే బుల్లెట్‌ని వారి గుండెల్లోకి దింపండి. బిక్కచచ్చిపోతారు దెబ్బకి. మీరు చూపించే దయకి, ఒక్కసారిగా వణుకు పుడుతుంది వారికి. ‘వాడిని క్షమించు. అంతకు మించిన శిక్ష ప్రపంచంలో మరేదీ లేదు’ అంటాడు ఆస్కార్ వైల్డ్. నిజమే. క్షణికావేశంలో నీ కోపం బయటపడితే, క్షమాపణ నీ క్యారెక్టర్ని బయటకు తెస్తుంది. క్షమాపణ ఓ మందులాంటిది. అది అవతలివాడిలోని అపరాధభావంతో కలిసి ఒక కెమికల్ రియాక్షన్ జరిగినట్టు వాడిలోని క్రూరత్వాన్ని నశింపజేసి, మంచితనాన్ని బయటకు తెస్తుంది. ఉదాహరణల కోసం వెతక్కండి. మీరే ఉదాహరణగా నిలవండి. మిమ్మల్ని తిట్టినా, కొట్టినా, అష్టకష్టాలు పెట్టినా క్షమించి చూడండి. కృష్ణుణ్ని కర్ణుడు క్షమించినట్టు, బిడ్డని తండ్రి క్షమించినట్టు, ప్రకృతి మనుషుల్ని క్షమించినట్టు, మీకు చేయిచ్చిన వారందరినీ చెయ్యెత్తి క్షమించండి... చెంపదెబ్బ కన్నా గట్టిగా తగులుతుంది. మిమ్మల్ని వద్దనుకున్నవారిని కూడా మీకు మరింత దగ్గర చేస్తుంది! - జాయ్ -
అడగక ఇచ్చిన వరం
దైవికం దేవుడిని వరంఇమ్మని అడక్కుండానే ఆయన ఇచ్చిన వరమే చెట్లు. అలాంటి చెట్లను మనం నరికేస్తున్నాం! ‘‘ఆవులకు మేత లేదు. వెళ్లి గడ్డి కోసుకురా’’ అని భక్త కబీరు తన కొడుకును ఊరి చివరున్న పొలాలకు పంపించాడు. కానీ ఎంతసేపైనా కొడుకు రాలేదు. సాయంత్రం అవుతోంది. అయినా రాలేదు. సహనం కోల్పోయిన కబీరు కొడుకు ఎక్కడున్నాడో చూద్దామని బయలుదేరాడు. తనయుడు నిగనిగలాడుతున్న పచ్చికబయలుపై తదేకంగా నిల్చుని కనిపించాడు! పిల్లగాలులు వీస్తున్నాయి. పచ్చిగడ్డి గాలిని ఆస్వాదిస్తూ అటూ ఇటూ రమ్యంగా ఊగుతున్నాయి. ఆ సన్నివేశాన్ని చూసిన కబీరు కుమారుడు పచ్చిక ఆనందంతో మమేకమైపోయాడు. ఆనందంలో మునిగితేలుతున్నాడు. తన తండ్రి వచ్చిన విషయాన్ని కూడా అతను గమనించలేదు. దాంతో క బీరుకు కోపం వచ్చింది. ‘‘నీకేమైనా పిచ్చా? నేనేం చెప్పాను? నువ్వేం చేస్తున్నావు?’’ అని గట్టిగా కోప్పడ్డాడు. ‘‘నేనిక్కడికి వచ్చేసరికి ఈ పచ్చగడ్డి... గాలి స్పర్శకు పరవశించిపోయి ఆనందంతో నృత్యం చేస్తుండటం చూస్తూ నన్ను నేను మరచిపోయాను. నా మనసెంతో ఆనందంగా ఉంది. ఈ ఆనందంలో నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో మరచిపోయాను. ఇప్పుడు చెప్పండి నాన్నగారూ, నన్ను ఇక్కడికి ఎందుకు పంపారు?’’ అని నిదానంగా అడిగాడు కుమారుడు. దాంతో కబీరు కోపం రెట్టింపైంది. ‘‘నిన్ను ఇక్కడికి గడ్డి కోసుకు రమ్మని పంపాను’’ అన్నాడు. ‘‘మన్నించండి నాన్నగారూ... నేను ఎంతో సంతోషంగా నృత్యం చేస్తున్నట్లున్న ఈ పచ్చగడ్డిని నేను నా చేతులతో నరకలేను. మీరు నన్ను ఎంత తిట్టినా ఈ విషయంలో మాత్రం నేను ఏమీ చెయ్యలేను. నేనిప్పటి వరకు ఓ ఆనంద జగత్తులో ఉన్నాను. అది కాస్తా మీ రాకతో చెదరిపోయింది. ఆ ప్రపంచాన్ని మాటల్లో వర్ణించలేను. ఆ సౌందర్య సన్నివేశం ఎవరికి వారు చూసి తరించాల్సిందే. ఒకరు చెప్తే పొందేది కాదు’’ అన్నాడు కబీరు పుత్రుడు. కబీరు అతని మాటలు విని నిశ్చేష్టుడయ్యాడు. అప్పుడే ఆ క్షణంలోనే తన కుమారుడికి కమాల్ అని పేరు పెట్టాడు. అందరూ అతనిని ఆ క్ష ణం నుంచి కమాల్ అని పిలవడం మొదలుపెట్టారు. తన కొడుకు పచ్చికతో ఓ గాఢమైన బంధాన్ని ఊహించుకుని చెప్పడం కబీర్‌కు ఆనందమేసింది. తన సుపుత్రుడిలో ఒక గొప్ప వ్యక్తిని చూశాడు. నిజమాలోచిస్తే మనిషికీ, పచ్చగడ్డికీ అనుబంధముంది. పరిణామక్రమంలో తొలుత పచ్చికై, పురుగై, చెట్టై, పక్షై, జంతువై ఆ తర్వాత రకరకాల వాటి తర్వాత మనం పుట్టాం. ఈ పరిణామక్రమాన్ని మనం మరిస్తే మరచిపోవచ్చు కానీ చెట్లనూ, మనుషులనూ ఒకే దేవుడు సృష్టించాడన్న విషయాన్ని మరచిపోకూడదు. కనుక చెట్లకూ, మనుషులకూ మధ్య విడదీయరాని బంధముంది. దేవుడు మనకన్నా ముందు చెట్లను పుట్టించాడు. ఆ తర్వాత మనిషి పుట్టాడు. అంటే చెట్లు మనకన్నా పూర్వం నుంచే ఉన్నాయి. కానీ మనుషులు ఈ సంగతి మరచిపోతున్నారు. కమాల్‌కు పచ్చగడ్డితో అనుబంధం యాదృచ్ఛికంగా వచ్చిన గొప్ప జ్ఞాపకం. అది అద్భుత విషయం. చెట్లతో మనకున్న బంధాన్ని తెలుసుకోవడం జ్ఞానానికి సంకేతం. కనుక చెట్లను నరికే వ్యక్తి తన బంధాన్ని తానే తెంచుకుంటున్నాడని అర్థం. ఆదివాసీలను మనం చిన్న చూపు చూశాం. కానీ వాళ్లే మనకన్నా జ్ఞానవంతులు. వాళ్లు చెట్లను ప్రాణప్రదంగా చూసుకున్నారు. ఆస్ట్రేలియాలోని ఆదివాసీలు చెట్లను నరకరు, అవి చనిపోయిన తర్వాతే వాటిని ఉపయోగిస్తారు. నాగరికులమని తలచే మనం చెట్లను నరుకుతున్నాం. కనుక ఎవరు ఆటవికులో తెలుసుకోవాలి. చెట్ల కొమ్మలు మేఘాలను చూసి మనిషి కోసం వర్షాన్ని యాచిస్తాయి. అలాంటి చెట్లను మనం నరికేస్తుంటాం. చెట్లు శిశుప్రాయంలో ఉయ్యాలలవుతున్నాయి. నడిచే ప్రాయంలో వాహనాలవుతున్నాయి. విశ్రమించేటప్పుడు మంచాలవుతున్నాయి. వృద్ధాప్యమొచ్చినప్పుడు చేతికర్రలవుతున్నాయి. ఇలా చేదోడువాదోడుగా ఉన్న చెట్లను స్వార్థానికి నరకడం ఎంత వరకు సబబో ఆలోచించాలి. దేవుణ్ణి వరమివ్వు అని అడక్కుండానే ఆయనిచ్చే వరమే చెట్లు. అలాంటి వరాన్ని నాశనం చేసే మనిషి నాగరికుడా? చెట్లను నరికే మనిషి నిజానికి వాటిని హత్య చేయడం లేదు. ఆత్మహత్య చేసుకుంటున్నాడని అర్థం. ఎందుకంటే చెట్లు నశిస్తే మనిషి మనుగడా క్రమేపీ క్షీణిస్తుంది. - అంబడిపూడి శర్వాణి -
సంతోషంగా ఉంటే పోయేదేమీ లేదు... బాధ తప్ప!
సంతోషమే సగం బలం అని పెద్దలు అన్నారుగానీ... నిజానికి సంపూర్ణ బలం. ‘నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ’ అన్నారు హీరోగారు. నవ్వు రావాలంటే సంతోషంగా ఉండాలి కదా! అందుకే ఎప్పుడూ సంతోషంగా ఉండండి. కొత్త బలాన్ని సొంతం చేసుకోండి. సంతోషంగా ఉండడం వల్ల ప్రయోజనాలు ఇవి... నిరాశా నిస్పృహల్లో ఉన్నప్పుడు చిన్న సమస్య అయినా సరే పెద్ద అనకొండగా మారి భయపెడుతుంది. సంతోషంగా ఉంటే పెద్ద సమస్య సైతం తేలికగా పరిష్కారమైపోతుంది. సంతోషంగా ఉన్నప్పుడు నవ్వగలుగుతాం. ఆ నవ్వు మన మెదడును ఉత్తేజితం చేస్తుంది. ఫలితంగా సమస్య పరిష్కారానికి కొత్త రకంగా ఆలోచించగలుగుతాం. సంతోషంగా ఉంటే శారీరక వ్యాయామాల పట్ల శ్రద్ధ పెరుగుతుంది. ఆటల మీద ఆసక్తి కలుగుతుంది. సంతోషంగా ఉండేవాళ్లలో ఆత్మవిశ్వాసం అధిక స్థాయిలో ఉంటుంది. ఏ పని అయినా చేయగలమనే ధీమా ఉంటుంది. సానుకూల దృక్పథం పెరుగుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. కోపం, ఒత్తిడి ఆరోగ్యానికి హాని చేస్తాయి. సంతోషం మేలు చేస్తుంది. (నేడు ప్రపంచ సంతోష దినోత్సవం) -
స్వేచ్ఛే సంతోషం
Howard Roark laughed. అయాన్ రాండ్ రాసిన ప్రసిద్ధ నవల ‘ది ఫౌంటేన్హెడ్’ తొలివాక్యం ఇది. ఈ వాక్యాన్ని చదివిన బిల్కి మతిపోయింది! అప్పుడతడు మిచిగాన్ విశ్వవిద్యాలయంలో అర్కిటెక్చర్ విద్యార్థి. రెండో పేజీ తిప్పలేదు, అసలు రెండో వాక్యంలోకే వెళ్లలేదు. అక్కడే, ‘హోవార్డ్ రోర్క్ లాఫ్డ్’ అనే దగ్గరే ఆగిపోయాడు. చాలా ఆశ్చర్యపోయాడు. ఆ వాక్యం అతడికి జీవితం మీద ప్రేమ కలిగించింది. జీవితం ఇంత అందమైనదా! ఇంత సంతోషకరమైనదా! ఇంత అద్భుతమైనదా.. అని అతడి హృదయం ఈ భూగోళంపై కృతజ్ఞతతో నిండిపోయింది. అయాన్ రాండ్ రాసిన ఇంకో పుస్తకం ‘అట్లాస్ షగ్డ్’్ర కూడా అతడి ఆలోచనా దృక్పథాన్ని విస్త్రృతం చేసింది. ముఖ్యంగా అందులో అయాన్ ప్రతిపాదించిన ‘ఆబ్జెక్టివిజం’! ఆబ్జెక్టివిజం మీద అధ్యయనం చేయడానికి న్యూయార్క్‌లో అయాన్‌ను వెతుక్కుంటూ వెళ్లాడు బిల్! కలుసుకున్నాడు. చాలా మాట్లాడాడు. అయాన్ శత జయంతి సందర్భంగా 2005లో బిల్ ఈ సంగతులన్నీ వెల్లడించారు. బిల్ వంటి ‘పడిచచ్చిపోయే’ (డై హార్డ్) అభిమానులు అయాన్‌కు ప్రపంచం అంతటా ఉన్నారు. అయాన్ 1982లో చనిపోయారు. జీవితంపై ఆమె కలిగించిన ప్రేమ మాత్రం నేటికీ సజీవంగా ఉంది ఆమె పుస్తకాల రూపంలో. బతకడానికి ఏం కావాలి? బతక నేర్చినతనం. కానీ ‘నిజంగా’ బతకడానికి ‘బతక నేర్వనితనం’ అవసరం అంటారు అయాన్ రాండ్. దానికి ఆమె పెట్టిన పేరు ‘ఆబ్జెక్టివిజం’. బయట కనిపించేది వేరు. లోపల మనకు వినిపించేది వేరు. మనసు చెప్పినట్లు చెయ్యడమా? మనిషిగా నిలబడడానికి మనం చెయ్యవలసింది చెయ్యడమా? ఏదైనా చెయ్యండి. మనసుకు మట్టి అంటకుండా ఎవరికి వాళ్లు సంతోషం కోసం తమకో జీవనసౌధాన్ని నిర్మించుకోవాలి. అందులో మనం, మనం నమ్ముకున్న విలువలు జీవించాలి. ఇదే ఆమె చెప్పిన ఆబ్జెక్టివిజం! అయాన్ నిర్మించుకున్న సౌధం.. సాహిత్య సృజన. ఇలాంటి నిర్మాణాలు 1900 నాటి నియంతృత్వపు రష్యాలో చెల్లుతాయా? ఊహు. అందుకే తన జన్మభూమిని వదిలి ఈ సెయింట్స్ పీటర్స్బర్గ్ అమ్మాయి అమెరికా వచ్చేసింది. విక్టర్ హ్యూగో అయాన్ అభిమాన రచయిత. ఈ ఫ్రెంచి నవలాకారుడు చనిపోయిన ఇరవై ఏళ్లకు పుట్టిన అయాన్.. జీవితాంతం ఆయన రచనల వల్ల ప్రభావితం అవుతూనే ఉన్నారు. ఎనిమిదేళ్ల వయసులో అమెను మంత్రముగ్ధురాలిని చేసిన మరో హీరో కూడా ఫ్రెంచి జాతీయుడే. అయితే పత్రిక సీరియల్లో అతడొక పాత్ర మాత్రమే. ఆ తర్వాత తొమ్మిదో యేట తనో పెద్ద రచయిత్రి అయిపోవాలని ఆయాన్ నిర్ణయించుకున్నారు. పెరిగి పెద్దవుతున్న కొద్దీ ఆమెకు రష్యా నచ్చడం లేదు. వ్యక్తి స్వేచ్ఛకు విరుద్ధమైన అక్కడి శుద్ధ సామాజిక సముదాయ ధోరణులు అస్సలు నచ్చడం లేదు. స్కూల్లో ఉండగనే తన దేశంలో జాతీయవాద కెరెస్కీ, అతివాద బోల్షెవిక్ విప్లవాలను చూశారు అయాన్. మొదటిదాన్ని సమర్థించారు. రెండో దాన్ని వ్యతిరేకించారు. రష్యాలో కమ్యూనిస్టులు అధికారాన్ని సంపూర్ణంగా హస్తగతం చేసుకునే నాటికి అయాన్ హైస్కూల్లో ఉంది. అమెరికా గురించి మొదటిసారిగా ఆమె తెలుసుకుంది తరగతి గదిలోనే. ‘అబ్బ! ఎంత స్వేచ్ఛ’ అనుకున్నారు. ఫిలాసఫీలో డిగ్రీ చేశాక, అమెరికా వెళ్లిపోయారు. చివరి వరకూ అక్కడే ఉండిపోయారు. ‘వియ్ ద లివింగ్’ అమె తొలి నవల. ‘ఫిలాసఫీ: హూ నీడ్స్ ఇట్’ చివరి రచన. హాలీవుడ్‌కు మంచిమంచి స్క్రిప్టులు కూడా రాశారు కానీ, రచయితగానే ఆమె నిలబడిపోయారు. ‘నీ సంతోషం కోసం నువ్వే పోరాడాలి’ అంటారు అయాన్ రాండ్. -
గురువుకు వందనం...
‘నువ్వు’ ‘నేను’ ఈ అక్షరాలను చదవగలుగుతున్నామంటే దానికి కారణం ఒక ఉపాధ్యాయుడు. ఆ మహానుభావుడికి ధన్యవాదాలు చెబుతూ... ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అంటారు. ఒక పరిపాలకుడు, ఒక శాస్త్రవేత్త, ఒక పాత్రికేయుడు, ఒక ఇంజినీర్, ఒక లాయర్, ఒక డాక్టర్, ఒక జవాన్, ఒక గాయకుడు, ఒక ఆటగాడు... వీరందరి వెనుక స్త్రీ ఉన్నా, లేకపోయినా ఆశయసాధన సాధ్యమే! కానీ ప్రతివారి విజయం వెనుక ఒక ఉపాధ్యాయుడు ఉండి తీరతాడు. ఉపాధ్యాయుడికి వయసు ఉండదు. ‘‘తల వంచి కైమోడ్చే శిష్యుడవు నీవైతే, నీ ఆర్తి కడతేర్చు ఆచార్యుడవు నీవే’’ అన్న సిరివెన్నెలగారి మాటలు అక్షరాలా సత్యములు. నీ గురించి నువ్వు ఆలోచించడం మొదలుపెట్టినప్పటి నుంచి నీ శిష్యుడవు నువ్వే. నువ్వే నీకు నిన్ను నేర్పించుకునే ఆచార్యుడవు. సర్వేపల్లి రాధాకృష్ణగారి జీవితం ఇందుకు ఉదాహరణ. ఆయన బి.ఏ. చదివే రోజుల్లో ఒక పుస్తకం రాశారు. ఆయన ఎం.ఏకి వచ్చేనాటికి ఆ పుస్తకం టెక్ట్స్ బుక్ అయ్యిందట! గురుశిష్యుల సంబంధానికి వయసు ఉండదు, వయసుతో సంబంధం ఉండదు. లియోనార్డో డావిన్సీకి, రైట్ బ్రదర్స్‌కి ఎగిరే పక్షి టీచర్... థామస్ ఆల్వా ఎడిసన్‌కి టంగ్స్టన్ వాడకముందు పగిలిపోయిన బల్బులే టీచర్. గజగజ వణికిన అర్జునుడికి చుట్టూ తన సోదరులు, శ్రేయోభిలాషులు ఉన్నా తన భారాన్ని మొత్తం భరించి గీత సారం బోధించి, అక్కడికక్కడే ప్రాక్టికల్స్ చేయించిన ప్రొఫెసర్ శ్రీకృష్ణుడు కాదా? ఉపాధ్యాయుడు మనిషి రూపంలోనే ఉండనవసరం లేదని ఏకలవ్యుడు నిరూపించాడు. కేవలం విగ్రహం నుండే స్ఫూర్తి పొంది విలుకాడు అయ్యాడు. రేపటి భారతానికి స్తంభాలు విద్యార్థులైతే... ఆ స్తంభాలను కట్టేది ఒక ఉపాధ్యాయుడు. రేపటి పౌరులని తీర్చిదిద్దే ఆర్కిటెక్ట్ ఆయన. ఒక పిల్లవాడికి దేవుడు... తల్లిదండ్రులని ప్రసాదిస్తే, సమాజం ఇచ్చే తల్లి తండ్రి మాత్రం ఉపాధ్యాయుడే. తనకున్న విజ్ఞానంతోపాటు విలువలని నేర్పిస్తాడు. పద్య గద్య, సాహిత్యాల్లోని అందాన్ని, ఒక శ్రీనాథుడిగానో, షేక్స్పియర్లానో మారిపోయి మన కళ్లకి కట్టినట్టు చూపిస్తున్నాడు. వెనువెంటనే సోక్రటీస్లాగ, స్వామివివేకానందలాగ మారి ఆ పాఠం యొక్క మూలాన్ని, దానిలోని సారాన్ని మన ఎదిగే మెదడులోకి ఎక్కిస్తాడు. ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు. అందుకేనేమో ఈ ఇరువురి సంబంధం ప్రత్యేకమైంది. నీలో టాలెంట్‌ని మొదటగా గుర్తించి ముందుకు వెళ్లే ధైర్యం ఇచ్చాడనేమో ఇంత అభిమానం. అందుకే ఒకరిని ఒకరు విడిచి వెళ్లాల్సిన సమయంలో ఆ కన్నీరు. మనుషులందరూ ఒకేలా ఉండరు. ఒక్కొక్కరిది ఒక్కో మనస్తత్వం. అలా ఒక విద్యార్థి మనస్తత్వానికి తగ్గట్టు ఉపాధ్యాయుడు కూడా మారతాడు. నిన్ను కొడతాడు... దొంగచాటుగా నీ నుండి తిట్లు తింటాడు. కానీ ఎంతో ఉన్నతస్థాయికి ఎదిగిన వాళ్లంతా చిన్నతనంలో వాళ్ల మ్యాథ్స్సర్తో రేపు వీపు బద్దలు కొట్టించుకునే ఉంటారు, ఫిజిక్స్ సర్‌తో చెవి మెలి పెట్టించుకునే ఉంటారు, ఇంగ్లిష్ సర్‌తో స్కేల్ బలాన్ని రుచి చూసే ఉంటారు. అవును... నిన్ను మార్చాలి... బతిమాలినా, భయపెట్టినా, ఏదో ఒకటి చేసి నిన్ను తీర్చిదిద్దాలంటే. అందుకేనేమో ఎన్ని వృత్తులు ఉన్నా టీచర్ పదవికి వన్నె, విలువ తగ్గనిది. అదే ఆయన అలిగి ఉంటే రాజులు, రాజ్యాలు, శాస్త్రాలు, సూత్రాలు ఎప్పుడో చరిత్రలో కలిసిపోయేవి. గడిచిపోయిన నిన్నటిని ఇంకా పుస్తకాల్లో దాచి నేటికి పరిచయం చేసి, రేపటిని నిర్మిస్తున్నాడు. నీ విజయంలో నీ వెనుక ఉంటూ నిన్ను ముందుకు నడిపిస్తున్నాడు. - జాయ్