లోహసుందరి
వేమౌత్ (ఇంగ్లండ్) రోడ్ల మీద వయసుకి తగ్గ వేగంతో దూసుకుపోతోంది 17 ఏళ్ల కత్రినా బర్గెస్. మనసులో తన మోడలింగ్ కలలు నెరవేరబోతున్నాయన్న ఊహలు వేగంగా పరుగులు తీస్తుంటే వాటికి పోటీగా కారుని ఉరకలెత్తిస్తోంది కత్రినా. పార్టీకి టైమ్ అవుతోంది. యాక్సిలరేటర్‌ని గట్టిగా దబాయించింది. క్షణం గడవగానే ఏదో చెట్టు నడుచుకుంటూ తన కార్ వైపు వస్తున్నట్లు అనిపిచింది. ‘ఏమౌతుంది..’ అనే ఆలోచన కళ్లలోకి ప్రవేశిస్తుండగానే ఆ కారు వెళ్లి ఆ చెట్టుని గుద్దింది. కారు చిధ్రం అయిపోయింది. ఎవరో వచ్చి తనని స్ట్రెచర్ మీద తీసుకెళుతున్నట్టు లీలగా తెలుస్తోంది కత్రినాకు.
శ్వాస పీలుస్తోంది కానీ వాసన తెలియడం లేదు. నాలుక రుచులు మర్చిపోయినట్టుగా ఉంది. మెల్లగా కళ్లు తెరిచి చూసింది కత్రినా. ‘ఏమైంది నాకు’ అని అడగటానికి ప్రయత్నం చేసినా మాట రావట్లేదు. తన నుండి ఏవో తీస్తున్నారు, వేస్తున్నారు డాక్టర్లు. ‘ఏమీ కాదు’ అన్నట్టు నవ్వింది అక్కడ ఉన్న ఒక డాక్టరు. మెల్లగా కారు, చెట్టు, యాక్సిడెంట్ గుర్తుకొచ్చాయి.
నుదురు చిట్లించింది. తను ఎలా ఉందో చూసుకోవాలి. లేచేందుకు ఓపిక కూడా లేదు. తల కూడా లేపలేకపోయింది. కాస్త కష్టపడి తల తిప్పగా, తన బెడ్ పక్కన ఉన్న బెడ్ ప్యాన్‌లో తన ప్రతిరూపం కనిపించింది. మనిషిలా లేదు. మనిషి శరీరానికి ఉండాల్సిన నిర్మాణం చెల్లాచెదురైంది. ఎముకలు కూలి కొత్త ఆకారంలో ఉన్న తనని తాను చూసుకుని ఆరిచే ప్రయత్నం చేసింది.
ఆ యాక్సిడెంట్‌లో తన వెన్నెముక పూర్తిగా విరిగిపోయింది. రెండు ఊపిరితిత్తులు చిల్లులు పడ్డాయి. మెడ ఎముక, తుంటి ఎముకతో పాటు ఎడమకాలు ఎముక కూడా విరిగిపోయింది. తన ప్రాణాలైనా పణంగా పెట్టడానికి సిద్ధమైంది కత్రినా. తన శరీరంలో విరిగిపోయిన ఎముకల్ని టైటానియమ్ రాడ్లతో రీప్లేస్ చేయడానికి సిద్ధపడ్డారు డాక్టర్లు. తన నడుము గుండా తన ఎడమ కాలిలో విరిగిన తొడ ఎముక స్థానంలో రాడ్‌ని అమర్చారు. తరువాత వారం, ఆరు టైటానియమ్ పిన్‌లను కలిిపి తన విరిగిన వెన్నెముక స్థానంలో పెట్టారు.
మెడ స్థానంలో ఆ టైటానియమ్ పిన్‌ల గుండా ఒక టైటానియమ్ స్క్రూని పెట్టారు. 5 నెలల తరువాత తను లేచి నిలబడగలిగింది. ‘‘లేచి చిలుచున్నప్పుడు నాకే ఆశ్చర్యంగా అనిపించింది. మెడలో స్క్రూ ఉండడం విచిత్రంగా అనిపించింది’’ అని తన మనసులో భావనని డాక్టర్లకు చెప్పింది కత్రినా.
యాక్సిడెంట్ అయిన తరువాత అమీబాలా రూపం పొగొట్టుకున్న కత్రినా ని తిరిగి అందంగా మార్చారు డాక్టర్లు. యాక్సిడెంట్ అయిన 5 నెలల తరువాత డాక్టర్ల చలవతో తిరిగి తన కెరీర్‌ను ఆరంభించడానికి సిద్ధపడింది కత్రినా. పదకొండు టైటానియం రాడ్లను ఒంట్లో దాచుకుని బయటకు నడిచింది తను తన కలల వైపు.
- జాయ్
మృత్యువును జయించిన టైటానియమ్ తారక
Published Tue, Jul 22 2014 12:00 AM | Last Updated on Sat, Sep 2 2017 10:39 AM
Advertisement
Advertisement