ఇవ్వడం కోసం చెయ్యి చాచండి
దైవికం
ఆడుకుంటూ ఆడుకుంటూ ఓ చిన్నారి లోతైన కాలువలోకి జారిపడ్డాడు. ‘‘కాపాడండీ... కాపాడండీ’’ అని అరుస్తూ ఏడుస్తున్నాడు. అటుగా వెళుతున్న ఒక వ్యక్తి కాలువలోకి తొంగి చూసి, ‘‘ఇదిగో అబ్బాయ్ నీ చెయ్యి ఇవ్వు’’ అని తన చేతిని చాచాడు. ఆ చిన్నారి చెయ్యి అందివ్వకపోగా మళ్లీ ‘‘కాపాడండీ... కాపాడండీ’’ అని అరవడం మొదలుపెట్టాడు. ఆ వ్యక్తికి జాలి కలిగింది.
పిల్లవాడికి అర్థం కావడం లేదని, ‘‘ఇదిగో నాయనా నా చెయ్యి కాస్త అందుకో’’ అని ఎంతో అనునయంగా తన చేతిని చాచాడు. వెంటనే ఆ చిన్నారి అతడి చెయ్యి అందుకుని పైకి వచ్చేశాడు. ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. ‘‘ఇందాక నీ చెయ్యి అందిమ్మంటే ఇవ్వలేదు!’’ అన్నాడు. దానికా చిన్నారి- ‘‘నిన్నెవరైనా ఇమ్మని అడిగితే ఇవ్వొద్దు. తీస్కోమంటే మాత్రం ఆలస్యం చేయకు అని మా నాన్నగారు చెప్పారు’’ అని చెప్పాడు.
మనుషులు ఎలా ఉంటారనేదానికి ఈ చిన్న కథను ఉదాహరణగా చెబుతూ ఫ్రాన్సిస్ గాన్‌సాల్వెస్ అనే ఆధ్యాత్మిక వేత్త ఇటీవల తనకు లాటిన్ అమెరికాలోని ఎల్‌సాల్వడార్‌లో ఎదురైన ఒక అనుభవాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్నారు. ఎల్ సాల్వడార్ అంటే ‘రక్షకుడు’ అని అర్థం. ఇటీవల ఆ దేశం తమ రక్షకుడైన క్రైస్తవ మతపెద్ద ఆస్కార్ రొమెరో 34వ వర్ధంతి సందర్భంగా సంస్మరణ కార్యక్రమాలు జరుపుకుంది.
980 మార్చి 24న హత్యకు గురికావడానికి కొన్ని రోజుల ముందు రొమెరో నోటి వెంట ఒక మాట వెలువడింది. ‘‘ఒక క్రైస్తవుడిగా నేను మరణాన్ని విశ్వసించను. పునర్జన్మను మాత్రమే నమ్ముతాను. వాళ్లు గనుక నన్ను చంపితే ఎల్‌సాల్వడార్ ప్రజల మధ్య మళ్లీ జన్మిస్తాను’’ అన్నారాయన. పౌరహక్కుల కోసం పాలకపక్షాలతో జరిపిన పోరే ఆయన్ని పొట్టనపెట్టుకుంది.
‘‘సంస్మరణ వేడుకలలో ఎటువైపు చూసినా రొమెరో కటౌట్లు, పోస్టర్లే కనిపించాయి. యువతీయువకులు ఆయన ముఖచిత్రం ముద్రించి ఉన్న టీ షర్టులను ధరించారు’’ అని చెబుతూ, రొమెరోను నిజమైన రక్షకునిగా కీర్తించారు ఫ్రాన్సిస్ గాన్‌సాల్వెస్.
1970లలో రోమెరో వచనాలు, సేవాకార్యక్రమాలు ఎల్‌సాల్వడార్‌లో ఎందరిలోనో పరివర్తన తెచ్చాయి. దేవుని సేవ అంటే తీసుకోవడం కాదు, ఇవ్వడం అని ఆయన ప్రబోధించారు. నిరుపేదలకు, ‘అంటరాని వాళ్లు’ అని సంపన్నులు దూరంగా ఉంచినవాళ్లకు ఆయన ఆలయ ప్రవేశం కల్పించారు. దేవుడిని ప్రార్థించేందుకు అందరికీ హక్కు ఉందని నినదించారు. అలా రోమెరో దేవుడిని దివి నుండి భువికి దించారు.
వాటన్నిటినీ గుర్తుచేస్తూ ఉత్సవాలను నిర్వహించిన రోమెరో సహాయకుడు, 87 ఏళ్ల వృద్ధుడు అయిన మాన్‌సైనర్ రికార్డో ఉరియోస్త్‌ను ప్రత్యేకంగా వెళ్లి కలిశారు ఫ్రాన్సిస్ గాన్‌సాల్వెస్. ‘‘దేవుడు మాపై తన దయనంతా కురిపించాడు. ఆయన మాకు ఇచ్చిన అతిపెద్ద బహుమతి రోమెరోను మాకు నాయకుడిగా ప్రసాదించడం’’ అని ఉరియోస్త్ అన్న మాటలను మననం చేసుకుంటుంటే ఫ్రాన్సిస్‌కు బైబిల్‌లోని ‘‘తీసుకున్నవారి కన్నా ఇచ్చినవారు ధన్యులు’’ అనే వాక్యం స్పురణకు వచ్చిందట.
ధన్యత అంటే జీవితం సంతోషకరంగా సాగడం. తీసుకున్నప్పటి కన్నా, ఇచ్చినప్పుడు మీకు ఎక్కువ ఆనందం కలుగుతున్నట్లయితే మీరూ ధన్యజీవే!