వెనిజులాలో రేపు అధ్యక్ష ఎన్నికలు
మచాడోకు వెల్లువలా ప్రజా మద్దతు
అధ్యక్షుడు మదురోకు ముచ్చెమటలు
దేశ చరిత్రలోనే అత్యంత ఆసక్తికరమైన పోరుకు రంగం సిద్ధం
వెనిజులా. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిక్షేపాలున్న లాటిన్ అమెరికా దేశం. అయినా అత్యంత నిరుపేద దేశాల జాబితాలో అగ్రస్థానంలో ఉంది. పాతికేళ్లుగా సాగుతున్న స్వయం ప్రకటిత సామ్యవాద కూటమి నియంతృత్వ పాలనే అందుకు ప్రధాన కారణం. నిరసనలపై ఉక్కుపాదం, హక్కుల అణచివేత, విపక్ష నేతలకు సంకెళ్లు తదితరాలతో వెనిజులా యువత విసిగిపోయింది. దీనికి తోడు అంతర్జాతీయ సమాజం ఆంక్షలతో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి ఉపాధి అవకాశాలూ లేకపోవడంతో కట్టకట్టుకుని దేశం వీడుతోంది.
నిండా 3 కోట్ల జనాభా కూడా లేని దేశంలో గత పదేళ్లలో ఏకంగా 80 లక్షల మంది విదేశీ బాట పట్టారు! సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం వంటి కీలక వ్యవస్థలన్నింటినీ ప్రభుత్వమే గుప్పెట్లో పెట్టుకోవడంతో పాతికేళ్లుగా వెనిజులాలో అధ్యక్ష ఎన్నికలు కూడా ఏకపక్షమే. 2018 ఎన్నికల్లోనైతే విపక్షాలన్నీ కట్టకట్టుకుని ఎన్నికలనే బహిష్కరించేంతగా ప్రభుత్వ అధికార దురి్వనియోగం శ్రుతి మించిపోయింది. దాంతో ప్రహసనప్రాయంగా సాగిన ఆ ఎన్నికల్లో అధ్యక్షుడు నికొలస్ మదురో తిరుగులేని మెజారిటీ సాధించి అధికారాన్ని నిలబెట్టుకున్నారు.
అలాంటి వెనిజులాలో ఆరేళ్ల అనంతరం ఆదివారం మళ్లీ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. కానీ పరిస్థితులు మాత్రం ఎప్పట్లా లేవు! విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి మదురోపై ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాయి. విపక్షాల ప్రచార సభలకు జనం విరగబడుతున్నారు. ఎన్నికల ప్రక్రియపై ఎప్పుడూ లేనంత ఆసక్తి, ఉత్సుకత వారిలో కనిపిస్తున్నాయి. దాంతో అంతర్జాతీయ సమాజం కూడా ఈసారి ఎన్నికలను అత్యంత ఆసక్తితో వీక్షిస్తోంది. ఇన్ని మార్పులకు కారణం ఒక్క మహిళ. ఒకే ఒక్క మహిళ. మదురోకు ముచ్చెమటలు పోయిస్తున్న ఆమే...విపక్ష నేత మరియా కొరీనా మచాడో.
అనర్హత వేటేసినా...
వెనిజులా అధ్యక్ష ఎన్నికల బరిలో 10 మంది ఉన్నారు. ప్రధాన పోటీ 61 ఏళ్ల మదురో, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎడ్మండో గొంజాలెజ్ రూపంలో ఇద్దరి మధ్య కేంద్రీకృతమైంది. కానీ అసలు పోటీలోనే లేని 56 ఏళ్ల మచాడో పేరు మాత్రమే దేశమంతటా మారుమోగిపోతోంది! ఎన్నికల ప్రచారం పొడవునా ఆమే సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. అటు అధికార యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ వెనిజులా, ఇటు విపక్ష ‘యూనిటరీ ప్లాట్‌ఫాం’ కూటమి ప్రచారమంతా ఆమెనే కేంద్రంగా చేసుకుని సాగడం విశేషం.
