సున్నదరీమణులు
సున్నా! ఆర్యభట్ట మెదడులో పుట్టి, అలియాభట్ ఒంటి మీద వాలింది. ఆరు నూరవ్వలేదు కానీ, సున్నా అయింది. ఎంతలా అంటే ‘సున్న’టి నడుము ఉంటేనే సన్నని నడుము అన్నట్టు అయ్యింది పరిస్థితి. ఇంతకీ అన్నం తినకుండా అందం పెంచుకోవడం అనే దాంట్లో ఎంత నిజముంది? ఈ బాడీ లెంగ్త్ ఫ్యాషన్ వెనక ఉన్న ట్రూత్ ఎంత? మిత్ ఎంత? తెలుసుకోవాలంటే...
‘టు ఆల్ ద గర్ల్స్... థింక్ యూ ఆర్ ఫ్యాట్ బికాజ్ యు ఆర్ నాట్ ఎ జీరో సైజ్, యూ ఆర్ ద బ్యూటిఫుల్ వన్, ఇట్స్ ది సొసైటీ హూజ్ అగ్లీ’... జీరో సైజ్ గురించి మార్లిన్ మన్రో అన్న మాటలివి. ‘అందం అంటే సన్నబడడం ఒక్కటే కాదు’ అని ఆవిడ ఉద్దేశం. జీరోసైజ్ ఫ్యాషన్ మన దేశానికి 2007లో వచ్చినా ఇది మొదలైంది మాత్రం 1960లోనే. లెస్లీ లాసన్, బ్రిజెట్ బార్‌డాట్. వీరిద్దరే మొట్టమొదట సైజ్ జీరో మోడల్స్. నాజూకైన ఒళ్ళు, గాజు లాంటి కళ్ళతో ఉన్న లెస్లీ లాసన్‌ని చూసి ముగ్ధులవ్వని వాళ్ళు లేరు అప్పట్లో. తర్వాత మోడల్స్ అందరూ ఈమె స్ఫూర్తితోనే తమని తాము సన్నపెట్టుకోవడం మొదలుపెట్టారు. చాలా డిజైనర్ కంపెనీలు, డిజైనర్‌లు కూడా జీరో సైజ్ సుందరాంగులు వేసుకుంటేనే, తమ దుస్తుల డిజైన్ అందం తెలుస్తుందని ఈ ఫ్యాషన్‌ని విపరీతంగా ప్రోత్సహించారు. ఒకానొక కాలంలో జీరో సైజ్ ‘తప్పనిసరి’ అని నిబంధనలు విధించిన రోజులు కూడా ఉన్నాయి. వివిధ రకాల ఆరోగ్యసమస్యల గురించి డాక్టర్లు ఎంత హెచ్చరించినా ‘జీరో’ క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఈ క్రేజ్ మూలంగానే ‘లూయిసెల్ రామోర్’ అనే మోడల్ తన ప్రాణం పోగొట్టుకుంది. జీరో సైజ్ వల్ల వచ్చే ‘అనొరెక్సియా నెర్వోసా’ అనే డిజార్డర్‌తో ఆమె మరణించింది. ఈ దెబ్బతో ఈ ‘జీరో’ సైజ్ యూరప్ నుండి కనుమరుగవడం ప్రారంభించింది. కానీ అదే సమయంలో దాన్ని ఇండియాకి తీసుకొచ్చింది కరీనా!
‘తషన్’ చిత్రంలో 51 కేజీలు తూగిన కరీనా సన్నదనం చూసి స్టన్నయింది బాలీవుడ్. దీంతో మిగిలిన నటీమణులు కూడా క్యాలరీలు కట్‌చేసుకోవడం మొదలు పెట్టారు. ఇలా కరీనా తర్వాత దీపికా పదుకొనె, బిపాసా, అనుష్క శర్మ, వీళ్ళంతా జీరో బాట పట్టినవారే. కానీ ఆ నాజూకుతనం భారతీయ మగ కంటికి అంత ఇంపుగా అనిపించక పోవడంతో జీరో సైజ్‌ని ఎంచుకునేవారి సంఖ్య జీరోకి చేరుకుంటోంది.
ఎనరెక్సియా నెర్వోసా
ఇది అత్యధిక మోడళ్ళలో కనపడే డిజార్డర్. తిండి తినడం వల్ల బరువు పెరుగుతుందనే ఫోబియా వల్ల వచ్చే రోగం ఇది. ఇది ఒక సాంఘిక అంటువ్యాధి.. నాకన్నా ఆ అమ్మాయి సన్నగా ఉందనే ఆత్మన్యూనతా భావంతో ఈ డిజార్డర్ బారిన పడుతుంటారు. ఇలా కొలతల గురించి కలత చెంది ప్రాణాల మీదకు తెచ్చుకున్న మోడళ్ళు ఎందరో.
ఫిజిక్స్
జీరో సైజ్ అంటే 30-20-30 అని అనుకుంటారందరూ. యూఎస్ సైజ్ రేంజ్ ప్రకారం 30-22-32 నుండి 33-25-35 మధ్య ఉండే మోడల్స్‌ని జీరో సైజ్‌గా పరిగణిస్తారు. ఇందులోనూ ‘0’, ‘00’ అని రెండు రకాలున్నాయి. రెండింటికి అర ఇంచు తేడా ఉంటుంది. ‘జీరో’ సైజ్ అనేది అందరి శరీర ఆకృతులకు సరిపోయేది కాదు. హైట్ టు వెయిట్ ఫ్యాక్టర్‌ని దృష్టిలో ఉంచుకొని ఈ ఫ్యాషన్‌ని అనుసరించాలి. అందుకే మరీ పొడుగు, పొట్టిగా ఉండే మోడల్‌లు ‘జీరో’ సైజ్‌కి ప్రయత్నించి విఫలమౌతున్నారు.
ఎకనామిక్స్
బరువు తగ్గించుకోవడానికి వేలం వెర్రిగా మోడళ్ళు పరిగెత్తినా, వారి వెనక నుండి పరిగెత్తించి డబ్బులు చేసుకునేది మాత్రం డిజైనర్లే. అప్పట్లో, కేవలం సైజ్ జీరో మోడళ్ళను మాత్రమే ఎంచుకుని వారికోసం క్యాట్‌వాక్‌లు నిర్వహించేవి ఎన్నో ఫ్యాషన్ కంపెనీలు. హ్యాలీబెరీ, నటాలీ పోర్ట్‌మన్ లాంటి ఎందరో జీరో సైజ్ నటీమణులకు ఉన్న క్రేజ్‌ని చూసి వారికి తగ్గట్లుగానే దుస్తులు డిజైన్ చేయడం కూడా ఒక కారణం. దీనివల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చినా... డబ్బు కూడా బాగా వస్తుందని ఎంత కష్టమైనా ఇష్టంగానే ఒళ్ళు కరిగించుకున్న మోడళ్ళు ఎందరో ఉన్నారు.
బయాలజీ
ఈ శరీరాకృతి సాధించడానికి చాలా పద్ధ్దతులున్నాయి. కానీ, ఆరోగ్యవంతమైనా పద్ధతులు చాలా తక్కువ. మగవాళ్ళు సిక్స్ ప్యాక్‌కి కష్టపడ్డట్టు, అమ్మాయిలు కూడా ‘జీరో’సైజ్‌కి అంతే కష్టపడాలి. ప్రత్యేకమైన డైట్లు, రోజువారీ ఎక్సర్‌సైజ్‌లు చేయాలి. ఇలా చేస్తే జీరో సైజ్ సాధించడానికి నెలల సమయం పడుతుంది. కానీ పోటీ తత్వం పెరగడంతో మోడళ్ళు షార్ట్‌కట్ రూట్లు వెతకడం వల్ల చాలా అనర్థాలే వచ్చాయి. కొందరు ఆహారం పూర్తిగా మానేసి కాఫీలు, సిగరెట్లను ఆశ్రయిస్తున్నారు. ఇంకొందరు స్టెరాయిడ్స్ తీసుకుంటూ... జీరో సైజ్ యావలో లైఫ్‌ని జీరో చేసుకుంటున్నారు.
- జాయ్