సేవాగణితుడు | Renaissance to open up a bit | Sakshi
Sakshi News home page

సేవాగణితుడు

Published Sun, Aug 10 2014 11:18 PM | Last Updated on Sat, Sep 2 2017 11:41 AM

సేవాగణితుడు

సేవాగణితుడు

లెక్కలు అంటే ఎప్పుడూ చిక్కులు, చిక్కుముడులు విప్పడమే కాదు... ఆ సంఖ్యల వెనకున్న సత్యాలను తెలుసుకుంటే కోట్ల విలువ చేసే ధన సంపద, విజ్ఞాన సంపదను సాధించవచ్చు అని నిరూపించారొకరు. ఆయనే కనబడే, వినబడే ప్రతి అంశంలోనూ గణితాన్ని చూడగల మానవతావాది జేమ్స్ హెచ్.సిమన్స్. ఆయన కనిపెట్టిన జీవితపు ఈక్వేషన్స్ ఏంటో చూద్దాం.
 
12.5 బిలియన్ డాలర్ల ఆస్తి. కేవలం... సిమన్స్ గణితాన్ని నమ్మితే వచ్చినది కాదు. గణితం సిమన్స్‌ని నమ్మింది కాబట్టి చేకూరినది. 76 ఏళ్ల సిమన్స్ పుట్టి పెరిగింది బోస్టన్‌లో. పద్నాలుగేళ్ల వయస్సులో ఉన్నప్పుడు క్రిస్మస్ సెలవుల్లో స్టోర్ కీపర్‌గా చేరిన సిమన్స్, తన మతిమరుపు కారణంగా నెల తిరక్కుండానే ఆ ఉద్యోగం నుండి ఫ్లోర్ కీపర్‌గా డిమోట్  అయ్యారు. సెలవులు పూర్తయిన తర్వాత ఆ ఉద్యోగం వదిలేసిన సిమన్స్... గణితంపై పట్టు సాధించాలనే కోరికతో ఎమ్‌ఐటీలో చేరారు. కాలం, అంతరిక్షాలపై గురుత్వాకర్షణ చూపించే ప్రభావం మీద ఆయన పరిశోధన చేశారు. ఐన్‌స్టైన్ చేపట్టిన అతి క్లిష్టమైన సబ్జెక్ట్ అది. కొన్నాళ్లు ఎన్.ఎస్.ఎ.లో కోడ్ బ్రేకర్‌గా దేశానికి సేవ అందించిన తరువాత తిరిగి ఎమ్.ఐ.టి.లో చేరారు... కాకపోతే ఈసారి ప్రొఫెసర్‌గా. అక్కడ రెండేళ్లు పని చేశాక స్టోనీ బ్రాక్ యూనివర్సిటీలో మ్యాథ్స్ డిపార్ట్‌మెంట్ హెడ్‌గా పనిచేశారు.
 
ఇవి ఎంతో కొంత తృప్తిని ఇచ్చినా, ఆయనకు ఏదో వెలితిగా ఉండేది. గణిత పరిజ్ఞానంతో ఏదైనా కొత్తగా చెయ్యాలనే తపనతో ఆయన రిమెనిసెన్స్ టెక్నాలజీస్ అనే సంస్థని ప్రారంభించారు. ఇది ఒక ఫండ్ మ్యానేజ్‌మెంట్ కంపెనీ. స్టోనీ బ్రాక్ యూనివర్సిటీలో ఒక చిన్న జాగాలో మొదలైంది ఈ కంపెనీ. వేరే కంపెనీల తాలూకు ఫండ్స్‌ని మ్యానేజ్ చేయడం ఆ కంపెనీ పని. ఏ రంగంలో ఇన్వెస్ట్ చేస్తే లాభం వస్తుంది అనే విషయం మీద సలహాలు ఇచ్చి, వారికి వచ్చే లాభం నుండి 5 శాతం ఫీజ్‌గా తీసుకుంటారు. ఇందులో ఆయన కొత్తగా చేసింది, మార్కెట్ సిద్ధాంతాలకు గణితాన్ని ఆపాదించడమే. స్టాక్‌మార్కెట్ స్థితిగతుల్ని ఒక మ్యాథ్స్ ఈక్వేషన్‌గా మార్చేవారు. ఇందుకోసం ఎందరో గణిత శాస్త్రజ్ఞులను నియమించి వారికి ఉపాధి కూడా కల్పించారు.
 
ఇది అనుకున్నంత సులువుకాదు. ఎందుకంటే మార్కెట్ అనేది రోజు రోజుకీ కొత్త పుంతలు తొక్కుతూనే ఉంటుంది. అందుకు తగ్గట్టు గణితాన్ని కొత్త పుంతలు తొక్కించాలి. మ్యాథ్స్ అందం ఏంటంటే... సమస్యని ఫార్ములేట్ చేయడం కష్టమే కానీ ఒకసారి ఫార్ములా రూపొందించాక సమాధనాలు రాబట్టడం ఎంతో సులువు. అందుకే ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలు వారి సలహాల కోసం ఎగబడతారు. వారి లాభాల నుండి 5 శాతం ఫీజు తీసుకున్న రిమెనిసెన్స్ టెక్నాలజీస్ సంపదే 12 బిలియన్ ఉంటే... వారి సలహాలు తీసుకున్న కంపెనీలు ఇంకెంత లాభపడుంటాయో ఊహించవచ్చు.
 
ఇది కేవలం ఒక అంశం మీద పట్టు ఉన్నవాళ్లకు సాధ్యమయ్యేది కాదు. పట్టుతో పాటు మ్యాథ్స్ అంటే పిచ్చి ఉన్నవారికే సాధ్యం. సిమన్స్ ఈ కోవ కిందికి వస్తారు. ఆయన జీవితాన్ని గణిత సమస్యలా చూస్తారు. కష్టసుఖాలను ప్లస్సు, మైనస్సుల్లా చూసే ఆయన జీవితంలో ఎన్ని మలుపులు! మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చారు. కొన్ని రాజకీయాల వల్ల ఎం.ఐ.టి.లో ఎంతో మంచి హోదాని వదులుకుని బయటకు వచ్చేయాల్సి వచ్చింది. అందివచ్చిన ఇద్దరు కొడుకులూ కళ్లముందే ప్రాణాలు వదిలారు. ఇలాంటివి ఆయన జీవితంలో ఎన్నో ఎదురయ్యాయి. కానీ సమస్యలన్నీ జీవితపు లెక్కలో ‘స్టెప్స్’ అనుకున్నారే తప్ప బాధపడి నీరుగారలేదు. అలా అని సిమన్స్ భావోద్వేగాలు లేని బండరాయి, మనుషులంటే లెక్క చేయని మొద్దుమనిషి కాదు. లేదంటే తన ఆస్తిని తిరిగి అమెరికా ప్రజలకోసం వాడేవారు కాదు కదా!
 
తనకు ఇంత అనుభవాన్ని, ఐశ్వరాన్ని ఇచ్చిన గణితానికి తిరిగి ఏదైనా చెయ్యాలనే ఆలోచనతో ఎమ్‌ఎఫ్‌ఏ (మ్యాథ్స్ ఫర్ అమెరికా) అనే సేవాసంస్థని స్థాపించారు సిమన్స్. అందులో భాగంగా ప్రతి అమెరికన్ విద్యార్థికీ గణితం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో కోటి డాలర్లకు పైగా వెచ్చించి అధ్యాపకులకు గణితంలో శిక్షణ ఇస్తున్నారు. ప్రతి అమెరికన్ విద్యార్థికీ ‘సరైన’ విద్య అందాలని తలపెట్టిన కార్యక్రమం ఇది. అంతేకాదు తన ఆస్తిలో ఎంతో భాగం, సైన్స్, మ్యాథ్స్ మెడిసిన్ తదితర విభాగాలలో లోతైన పరిశోధనల పైనే ఖర్చవుతుంది. ఈ విధంగా ఆయన వైజ్ఞానిక సేవ చేయడమేకాక ఆటిజమ్‌ని రూపు మాపేందుకు కూడా వైద్య విభాగంలో  పరిశోధనలు జరిపిస్తున్నారు. గణితం, సేవ... ఈ రెండూ ఆయనకు రెండు కళ్ళ లాంటివి.
 
‘‘నేను అంత చురుకైన వాడిని కాదు. మ్యాథ్ ఒలంపియాడ్‌లను సులువుగా చేధించలేను. కాని నాకు చూడడం ఇష్టం, శోధించడం ఇష్టం, తెలుసుకోవడం ఇష్టం. అదే నన్ను నడిపిస్తోంది’’ అని సంబరంతో చెబుతారు. ఒక ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తున్నప్పుడు... ఈజ్ ఈక్వల్ టు సింబల్‌కి అటు, ఇటుగా సంఖ్యలు మారుతున్నప్పుడు... ఆయన కళ్ళు ఉత్సుకతతో చూస్తాయి, తరువాత ఏమవుతుందా... అని! LHR = RHSఅని నిరూపించే వరకు విరామం లేదు ఆయనకు!
 
- జాయ్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement