poor countries
-
Venezuela presidential election: సామ్యవాద కోటలో నారీ భేరి
వెనిజులా. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిక్షేపాలున్న లాటిన్ అమెరికా దేశం. అయినా అత్యంత నిరుపేద దేశాల జాబితాలో అగ్రస్థానంలో ఉంది. పాతికేళ్లుగా సాగుతున్న స్వయం ప్రకటిత సామ్యవాద కూటమి నియంతృత్వ పాలనే అందుకు ప్రధాన కారణం. నిరసనలపై ఉక్కుపాదం, హక్కుల అణచివేత, విపక్ష నేతలకు సంకెళ్లు తదితరాలతో వెనిజులా యువత విసిగిపోయింది. దీనికి తోడు అంతర్జాతీయ సమాజం ఆంక్షలతో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి ఉపాధి అవకాశాలూ లేకపోవడంతో కట్టకట్టుకుని దేశం వీడుతోంది. నిండా 3 కోట్ల జనాభా కూడా లేని దేశంలో గత పదేళ్లలో ఏకంగా 80 లక్షల మంది విదేశీ బాట పట్టారు! సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం వంటి కీలక వ్యవస్థలన్నింటినీ ప్రభుత్వమే గుప్పెట్లో పెట్టుకోవడంతో పాతికేళ్లుగా వెనిజులాలో అధ్యక్ష ఎన్నికలు కూడా ఏకపక్షమే. 2018 ఎన్నికల్లోనైతే విపక్షాలన్నీ కట్టకట్టుకుని ఎన్నికలనే బహిష్కరించేంతగా ప్రభుత్వ అధికార దురి్వనియోగం శ్రుతి మించిపోయింది. దాంతో ప్రహసనప్రాయంగా సాగిన ఆ ఎన్నికల్లో అధ్యక్షుడు నికొలస్ మదురో తిరుగులేని మెజారిటీ సాధించి అధికారాన్ని నిలబెట్టుకున్నారు. అలాంటి వెనిజులాలో ఆరేళ్ల అనంతరం ఆదివారం మళ్లీ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. కానీ పరిస్థితులు మాత్రం ఎప్పట్లా లేవు! విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి మదురోపై ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాయి. విపక్షాల ప్రచార సభలకు జనం విరగబడుతున్నారు. ఎన్నికల ప్రక్రియపై ఎప్పుడూ లేనంత ఆసక్తి, ఉత్సుకత వారిలో కనిపిస్తున్నాయి. దాంతో అంతర్జాతీయ సమాజం కూడా ఈసారి ఎన్నికలను అత్యంత ఆసక్తితో వీక్షిస్తోంది. ఇన్ని మార్పులకు కారణం ఒక్క మహిళ. ఒకే ఒక్క మహిళ. మదురోకు ముచ్చెమటలు పోయిస్తున్న ఆమే...విపక్ష నేత మరియా కొరీనా మచాడో. అనర్హత వేటేసినా... వెనిజులా అధ్యక్ష ఎన్నికల బరిలో 10 మంది ఉన్నారు. ప్రధాన పోటీ 61 ఏళ్ల మదురో, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎడ్మండో గొంజాలెజ్ రూపంలో ఇద్దరి మధ్య కేంద్రీకృతమైంది. కానీ అసలు పోటీలోనే లేని 56 ఏళ్ల మచాడో పేరు మాత్రమే దేశమంతటా మారుమోగిపోతోంది! ఎన్నికల ప్రచారం పొడవునా ఆమే సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. అటు అధికార యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ వెనిజులా, ఇటు విపక్ష ‘యూనిటరీ ప్లాట్‌ఫాం’ కూటమి ప్రచారమంతా ఆమెనే కేంద్రంగా చేసుకుని సాగడం విశేషం. ముఖ్యంగా మదురో ప్రసంగాలన్నీ ఆద్యంతం మచాడోను విమర్శిస్తూనే సాగాయి. ఆమె ఎన్నికల పోటీకి దూరమైన వైనమూ ఆసక్తికరమే. విపక్ష అభ్యర్థిని తేల్చేందుకు గతేడాది జరిగిన ప్రైమరీలో దేశవ్యాప్తంగా జనం వెల్లువలా వచ్చి మచాడోకు ఓటేశారు. దాంతో ఆమె రికార్డు స్థాయిలో ఏకంగా 93 శాతం ఓట్లు సాధించారు. ఆ వెంటనే ప్రభుత్వం ఆమెపై అవినీతి ఆరోపణలు మోపి ఎన్నికల్లో పోటీకి అనర్హురాలిగా ప్రకటించింది. విపక్ష ప్రైమరీనే చట్టవిరుద్ధంగా ప్రకటించింది. మచాడో మద్దతుదారులైన నాయకులు, జర్నలిస్టులు, హక్కుల నేతలు తదితరులందరినీ జైలుపాలు చేసింది. ప్రభుత్వ గుప్పెట్లో ఉన్న సుప్రీంకోర్టు కూడా వేటునే సమరి్థంచింది. అయినా మచాడో వెనక్కు తగ్గకుండా పెద్ద జనాకర్షణ శక్తి లేని మాజీ దౌత్యవేత్త గొంజాలెజ్‌ను తనకు బదులుగా రేసులో దించారు. తనపై వేటునే అతి పెద్ద ప్రచారాస్త్రంగా మలచుకుని సుడిగాలి ప్రచారంతో హోరెత్తించారు. మదురో ప్రభుత్వ అవినీతి, అస్తవ్యస్త పాలనపై ఆమె విమర్శలకు ప్రజల నుంచి విపరీతమైన స్పందన లభించింది. దాంతో అందరి దృష్టీ ఆదివారం జరిగే పోలింగ్ మీదే కేంద్రీకృతమైంది. 40 లక్షల మంది ఓటర్లపై ‘వేటు’ వెనిజులా మొత్తం ఓటర్లే 2.1 కోట్లు. వారిలో 40 లక్షల మందికి పైగా విదేశాల్లో ఉన్నారు. మదురో పాలనపై వారిలో తీవ్ర అసంతృప్తి నెలకొన్న నేపథ్యంలో వారెవరూ ఓటేసే వీల్లేకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. లెక్కలేనన్ని కొత్త నిబంధనలు తేవడంతో ప్రవాసుల్లో 69 వేల మంది మాత్రమే ఓటింగ్‌కు అర్హత పొందారు! బస్సు డ్రైవర్ నుంచి అధికార పీఠం దాకా... నికొలస్ మదురో మోరోస్. ఒకప్పుడు సాదాసీదా బస్సు డ్రైవర్. అనంతరం కార్మిక సంఘాల నేతగా మారారు. మెల్లిగా రాజకీయంగా ఒక్కో మెట్టే ఎక్కుతూ అధ్యక్ష పీఠం దాకా ఎదిగారు. 2000లో నేషనల్ అసెంబ్లీకి ఎన్నికవడం మదురో కెరీర్లో కీలక మలుపు. వెనిజులా చరిత్రలో అత్యంత జనాకర్షక నేతగా పేరొందిన హ్యూగో చావెజ్ అభిమానం చూరగొనడంతో ఆయన దశ తిరిగింది. చావెజ్ హయాంలో నేషనల్ అసెంబ్లీ స్పీకర్‌గా, విదేశాంగ మంత్రిగా చేసి 2012లో దేశ ఉపాధ్యక్షుడయ్యారు. ఏడాదికే చావెజ్ క్యాన్సర్ బారిన పడ్డారు. 2013లో మదురోను తన తాత్కాలిక వారసునిగా ప్రకటించి మరణించారు. మదురో గద్దెనెక్కుతూనే అధ్యక్ష పదవికి తూతూ మంత్రంగా ప్రత్యేక ఎన్నికలు జరిపించి తనకు 50 శాతానికి పైగా ఓట్లొచ్చాయని ప్రకటించుకున్నారు. నాటినుంచి నేటిదాకా అధికారంలో కొనసాగుతున్నారు. ఆయన 11 ఏళ్ల పాలనలో దేశం అన్ని రంగాల్లోనూ కుప్పకూలిందంటూ జనం ఆగ్రహంగా ఉన్నారు. కొన్నేళ్లుగా మదురోపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత తీవ్రతరమవుతోంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
World Environment Day: ‘వాతావరణ న్యాయం’ కోరుతున్నాం
న్యూఢిల్లీ: అభివృద్ధి చెందిన కొన్ని దేశాలు అనుసరిస్తున్న తప్పుడు విధానాలకు అభివృద్ది చెందుతున్న, పేద దేశాలు మూల్యం చెల్లించాల్సి వస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ‘వాతావరణ న్యాయం’ కోసం అభివృద్ధి చెందిన దేశాలను డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ సోమవారం ఒక సందేశం విడుదల చేశారు. పర్యావరణ పరిరక్షణకు ప్రపంచ దేశాలన్నీ నడుం బిగించాలని, కలిసికట్టుగా పనిచేయాలి, ఈ విషయంలో సొంత ప్రయోజనాలు పక్కనపెట్టాలని సూచించారు. వాతావరణాన్ని చక్కగా కాపాడుకోవాలని, ప్రపంచదేశాలు దీనిపై తక్షణమే దృష్టి పెట్టాలని హితవు పలికారు. మొదట దేశాన్ని అభివృద్ధి చేసుకుందాం, ఆ తర్వాత పర్యావరణం గురించి ఆలోచిద్దామన్న ధోరణి ప్రపంచమంతటా పెరిగిపోతోందని, ఇది చాలా ప్రమాదకరమని హెచ్చరించారు. ఇలాంటి అభివృద్ధి మోడల్‌తో విధ్వంసమే తప్ప ఆశించిన ప్రయోజనం ఉండదన్నారు. ఒకవేళ అభివృద్ధి లక్ష్యాలు సాధించినప్పటికీ దాని మూల్యం ఇతర దేశాలు చెల్లించాల్సి వస్తుందని తెలిపారు. అభివృద్ధి చెందిన దేశాలు అమలు చేస్తున్న తప్పుడు విధానాలను ఇప్పటిదాకా ఎవరూ పెద్దగా ప్రశ్నించలేదని గుర్తుచేశారు. ‘వాతావరణ న్యాయం’ కోసం అభివృద్ధి చెందిన దేశాల ఎదుట భారత్ బిగ్గరగా గొంతెత్తున్నందుకు తనకు సంతోషంగా ఉందని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. బడా దేశాల స్వార్థానికి చిన్న దేశాలు ఎందుకు నష్టపోవాలని ప్రశ్నించారు. పర్యావరణ పరిరక్షణ అనేది భారతీయ సంస్కృతిలో వేలాది సంవత్సరాలుగా ఒక భాగంగా కొనసాగుతూ వస్తోందన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ది కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నామని, అదే సమయంలో పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని వివరంచారు. 4జీ, 5జీ కన్టెక్టివిటీ మాత్రమే కాదు, మరోవైపు అడవుల పెంపకం చేపడుతున్నామని తెలియజేశారు. సింగిల్–యూజ్ ప్లాస్టిక్ నిషేధం కోసం ప్రజలంతా సహకరించాలని కోరారు. గత ఐదేళ్లుగా ఈ దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. వాతావరణ మార్పుల నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ కోసం స్పష్టమైన రోడ్డుమ్యాప్‌తో ముందుకెళ్తున్నామని ప్రధానమంత్రి పేర్కొన్నారు. -
పాపం మీది.. పరిహారమివ్వండి.. పేద దేశాల డిమాండ్
షెర్మ్–ఎల్–షేక్: భూతాపం, ప్రకృతి విపత్తులు, ఉత్పాతాలు.. వీటికి శిలాజ ఇంధనాలను విచ్చలవిడిగా వినియోగించడం, పర్యావరణాన్ని నాశనం చేయడమే కారణం. ఈ పాపం సంపన్న, అభివృద్ధి చెందిన దేశాలదేనని పేద దేశాలు ఘోషిస్తున్నాయి. శిలాజ ఇంధనాలను అధికంగా ఉపయోగించే దేశాల కారణంగా తాము బాధితులుగా మారాల్సి వస్తోందని వాపోతున్నాయి. బడా దేశాలు, కార్పొరేట్ సంస్థలు నష్ట పరిహారం చెల్లించాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. ఈజిప్ట్‌లోని షెర్మ్–ఎల్–షేక్‌లో జరుగుతున్న కాప్–27లో పలుదేశాల నాయకులు ఈ డిమాండ్‌కు మద్దతుగా గళం విప్పుతున్నారు. విపత్తుల్లో నష్టపోతున్న పేద దేశాలకు న్యాయం చేయాలని మలావీ దేశాధ్యక్షుడు లాజరస్ చక్‌వెరియా అన్నారు. శిలాజ ఇంధన కంపెనీలు నిత్యం 3 బిలియన్ డాలర్ల లాభాలు ఆర్జిస్తున్నాయని ఆంటిగ్వా బార్బుడా ప్రధానమంత్రి గాస్టన్ బ్రౌనీ చెప్పారు. అందులో కొంత సొమ్మును పేద దేశాలకు పరిహారంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూగోళాన్ని మండించి, సొమ్ము చేసుకుంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంధన కంపెనీలు తమ లాభాల నుంచి గ్లోబల్ కార్బన్ ట్యాక్స్ చెల్లించాలన్నారు. మానవ నాగరికతను బలిపెట్టి లాభాలు పిండుకోవడం సరైంది కాదన్నారు. నష్టపరిహారం కోసం అవసరమైతే అంతర్జాతీయ కోర్టులను ఆశ్రయిస్తామని తేల్చిచెప్పారు. పెద్ద దేశాల నేతలు, కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు ప్రతిఏటా కాప్‌కు సదస్సుకు హాజరై, ఘనంగా ప్రకటనలు ఇచ్చి వెళ్లిపోతున్నారని తప్పు ఆచరణలో ఏమీ చేయడం లేదని గాస్టన్ బ్రౌనీ ఆరోపించారు. వాతావరణ లక్ష్యాలను సాధించాలంటే చిన్న దేశాలపై విధించిన చట్టవిరుద్ధమైన ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలని జింబాబ్వే అధ్యక్షుడు ఎమర్సన్ మాంగాగ్వే పేర్కొన్నారు. మడ అడవుల సంరక్షణలో సహకరిస్తాం మడ అడవుల పునరుద్ధరణలో భారత్ నైపుణ్యం సాధించిందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ చెప్పారు. పర్యావరణానికి అత్యంత కీలకమైన మడ అడవుల సంరక్షణ కోసం గత ఐదు దశాబ్దాలుగా కార్యాచరణ కొనసాగిస్తోందని అన్నారు. ఈ విషయంలో ఇతర దేశాలకు సహకరించేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. కాప్–27 సందర్భంగా యూఏఈ, ఇండోనేషియా ఆధ్వర్యంలో మాంగ్రూవ్ అలయెన్స్ ఫర్ క్లైమేట్(ఎంఏసీ)ని ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా మడ అడవుల పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించడం, కాపాడుకోవడం ఈ కూటమి లక్ష్యం. ఈ సందర్భంగా భూపేంద్ర మాట్లాడారు. ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలన్న లక్ష్యాన్ని సాధించడానికి మడ అడవుల సంరక్షణ అత్యంత కీలకమని సూచించారు. కర్బన ఉద్గారాల నిర్మూలన ఇలాంటి అడవులతో సాధ్యమవుతుందన్నారు. అండమాన్, సుందర్బన్స్, గుజరాత్ తీర ప్రాంతంలో మడ అడువుల విస్తీర్ణం పెరిగిందని వెల్లడించారు. చదవండి: షాకింగ్ రిపోర్ట్: కరోనాను మించిన వైరస్ తయారీలో పాక్-చైనా! -
కరోనా బాధిత దేశాలకు ఐఎంఎఫ్ సాయం
వాషింగ్టన్: కరోనా మహమ్మారితో పోరాడుతూ ఆర్థిక పరిస్థితి దిగజారిన దేశాలకు అండగా నిలవాలని అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) సంస్థ నిర్ణయించింది. ఇందుకోసం 650 బిలియన్ డాలర్లు(రూ.48.44 వేల కోట్లు) ఖర్చు చేసేందుకు ఎగ్జిక్యూటివ్ బోర్డు ఆమోదం తెలిపింది. ఐఎంఎఫ్ చరిత్రలో ఇదే అతిపెద్ద ఆర్థిక సాయం కానుందని సంస్థ ఎండీ క్రిస్టలినా జార్జివా శుక్రవారం చెప్పారు. ఐఎంఎఫ్ తాజా నిర్ణయాన్ని పలు అంతర్జాతీయ సంస్థలు స్వాగతించాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలు తక్షణమే 200 బిలియన్ డాలర్ల సాయాన్ని పొందానికి అవకాశం ఉందని అమెరికాలోని జూబ్లీ యూఎస్ఏ నెట్వర్క్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్ లికాంప్టీ చెప్పారు. పేద దేశాల్లో కరోనా వ్యాక్సినేషన్‌కు ఈ సాయం ఉపయోగపడుతుంది. -
Corona Vaccination:జో బైడెన్ సంచలన నిర్ణయం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. యాభై కోట్ల ఫైజర్ వ్యాకిన్ డోసులను కొనుగోలు చేసి.. పేద దేశాలకు ఉచితంగా పంచాలని నిర్ణయించుకున్నాడు. ఈ నిర్ణయంపై ఇప్పటికే కసరత్తులు పూర్తయ్యానని, బైడెన్ నోటి నుంచి అధికారిక ప్రకటన వెలువడడమే తరువాయి అని వైట్‌హౌజ్ ఉటంకించినట్లు అమెరికాలోని ప్రముఖ వెబ్‌సైట్స్ ఒక కథనం ప్రచురించాయి. కాగా, ఫైజర్ బయోఎన్‌టెక్ కొవిడ్ 19 వ్యాక్సిన్ 500 మిలియన్ల డోసులు కొనుగోలు చేయాలని బైడెన్ పాలనా విభాగం ప్రణాళిక వేసింది. వీటిని వంద పేద దేశాలకు వీటిని పంచబోతోంది. ఈ ఏడాది చివరికల్లా 200 మిలియన్ డోసులు, మిగిలిన 300 మిలియన్ డోసులు వచ్చే ఏడాది కల్లా అందించాలని నిర్ణయించుకుంది. ఇక ఈ భారీ సాయంపై పోయిన నెలలోనే బైడెన్ నిర్ణయం తీసుకున్నట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించింది. ‘‘కరోనాను అంతం చేయాల్సిన అవసరం ఉంది. అది అమెరికాలోనే కాదు.. ప్రపంచంలో నలుమూలలా. వ్యాక్సిన్ డోసుల డొనేషన్లో మీరు పాల్గొనండి. ముందుకు రండి’’ అని ప్రపంచదేశాలను ఉద్దేశించి బైడెన్ వ్యాఖ్యానించినట్లు వాషింగ్టన్ పోస్ట్ వెబ్ సైట్ పేర్కొంది. ప్రపంచం మొత్తం వ్యాక్సిన్ కొరతను ఎదుర్కొంటున్న తరుణంలో బైడెన్ భారీ సాయంపై హర్షం వ్యక్తం అవుతోంది. కాగా, అమెరికా ఇదివరకే 300 మిలియన్ల ఫైజర్ డోసుల కోసం ఒప్పందం చేసుకోగా.. ఇప్పుడు సాయం ప్రకటన నేపథ్యంలో అదనంగా 500 మిలియన్ల డోసుల కొనుగోలు కోసం మరో ఒప్పందం చేసుకుంది. యూఎస్, యూకేలో 42 శాతం జనాభాకు వ్యాక్సినేషన్ పూర్తికాగా, ఆఫ్రికాదేశాల్లో ఒక్క శాతం కంటే తక్కువ జనాభాకు వ్యాకినేషన్ జరిగింది. దీంతో ముందుగా ఆఫ్రికన్ దేశాలకే అందించాలని బైడెన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కోవాక్స్ ద్వారా 75 శాతం డోసుల్ని పంపిణీ చేయనున్నట్లు వైట్‌హౌజ్ ప్రకటించింది. ఇక ప్రపంచం మొత్తం మీద వ్యాక్సిన్ కొరత తీరాలంటే పదకొండు బిలియన్ల డోసులు అవసరమని డబ్ల్యూహెచ్‌వో భావిస్తుండగా.. బైడెన్ సాయం ప్రకటన కొంతలో కొంత ఊరట ఇచ్చేదే. జీ7 సమ్మిట్‌లో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. చదవండి: ఇజ్రాయెల్–పాలస్తీనా వివాదానికి ఏకైక పరిష్కారమిదే -
బ్రిటన్ 20 శాతం టీకాలను పేద దేశాలకు ఇవ్వాలి: యూనిసెఫ్
లండన్: గత సంవత్సర కాలంగా ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి పట్టి పీడిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ అడ్డుకట్టకు వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని భావించి ఆయా దేశాల శాస్త్రవేత్తలు వాళ్ల ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో సంపన్న దేశాలు పరిస్థితి బాగానే ఉంది కానీ పేద దేశాలు టీకాలను తయారు చేసుకోలేక, ఇతర దేశాలనుంచి కొనుగోలు చేసుకోలేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి బాలల సంక్షేమ సంస్థ ( యూనిసెఫ్ల) దీని పై స్పందించింది. బ్రిటన్ వద్ద ఉన్న కరోనా వ్యాక్సిన్లలో 20 శాతం టీకాలను పేదదేశాలకు విరాళంగా ఇవ్వాలని యూనిసెఫ్ సూచించింది. పేద దేశాలను పట్టించుకోండి జూన్ మొదటివారం నాటికి టీకాలను పంపించే విధంగా బ్రిటన్ చర్యలు చేపట్టాలని సూచించింది. ఇలా చేసినప్పటికీ బ్రిటన్ దగ్గర జూలై చివరినాటికి ఆ దేశపౌరులైన వయోజనులకు ఇచ్చేందుకు సరిపడా టీకాలు ఉంటాయని ఆ సంస్థ వివరించింది. కాగా ఇప్పటికే బ్రిటన్‌లో దాదాపు 18 మిలియన్ల మందికి వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆ దేశం పూర్తి చేసింది. ఇక అధిక శాతం వయోజనులకు కనీసం ఒక డోసు టీకాను కూడా పూర్తి చేసింది. ప్రపంచంలోని 5 కోట్ల మంది ప్రజలకు టీకాలు అందించే సామర్థ్యం బ్రిటన్‌కు ఉందని ఈ సందర్భంగా తెలిపింది. బ్రిటన్ను చూసి మిగతా జీ-7 దేశాలు సైతం సాయం కోసం అలమటిస్తున్న ఇతర దేశాలకు టీకాలు పంపించే అవకాశం ఉంటుందని యూనిసెఫ్ అభిప్రాయపడింది. ఇతర దేశాల ప్రజలకు టీకాలు అందుబాటులో ఉన్నప్పడే మరో కొత్త రకం వైరస్లు పుట్టుకురాకుండా ఉంటాయని యూనిసెఫ్ తెలిపింది. ( చదవండి: ‘ఈ వేరియంట్ వల్లే భారత్‌లో కరోనా కల్లోలం’ ) -
పేద దేశాలకూ టీకా అందాలి
జెనీవా: ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ వస్తే నిరుపేద దేశాలకు కూడా అందేలా ఒక ఒప్పందం కుదుర్చుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఒ) పిలుపునిచ్చింది. వ్యాక్సిన్ అంశంలో జాతీయవాదాన్ని ప్రదర్శించకూడదని సంపన్న దేశాలకు హితవు పలికింది. వివిధ దేశాల్లో జరుగుతున్న వ్యాక్సిన్ పరిశోధనలు ముందడుగు వేస్తున్న తరుణంలో డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధ్నామ్ ఈ వ్యాఖ్యలు చేశారు. టీకా ప్రయోగాలు విజయవంతమైతే ప్రపంచదేశాలందరి ప్రయోజనాలు పరిరక్షించేలా సంపన్న దేశాలు ముందుకు రావాలని అన్నారు. ఈ మేరకు అంతర్జాతీయంగా పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని టెడ్రోస్ సూచించారు. ఫ్రంట్‌లైన్ వర్కర్లకు ముందుగా టీకా అందించాలన్నారు. డిసెంబర్ నాటికి చైనా వ్యాక్సిన్ వూహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్ ప్రొడక్ట్స్ అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్ ఈ ఏడాది చివరికల్లా వచ్చే అవకాశాలున్నాయి. అత్యంత కీలకమైన మూడో దశ ప్రయోగాలు ప్రస్తుతం జరుగుతున్నాయని ఈ వ్యాక్సిన్ అభివృద్ధికి సహకరిస్తున్న చైనా ప్రభుత్వ కంపెనీ సినోఫార్మ్ చైర్మన్ లియూ జింగ్‌హెన్ తెలిపారు. ఈ వ్యాక్సిన్ ఖరీదు ఇండియన్ కరెన్సీలో 10 వేల రూపాయల వరకు ఉంటుంది. ఈ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకుంటే వందశాతం సత్ఫలితాలు ఉంటాయని ఆయన చెప్పారు. -
పేద దేశాలకు అమెరికా మొండిచేయి
వాషింగ్టన్: పేద దేశాలకు సాయం చేసేందుకు అమెరికాకు మనసొప్పట్లేదు. ఆ దేశాల్లోని ప్రజలకు మేలు చేసే విధానాలు రూపొందించే విషయంలో ఆ దేశం మిగతా ధనిక దేశాలతో పోలిస్తే వెనుకంజలో ఉంది. అభివృద్ధి నిబద్ధత సూచీ (కమిట్మెంట్ టు డెవలప్మెంట్ ఇండెక్స్)లో చివరి స్థానాల్లో ఒకటిగా నిలిచింది. విదేశాలకు ఆర్థిక సాయం, పర్యావరణ విధానాలను ఆధారంగా చేసుకుని సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ (సీజీడీ) ఈ సూచీని విడుదల చేసింది. మొత్తం 27 ధనిక దేశాలను పరిగణనలోకి తీసుకుని ఈ సూచీని రూపొందించారు. ఇందులో స్వీడన్ మొదటి స్థానంలో నిలవగా, డెన్మార్క్ రెండో స్థానంలో నిలిచింది. జర్మనీ, ఫిన్లాండ్లు మూడో ర్యాంకు సొంతం చేసుకున్నాయి. అమెరికా 23వ స్థానంలో నిలిచింది. చివరి నాలుగు స్థానాల్లో పోలండ్, గ్రీస్, దక్షిణ కొరియా, జపాన్ మాత్రమే ఉన్నాయి. రక్షణ, వాణిజ్య రంగాల్లో మాత్రం అమెరికా మంచి స్కోరు సాధించినా.. నూతన పన్నుల విధానం వల్ల భవిష్యత్తులో ర్యాంకు మరింత పడిపోయే అవకాశం ఉంది. ఈ ఏడాది సూచీలో ఐరోపా దేశాలు తొలి 12 స్థానాలు దక్కించుకోవడం విశేషం. -
భారత్ విప్లవాత్మక అడుగులు
-
పేద దేశాల్లోనే మత విశ్వాసం ఎక్కువ
లండన్: ప్రపంచంలో అన్నింటికన్నా తమకు మతమే ముఖ్యమని భావించేవారు ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన దేశాల్లోనే ఎక్కువగా ఉన్నారని పియూస్ రిసెర్చ్ సెంటర్ గతేడాది నిర్వహించిన ఓ సర్వే తెలియజేస్తోంది. ఒక్క అమెరికా మినహా ఆర్థికంగా బలమైన దేశాల్లో మతం అన్నింటికన్నా ముఖ్యమనే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. మతేమేదైనా మతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామంటున్న ప్రజలు అమెరికాలో 53 శాతం ఉన్నారు. మతానికి ఎక్కువ ప్రాధ్యాన్యత ఇస్తామంటున్న వారు వెనుకబడిన దేశమైన ఇథియోపియాలో ఏకంగా 98 శాతం మంది ఉన్నారు. ఈ విషయంలో ప్రపంచంలో ఇథియోపియానే అగ్రస్థానంలో ఉంది. ప్రపంచంలోనే మతానికి అతి తక్కువ ప్రాధాన్యత ఇచ్చే దేశాల్లో చైనా అగ్రస్థానంలో ఉంది. ఆ దేశంలో మతానికి ప్రాధాన్యత ఇచ్చే వారి సంఖ్య కేవలం మూడు శాతం మాత్రమే. అంటే ప్రతి 20 మందిలో ఒక్కరు మాత్రమే మతానికి ప్రాధాన్యత ఇస్తారన్నమాట. భారత్‌కు పొరుగనున్న పాకిస్తాన్ మతానికి ప్రాధాన్యత ఇచ్చే దేశాల్లో 93 శాతంతో ఐదో స్థానంలో ఉంది. భారత్ 80 శాతంతో 14వ స్థానంలో ఉంది. ఆర్థికంగా బలమైన దేశాల్లో అన్నింటికన్నా మతమే ముఖ్యమని విశ్వసించే వారి సంఖ్య 20 శాతం కన్నా తక్కువగా ఉంది. బ్రిటన్, జర్మనీ దేశాల్లో ప్రతి 20 మందిలో కేవలం ఐదుగురు మాత్రమే తమ జీవితాల్లో మతం ముఖ్యమని నమ్ముతున్నారు. 2050 నాటికి ప్రపంచంలో ముస్లింల సంఖ్య కూడా క్రైస్తవులకు సమానమవుతుందని పియూస్ రిసర్చ్ సెంటర్ తెలిపింది. ఏ మతాన్ని విశ్వసించని వారి సంఖ్య అతి తక్కువగా పెరుగుతుందని అంచనా వేసింది. -
పెరిగిన ప్రజల జీవితకాలం
జెనీవా: ప్రపంచ ఆరోగ్య సంస్థ 2014 లెక్కల ప్రకారం ప్రజల జీవితకాలం పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా 2012లో పుట్టిన బాలికలు 73 సంవత్సరాలు, బాలురైతే 68 సంవత్సరాలు జీవిస్తారు. పేద దేశాల్లో నివసిస్తున్న ప్రజల జీవితకాలం గత రెండు దశాబ్దాల్లో సగటున 9 ఏళ్లు పెరిగింది. ఆయా దేశాల్లో శిశు ఆరోగ్యం కోసం మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రావడం వల్లే ప్రధానంగా ఈ మార్పు సాధ్యం అయింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో 1990-2012 మధ్య కాలంలో ప్రజల సగటు జీవితకాలం పెరుగుదలను పరిశీలించిన ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఈ మేరకు గురువారం తన వార్షిక నివేదికలో పేర్కొంది.