మీ హాస్యాభిలాషి
సందర్భం: నేడు
డా. రాజేంద్రప్రసాద్ బర్త్‌డే
దిగాలుగా రోడ్డు మీద నడుస్తున్న నాకు చార్లీచాప్లిన్ పోతూ పోతూ చేతిలో ఒక కాగితం పాడేసి పోయాడు! ‘జనాజవాజరజసుజడు’ అని రాసుంది దాని మీద 18 జూలై అని తేదీతో. ఆ కోడుని డీకోడించి, జోడించి అసలందులో ఏం జొప్పించాడో తెలుసుకోవాలని నాలో కుతూహలం మరిగిపోవడంతో దేశం మీద పడ్డా. బాదులు, వాడలు, గోడలు, మేడలు తిరిగి తిరిగి వైజాగుకి చేరా. పిచ్చాళ్ళ జాతికి సంబంధించిదై ఉంటుందేమో అని. ఫలితం లేక అరిగిన చెప్పులేసుకుని బీచంటా కాళ్ళీడిస్తూ తిరుగుతూ ఉంటే, చంకలో చెప్పులు పెట్టుకుని పిల్లి నడకలతో పరిగెడుతున్నాడొక ఆసామి. గబుక్కున వెళ్లి లటుక్కున ఆయన జబ్బ పట్టుకుని ‘‘ఆ చెప్పులు, అక్కడ పెట్టుకుని నడుస్తున్నారేం?’’ అని అంటే... ‘‘అరిగిపోతాయని చెప్పి’’... తిరిగి తన పిల్ల నడకలు సాగించాడాయన.
ఆ అరవీర భయంకర పిసినారితనానికి జడుసుకుని... ‘‘సార్’’ అని నాచేతిలోని చిట్టీని అందించి ఈ అడ్డ దిడ్డ పదానికి గూడార్థం చెప్పండి అంటే’’ ఆ ఒక్కటి అడక్కు’’ అని అల్టిమేటం జారీ చేశాడాయన. ‘‘యే..?’’ అని గీతాంజలిలో నాగార్జునలా అడిగితే ‘‘ఆఫ్టర్ వన్ ఇయర్ ఐ విల్ బీ ద కింగ్ అప్పుడొచ్చి కలువు’’ అని పుసుక్కున మాయమయ్యారు ఆ చిట్టీ చేతిలో పెట్టుకుని. సరే అని తిరిగి సిటీకి చేరుకోగానే ఒక అందమైన ఆంటీ మీద కళ్ళు పడ్డాయి. ఎవరా అని చూడగా ‘‘ఏం మిస్టర్. ఏం చూస్తున్నావు’’ అని ఆవిడ అనగానే కళ్ళకు పట్టిన మబ్బు కరిగిపోయింది. ఆవిడ ‘ఆవిడ’ కాదని, ఆ ‘మేడమ్’ ఎవరో కాదు నా చిట్టీతో మాయమైన ‘మాయలోడ’ని అర్థమైంది.
సార్, అని మళ్లీ వెంటపడ్డా. హచ్ యాడ్‌లా నేను ఆయన వెనకాల నడుస్తుంటే, ‘‘నేను ‘ఉ’ అనగానే స్విచ్ వెయ్. మాటలు బ్యాక్‌గ్రౌండ్‌లో ఎక్కడో వినపడ్డాయి. ఈయన కాసేపాగి ‘ఉ’ అన్నాడు. కుయ్‌మని అరిచి, ఎవరో నేల మీద పడ్డ శబ్దం వచ్చింది బ్యాక్‌గ్రౌండ్‌లో. ‘‘ఓయమ్మో ఏంటి ఈయన కాష్మోరాలా ఉన్నాడు’’ అని భయంతో నేనరిస్తే, వెంటనే ఆయన వైపు తిరిగి’’ యాక్చువల్లీ ఐ యామ్ అచ్ఛా బచ్ఛా. బట్టల సత్యం లుచ్ఛా’’ అని అన్నాడు. ఎవరా బట్టల సత్యం అని వెనక్కు తిరిగి చూసేసరిగి ఈయన మళ్లీ తుర్రుమన్నాడు. ఇలా కాదని ఈసారి మాటేసి ఆయన్ని పట్టుకుంటే ‘‘ఎక్స్‌పెక్ట్ చేశా’’ అని వెకిలి నవ్వు నవ్వి, ఏంటో చెప్పమన్నట్టు చూశాడు. నేను ఆవేశంతో రొప్పుతూ ‘‘అసలేమనుకుంటున్నారు నా గురించి?’’ అని గదమాయించాను. ‘‘బక్క చిక్కిన బొప్పాసి బోదలా ఉన్నా’’వన్నాడు. ఆయన సత్యశీలతకి షాక్ అయ్యి, ఆయనవైపు బిత్తర చూపులు చూస్తుంటే ‘‘ఏమనుకోకు. నేను సత్యవచనా వ్రతం చేస్తున్నా’’ అని అసలు నిజం చెప్పారు.
అంతలోనే ముప్ఫై ఆరేళ్లు ఉన్న ఓ స్త్రీని చూసి ఆయన కళ్ళు మెరిశాయి. చూడంగానే జమజచ్చ అన్నారు. అంటే ఏంటి అన్నాను.’’ అది జా భాష! నేను అన్నదాన్నుండి ‘జ’ తీసేయ్’’ అన్నారు. ‘మచ్చ’ అన్న నేను ‘‘ఆ!’’ అని ప్రోత్సాహకంగా నవ్వి, తిరిగి నా చేతిలో చీటీ పెట్టాడు. అందులో నుండి ‘జా’లు తీసేస్తే... ‘నా వారసుడు’. డీకొడేశాను బాబోయ్ అని యురేకా రేంజ్‌లో అరిచా. అంతలోనే ఆ కోడ్ తాలూకు అర్థం తలకు తట్టింది. చాప్లిన్ వారసుడా ఈయన అనుకున్నాను. నిజమే... నడక నడత మాట మడతా అన్నీ కలగలిపి హాస్యంతో పోత పోసినట్టున్నాడు. వెళ్లి థ్యాంక్యూ సార్. నా కానుక అని కాస్త రుసుము ఆయన చేతిలో పెట్టగా... ‘‘రూపాయి రూపాయి. నువ్వేం చేస్తావంటూ’’ మొదలు పెట్టి రూపాయి అసలు రూపాన్ని బయటపెట్టారు. తత్వవేత్తలా మారిన హాస్య వేత్తగా కనిపించారాయన. అందుకే వెంటనే డబ్బుని లాక్కుని ఒక నవ్వుని గురు దక్షిణగా పాడేసి తిరిగి వచ్చా. నవ్వుల తోటలో చుక్కలు తెంపుకుందామని. - జాయ్