ముఖ్యంగా మదురో ప్రసంగాలన్నీ ఆద్యంతం మచాడోను విమర్శిస్తూనే సాగాయి. ఆమె ఎన్నికల పోటీకి దూరమైన వైనమూ ఆసక్తికరమే. విపక్ష అభ్యర్థిని తేల్చేందుకు గతేడాది జరిగిన ప్రైమరీలో దేశవ్యాప్తంగా జనం వెల్లువలా వచ్చి మచాడోకు ఓటేశారు. దాంతో ఆమె రికార్డు స్థాయిలో ఏకంగా 93 శాతం ఓట్లు సాధించారు. ఆ వెంటనే ప్రభుత్వం ఆమెపై అవినీతి ఆరోపణలు మోపి ఎన్నికల్లో పోటీకి అనర్హురాలిగా ప్రకటించింది. విపక్ష ప్రైమరీనే చట్టవిరుద్ధంగా ప్రకటించింది.
మచాడో మద్దతుదారులైన నాయకులు, జర్నలిస్టులు, హక్కుల నేతలు తదితరులందరినీ జైలుపాలు చేసింది. ప్రభుత్వ గుప్పెట్లో ఉన్న సుప్రీంకోర్టు కూడా వేటునే సమరి్థంచింది. అయినా మచాడో వెనక్కు తగ్గకుండా పెద్ద జనాకర్షణ శక్తి లేని మాజీ దౌత్యవేత్త గొంజాలెజ్‌ను తనకు బదులుగా రేసులో దించారు. తనపై వేటునే అతి పెద్ద ప్రచారాస్త్రంగా మలచుకుని సుడిగాలి ప్రచారంతో హోరెత్తించారు. మదురో ప్రభుత్వ అవినీతి, అస్తవ్యస్త పాలనపై ఆమె విమర్శలకు ప్రజల నుంచి విపరీతమైన స్పందన లభించింది. దాంతో అందరి దృష్టీ ఆదివారం జరిగే పోలింగ్ మీదే కేంద్రీకృతమైంది.
40 లక్షల మంది ఓటర్లపై ‘వేటు’
వెనిజులా మొత్తం ఓటర్లే 2.1 కోట్లు. వారిలో 40 లక్షల మందికి పైగా విదేశాల్లో ఉన్నారు. మదురో పాలనపై వారిలో తీవ్ర అసంతృప్తి నెలకొన్న నేపథ్యంలో వారెవరూ ఓటేసే వీల్లేకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. లెక్కలేనన్ని కొత్త నిబంధనలు తేవడంతో ప్రవాసుల్లో 69 వేల మంది మాత్రమే ఓటింగ్‌కు అర్హత పొందారు!
బస్సు డ్రైవర్ నుంచి అధికార పీఠం దాకా...
నికొలస్ మదురో మోరోస్. ఒకప్పుడు సాదాసీదా బస్సు డ్రైవర్. అనంతరం కార్మిక సంఘాల నేతగా మారారు. మెల్లిగా రాజకీయంగా ఒక్కో మెట్టే ఎక్కుతూ అధ్యక్ష పీఠం దాకా ఎదిగారు. 2000లో నేషనల్ అసెంబ్లీకి ఎన్నికవడం మదురో కెరీర్లో కీలక మలుపు. వెనిజులా చరిత్రలో అత్యంత జనాకర్షక నేతగా పేరొందిన హ్యూగో చావెజ్ అభిమానం చూరగొనడంతో ఆయన దశ తిరిగింది. చావెజ్ హయాంలో నేషనల్ అసెంబ్లీ స్పీకర్‌గా, విదేశాంగ మంత్రిగా చేసి 2012లో దేశ ఉపాధ్యక్షుడయ్యారు.
ఏడాదికే చావెజ్ క్యాన్సర్ బారిన పడ్డారు. 2013లో మదురోను తన తాత్కాలిక వారసునిగా ప్రకటించి మరణించారు. మదురో గద్దెనెక్కుతూనే అధ్యక్ష పదవికి తూతూ మంత్రంగా ప్రత్యేక ఎన్నికలు జరిపించి తనకు 50 శాతానికి పైగా ఓట్లొచ్చాయని ప్రకటించుకున్నారు. నాటినుంచి నేటిదాకా అధికారంలో కొనసాగుతున్నారు. ఆయన 11 ఏళ్ల పాలనలో దేశం అన్ని రంగాల్లోనూ కుప్పకూలిందంటూ జనం ఆగ్రహంగా ఉన్నారు. కొన్నేళ్లుగా మదురోపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత తీవ్రతరమవుతోంది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment