పేద దేశాల్లోనే మత విశ్వాసం ఎక్కువ
లండన్: ప్రపంచంలో అన్నింటికన్నా తమకు మతమే ముఖ్యమని భావించేవారు ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన దేశాల్లోనే ఎక్కువగా ఉన్నారని పియూస్ రిసెర్చ్ సెంటర్ గతేడాది నిర్వహించిన ఓ సర్వే తెలియజేస్తోంది. ఒక్క అమెరికా మినహా ఆర్థికంగా బలమైన దేశాల్లో మతం అన్నింటికన్నా ముఖ్యమనే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. మతేమేదైనా మతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామంటున్న ప్రజలు అమెరికాలో 53 శాతం ఉన్నారు. మతానికి ఎక్కువ ప్రాధ్యాన్యత ఇస్తామంటున్న వారు వెనుకబడిన దేశమైన ఇథియోపియాలో ఏకంగా 98 శాతం మంది ఉన్నారు. ఈ విషయంలో ప్రపంచంలో ఇథియోపియానే అగ్రస్థానంలో ఉంది.
ప్రపంచంలోనే మతానికి అతి తక్కువ ప్రాధాన్యత ఇచ్చే దేశాల్లో చైనా అగ్రస్థానంలో ఉంది. ఆ దేశంలో మతానికి ప్రాధాన్యత ఇచ్చే వారి సంఖ్య కేవలం మూడు శాతం మాత్రమే. అంటే ప్రతి 20 మందిలో ఒక్కరు మాత్రమే మతానికి ప్రాధాన్యత ఇస్తారన్నమాట. భారత్‌కు పొరుగనున్న పాకిస్తాన్ మతానికి ప్రాధాన్యత ఇచ్చే దేశాల్లో 93 శాతంతో ఐదో స్థానంలో ఉంది. భారత్ 80 శాతంతో 14వ స్థానంలో ఉంది.
ఆర్థికంగా బలమైన దేశాల్లో అన్నింటికన్నా మతమే ముఖ్యమని విశ్వసించే వారి సంఖ్య 20 శాతం కన్నా తక్కువగా ఉంది. బ్రిటన్, జర్మనీ దేశాల్లో ప్రతి 20 మందిలో కేవలం ఐదుగురు మాత్రమే తమ జీవితాల్లో మతం ముఖ్యమని నమ్ముతున్నారు. 2050 నాటికి ప్రపంచంలో ముస్లింల సంఖ్య కూడా క్రైస్తవులకు సమానమవుతుందని పియూస్ రిసర్చ్ సెంటర్ తెలిపింది. ఏ మతాన్ని విశ్వసించని వారి సంఖ్య అతి తక్కువగా పెరుగుతుందని అంచనా వేసింది.